విష్ణు మళ్లీ ఆ హీరోయిన్ని పట్టేశాడు
on Aug 22, 2016
హన్సికకు తెలుగులో సినిమాలు బాగా తగ్గిపోయాయి. అయితే మంచు వారి సినిమాల్లో మాత్రం తరచుగా నటిస్తోంది. హన్సిక ఓ తెలుగు సినిమా చేస్తోందంటే అది.. మంచు ఫ్యామిలీ సినిమా అయ్యుండొచ్చని కన్ఫామ్ అయిపోతున్నారు సినీ జనాలు. విష్ణుతో కలసి రెండు సినిమాల్లో నటించింది హన్సిక. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో విష్ణు, హన్సిక జోడీ కట్టారు. ఆ రెండు సినిమాల్లో వీళ్ల జోడీ ఓకే అనిపించుకొంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విష్ణు - హన్సికలు కలసి నటించబోతున్నారు. విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం లక్కున్నోడు. రాజ్‌కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. గీతాంజలి, త్రిపుర చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడీయన. ఇప్పుడు విష్ణు కోసం ఓ కథ రెడీ చేసుకొన్నాడు. మాస్, యాక్షన్, వినోదం అంశాల్ని మేళవిస్తూ సరికొత్త జోనర్లో సాగే సినిమా ఇది. ఇందులో కథానాయికగా హన్సికని ఎంచుకొన్నారు. అలా.. విష్ణు మరోసారి ఈ కథానాయికని పట్టేశాడన్నమాట. మరి ఈ హ్యాట్రిక్ సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.