సినిమా పేరు: అర్జున్ సురవరం
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, లావణ్యా త్రిపాఠి, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, నాగినీడు, సత్య, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి, ప్రగతి, కిశోర్, విద్యుల్లేఖా రామన్
సంగీతం: శామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటింగ్: నవీన్ నూలి
సమర్పణ: ఠాగూర్ మధు
రచన-దర్శకత్వం: టి. సంతోష్
బ్యానర్: మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ
విడుదల తేదీ: 29 నవంబర్ 2019
ఎప్పుడో మే 1న విడుదల కావాల్సిన సినిమా అనూహ్యమైన సమస్యల్లో చిక్కుకొని, క్రమంగా వాటిని పరిష్కరించుకుంటూ దాదాపు ఏడు నెలలు ఆలస్యంగా విడుదలైంది 'అర్జున్ సురవరం'. అప్పట్లోనే ట్రైలర్ చూసినప్పుడు ప్రామిసింగ్‌గా అనిపించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వచ్చారు. నిఖిల్, లావణ్య టీవీ జర్నలిస్టులుగా నటించడం, 'వియ్ డిమాండ్ అర్జున్ సురవరం అరెస్ట్' అంటూ ప్లకార్డులతో జనం ప్రదర్శన చేయడం ఆసక్తిని రేకెత్తించింది. మూడేళ్ల క్రితం అధర్వ హీరోగా నటించగా తమిళంలో వచ్చిన 'కణిదన్' సినిమాకు రీమేక్ అయిన 'అర్జున్ సురవరం' అంచనాలకు తగ్గట్లే ఉందా...
కథ:-
తండ్రి (నాగినీడు) అభీష్టానికి విరుద్ధంగా, ఆయనకు తెలీకుండా టీవీ99 అనే చానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్). ఒక పబ్‌లో పరిచయమైన కావ్య (లావణ్యా త్రిపాఠి)తో అర్జున్‌కు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆమె తన బాస్ కూతురేననే విషయం ఆమె తమ చానల్లో రిపోర్టర్‌గా జాయినయినప్పుడే అతడికి తెలుస్తుంది. ఒకసారి అనూహ్యంగా ఫేక్ సర్టిఫికెట్లతో బ్యాంక్‌ను మోసం చేసి ఎడ్యుకేషనల్ లోన్ పొందాడంటూ పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. అతడిలాగే మరికొంతమంది యువతను కూడా అవే ఆరోపణలతో అరెస్టవుతారు. అర్జున్‌కు బెయిల్ లభిస్తుంది. ఇదంతా పెద్ద కుట్ర అనీ, ఎవరో నకిలీ సర్టిఫికెట్లతో భారీ కుంభకోణానికి పాల్పడుతుండటమే కాకుండా, నకిలీ సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం కనిపెడతాడు అర్జున్. అయితే ఈ కుంభకోణం వెనుక ఉన్నది అర్జున్ అంటూ న్యూస్ వస్తుంది. పోలీసులకు అర్జున్ లొంగిపోతాడు. ఆ తర్వాత అతడు తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు, అసలు నిందితులను ఎలా కనిపెట్టాడు? అనే విషయాల్ని తర్వాత కథలో చూస్తాం.
ఎనాలసిస్ :
టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నా, అదెలా దుర్వినియోగమవుతున్నదో రోజూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. 'అర్జున్ సురవరం' కూడా అటువంటి ఒక లైన్ మీద ఆధారపడి తీసిన ఒక క్రైమ్ థ్రిల్లర్. మన అవసరాల కోసం ఇచ్చే సమాచారాన్ని కొంతమంది ఎలా తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తుంటారో, ఎలా అమాయకుల్ని బాధితులుగానే కాకుండా నిందితులుగా కూడా మార్చేస్తుంటారో, వివరంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. జనం 'అర్జున్ సురవరంను వెంటనే అరెస్ట్ చెయ్యాలి' అని ప్లకార్డులతో ప్రదర్శన చెయ్యడం, పోలీసులకు అర్జున్ లొంగిపోవడంతో సినిమా మొదలవుతుంది. హీరోని అరెస్ట్ చెయ్యమని జనం డిమాండ్ చెయ్యడం చూడగానే అతడు చేసిన నేరమేమిటనే ఆసక్తి మనలో కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (కన్నడ కిశోర్)తో తన కథను అర్జున్ చెబుతున్నట్లుగా దర్శకుడు చూపించడం మంచి ఎత్తుగడే.
ఫస్టాఫ్‌ను ఎంటర్టైనింగ్గా తీసి సెకండాఫ్ కోసం ఎదురు చూసేలా చేశాడు దర్శకుడు. రిపోర్టింగ్‌లో అర్జున్ వెన్నంటి ఉండే సహోద్యోగిగా సత్య నవ్వులు పండిస్తాడు. అలాగే వెన్నెల కిశోర్, విద్యుల్లేఖా రామన్ మధ్య వచ్చే సీన్లు కూడా హాస్యాన్ని పంచుతాయి. మరోవైపు ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణాన్ని బయటపెట్టే క్రమంలో ఆ కుంభకోణం వెనుక ఉన్న దురా సర్కార్ (తరుణ్ అరోరా) కొడుకుతో జరిగిన ఘర్షణలో అతడిని చంపేస్తాడు అర్జున్. దీంతో కథ మరింత రసకందాయంలో పడుతుంది. అప్పటికి దురా సర్కార్ ఎవరో అర్జున్‌కు కానీ, తన కొడుకును చంపింది అర్జున్ అని దురా సర్కార్‌కు కానీ తెలీదు. హీరో విలన్లు ఒకర్నొకరు కనిపెట్టడానికి చేసే ప్రయత్నాలను పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా దర్శకుడు మలచాడు. నిందితుల్ని పట్టుకోవడానికి వెన్నెల కిశోర్‌ను హీరో వాడుకోవడం, విలన్ గ్యాంగ్ అతడిని పట్టుకొని తమ డెన్‌కు తీసుకెళ్లి చంపబోతే, ఆఖరి క్షణంలో హీరో వచ్చి అతడిని కాపాడటాన్ని ఎంటర్టైనింగ్గానూ, అదే సమయంలో ఎమోషనల్గానూ తీయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. అయితే ఫస్టాఫ్ తరహా స్క్రీన్‌ప్లేను సెకండాఫ్‌లో కొనసాగించడంలో అతను తడబడ్డాడు.
తన అభీష్ఠానికి వ్యతిరేకంగా కొడుకు ఒక టీవీ చానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడని తెలిసినప్పుడు షాకైన అర్జున్ తండ్రి, ఆ తర్వాత తన కొడుకుకు సపోర్టునిచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. తండ్రీకొడుకులుగా పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ పాత్రల్ని డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. వాళ్ల పాత్రలకు సంబంధించి కన్నీళ్లు తెప్పించే సీన్ కూడా ఉంది. కథానుసారం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్సుకు అవకాశమున్నా, దానిపై ఎక్కువగా ఫోకస్ చెయ్యలేదు దర్శకుడు. ఆ ఇద్దరి మధ్య కేవలం ఒక డ్యూయెట్ పెట్టి వదిలేశాడు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అవుతున్నప్పుడు రొమాన్స్ కూడా అలరించే ఎలిమెంట్ అవుతుంది. దాన్ని దర్శకుడు మిస్ చేసుకున్నాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవుతాడనే సినిమా ప్రాథమిక సూత్రం ఈ సినిమాకీ వర్తిస్తుంది. టెక్నికల్‌గా చూస్తే సన్నివేశాలకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ దన్నుగా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్:-
కంటెంట్
ఫస్టాఫ్
హీరో విలన్ క్యారెక్టరైజేషన్స్
ఎంటర్టైన్మెంట్
మైనస్ పాయింట్స్:-
కథలో టెక్నికల్ విషయాలు ఎక్కువవడం
హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ లేకపోవడం
సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే బలహీనమవడం
క్లైమాక్స్ సీన్
నటీనటుల అభినయం:-
అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో నిఖి చక్కగా రాణించాడు. ఒక సినిమాను తన భుజాలపై తీసుకెళ్లగలనని ఈ సినిమాతో అతను నిరూపించాడు. జోవియల్ క్యారెక్టర్స్‌ను ఎంత చులాగ్గా చేయగలనో, సీరియస్ రోల్స్‌ను కూడా అంటే ఈజ్‌తో చేయగలనని తెలియజేశాడు. అతని హావభావాల్లో ఎంతో పరిణతి కనిపించింది. యాక్షన్ సీన్స్‌లోనూ మంచి వేగం కనపరిచాడు. కావ్య పాత్రలో లావణ్య పేరుకు తగ్గట్లే ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. అవకాశం లభించినప్పుడల్లా చక్కని పర్ఫార్మెన్స్ చూపింది. ఆమె పాత్రను దర్శకుడు మరింత బాగా ఉపయోగించుకొని ఉంటే, సినిమాకు ఆమె ఒక ప్లస్సయ్యేది. విలన్‌గా తరుణ్ అరోరా పర్ఫెక్టుగా సూటయ్యాడు. కనిపించినప్పుడల్లా ముఖంలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ కథలో టెన్షన్ పెంచాడు. సత్య, వెన్నెల కిశోర్, విద్యుల్లేఖా రామన్ చక్కని హాస్యంతో అలరించారు. ఎలాంటి పాత్రయినా సరే, తను సునాయాసంగా చెయ్యగలని కానిస్టేబుల్ సుబ్బారావు పాత్రతో మరోసారి చేసి చూపించాడు పోసాని. నాగినీడు, కిశోర్ పాత్రల పరిధి మేరకు నటించారు. చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి పాత్రలో రాజా రవీంద్ర మెప్పించాడు.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
సెకండాఫ్ స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ కనపరచి ఉంటే, క్లైమాక్స్‌ను ఇంకా బాగా తీసి వుంటే.. తప్పకుండా ఒక భారీ విజయాన్ని సాధించగలిగిన సత్తా ఉన్న సినిమా 'అర్జున్ సురవరం'. అయినప్పటికీ ప్రేక్షకులని నిరాశపరచదు.
- బుద్ధి యజ్ఞమూర్తి