ఉయ్యాలవాడ కథ ఇది?
on Aug 22, 2017
చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అని అందరికీ తెలిసిందే. అయితే.. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని టాక్. అసలు చిరంజీవి సినిమా అంటే.. డాన్సులు ఓ రేంజ్ లో ఉండాలి. కానీ... ఈ దఫా మెగాస్టార్ స్వాతంత్ర్య సమరయోధునిగా కనిపించబోతున్నాడు. అంటే.. అభిమానులకు డాన్సులు గట్రా లేనట్టే. మరి ఇలాంటి కథను ఎంచుకునే సాహసం మెగాస్టార్ ఎందుకు చేశారు. ? అసలు ఉయ్యాలవాడ కథేంటి? అనేది తెలుసుకోవాలనుందా? అయితే... వినండి.
అది 17వ శతాబ్దం. బ్రిటీష్ పాలన మొదలై ఓ యాభై ఏళ్లు కావొస్తోంది. పరగణాలన్నింటినీ ఏలే పాలెగాళ్లను తమ చేతిల్లోకి తీసుకొని వాళ్లకు నెలకింతని బ్రిటీష్ వారు భరణం ఇచ్చేవారు. కర్నూల్ పరిసర ప్రాంతాల పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అందరితో పాటు ఉయ్యాలవాడ కూడా బ్రిటీష్ వారి వద్ద భరణం తీసుకొనేవాడు. ఓ రోజు అనుకోని కారణాలవల్ల తను వెళ్లలేక... భరణం తీసుకురమ్మని తన అనుచరుణ్ణి బ్రిటీష్ కార్యాలయానికి పంపుతాడు ఉయ్యాలవాడ. కానీ... బ్రిటీష్ అధికారులు దానికి ఒప్పుకోరు. భత్యం తీసుకోవాల్సింది ఉయ్యాలవాడ. అతడ్నే వచ్చి, కాళ్లు పట్టుకొని క్షమాపణ వేడుకొని భత్యం తీసుకెళ్లమంటారు. ముష్టి తీసుకునేవాడికి ఇంత పొగరుబోతు తనమా? అని హేళనగా మాట్లాడతారు. ఈ విషయం తెలుసుకున్న ఉయ్యాలవాడ... ఆగ్రహంతో ఊగిపోతాడు. అసలు ఎవరు భరణం ఇచ్చేవారూ? ఎవరు తీసుకునేవారు? అని తొలిసారి బ్రిటీషర్లపై ఎదురు తిరుగుతాడు. ఇది నా దేశం... విడిచిపోండి.. లేకపోతే... తలలు తెగుతాయ్ అని బ్రిటీష్ వారికి శాసనం పంపుతాడు. యుద్ధానికి వచ్చిన బ్రిటీష్ సైనికులతో చావుకేకలు వేయిస్తాడు. చావు భయం రుచి చూపిస్తాడు. భయంతో పారిపోతున్న బ్రిటీష్ జనరల్ తలను ఒక్క వేటితో నరికి తెలుగు వాడి పౌరుషాన్ని తెల్లదొరలకు రుచిచూపిస్తాడు.
అక్కడ్నుంచి జరిగిన పోరాటంలో చివరకు ఉయ్యాలవాడ బ్రిటీషర్ల చేతుల్లో హతుడవుతాడు. ఆయన తల పాశవికంగా నరికి... ఆ మృత ఖండాన్ని కర్నూలు కోట బురుజుకి వేళాడగడతారు బ్రిటీష్ వారు. ఆ విధంగా స్వతంత్ర్య నినాదం చేసిన తొలి సమరయోధునిగా కీర్తికెక్కాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటు ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాయకుడు ఉయ్యాలవాడ. సిపాయిల తిరుగుబాటు వ్యవహారంలో కూడా ఉయ్యాలవాడ స్పూర్తి ఉంది. ఈ విషయం ఝాన్సీ లక్ష్మీబాయ్ చరిత్రను పరిశీలిస్తే మనకు అవగతమవుతుంది.
మరి సినిమాలో ఈ కథకు ఎలాంటి మార్పులు జరిగాయో తెలియాలి. కమర్షియల్ అంశాల కోసం కొంత కవి స్వేచ్ఛ సహజం. అయితే... అది చరిత్రకు విరుద్ధంగా మాత్రం ఉండకూడదు. మరి చిరంజీవి అండ్ టీమ్ ఈ కథ విషయంలో ఎలాంటి వర్కవుట్లు చేశారో... ఎలాంటి మార్పులు చేశారో. ఎలాంటి సొగబులద్దారో... తెలియాలంటే.. సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే.
Also Read