పవన్ కోసం అరవింద్ ఇన్ని రాజకీయాలా?
on Jan 20, 2017
మెగా బ్రదర్స్ చిరంజీవి - పవన్ కల్యాణ్ మధ్యన కంటికి కనిపించని ఓ అడ్డు గోడ ఉంది. పైకి `నా ముద్దుల తమ్ముడు పవన్` అని చిరు... `నా ఆరాధ్యదైవం అన్నయ్య` అని పవన్ చెప్పుకొంటున్నా... నిజానికి వీరిద్దరి మధ్య అంత అనుబంధం లేదన్నది మెగా ఫ్యాన్స్‌కీ తెలుసు. తొమ్మిదేళ్ల తరవాత అన్నయ్య సినిమా ల్లోకి వస్తే ఆ ఫంక్షన్‌కి కూడా రాలేనంత బిజీ అయిపోయాడు పవన్. పవన్ రాకూడదనే ఆ కార్యక్రమానికి రాలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ముందూ... మెగా ఫంక్షన్లకు పవన్ హాజరవుతాడన్న గ్యారెంటీ లేదు. నిజానికి పవన్‌కీ చిరుకీ అంత వైరం ఎక్కడొచ్చింది? వీరిద్దరి మధ్య అడ్డుగోడ కట్టిందెవరు అని అడిగితే.. అల్లు అరవింద్ అనే సమాధానం వినిపిస్తుంటుంది.
చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో అరవింద్ క్రీయాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకంలో అరవింద్ చాతుర్యం స్పష్టంగా కనిపించింది. తన కోటరీలో ఉన్నవాళ్లకు సీట్లు ఇప్పించగలిగాడు అరవింద్. ఆ వ్యవహారం నచ్చక అప్పట్లో అరవింద్‌తో గొడవపడ్డాడు పవన్. ఇలాంటి సమయంలో తమ్ముడ్ని సపోర్ట్ చేయకుండా బామ్మర్దిని వెనకేసుకొచ్చాడు చిరు. ఎన్నికలు అయిపోయిన తరవాత పార్టీ కేవలం 18 సీట్లకు పరిమితమయ్యాక... జెండా ఎత్తేసి, కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం కూడా పవన్‌కి నచ్చలేదు. అయితే వెనుక ఉండి ఈ తతంగం అంతా నడిపించింది అల్లు అరవిందే. అక్కడే.. అరవింద్‌కీ పవన్‌కీ మరింత గ్యాప్ పెరిగింది. అన్నయ్య తన మాట వినకపోవడం అరవింద్‌ని సపోర్ట్ చేయడంతో... చిరు విషయాల్లో పవన్ జోక్యం పూర్తిగా తగ్గిపోయింది.
పవన్‌ని మళ్లీ దగ్గర చేసుకోవాలని చిరుకీ, అతని కుటుంబ సభ్యులకు ఉన్నా... అరవింద్ మాత్రం అందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదని పవన్ అభిమానులు భావిస్తున్నారు. చిరునీ, పవన్నీ దూరం పెడుతోంది ఆయనే అని... వాళ్లందరి నమ్మకం. అటు ధృవనీ, ఇటు ఖైదీ నెం.150నీ అరవింద్ బాగా మోశారు. ఖైదీ నెం.150 సినిమాతో అరవింద్‌కి సంబంధం లేకపోయినా.. ఆ సినిమాకి సంబంధించిన అన్ని వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకొన్నారు. ఇదంతా... పవన్‌ని దూరం పెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలే అన్నది పవన్ అభిమానులు నమ్మకం. అన్నాదమ్ములిద్దరూ కలవకపోవడానికి కారణం.. అల్లు అరవిందే అని పవర్ స్టార్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతుంటారు. మరి వీటికి మెగా కాంపౌండ్ సమాధానం ఇవ్వగలదా? అరవింద్ నోరు విప్పగలరా?? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Also Read