బన్నీ, కొరటాల.. అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్సయ్యారా?
on Mar 3, 2021
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు.. సదరు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. బన్నీ రాబోయే చిత్రాలపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
ప్రస్తుతం బన్నీ తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో `పుష్ప` చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగస్టు 13న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. ఆపై విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారు అల్లు అర్జున్. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
అంతేకాదు.. సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే రిలీజ్ డేట్ ని ఫిక్సయ్యారట బన్నీ, కొరటాల. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. 2022 సమ్మర్ స్పెషల్ గా మార్చి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు టాక్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, కొరటాల ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `ఆచార్య` మే 13న రిలీజ్ కానుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.