బరిలో ఎందరున్నా.. జైసింహా బలం ఇదే..?
on Jan 5, 2018
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ సమ్‌థింగ్ స్పెషల్.. స్టార్ హీరోల చిత్రాలు వన్ బై వన్ బాక్సాఫీస్ వద్ద క్యూకడతాయి. మిగతా రోజుల్లో విజయం సాధించడం కంటే సంక్రాంతి సీజన్లో హిట్ కొడితే ఆ కిక్కే వేరని మనోళ్లు భావిస్తారు. సంక్రాంతికి ఎవరి సినిమా ఉన్నా లేకపోయినా తన సినిమా ఉండేలా చూసుకుంటారు నటసింహం నందమూరి బాలకృష్ణ. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేటి వరకు ఒకటి రెండు సార్లు తప్పించి ప్రతిసారి బాలయ్య తన సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతూ.. సంక్రాంతి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది గౌతమీపుత్ర శాతకర్ణితో గ్రాండ్ విక్టరీ కొట్టిన బాలయ్య ఈ సారి జైసింహాగా కాలుదువ్వుతున్నాడు.
తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఏమాత్రం అంచనాలు లేవు. అందుకు తగ్గట్టే ఏమాత్రం బిజినెస్ జరగని జైసింహాని సొంతంగానే రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత సి.కళ్యాణ్. అయితే ఒక సెంటిమెంట్ ఆయనకి నమ్మకాన్ని కలిగిస్తోంది. బాలయ్య సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటే సినిమా హిట్ అని కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. జైసింహాలోనూ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని.. దానికి తోడు సింహా టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు ఫ్లాపయిన చరిత్ర లేదని.. అలా చూసినా కూడా జైసింహా హిట్ అవుతుందని బల్ల గుద్ది చెబుతున్నాడు సి. కళ్యాణ్. మరి 2018 సంక్రాంతి బాలయ్యకు మరో హిట్ ఇస్తుందో లేదో తెలియాలంటే ఇంకొద్దిరోజులు వెయిట్ చేస్తే చాలు.