మళ్లీ అదే తరహా సినిమా అవసరమా నాయనా?
on Aug 17, 2017
కొత్తగా ఓ ఆలోచన వస్తుంది. దానిపై నెలల తరబడి వర్కవుట్ చేస్తారు. తమలో ఉన్న టాలెంట్ మొత్తం రంగరించి సినిమా తీస్తారు. అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఇక అక్కడ్నుంచి మొదలవుతుంది అసలు కథ. సక్సెస్ మత్తులో మునిగి తేలతారు. మళ్లీ అదే తరహా కథలను తయారు చేయడం మొదలెడతారు. సినిమా తీస్తారు. అది తుస్సుమంటుంది. ఎన్ని చూడలేదండీ... ఇలాంటి ఉదాంతాలు.
తొలి విజయం ఎలా వచ్చింది? ఓ కొత్త ఆలోచన నుంచి వచ్చింది. కష్టపడితే వచ్చింది. సక్సెస్ మాయలో పడి ఆ విషయాన్నేమరచిపోతే ఎలా?దాన్ని వల్ల పరాజయాల పరంపర. అవసరమా? మన దర్శకుల్లో ఒకరిద్దరు తప్ప అందరి ప్రవర్తనా ఇదే. ఆ ఒకరిద్దరులో శేఖర్ కమ్ముల ఉంటాడని మొదట్టో అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఆయన తీసిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్.. అలాంటివి. కానీ ‘హ్యాపీడేస్’ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’అనే సినిమాను తీశాడు శేఖర్ కమ్ముల. అదంతా దాదాపు ‘హ్యాపీడేస్’ ప్యాట్రన్ లోనే ఉంటుంది. సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత వచ్చిన లీడర్, అనామిక చిత్రాలు కూడా ఫ్లాపులే. దానికి కారణం కొత్తగా ఆలోచించకపోవడమే. ఏమైతేనేం... పాపం.. ఇన్నాళ్లకు ‘ఫిదా’చిత్రం శేఖర్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఎందుకంటే... ఇది కొత్త ఆలోచన. తొలి సినిమాకు పడ్డంత కష్టం పడితే వచ్చిన విజయం ఇది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
అయితే... వినిపిస్తున్న వార్తలే నిజమైతే... మళ్లీ శేఖర్ కమ్ముల తప్పు చేస్తున్నాడేమో! అనిపిస్తోంది. కారణం.. ఆయన ‘ఫిదా2’ చేయబోతున్నారట. ‘ఫిదా’ తరహాలోనే ఈ కథ కూడా తెలంగాణ గ్రామ నేపథ్యంలో సాగుతుందట. అయితే.. ఇది సీక్వెల్ కాదట. ‘ఫిదా’ను పోలిన వేరే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట శేఖర్. ప్రస్తుతం కథ తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ఇదే కనుక నిజమైతే... ‘ఫిదా’ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని నమ్మకంగా చెప్పలేం.
శేఖర్ కమ్ముల విషయంలో వినిపిస్తున్న ఈ వార్తపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఒకసారి చేసిన తప్పే మళ్లీ చేయడం అవసరమా శేఖర్ కమ్ములా? అని చాలామంది బహాటంగానే అంటున్నారు. ఏదిఏమైనా... మళ్లీ కొత్తగా ఆలోచించి మళ్లీ మంచి హిట్ ఇస్తే... అందరికీ ఆనందం... సంతోషం.