పాపం.. పూరి.. ఇదీ పోయినట్టేనా?
on Jan 17, 2017
'సక్సెస్' పై నడిచే ఇండస్ట్రీ ఇది. ప్రతీ శుక్రువారానికి ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. బండ్లు ఓడలవ్వడం, ఓడలు బండ్లగా మారడం ఇక్కడ వెరీ కామన్. చరిత్ర అనవసరం. భవిష్యత్ గురించి వద్దు. వర్తమానం ఎలా వుందో చెప్పండంతే. ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పివుండవవచ్చు. కానీ వరుసగా ఓ రెండు ఫ్లాపులు పడితే చాలు.. మళ్లీ లైన్ లో కనిపించడం కష్టమే. ఇప్పుడు ఇదే పరిస్థితిలో వున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్.
పూరి జగన్నాధ్ మామూలు డైరెక్టర్ కాదు. ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు. బాక్సాఫీసు బిజినెస్ మెన్. అయితే ఇది గతం. వర్తమానం మాత్రం బ్యాడ్ గా వుంది. ఆయన మ్యాజిక్ వర్క్ అవుట్ కావడం లేదు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం .. అంతకుముందు హార్ట్ ఎటాక్, ఇద్దరమ్మాయిలు.. ఇలా వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టేశాయి. ఇప్పుడు ఆయన చేతిలో ఒక్క చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లేదు. మహేష్ బాబుతో 'జనగణమన' అని స్వయంగా ఓ సినిమా ప్రకటించాడు పూరి. ఈ సినిమా ఆజాపాజా లేదు. మహేష్ ఎందుకో ఈ సినిమా నుండి డ్రాప్ అయిపోయారని కూడా వినిపిస్తుంది. ఇక మిగతా స్టార్ హీరోలు కూడా ఎవరి సినిమాలతో వారు బిజీగా వున్నారు. పూరి సినిమా పైప్ లైన్ లో కూడా కనిపించడం లేదు.
ఇలాంటి దశలో విక్టరీ వెంకటేష్, పూరితో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. వెంకటేష్ తన కెరీర్లో 75వ చిత్రానికి చేరువ కాబోతున్నారు. ఆ సినిమాని ఓ పెద్ద దర్శకుడి చేతుల్లో పెట్టాలన్నది ఆయన ప్లాన్. ఆ దర్శకుడు పూరి జగన్నాధ్ అనే వినిపించింది. అయితే ఇప్పుడా సినిమా కూడా డ్రాప్ అయిపోయినట్లు కనబడుతుంది. వెంకీ 75కి క్రిష్ దర్శకుడిగా ఫిక్స్ అయిపోయాడు. ''వెంకటేశ్‌తో 75వ సినిమా చేయబోతున్నాను. త్వరలో వివరాలు''అని ప్రకటించారు క్రిష్. దీంతో వెంకీతో పూరి సినిమా ఇక అంతే సంగతులు అని తేలిపోయింది. మొత్తంమ్మీద పూరికి ఇది రాంగ్ టైం అని మాత్రం చెప్పాలి. అయితే బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈజీయే. ముందే చెప్పం కదా. ప్రతీ శుక్రువారానికి ఇక్కడ జాతకాలు మారిపోతాయని. పూరి తన మార్కు తో ఓ హిట్ కొడితే మళ్ళీ పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారడం పెద్ద కష్టమేమీ కాదు.