చిరు,పవన్, చరణ్, బన్నీల సినిమా.. అయ్యే పనేనా?
on Jan 20, 2017
చిరంజీవి, పవన్ కల్యాణ్ కలసి నటిస్తే ఎలా ఉంటుంది? వీళ్లిద్దరికి చరణ్, అల్లు అర్జున్‌లు కలిస్తే... అద్భుతమే కదా? ఈ మెగా మల్టీస్టారర్‌కి స్కెచ్ వేసేశారు కళాబంధు సుబ్బరామిరెడ్డి. భారీ చిత్రాల నిర్మాతగా ఒకప్పుడు సుబ్బిరామిరెడ్డికి క్రేజ్ ఉండేది. ఆ తరవాత సినిమాలకు దూరమయ్యారాయన. అయితే ఇప్పుడు మళ్లీ ప్రొడ్యూసర్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు మెగా మల్టీస్టారర్‌తో కొబ్బరికాయ్ కొట్టాలని ఫిక్స్ అయ్యారట. ఖైదీ నెం. 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ``చిరంజీవి, పవన్, చరణ్, బన్నీలతో ఓ సినిమా తీస్తా`` అన్నారాయన. అప్పుడేదో మాటవరసకు అన్నారేమో అనుకొంటే... ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టు గురించి పాయింట్ లేవనెత్తారు. చిరు రీ ఎంట్రీ సక్సెస్ ఫుల్‌గా అయిన సందర్భంగా పార్క్ హయత్‌లో చిరుని ఘనంగా సన్మానించారాయన. ఈ సందర్భంగా మరోసారి మెగా మల్టీస్టారర్ ప్రస్తావన తీసుకొచ్చారు సుబ్బిరామిరెడ్డి.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తాను.. త్వరలోనే నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని, చిరుతో ఓ భారీ మల్టీస్టారర్ తీస్తానని ఎనౌన్స్ చేసేశారు. చిరు సినిమాలో వపన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా కనిపిస్తారని, ఈ సినిమాకి అశ్వనీదత్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తారని సుబ్బిరామిరెడ్డి చెప్పుకొచ్చారు. నిజంగా ఈ కలయిక కుదిరితే అద్భుతమే. చిరుతో కలసి నటించడానికి చరణ్, బన్నీలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పవన్నీ ఈ టీమ్‌లో చేర్చుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరు - పవన్లమధ్య గ్యాప్ రోజు రోజుకీ పెరుగుతోంది. చిరు ఫంక్షన్లకు డుమ్మా కొడుతున్న పవన్.. ఇప్పుడు సినిమా అంటే రెడీ అవుతాడా.. అనేది అనుమానమే.