English | Telugu

విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యాలంటే..!

on Nov 18, 2019

 

విజయ్ దేవరకొండ నాలుగైదేళ్ల క్రితం వరకు కెరీర్‌లో చాలా స్ట్రగుల్ పడ్డాడు. సినిమా ఛాన్సుల కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నాడు. డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేశాడు. సీన్ కట్ చేస్తే.. ఇవాళ అతను యూత్ ఐకాన్. అతనికి కథలు వినిపించాలని రైటర్లూ, అతడితో పనిచెయ్యాలని డైరెక్టర్లూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ దశ నుంచి ఈ దశకు రావడం అంత ఈజీగా జరగలేదు. విజయ్ చివరిసారిగా ఆడిషన్‌లో పాల్గొన్న సినిమా.. 2015లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం'. 'పెళ్లిచూపులు' సినిమా కంటే ముందు మూడు సినిమాల ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యాడు. వాటిలో వేషాలు చేజిక్కించుకున్నాడు. రవిబాబు డైరెక్ట్ చేసిన 'నువ్విలా', శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో ఆడిషన్ల ద్వారానే నటించాడు. అప్పుడు అతని స్క్రీన్ నేం 'విజయ్ సాయి'. ఆడిషన్లంటే అతనికి అయిష్టం కాదు కానీ, ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి, అక్కడ మరికొంతమందితో పాటు తనకు ఎప్పుడు అవకాశం వస్తుందా.. అని ఎదురుచూడాల్సి రావడమంటే చాలా కష్టంగా ఉండేది. అందరూ ఆడిషన్‌లో తాము ఎంపికవుతామని ఆశపడేవాళ్లే. అలాగే మిగతావాళ్లను దాటుకొని, తాను ఆ ఛాన్స్ దక్కించుకుంటానని నమ్మేవాడు విజయ్. అయితే నటుడిగా తన కెరీర్‌లో చేదు దశగా అతను దాన్ని భావిస్తాడు. అలాంటి దశ మళ్లీ ఎన్నడూ తన జీవితంలో రాకూడదని అతను కోరుకుంటున్నాడు.

మనం శుక్రవారం సినిమాలకు వెళ్తాం. టికెట్ కొని, దాన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ తెరవెనుక చూస్తే, ఒక సినిమా మేకింగ్‌లో భాష, ప్రాంతం, పాలిటిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయని విజయ్‌కు బాగా తెలుసు. "ఒక కళగా అది 'క్లీన్' కాదు. డబ్బు, వ్యాపారం, అధికారం, కులం అనేవి అక్కడ రాజ్యం చేస్తుంటాయి. నాకు అదొక యుద్ధం లాంటిది" అని చెబుతాడు విజయ్. నటన అనేది అతడి పనిలో 30 శాతమే అని జనానికి తెలీదు. మిగతా 70 శాతం ఏమిటనేది.. అతడిని అత్యంత సమీపంగా చూసేవాళ్లకే తెలుస్తుంది. ఒక సినిమా చెయ్యాలంటే అనేకమంది కలిసి పనిచెయ్యాలి. జనానికి బెస్ట్ ఇవ్వడానికి కృషి చెయ్యాలి. ఎక్కువగా కొత్తవాళ్లతో పనిచేస్తుండటం వల్ల, ఆ సినిమా పూర్తి కావడానికీ, దాన్ని ప్రమోట్ చెయ్యడానికీ మరింత ఎక్కువగా అతను కష్టపడుతున్నాడు.

విజయ్‌కు ఇవాళ డబ్బు అనేది ప్రయారిటీ కాదు. కంటెంట్ తనను ఎగ్జైట్ చేస్తేనే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. గతంలో డబ్బు కోసం అతను చాలా పనులు చేశాడు. డబ్బు కోసమే మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఒక ఇల్లు కొనాలనే ఉద్దేశంతో 'నీ వెనకాలే నడిచి' అనే  ఒక మ్యూజిక్ వీడియో కూడా చేశాడు. కానీ దాంతో వచ్చిన డబ్బు ఇల్లు కొనడానికి సరిపోలేదు. పదివేల రూపాయలు, అంతకంటే ఎక్కువ వస్తుందనుకుంటే ఏ పని చెయ్యడానికైనా సిద్ధపడ్డ రోజులున్నాయి. ఆ రోజులు గతించాయి. ఇవాళ తన పనికి తగ్గ ఆదాయం గడిస్తున్నాడు. అయితే కంటెంట్ నచ్చకపోతే, ఎంత డబ్బు ఇచ్చినా చెయ్యకూడదనే డెసిషన్ తీసుకున్నాడు. 

కొత్తవాళ్లతో పనిచెయ్యడానికి అతను సిద్ధంగా ఉంటాడు. అలా అని 'నేను బ్లాక్‌బస్టర్ సినిమా తీస్తాను' అని ఊరికే మాటలు చెప్పేవాళ్లతో కలిసి పనిచెయ్యాలని అతను అనుకోవట్లేదు. ఎవరైనా తన దగ్గరకు కొత్త డైరెక్టర్ వస్తే, అతను చేసిన షార్ట్ ఫిల్మ్ కానీ, యాడ్ ఫిల్మ్ కానీ చూపించమని అడుగుతున్నాడు విజయ్. అవి చూశాకే, స్క్రిప్ట్ వినడానికి అతను ఆసక్తి చూపిస్తున్నాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరి కథనూ వింటూ పోతే, తన మెదడు బ్లాంక్ అయిపోతుందని అతను భావిస్తున్నాడు. అతడి దృష్టిలో డైరెక్టర్స్ అనేకమంది ఉన్నారు కానీ, యాక్టర్లు మాత్రం ఒక గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. యాక్టర్ అవసరమైన స్క్రిప్టులు చాలానే ఉన్నాయి.

విజయ్‌లో ఉన్న గుణమేమంటే.. అతను ఏ సినిమా ఒప్పుకున్నా, తన పాత్రను ఎలా పోషించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతుంటాడు. చేసే ప్రతి సినిమాతో నటుడిగా అతను ఇంకో రేంజికి వెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఈ విషయం విజయ్‌కు బాగా తెలుసు. ఆ భయం విజయ్ మనసును తొలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు 'డియర్ కామ్రేడ్' చేసేటప్పుడు కొన్ని సీన్లను విని, వాటిని తాను చేయగలనా అని భయపడ్డాడు. కానీ చివరకు ఆ భయాన్ని జయించి వాటిని చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్టును పక్కనపెడితే నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. త్వరలో అతను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీతో అతను ఎంతమంది హృదయాల్ని కొల్లగొడతాడో చూడాలి.


Cinema GalleriesLatest News


Video-Gossips