English | Telugu
Home  » 

హీరో సుధీర్ బాబుతో తెలుగువన్ డాట్ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

on Jan 28, 2012

సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నమ్మాయి పద్మిని ప్రియదర్శిని భర్త, ప్రిన్స్ మహేష్ బాబుకి బావ అయిన "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి చిత్రం హీరో సుధీర్ బాబుతో తెలుగువన్ డాట్ కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

తెలుగువన్ డాట్ కామ్ - సుధీర్ గారు హీరోగా మీ తొలి చిత్రం "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి విడుదలకు సిద్ధమవుతోంది. అందుకు గాను ముందుగా మీకు కంగ్రాట్స్.

సుధీర్ బాబు - థ్యాంక్స్ అండీ...!

తెలుగువన్ డాట్ కామ్ - మీరు సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్నల్లుడుగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారా...? లేక మీ వ్యక్తిగత ఇమేజ్ తోనే సినీ రంగ ప్రవేశం జరిగిందా...? మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది...?

సుధీర్ బాబు - మాది విజయవాడండీ...! అక్కడ రోడ్ల మీద జనం కన్నా ఎక్కువగా సినిమా పోస్టర్లే మీకు కనపడతాయ్. మా ఊర్లో ఏ ఇంజినీరింగో లేక మెడిసనో చదువుని ఉద్యోగం చేసుకునే వాడికి మర్యాద, గౌరవం ఉంటాయి. లేకపోతే వీడేదో తేడాగాడంటారు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. సినీ రంగం మీద మక్కువ ఎక్కువ. అందుకని ఇంజినీరింగ్ పూర్తి చేసి, యమ్.బి.ఎ. అలాగే జి.యమ్.టి. కూడా పూర్తిచేశాక మాత్రమే సినీ రంగంలోకి వచ్చాను. ఇక మామయ్యగారి ఇమేజ్ కానీ, బావ మహేష్ బాబు ఇమేజ్ కానీ నాకు ప్రమోషన్ కి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ నాలో ప్రతిభ లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవటం అసాధ్యం. నన్ను నేను నమ్ముకునే ఈ రంగంలోకి వచ్చాను.

తెలుగువన్ డాట్ కామ్ - "యస్.యమ్.యస్." శివ మనసులో శృతి చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎలా వచ్చింది....?

సుధీర్ బాబు - దర్శకుడు తాతినేని సత్య నాకు మంచి స్నేహితుడు. అలాగని నాన్ను ఏమీ పరీక్షించకుండానే నాకీ అవకాశమివ్వలేదు. ఒక ఆరు నెలల పాటు నటనలో, డ్యాన్సుల్లో, జిమ్నాస్టిక్స్ లో నాకు పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చి ఆయన నా పెర్ ఫార్మెన్స్ చూసి సంతృప్తి చెందాకనే నాకీ అవకాశమిచ్చారు. ఇంకోవిషయం ఆయన నాకు కథ చెప్పినదానికంటే సినిమా బాగా తీశారు. ఎందుకంటే ఆయన వెరీ బ్యాడ్ నెరేటర్.

తెలుగువన్ డాట్ కామ్ - ఆరునెలల శిక్షణకే మీరు మోకాళ్ళతో మూన్ వాక్, సమ్మర్ సాల్ట్ ల వంటి ప్రక్రియలన్నీ చాలా అలవోకగా ఎలా చేయగలిగారు....?

సుధీర్ బాబు - ఇదే మాట మా బావ మహేష్ బాబు కూడా పదే పదే అడిగారండీ...! ఆయనకి నా పెర్ ఫార్మెన్స్ చూసి చాలా ఆశ్చర్యమేసింది. కానీ ఇది నిజం.

తెలుగువన్ డాట్ కామ్ - సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీలో ఇప్పటికే మహేష్ బాబు ఉన్నారు. మళ్ళీ మీరు వస్తున్నారు. మహేష్ బాబు మీకు సపోర్టనుకుంటున్నారా...?

సుధీర్ బాబు - మహేష్ ఇమేజ్ నాకు సపోర్ట్ ఇవ్వటం కన్నా డిజడ్వాంటేజ్ అవుతుందండీ....! ఎలాగంటే జనం నన్ను ఆయనతో పోల్చే ప్రమాదముంది. అది నాకు చాలా ఇబ్బందికరమైన విషయం. కాకపోతే మహేష్ బాబు బావగా నాకు అద్భుతమైన ప్రమోషన్ లభిస్తుంది అంతే.

తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది....?

సుధీర్ బాబు - కొరియర్ బోయ్ గా నేనీ చిత్రంలో నటించానండీ...!

తెలుగువన్ డాట్ కామ్ - హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది....?

సుధీర్ బాబు - అది సస్పెన్స్. కాకపోతే మా ఇద్దరి మధ్య గొడవలు మీకు టామ్ అండ్ జెర్రీలాగుంటాయి. మా ఇద్దరి మధ్య సీన్లన్నీ కూడా మంచి ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉంటాయి.

తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రంలో మీ నటన గురించి మీరు తృప్తిగా ఉన్నారా...?

సుధీర్ బాబు - కచ్చితంగా సంతృప్తిగా ఉన్నాను.

తెలుగువన్ డాట్ కామ్ - ఈ తరం యువ హీరోల్లో చాలా బలమైన పోటీ నెలకొని ఉంది. దానికి మీరెలా తయారుగా ఉన్నారు....?

సుధీర్ బాబు - నేనెవరికీ పోటీ కాదండీ...అలాగే నాకూ ఎవరూ పోటీ కాదండి. కాకపోతే నన్ను నేను అప్ డేట్ చేసుకుంటూ, నాలో లోపాలను సరిచేసుకుంటూ నటించటమే నేను చేయగలిగింది. ఇక ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకం పుష్కలంగా ఉంది.

తెలుగువన్ డాట్ కామ్ - ఈ చిత్రం తర్వాత మీరు చేయబోయే సినిమా ఏది...?

సుధీర్ బాబు - రెండు స్క్రిప్టులు రెడీగా ఉన్నాయండి...ఈ సినిమా రిలీజయ్యాక ఏ సినిమా చెయ్యాలో నిర్ణయిస్తాను....!

తెలుగువన్ డాట్ కామ్ - ఆల్ ది బెస్ట్ సుధీర్ బాబు గారూ...మీ సినిమా సూపర్ హిట్టవ్వాలనీ, మీ కృషి ఫలించాలనీ, తెలుగువన్ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూంది...!

సుధీర్ బాబు - థ్యాంక్యూ వెరీ మచ్ సర్...!

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here