English | Telugu

ఏజ్‌లెస్ బ్యూటీ రేఖపై ఆరాధనతోటే 'రేఖా' అని నా భార్యను పిలుస్తుంటాను: మెగాస్టార్

on Nov 18, 2019

 

దేశం గర్వించదగ్గ తారల్లో రేఖ ఒకరనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు వరించింది. ఆదివారం (నవంబర్ 17) అన్నపూర్ణ స్టూడియోస్‌లో కన్నుల పండువగా జరిగిన వేడుకలో 2018 సంవత్సరానికి శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, 2019 సంవత్సరానికి రేఖ.. ఈ అవార్డును అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో రేఖను ఆకాశానికెత్తేశారు చిరంజీవి. కేవలం ఆమె గురించే దాదాపు 5 నిమిషాల సేపు మాట్లాడారు. ఆమె తన ఆరాధ్య తార అనీ, ఆమెను దృష్టిలో ఉంచుకొనే తన భార్య సురేఖను 'రేఖా' అని పిలుస్తాననీ ఆయన చెప్పారు.

"పార్లమెంటంటే అందరికీ తెలుసు. రచ్చ రచ్చగా ఉంటుంది. కేకలు, కేరింతలు, పేపర్లు విసిరేసుకోవడాలు.. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రాజ్యసభలో.. ఈ గొడవలన్నీ మనకెందుకని తలవంచుకొని సెల్‌ఫోన్ చూసుకుంటున్నాను. ఒక్కసారిగా రాజ్యసభంతా సైలెంట్ అయిపోయింది. ఏంటా.. అని ఆశ్చర్యపోతూ నేను తలెత్తి చూస్తే.. అందరి తలలూ పొద్దు తిరుగుడు పువ్వులా ఒకవైపే చూస్తున్నాయి. ఒక అద్భుత సౌందర్యరాశి.. లోపలికి వస్తున్నారు. నేను అందర్నీ ఒకసారి చూశాను.. నోళ్లు వెళ్లబెట్టుకొని చూస్తున్నారు. ఆ అందాలరాశి ఎవరో కాదు, నా తోటి రాజ్యసభ సభ్యురాలు రేఖ గారు!" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

రేఖ వంక చూస్తూ.. "మీకు గుర్తుందా.. ఆరోజు మీరెంత మందిని డిస్టర్బ్ చేశారు! వాళ్ల ప్రాబ్లెమ్స్‌ని చర్చించుకోనీయకుండా, వాళ మెదళ్లలోని మేటర్‌ని మర్చిపోయేలా చేశారు" అన్నారు. "ఆరోజు సభ జరగలేదంటే ఒట్టు. ఆరోజు ఆమె తెలుసుకున్నారు.. తాను రాజ్యసభకు వస్తే డిస్టర్బెన్స్ అని. దాంతో ఆమె తాను అక్కడికి రావడం తగ్గించుకుంటే బెటర్ అని.. అప్పుడప్పుడు గెస్ట్‌గా వస్తుండేవారు" అని చిరంజీవి చెప్పారు. ఇది అతిశయోక్తి కాదనీ, నిజంగా జరిగిందనీ అన్నారు.. "స్టాండింగ్ బ్యూటీ, టైంలెస్ గ్లామర్, ఏజ్‌లెస్ బ్యూటీ.. ఎవరంటే.. ఒక్క రేఖగారు తప్ప ఎవరిని చెప్పుకోగలం! అలాంటి లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా నేను లెజెండరీ ఫిలింఫేర్ అవార్డు తీసుకోవడం.. నేను జీవితంలో మర్చిపోలేని అద్భుత సంఘటన" అని తెలిపారు చిరంజీవి.

ఎయిటీస్ క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అంతా సెలబ్రేట్ చేసుకొనేది.. ఈసారి తమ ఇంట్లో చేసుకుందామని ప్లాన్ చేసి, రేఖ గారిని దానికి స్పెషల్ గెస్ట్‌గా రావాలనీ, వస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారనీ పదిహేను రోజుల క్రితం ఫోన్ చేసి అడిగాననీ రావడానికి ప్రయత్నిస్తా అన్నారనీ ఆయన చెప్పారు. వస్తారో, రారో చూడాలన్నారు. "కాలేజీ రోజులు ముగిసే కాలం నుంచీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఆమె సినిమాలు చూస్తూనే ఉన్నాను. నేను ఆరాధించే నటీమణుల్లో ఆమె ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ఆరాధన. ఆ విషయం ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఈరోజున నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడమన్నది నాకు అమితమైన సంతోషాన్నిస్తోంది. అది నాకు లభించిన అదృష్టం. ఆమెకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు రావడం ఆమెకు గౌరవం. ఆమెకు అవార్డు ఇవ్వడం నాకు గౌరవం" అన్నారు చిరంజీవి. 

ఆమెపై తనకున్నఇష్టానికి నేచర్ స్పందించిందేమో తెలీదనీ, తనకు భార్యగా సురేఖ దొరికిందన్నారు. "తనను అందరూ సురేఖ అని పిలుస్తారు. నేను మాత్రం రేఖా అని పిలుస్తాను. నా ఆరాధ్య నటీమణి రేఖను దృష్టిలో పెట్టుకొని తనను రేఖా అని పిలుస్తుంటానని ఆమెకు తెలీదు. (నాగార్జునను చూస్తూ).. ఇది నా వైఫ్ చూడకపోతే బెటర్.. ఎడిట్ చేసి పక్కనపెడితే బెటర్" అని నవ్వేశారు మెగాస్టార్.


Cinema GalleriesLatest News


Video-Gossips