English | Telugu

మామ అమితాబ్‌పై ఆగ్రహంతో ఉన్న ఐశ్వర్య?

on Nov 19, 2019

సెలబ్రిటీ ఫ్యామిలీగా ముంబైలో కానీ, దేశవ్యాప్తంగా కానీ అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న పేరే వేరు. అమితాబ్, జయా బచ్చన్.. ఇద్దరూ సినిమాల్లో జంటగా నటించి, ప్రేమలో పడి పెళ్లాడారు. అదే రీతిలో వాళ్లు కలిసి చేసిన సినిమాలు తక్కువైనా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఆ ఫ్యామిలీ సినీ రంగంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్, వివేక్ ఓబరాయ్, మోడల్ రాజీవ్ ముల్‌చందానితో ఐశ్వర్య ఎఫైర్లు నడిపిందనే ప్రచారాలు ఏ రీతిన మీడియాలో హల్‌చల్ చేశాయో మనకు తెలుసు. 

ఆ విషయం అలా ఉంచితే, మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహించిందనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో బాగా చలామణిలోకి వచ్చింది. కారణం.. 'చెహ్రే' మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి అమితాబ్ నటిస్తుండటం! దానికీ, ఆమె కోపానికీ లింకేమిటి అనుకుంటున్నారా? లింకు ఉంది. ఇమ్రాన్ హష్మి అంటే ఐశ్వర్యకు ఏమాత్రం గిట్టదు. ఐదేళ్ల క్రితం, అంటే 2014లో పేరుపొందిన టీవీ షో 'కాఫీ విత్ కరణ్'లో పాల్గొన్న ఇమ్రాన్, హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ఐశ్వర్యా రాయ్‌పై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఐశ్వర్యను 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' అంటూ అభివర్ణించాడు. అతడి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. అప్పట్నుంచీ ఇమ్రాన్ అంటే మండిపడుతూ వస్తోంది ఐశ్వర్య. అతడితో కలిసి నటించడానికి వచ్చిన అవకాశాల్ని మరో మాట లేకుండా తిరస్కరిస్తూ వచ్చింది. ఆ ఉదంతం జరిగి ఐదేళ్లయినా ఐశ్వర్య మర్చిపోలేదు. తాను ఆ మాటల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఇమ్రాన్ సంజాయిషీ ఇచ్చుకున్నా అతడిని ఐశ్వర్య క్షమించలేదు.

"అది నవ్వులాటగా చెప్పిన మాట. దాన్ని ఆమె సీరియస్‌గా తీసుకొని బాధపడుతుందని ఊహించలేదు. ఐశ్వర్యా రాయ్‌కి నేను బిగ్ ఫ్యాన్‌ని. ఎప్పుడైనా ఆమెను కలుసుకొనే అవకాశం వస్తే, నా మాటలకు క్షమాపణలు చెబుతాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమెను బాధపెట్టే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు" అని తెలిపాడు ఇమ్రాన్. తన మాటలకు ఇమ్రాజ్ సంజాయిషీ చెప్పినా, అతడన్న 'ఫేక్ అండ్ ప్లాస్టిక్' కామెంట్స్ ఐశ్వర్య మనసు నుండి తొలగిపోలేదు. ఆ మాటల్ని మరచిపోయే మూడ్‌లో ఆమె లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్‌తో కలిసి తన మామ అమితాబ్ బచ్చన్ నటిస్తుండటాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేక పోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటించలేదు. రుమి జాఫ్రీ డైరెక్ట్ చేస్తోన్న 'చెహ్రే' మూవీలో మొట్టమొదటిసారిగా వాళ్లు కలిసి నటిస్తున్నారు. ఆ మూవీలో 'తీన్ మార్' ఫేం కృతి ఖర్బందా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు.

తనను ఒక పబ్లిక్ ప్లాట్‌ఫాంపై కించపరిచే విధంగా మాట్లాడిన ఇమ్రాన్‌తో ఎలా కలిసి పనిచేస్తారని మామ అమితాబ్‌పై ఐశ్వర్య ఆగ్రహంతో ఉన్నదంటూ కొంత కాలం క్రితమే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ ఆ విషయంలో ఐశ్వర్య ధోరణి మారలేదంటున్నాయి ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు. ఆ సినిమా చేస్తున్నప్పట్నుంచీ అమితాబ్‌తో ఆమె అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని లేటెస్టుగా ప్రచారం నడుస్తోంది. గతంలో 'బాద్‌షాహో' సినిమాలో అజయ్ దేవ్‌గణ్ జోడీగా నటించే అవకాశం వచ్చినప్పుడు, ఆమె తిరస్కరించింది. కారణం.. అందులో ఇమ్రాన్ హష్మి ఉండటం. అతడితో కలిసి పనిచేయడాన్ని ఆమె ఏమాత్రమూ ఇష్టపడటం లేదని అందరికీ తెలిసిందప్పుడే. 

అంతేకాదు, ఇమ్రాన్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆమె దాచుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, "మీకు బాధ కలిగించిన ,మీపై వచ్చిన వరస్ట్ కామెంట్ ఏమిటి?" అనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఏమాత్రం తడుముకోకుండా "నేను ఫేక్ అండ్ ప్లాస్టిక్ అనే కామెంట్‌ను" అని బదులిచ్చింది ఐశ్వర్య. అయితే మీడియాలో తన కామెంట్ ప్రచారంలో ఉన్నందువల్లే ఆమె దాన్ని మరచిపోలేదంటున్నాడు ఇమ్రాన్. వినోదం కోసం కరణ్ జోహార్ ఇలాంటి మాటల్ని అనిపిస్తుంటాడనీ, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ అతను తెలిపాడు. అయితే సున్నితమనస్కురాలిగా ముద్రపడిన ఐశ్వర్య మాత్రం ఇప్పట్లో అతడి మాటని మర్చిపోయేట్లు లేదు. కాగా అమితాబ్, ఇమ్రాన్ కలిసి నటిస్తోన్న 'చెహ్రే' సినిమా 2020 ఏప్రిల్ 24న విడుదల కానున్నది.


Cinema Galleries



Latest News


Video-Gossips