పదిహేనేళ్లకు హిందీలో '7/జి' సీక్వెల్?
on Jan 24, 2019
ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు కథానాయకుడిగా పరిచయమైన సినిమా '7/జి బృందావన కాలనీ'. తెలుగు, తమిళ భాషల్లో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో రీమేక్ అయ్యింది. ప్రతి భాషలోనూ సినిమా విజయం సాధించింది. ఇదంతా పదిహేనేళ్ల క్రితం సంగతి. ఇప్పుడు రవికిషన్ హీరోగా లేడు. ఎప్పుడో ఫెడవుట్ అయ్యాడు. దర్శకుడు సెల్వ రాఘవన్ ప్లాప్ సినిమాలతో తన మార్కెట్, ఇమేజ్ పోగొట్టుకున్నాడు. కానీ, ఆయన తీసిన చక్కటి సినిమాల్లో '7/జి బృందావన కాలనీ' ఒకటిగా ఉంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.
ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు షర్మిన్ సెహగల్ కథానాయికగా, జావేద్ జాఫ్రి కుమారుడు మీజాన్ కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'మలాల్' అని ఓ సినిమా నిర్మిస్తున్నారు. మంగేష్ హడవాలె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా '7/జి బృందావన కాలనీ'కి రీమేక్ అని టాక్. అయితే దర్శక నిర్మాతలు అధికారికంగా ఎక్కడా ఈ మాట చెప్పడం లేదు. '7/జి బృందావన కాలనీ' హిందీ రీమేక్ రైట్స్ టీ సిరీస్ సంస్థ, సంజయ్ లీలా భన్సాలీ సొంతం చేసుకున్నారు. ఆ కథతో 'మలాల్' తీస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో పదిహేనేళ్ల క్రితం వచ్చిన సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడం విశేషమే.