ENGLISH | TELUGU  

హిస్టరీపై మోజు చూపిస్తున్న టాలీవుడ్

on Oct 17, 2019

 

గతంలో ఎన్నడూ లేని విధంగా హిస్టరీ వైపు దృష్టి సారిస్తోంది తెలుగు సినిమా. కొంత కాలంగా గమనిస్తే.. చరిత్ర లేదా, జీవిత కథలతో ఒక దాని వెంట ఒకటిగా సినిమాలు తయారవుతూ రావడం కనిపిస్తుంది. 'రుద్రమదేవి', 'వంగవీటి', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'ఘాజి', 'మహానటి', 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు', 'యాత్ర', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వంటి సినిమాలు.. అందుకు ఉదాహరణ. ఈ కోవలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'సైరా.. నరసింహారెడ్డి'. వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయితే, కొన్ని బాగానే ఆడాయి. ఒక్కటి మాత్రం నిజం.. చరిత్రకెక్కిన విషయాల ఆధారంగా కథ రాసుకొని, దాన్ని వెండితెరపై తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలనే తపన తెలుగు ఫిల్మ్ మేకర్స్‌లోనూ, నటులలోనూ పెరుగుతూ వస్తోంది.

వచ్చే ఏడాది యస్.యస్. రాజమౌళి మూవీ 'ఆర్ ఆర్ ఆర్' రానున్నది. ఇద్దరు ప్రసిద్ధ చారిత్రక వ్యక్తులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను తీసుకొని కల్పిత కథతో ఆ మూవీని రాజమౌళి రూపొందిస్తున్నాడు. తెల్లవాళ్లను తన అసమాన ధైర్యసాహసాలతో ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, ప్రజలపై అత్యాచారాలు చేస్తూ, వాళ్లను క్రూరంగా హింసించిన రజాకార్లపై గెరిల్లా పద్ధతుల్లో యుద్ధం చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్ర కని కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే పేరుపొందిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్, తెలుగునాట సుప్రసిద్ధ మల్లయోధుడైన కోడి రామ్మూర్తినాయుడు జీవితం ఆధారంగా ఒక సినిమా, విజయవాడ రాజకీయాల్లో కీలక నేత, ఇటీవలే దివంగతుడైన దేవినేను నెహ్రూ జీవితం ఆధారంగా 'దేవినేని'  సినిమాలు తయారవుతున్నాయి. బ్యాడ్మింటన్‌లో దేశానికి కీర్తి సాధించిపెట్టిన ముగ్గురు హైదరాబాదీ క్రీడాకారులు.. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు బయోపిక్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి.

చిత్రమేమంటే 'రుద్రమదేవి', 'గౌతమిపుత్ర శాతకర్ణి', ఇప్పుడు 'సైరా' సినిమాల మేకింగ్‌కు పురికొల్పిన సినిమా చారిత్రకం కాకపోవడం.. అది ఒక జానపద చిత్రం కావడం. అదే.. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా అది సాధించిన విజయంతో భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమాలు చెయ్యవచ్చనే నమ్మకం మిగతా దర్శక నిర్మాతల్లో, నటుల్లో కలిగింది. అదివరకు ఆ నమ్మకం వారిలో ఉండేది కాదు. అంతెందుకు.. తెలుగులో మెగాస్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవి సైతం రెండేళ్ల క్రితం వరకు ఆ తరహా సినిమా చెయ్యడానికి సాహసించలేకపోయారు. 20 సంవత్సరాల క్రితమే తాను భగత్ సింగ్ బయోపిక్ చెయ్యాలనుకున్నాననీ, పన్నెడేళ్ల క్రితం నుంచీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ చెయ్యాలనేది తన కలగా ఉంటూ వచ్చిందనీ, అయితే భారీ బడ్జెట్ అవసరమయ్యే ఆ సినిమాలను తీసే సాహసం చెయ్యలేకపోయాననీ ఆయన స్వయంగా వెల్లడించారు. రాజమౌళి 'బాహుబలి' ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు 'సైరా' సినిమా చేశానని ఆయన చెప్పారు. 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ పరిధిని అనూహ్యంగా పెంచడం వల్లే, ఇవాళ ఆ తరహా సినిమాలు చెయ్యగలమన్న ధైర్యం తెలుగు నిర్మాతల్లో పెరిగింది.

తెలుగువారు జరుపుకొనే ఉగాది పండగకు ఆద్యుడు, తనపేరిట శాలివాహన శకాన్ని లిఖించిన గౌతమిపుత్ర శాతకర్ణి, కాకతీయ సామ్రాజ్యాన్ని దశాబ్దాల కాలం పాలించిన వీరనారి రుద్రమదేవి.. రాజ్య పాలకులైతే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన 61 గ్రామాల పాలెగాడు. విదేశీ రాజుల దండయాత్రలను ఎదుర్కోవడానికి భారతీయ రాజ్యాల్ని ఏకతాటిపై తీసుకు రావడానికి కృషిచేసిన గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలకృష్ణ నటించారు. ఓటమి ఎరుగని వీరునిగా పేరుపొందిన శాతకర్ణి ఎన్ని అవాంతరాలను ఎదుర్కొని రాజులనందర్నీ ఐక్యంగా నిలపడానికి కృషి చేశాడో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో దర్శకుడు క్రిష్ చూపించాడు. ఒక మహా సామ్రాజ్యాన్ని పాలించడానికి స్త్రీ కూడా అర్హురాలే అని నిరూపించి, సమాజ దృష్టిని మార్చిన వీర వనిత 'రుద్రమదేవి'గా అనుష్క అమోఘమైన నటన ప్రదర్శించింది. మహా మహా సంస్థానాధీశులే బ్రిటిష్‌వాళ్లకు దాసోహమవగా, ఒక చిన్న పాలెగాడు వాళ్లపై తిరుగుబాటు చెయ్యడం ఊహకు అందని కాలంలో ఆ పనిచేసి, తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి అభినయం ఎలా ఉందో ఇవాళ 'సైరా'లో చూస్తున్నాం.

శతాబ్దాల క్రితం నాటి చరిత్రతో తీసిన సినిమాలతో పాటు 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దం తొలినాళ్లలో తెలుగునాట తమదైన ముద్రవేసిన వ్యక్తుల జీవితాల్ని సెల్యులాయిడ్‌పైకి తీసుకువచ్చారు దర్శకులు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తార అయిన సావిత్రి జీవితం ఆధారంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన 'మహానటి'లో సావిత్రిగా జీవించిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ ఉత్తమనటి పురస్కారం పొందింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రవేసి విశ్వఖ్యాత నటసార్వభౌమునిగా, మహానేతగా కీర్తిపొందిన నదమూరి తారకరామారావు జీవితం ఆధారంగా క్రిష్ రూపొందించిన రెండు సినిమాలు 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాల్లో టైటిల్ రోల్‌ను ఆయన తనయుడు బాలకృష్ణ పోషించారు.

అలాగే 20వ శతాబ్దం చివరిలో, 21వ శతాబ్దం ఆరంభంలో రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి, ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో మహానాయకునిగా తెలుగువాళ్ల హృదయాల్లో చోటుపొంది, హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర'లో రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి గొప్పగా రాణించారు.

చరిత్రతో పాటు పురాణాలూ ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. హిరణ్యకశిపుడు, ఆయన కొడుకు ప్రహ్లాదుడి కథతో ఇప్పటికే తెలుగులో 'భక్త ప్రహ్లాద' పేరుతో మూడు సినిమాలు వచ్చాయి. లేటెస్టుగా, హిరణ్య కశిపుడి పాత్రను ఆధారం చేసుకొని 'హిరణ్యకశిప' సినిమా రూపొందించేందుకు డైరెక్టర్ గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్క్రిప్టును సిద్ధం చేశారు కూడా. ఆ కేరెక్టర్‌లో నటించేందుకు దగ్గుబాటి రానా సిద్ధమవుతున్నాడు.

ఇప్పుడు అందరి దృష్టీ రాజమౌళి తీస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీపై కేంద్రీకృతమవుతోంది. 19వ శతాబ్దం చివరలో జన్మించి 20వ శతాబ్దం ప్రథమార్ధంలో మృతిచెందిన ఇద్దరు మహాయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని ఆయన వెండితెరపై కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. హిస్టరీలో రికార్డు కాని ఒక నాలుగేళ్ల కాలంలో ఆ ఇద్దరు వీరుల జీవితం ఎలా ఉండి ఉంటుందీ, వాళ్లు ఎలాంటి ఘటనల్ని ఎదుర్కొని ఉంటారనే ఊహాజనిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు రాజమౌళి. నిజంగా ఇది కత్తిమీద సాము వ్యవహారమే. 2020 జూలైలో రానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.