21 సంవత్సరాలు.. 25 సినిమాలు.. 'స్టార్' కాలేకపోయిన అక్కినేని వారసుడు!
on Oct 27, 2020
అక్కినేని వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన సుమంత్ తొలిచిత్రంలోనే రామ్‌గోపాల్ వర్మతో పనిచయడంతో సహజంగానే అందరి దృష్టి అతడిపై పడింది. అయితే ఆ ఫస్ట్ ఫిల్మ్ 'ప్రేమకథ' ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌తో చేసిన 'యువకుడు' మూవీ కూడా అతడి కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్లలేక పోయింది. ఆపైన చేసిన ప్రయత్నాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఏదేమైనా యువహీరోల పోటీలో సుమంత్ వెనకపడిపోయాడు.
అయితే సినీరంగ ప్రవేశం చేసిన చాన్నాళ్లకు 'సత్యం' చిత్రంతో సక్సెస్ రుచి చూశాడు. డెబ్యూ డైరెక్టర్ సూర్యకిరణ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సుమంత్ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. అంతదాకా ముఖం చాటేసిన నిర్మాతలు 'సత్యం' సక్సెస్‌తో ఒక్కసారిగా అతడి డేట్స్ కోసం పరుగులుపెట్టారు. ఈ క్రమంలో సుమంత్ తదుపరి చిత్రంపై ఆచితూచి అడుగేశాడు. రమణ డైరెక్ట్ చేసిన 'గౌరి' సినిమా కూడా అతడికి మంచి విజయాన్ని అందించి మాస్ ఇమేజ్ను తీసుకొచ్చింది. దీంతో సుమంత్ కెరీర్ గాడిలో పడిందని అందరూ భావించారు. 'సత్యం' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ మరోసారి మేజిక్ చేద్దామని సూర్యకిరణ్‌తో చేసిన ప్రయత్నం 'ధన 51' పేరుతో ఢమాల్‌మంది.
అపజయాలు సహజమైన చిత్రసీమలో సుమంత్ డీలా పడలేదు. శేఖర్ కమ్ములను నమ్ముకున్న అతడికి 'గోదావరి' మంచి పేరు తెచ్చింది. అయినా కూడా అతడి కెరీర్ ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనుకకు అన్న చందాన సాగుతూ వచ్చింది. చంద్రసిద్ధార్థ్ డైరెక్షన్లో చేసిన 'మధుమాసం', ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేసిన 'గోల్కొండ హైస్కూల్', గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేసిన 'మళ్లీ రావా' సినిమాలు మినహాయిస్తే మిగతావేవీ అతనికి కెరీర్‌కు ప్రయోజనం కల్పించలేకపోయాయి. చిన్నోడు, క్లాస్మేట్స్, పౌరుడు, బోణి, రాజ్, దగ్గరగా దూరంగా, ఏమో గుర్రం ఎగరావచ్చు, సుబ్రమణ్యపురం, ఇదం జగత్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించలేదు.
ఇక బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'విక్కీ డోనార్'ను 'నరుడా డోనరుడా' అని సొంతంగా రీమేక్ చేసి, చేతులు కాల్చుకున్నాడు సుమంత్. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో ఏఎన్నార్ క్యారెక్టర్‌ను చేసినా, ఆ సినిమాలు డిజాస్టర్ కావడంతో అతని శ్రమకు ఫలితం దక్కకుండా పోయింది.
ప్రస్తుతం 'కపటధారి' అనే సినిమా చేస్తున్నాడు సుమంత్. ఇది రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన హిట్ ఫిల్మ్ 'కవలుదారి'కి రీమేక్. ఇందులో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రోల్‌ను చేస్తున్నాడు. ఇప్పటికి పాతిక సినిమాలు చేసినా, ఇమేజ్ పరంగా, క్రేజ్ పరంగా తోటి యువనటులు పలువురితో పోల్చుకుంటే చాలా వెనుకంజలో ఉన్నాడు సుమంత్. అక్కినేని మనవడిగా ఎంట్రీ ఇచ్చినా, స్ఫురద్రూపం, మంచి ఒడ్డు-పొడుగు ఉన్నా, కెరీర్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా స్టార్ హీరో అనిపించుకోలేని దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడు సుమంత్!
Also Read