డైలాగ్ కింగ్‌కి ఎన్ని తిప్పలో...??
on Aug 22, 2016
వారసుల్ని హీరో చేయడం సులభమే. కానీ వాళ్లకో హిట్టు తీసుకురావడం మాత్రం కష్టాతి కష్టం. ఆ కష్టం ఎలా ఉంటుందో సాయికుమార్ స్వయంగా అనుభవిస్తున్నాడు. ఆది హీరో అయి చాలా ఏళ్లయ్యింది. తొలి సినిమా ప్రేమ కావాలి ఓ మాదిరిగా ఆడిందంతే. ఆ తరవాత వచ్చిన లవ్ లీ పరిస్థితి కూడా అంతే. అక్కడ్నుంచి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. సుకుమారుడు, ప్యార్‌మే పడిపోయానే, రఫ్, గరమ్.. ఇలా నాలుగు ఫ్లాపులు తగిలాయి. చుట్టాలబ్బాయ్తో హిట్టు కొట్టి.. ఆదిని నిలబెట్టాలనుకొన్నాడు సాయికుమార్. ఈ సినిమాలో ఆయనా నటించారు. కానీ ఫలితం మాత్రం సేమ్ టూ సేమ్. సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్తెచ్చుకొంది. అయినా సరే, ఈ సినిమాని కాస్తయినా నిలబెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు సాయికుమార్. పబ్లిసిటీ భారీగా పెంచడానికి తాను కూడా నిర్మాతలకు కొంత మొత్తం ముట్టజెప్పాడట. తనకున్న పరిచయాలతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని తీసుకొచ్చి సినిమా చూపించాడు. ఈ సినిమా గురించి నాలుగు మంచి ముక్కలు మాట్లాడి వెళ్లిపోయారాయన. మీడియా వాళ్లకు కూడా ఫోన్లు చేసి 'మా అబ్బాయి సినిమాని కాస్త చూసుకోండి' అంటూ పర్సనల్ గా రిక్వస్ట్ చేస్తున్నాడట. అయినా ఈ సినిమా వసూళ్లు మాత్రం పెరగడం లేదు. పాపం.. తనయుడికి ఓ హిట్టివ్వాలని తండ్రిగా ఎంత పాటు పడుతున్నాడో..??