‘హలో’ పై అంత నమ్మకం దేనికి?
on Dec 14, 2017
’ ‘హలో’ సినిమా డెఫనెట్ హిట్‘... వందకు 99 శాతం మంది అభిప్రాయం ఇది. అఖిల్ గత చిత్రం పెద్ద డిజాస్టర్. అయినా.. ‘హలో’ విజయంపై విడుదలకు ముందే.. గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఎక్కడొచ్చింది తేడా? దీనికి సమాధానం ఒక్కటే ‘విక్రమ్ కుమార్’. అవును... ఈ సినిమాకు దర్శకుడు విక్రమ్ కుమార్ అవ్వడమే ఆ నమ్మకానికి కారణం. అసలేంటి ‘ఈ విక్రమ్ కుమార్ గొప్పతనం’ అనే విషయానికొస్తే...
చేసినవి తక్కువ సినిమాలే. అయినా... దేనికి దానికి సంబంధం లేని కథల్ని ఎంచుకొని... వాటిని సమర్థనీయంగా తెరకెక్కించి విజయం సాధించిన దర్శకుడు విక్రమ్ కుమార్. అందుకే... తనంటే ప్రేక్షకులకు అంత గురి. నిజానికి విక్రమ్ కుమార్ తొలి సినిమా అట్టర్ ఫ్లాప్. అది కూడా తెలుగు సినిమానే కావడం విశేషం. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్టం’... దర్శకునిగా విక్రమ్ కుమార్ తొలి సినిమా. హీరోయిన్ శ్రియ తొలి సిినిమా కూడా అదే కావడం విశేషం. ఆ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా తర్వాత చాలా ఏళ్లు విక్రమ్ కనిపించలేదూ... వినిపించలేదు. అయితే.. ఉన్నట్టుండి ‘13బి’ అనే సినిమా పోస్టర్ పై ‘విక్రమ్ కుమార్’ అనే పేరు కనిపించింది. ఈ విక్రమ్ కుమార్... ‘ఇష్టం’ దర్శకుడేనా? అనే అనుమానం జనాల్లో. ‘13బి’ విభిన్నమైన కాన్సెప్ట్. హారర్ జానర్. హారర్ లో కూడా ఎవరూ టచ్ చేయలని జానర్. మాధవన్ హీరో. విడుదలైన ప్రతి భాషలో విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ టీవీల్లో వస్తే.. జనాలు టీవీలకు అతుక్కుపోతారు. .
ఎవరైనా అంత పెధ్ద హిట్ తర్వాత... మళ్లీ అలాంటి జానర్లే ఎంచుకుంటారు. కానీ విక్రమ్ అందుకు భిన్నం. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకొని నితిన్ తో ‘ఇష్క్’ చేశాడు. అసలు విజయం అనే పదాన్నే మరిచిపోయిన నితిన్ కి భారీ విజయాన్ని అందించాడు. ఇది లవ్ జానర్.
హారర్, లవ్ జానర్లతో విజయాలను అందుకున్న విక్రమ్ కుమార్ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడో! అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో... ‘మనం’ చేశాడు. అది ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఫాంటసీ మూవీ. పునర్మజన్మల కాన్సెప్ట్. అంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా. పెద్ద హిట్. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
నాలుగో ప్రయత్నంలో కూడా ఎవరికీ అందలేదు విక్రమ్. ఈ దఫా సైంటిఫిక్ ఫిక్షన్ కథను ఎంచుకున్నాడు. అదే.. ’24‘. తమిళ హీరో సూర్యతో త్రిపాత్రాభినయం చేయించి.. టైమిషిన్ తరహా కథతో తెలుగు, తమిళ భాషల్లో పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
డిసెంబర్ 22న ‘హలో’తో అయిదోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరి ఇంత జర్నీ చూశాక..‘హలో’పై జనాలకు ఆ మాత్రం నమ్మకం ఉండటం తప్పుకాదు కదా! అందుకే... అఖిల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఘంటపథంగా చెప్పేస్తున్నారు. మరి ఈ దఫా విక్రమ్ ఎలాంటి కథను ఎంచుకున్నాడో. ప్రోమోలు, పబ్లిసిటీ చూస్తే ప్రేమకథ అనిపిస్తుంది. మరి ఇది ఉత్తి ప్రేమకథేన? లేక ఇంకేదైనా జిమ్మిక్కు చేశాడా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే... ఓ వారం ఆగాల్సిందే.
Also Read