English | Telugu
సినిమా పేరు: జయ జానకీ నాయక
బ్యానర్ : ద్వారక క్రియేషన్స్
Rating : 2.00
విడుదలయిన తేది : Aug 11, 2017
Facebook Twitter Google

సినిమా:- జయ జానకీ నాయక
తారాగణం:- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, శరత్ కుమార్, సుమన్...
దర్శకత్వం:- బోయపాటి శ్రీను 
నిర్మాత:- మిరియాల రవీంద్రరెడ్డి

‘పాడిందే పాటరా పాచిపళ్ల దాసుడా’ అని ఓ సామెత ఉంది. మన తెలుగు సినిమా వాళ్లకు అది సరిగ్గా సరిపోతుంది. తీసిందే తీస్తుంటారు. చేసిందే చేస్తుంటారు. దాన్ని బలవంతంగా జనాల నెత్తిన రుద్దుతుంటారు. ‘నిన్ను నమ్మే బకరా నిర్మాతలున్నారు కాబట్టి... నువ్వు తీసిందే తీస్తావ్.. బాగానే ఉంది. కానీ... చూసిందే చూడాల్సిన అవసరం మాకు లేదు’సగటు ప్రేక్షకుడి మనసులోంచి వినిపిస్తున్న మాట ఇది. మరి మన తెలుగు సినిమా వాళ్లకు ఎప్పుడు వినిపిస్తుందో ఏమో! ఓ వైపు బాలీవుడ్ సినిమాలు అటు ఇటుగా హాలీవుడ్ స్థాయికి చేరుకుంటున్నాయ్. మరి మన సినిమాలు అటు ఇటుగా బాలీవుడ్ స్థాయిలో అయినా ఉండాలా? ఒక్కడు కొడితే... వందమంది ఎగిరి పడే అర్థరహిత షాట్లు ఎన్నాళ్లు తీస్తారయ్యా? 

హీరోని భూమి మీద ఎప్పుడు నడిపిస్తారూ...? చూసే ప్రేక్షకులు తమకు తాము ఐడెంటిఫై చేసుకునే స్థాయిలో పాత్రలను ఎప్పుడు సృష్టిస్తారూ..? ‘మాస్  సినిమా’అంటే జనం సినిమా అని అర్థం. జనం మెచ్చే సినిమా అని అర్థం. అంతేకానీ.. కొట్టుకోడాలూ, చంపుకోడాలూ.. వికృతమైన అరుపులూ, కేకలూ, చేష్టలూ... ఇది కాదు మాస్ సినిమా అంటే. ఒకవేళ కథ రిత్యా అవన్నీ ఉన్నా.. అర్థవంతంగా ఉండాలి. శృతిమించి కాదు.  ప్రేక్షకులు కూడా తల్లి లాంటివారే. ముద్దొస్తే చంకెనెత్తుకుంటారు. అదే, చెప్పిన మాట వినకుంటే... ఎత్తి కుదేస్తారు. ఇందుమూలంగా మన దర్శక‘సింహా’లకు చెప్పేదేంటంటే... ‘జర భద్రం’. ఈ శుక్రవారం ‘జయ  జానకీ నాయక’అని ఓ సినిమా రిలీజైంది. ఆ సినిమా గురించి చెప్పేముందు.. ఎందుకో... ఇలా నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది. ఇక కథలోకెళ్దాం. 

కథ:
ఇందులో హీరో తండ్రి... హీరోయిన్ ని చూపించి, హీరోతో ఓ మాట అంటాడు. ‘రేయ్... జీవితంలో ఆ అమ్మాయి కళ్లలో నీళ్లు రానీయకు’ అని. తండ్రి అంటే ప్రాణం పెట్టే కొడుకు అవ్వడం, పైగా ఆ అమ్మాయిని ప్రాణాధికంగా ప్రేమిస్తున్నవాడు అవ్వడంతో... నాన్న మాటను శిరోధార్యంగా భావస్తాడు. ‘ఆ అమ్మాయి దక్కినా, దక్కకపోయినా... ఎక్కడున్నా, ఏం చేస్తున్నా... ఎన్నడూ ఆ అమ్మాయ్ కళ్లలో నీళ్లు మాత్రం  రాకూడదు’ ఇదే అబ్బాయ్ లక్ష్యం. అయితే... ఆ అమ్మాయికి అప్పట్నుంచే కష్టాలు మొదలవుతాయ్. నాలువైపుల నుంచీ గండాలు మూగుతాయ్. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించిన అమ్మాయిని హీరో ఎలా కాపాడుకున్నాడు? కన్నీటి మయం అయిన ఆ అమ్మాయి జీవితాన్ని మళ్లీ ఆనందమయం ఎలా చేశాడు? అనేది మిగిలిన కథ. ఎనాలసిస్ :

బోయపాటి శ్రీను ఈ సినిమాను ఎలా తీశాడు? ‘యాజిటీజ్ గా తీశాడు’. అంతే.. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. మొదట్నుంచీ యాంగ్రీ ఎమోషన్ ని హీరోల నుంచి బాగా రాబట్టే బోయపాటి... ఈ సినిమాలో కూడా అదే చేశాడు. తొలి సినిమా నుంచీ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇరగదీసే బోయపాటి.. ఈ సినిమాలో కూడా ఇరగదీశాడు.. ఆ మాటకొస్తే, మోతాదుని పెంచేశాడు. డైలాగులతో థియేటర్లు హోరెత్తించే బోయపాటి...  ఈ సినిమాలో కూడా ఆ ఫీట్ రిపీట్ చేశాడు. మరి ఇందులో కొత్తగా ఏం చేశాడు?.. దానికి మౌనమే సమాధానం. అలా అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి?..  దానికీ మౌనమే సమాధానం. బోయపాటి తనకు బాగా వచ్చిన వంటనే మళ్లీ వండాడు. అయితే... ఈ దఫా కారం చాలా ఎక్కువైంది అంతే. అందుకే భరించడం కష్టమైంది.  


కథ పరంగా చూసుకుంటే.. మంచి కథే. భావోద్వేగాలను పండించడానికి అనువైన కథ.  అయితే.. కథ మీద కంటే హీరో మీదే దృష్టి అంతా పెట్టాడు బోయపాటి. ఈ కథకు సోల్ హీరోయిన్ పాత్ర. ఆ పాత్ర ఎంత హైలైట్ అయితే... సినిమాకు అంత మంచిది. కానీ... ఎక్కడా హీరోయిన్ హైలైట్ అయినట్టు కనిపించదు. సినిమా అంతా నరుక్కోడాలూ, చంపుకోడాలు, గావు కేకలు. ‘రెండొందలు ఖర్చుబెట్టుకొని, విలువైన రెండు గంటల సమయాన్ని వృధా చేసుకొని... నువ్వేదో పొడిచేస్తావని సినిమాకొస్తే... ఆ పొడుచుకోవడాలేంటి? ఆ కాల్చుకోవడాలేంటి? ఎటు నుంచి ఏ గుండు వచ్చి దిగుతుందో అని హడలి చచ్చాం’అంటున్నారు థియేటర్ నుంచి బయటకొచ్చే జనాలు.  
అయ్యా బోయపాటి..!  కొత్తగా ఏదైనా చేయ్ నాయనా.. ప్లీజ్! అని ప్రాధేయపడుతున్నారు. 

నటీనటుల పర్ఫామెన్స్:
ఇక బెల్లంకొండ శ్రీనివాస్. అబ్బాయ్ ఫిజిక్ బావుంది. డాన్స్ అయితే... షేక్ అడించేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగాచేశాడు. అయితే... ఇంకా నటనలో మెరుగవ్వాలి. రకుల్ ప్రీత్ సింగ్... సినిమాలో ఎక్కువ భాగం అలనాటి హీరోయిన్ ‘జూనియర్ శ్రీరంజని’మాదిరి  ఏడుస్తూనే ఉంది. ఉన్నంతలో బాగా చేసింది. జగపతిబాబు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అద్భుతంగా చేశాడు. వంక పెట్టడానికి లేదంతే. శరత్ కుమార్ అయితే... అతనున్న సీన్స్ లో అందరినీ డామినేట్ చేశాడు. మిగిలిన వాళ్ల గురించి సరేసరి. సాంకేతికంగా చెప్పుకుంటే... దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేవ్. రిషి పంజాబీ ఛాయాగ్రహణం బావుంది. 


ఓవరాల్ గా చెప్పుకుంటే... ఏ మాత్రం కొత్తదనం లేని రొటీన్ యాక్షన్ సినిమా ‘జయ జానకీ నాయక’. ఊర సినిమాలు ఇష్టపడేవాళ్లకు నచొచ్చు. కానీ... కొత్తదనం కోరుకునేవారు చూస్తే మాత్రం కళ్లకు మత్తివ్వకుండా ఇంజక్షన్ చేసినట్లుంటుంది... జాగ్రత్త. 
 తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

కారం మరీ ఎక్కువైందీ

  

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here