Facebook Twitter
“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏడవభాగము


“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏడవభాగము

 

4వ- అధ్యాయము

                                
   ఎర్రపోతసూరి ఇంటిలోనికి వెళ్లి భోషాణంలో దాచిన తాళపత్ర గ్రంధాన్ని  తీసుకొచ్చాడు. అది మూలికలతో కలిపి కొన్ని ఆకుల మధ్యన భద్రపరచబడి ఉంది.
   ఆకులనీ మూలికల్నీ జాగ్రత్తగా తొలగించి మెత్తని బట్టతో తుడిచాడు.
   ఒక గ్రంధం కాదు.. రెండు.
   ఒకటి చిన్నదిగా ఉంది. మరొకటి పెద్దదిగా ఉంది.
   ఎర్రన ఆశ్చర్యంగా చూశాడు.
   “తాతగారూ! ఏమది? ఇంత పెద్ద గ్రంధాలు.. ఎచటి నుండి వచ్చినవి?
   “ఓరుగల్లు నుండి.”
  "కాకతీయ సామ్రాజ్య ముఖ్యపట్టణము నుండా?" ఎర్రన సంభ్రమంగా చూశాడు. ఆ సామ్రాజ్యం గురించి ఎప్పుడునూ వినుటయే.. అచ్చటి నుండి వచ్చినటువంటి గ్రంధమంటే ప్రాముఖ్యమైనదే అయుంటుంది.
   "అవును ఎర్రనా! ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంధం. ఆంధ్ర మహా భారతం."
   "నన్నయ భట్టారకుడు, తిక్కనార్యుడు రచించిన భారతమా? నమ్మ లేక పోతున్నాను. మనకి ఏ విధంగా లభ్య మయింది?" గ్రంధాన్ని అరాధనగా చూస్తూ అడిగాడు ఎర్రన. అప్పటికే దక్షిణాపధ మంతా ఆ గ్రంధం ఖ్యాతి వ్యాపించింది.
   "మా తాతగారి మిత్రుడొకరు గణపతి దేవుని ఆస్థానంలో కవి. ఆయన మనుమడు కొద్ది కాలం క్రితం నాకు ఈ గ్రంధాలను తెచ్చి ఇచ్చాడు. నేను ఒక సారి చదివాను. అద్భుతమైన గ్రంధం."
   "నన్నయ వేంగీ దేశం వాడు, తిక్కన సోమయాజిది నెల్లూరు సీమ. నన్నయగారి భారతాన్ని పూర్తి చెయ్యడానికి తిక్కన గారు ప్రతిని సంపాదించి ఉండవచ్చును. కానీ ఇవి కాకతీయుల వద్దకే విధంగా చేరాయో నాకు అర్ధం అవుట లేదు తాతగారూ!"
   "మహారాణీ రుద్రమదేవి వీరమరణం తరువాత, కొందరు బ్రాహ్మణులు.. ప్రతాపరుద్ర మహారాజు ఆనతి మీద ఓరుగల్లునుండి పాకనాడుకు వచ్చారు. ఆ సమయంలో వచ్చినవారిలో మనకి తెలిసిన ఈ వ్యక్తి ఉన్నారు. ఆయన నాకిది ఇచ్చి, దీనికి ప్రతి తయారు చెయ్యగలరా అని అడిగారు. మనం రెండు ప్రతులను చేద్దాం. ఒకటి మన వద్ద నుంచుకుందాం."
   "ప్రతి తయారు చెయ్యడం సులభమే. అది కాదు.. అసలు ఓరుగల్లునకు ఏ విధంగా.."
   మనుమడి ఆతృత చూసి ఎర్రపోతసూరి నవ్వుకున్నాడు. ఆ వయసులో ఉండే సహజ కుతూహలమే..
   "అది పెద్ద చరిత్ర. రాజకీయ కారణాల వలన అక్కడికి చేరింది ఒక ప్రతి."
   "రాజకీయ కారణములా?" కాలమంతా సంస్కృతాంధ్రాలను ఔపోసన పట్టడంలోనే గడిపిన ఎర్రనకు రాజకీయ పరిస్థితుల పై అంత అవగాహన లేదు.. అక్కడక్కడా విన్నది కొద్దిగా మాత్రమే గ్రహించాడు.
   "అవును. ప్రదోష వేళ అయింది. ఆలయానికి వెళ్లి అర్చన చేసుకునే సమయం.. ఈ గ్రంధముల గురించి రేపు చెప్పుకుందాం."
   "అటులనే తాతగారూ! నన్ను కూడా శంకరస్వామి గురువుగారు త్వరగా రమ్మన్నారు. శివపురాణ కాలక్షేపం ఉంది, నీలకంఠేశ్వరుని ఆలయంలో."
   "కేశవుని ఆరాధన అయిన పిదప నేను కూడా వస్తాను." తాతా మనవలిద్దరూ లేచారు.. చెరొక గుడికీ వెళ్లుటకు.

   ప్రాతఃకాల స్నానాదులకి నదీ తీరానికి బయలుదేరారు ఎర్రపోతసూరి, ఆయన పేరింటిగాడైన ఎర్రన.
   సూరన అత్యవసర పని మీద అద్దంకి వెళ్లాడు. తాతగారితో ఏకాంతాన్ని సంపూర్ణంగా వినియోగించ దలచుకున్నాడు ఎర్రన, ఒక్క క్షణం కూడా వదల దలచుకో లేదు..
   ఉషోదయాన ఆదిత్యునికి అర్ఘ్యం వదిలి, స్నానం చేసి ఇంటికొచ్చారు.
   దేవతార్చన చేసి, పదునొకండు మారులు గాయత్రి జపించి, క్షీర పానం చేశారు.
   "తాళ పత్రములు తీసుకొని రమ్మని పురమాయించాను నాగయ్య శ్రేష్ఠిని. రెండు మూడు దినములలో రావచ్చును. ఆ లోగా నీకు తిక్కన సోమయాజిగారి ఓరుగల్లు పయనం గురించి చెప్తాను. మనం తోటలోకి వెళ్దాం." మనుమడిని తోటలో వేప చెట్టు కింద అరుగు మీద కూర్చో పెట్టి, తను కూడా ఎదురుగా చాప మీద కూర్చుని ప్రారంభించాడు. అక్కడంతా నున్నగా అలికి ముగ్గులు వేసి మంగళ కరంగా ఉంది.
   పక్షుల సమూహములన్నీ ఉషోదయ రాగములను ముగించి ఆహారాన్వేషణకై వెళ్ళాయి. అప్పుడూ అప్పుడూ వినిపించే పక్షి పిల్లల కూకూ, కిచ కిచ ధ్వనులు తప్పిస్తే వాతావరణం ప్రశాంతంగా ఉంది.
   చల్లని గాలి.. ఉండుండి ఆహ్లాదంగా వీస్తోంది. చెట్లన్నీ.. మేము కూడా సిద్ధం అన్నట్లు కొమ్మల నూగిస్తున్నాయి. ఒకదాన్నొకటి తరుము కుంటున్న రెండు ఉడుతలు దూరంగా పారిపోయాయి, మీ ఏకాంతానికి మేము అడ్డురామంటూ.
   ఎర్రన ఏకాగ్రతతో.. కొత్త విషయములు, సందేహములు వ్రాయుటకు తాళపత్రములు, గంటం పట్టుకుని మరీ వచ్చాడు. ఎర్రపోత సూరి ప్రారంభించాడు..

   "మాతాతగారు వెలనాటి చోళుల ఆస్థానంలో ఉన్నపుడే, చోడతిక్కరాజు  నెల్లూరు సీమను పాలిస్తూ ఉండేవాడు. అప్పుడే చోళుల పతనం ప్రారంభమయింది. తిక్కరాజు, చాలా చిన్నతనం లోనే వెలనాటి రాజు పృధ్వీశ్వరుడిని చాలా భీకరంగా చంపాడు. వెలనాటి సీమని జయించిన చోడ తిక్కరాజు, మార్గ మధ్యమున గుంటూరు విభుడైన భాస్కర మంత్రిని చేరదీసి ఆశ్రయమిచ్చాడు. భాస్కరమంత్రి సర్వజ్ఞుడు, కవి. పేరు ప్రఖ్యాతులు కలవాడు.
   తాను గెలిచిన సీమలోని విద్వాంసులను ఆదరించడం రాజుల విజ్ఞానానికి చిహ్నం.
   తిక్కరాజు కూడా స్వయంగా కవి.
  "తిరకాల భూవిభుడు సార్వభౌమాంకుడు" అని తిక్కనగారే ప్రస్తుతించారు.
   భాస్కరమంత్రికి నలుగురు కుమారులు. కేతనప్రగ్గడ, మల్లన, సిద్ధన, కొమ్మన. ఆఖరి కొడుకైన కొమ్మనగారి పుత్రుడే తిక్కన సోమయాజి.
   మూడవ కొడుకు సిద్ధన చోడతిక్కరాజుకు ఇష్టుడైన మంత్రి. సిద్ధనను నెల్లూరునకు కొనిపోయి తన ఆస్థానములో సముచిత స్థానమిచ్చాడు తిక్కరాజు.
   ఈ సిద్ధన మంత్రి కుమారుడే ప్రసిద్ధుడైన ఖడ్గతిక్కన. ఈయనా, సోదరుడు చిన భాస్కరుడూ అనేక యుద్ధములలో రాజుకు వెన్ను దన్నుగా నిలిచారు. సిద్ధన కుటుంబం నెల్లూరులో నుండగా, కొమ్మన తండ్రితో గుంటూరులోనే ఉండిపోయాడు. కొమ్మన కుమారుడు తిక్కన, పెదతండ్రి పెద్ద పదవిలో ఉండుట వలన నెల్లూరులో విద్యాభ్యాసము సాగించాడు.
   చోడతిక్కరాజు పుత్రుడు మనుమ సిద్ధి, తిక్కన సహాధ్యాయులు. మనుమసిద్ధి, తిక్కనను ’మామా’ అని పిలిచేవాడు. ఇద్దరూ గాఢ మిత్రులు. అందువలననే మనుమసిద్ధిని ’వివిధ విద్యా పరిశ్రమవేది’ అని తిక్కనగారు అన్నారు. అంతటి మిత్రుడు కనుకనే తిక్కన, మనుమ సిద్ధి మహరాజుకి మంత్రి అయినాడు."

తిక్కన సోమయాజి

 

ఈ వివరాలన్నీ ఎర్రనకి తెలియవు.. తిక్కనగారు మహాభారతం చాలా భాగం వ్రాశారనీ, ఆయన మనుమసిద్ధికి మంత్రి అనీ మాత్రమే తెలుసు. నెల్లూరు చోడరాజుల కొలువులో తిక్కన వంశీయులు ఉండేవారని అప్పుడే తెలుసుకున్నాడు. తాతగారిని కొంత విరామమడిగి అన్నీ గ్రంధస్తం చేసుకున్నాడు ఎర్రన. మునుముందు ఉపయోగపడతాయేమో..
  "మొదటి తిక్కరాజు నెల్లూరును దీర్ఘకాలం పాలించిన తరువాత, కుమారుడు మనుమసిద్ధిని రాజుని చేశాడు. తిక్కనార్యుడుమంత్రిగా మనుమసిద్ధి జనరంజకంగా పాలిస్తున్నాడు. మనుమసిద్ధి కవిజన ప్రియుడు. ఆయన కొలువులో అనేక మంది కవులు ఉండేవారు.
    అందువలననే తిక్కన, నన్నయ భట్టు అసంపూర్తిగా వదిలిన మహా బారతమును పూర్తి చెయ్యగలిగాడు. అది ఎంతో క్లిష్టమైన, మహత్తరమైన కార్యము. ఎవరైనా తాము స్వంతంగా మొదలుపెట్టి కావ్య రచన సాగించడం వేరు. స్వేఛ్ఛ ఉంటుంది. ఇతరులు మొదలుపెట్టినది కొనసాగించడం కష్టం."
   "ఎందుకని తాతగారూ?"
   "కావ్యాన్ని ప్రారంభించిన కవి రచనా పద్ధతికి ఎటువంటి లోపమూ కలుగ కూడదు. ఆ శైలిని గౌరవిస్తూ కావ్యరచన సాగాలి. శిల్పములో భేదమున్ననూ, అది కూడా కావ్యమునకు అందము తేవాలి."
   "తిక్కనగారు భారతమును పూర్తి చేశారా తాతగారూ?"
   ఎర్రన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఇంచుక ఆలోచించారు ఎర్రపోతన. ఈ బాలుడు యువకుడవుతున్నాడు. తండ్రి మార్గ దర్శకత్వంలో అనేక గ్రంధాలను చదివాడు. అన్నీ తెలిసినా గుంభనగా ఉంటాడు. ఈతడి మేధని మధిస్తే మంచి కవి కాగలడు. తన అభీష్ఠం నెరవేర్చ గలడు తప్పక. అమృత మధనం చెయ్యాలి.. దానికి తన వంతు కృషి చెయ్యవలసిందే.
   కంఠం సవరించుకున్నాడు.
  "ఆవిషయం మనం తరువాత చెప్పుకుందాం. ముందు మనం తిక్కనగారు ఓరుగల్లు ఎందుకు వెళ్లాడో చూద్దాం."
   "సరే తాతగారూ!" ఎర్రన సర్దుకున్నాడు.
   "తిక్కనార్యుడు భారతం, నిర్వచనోత్తర రామాయణం మొదలైన కావ్యాలు రాస్తూనే తోటి కవులను ఆదరించి, ఉభయకవి మిత్రుడు అనే బిరుదును పొందాడు.  కేతన తన దశకుమార చరిత్రమును తిక్కనార్యునికి అంకితమిస్తూ, కృతిపతి ’సుకవీంద్ర బృంద రక్షకుడు’ అనీ, ’కవి సరోజ మార్తాండుడు" అనీ కొనియాడాడు.
   సకలవిద్యా పారంగతుడైన తిక్కనార్యుడు ఊపిరి సలపని కావ్య రచనల్లో కాలం గడుపుతుంటే రాజ్యంలో అనేక సంక్షోభాలొచ్చాయి. మనుమసిద్ధి మహారాజు కష్టాల పాలయ్యాడు.
   చోడతిక్కరాజు, కుమారుడైన మనుమసిద్ధికి రాజ్యం అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మనుమ సిద్ధి దగ్గరి బంధువు తిక్కరాజు కూడా ప్రముఖుడే. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. మహరాజు కొద్దిగా అస్వస్థులవగానే కొంత రాజ్యం తాను తీసుకుని, కాంచీపుర వరాధీశుడ్నని ప్రకటించుకున్నాడు. ఇతని తమ్ముడు విజయాదిత్యుడు మనుమసిద్ధి ప్రతినిధిగా తాను ఏలుతున్న మరికొన్ని ప్రాంతాలను స్వాధీనంలోనికి తీసుకున్నాడు.
   అన్నదమ్ములిరువురూ కలిసి, మనుమసిద్ధిని తప్పించి నెల్లూరును ఆక్రమించుకున్నారు. తండ్రి మరణించగానే మనుమ సిద్ధి అడవుల పాలయ్యాడు." ఎర్రపోతన అలసటగా ఆగాడు.
   "తాతగారూ! మంచి తీర్ధం.."
   "భోజనానికి వేళయింది. తాతా మనుమలిద్దరూ కదలి రండి. ఆనక చెప్పుకోవచ్చును చరిత్రలు." పేరమ్మ ఇంటి లోనుండి పిలిచింది.

   "అయ్యయ్యో.. అంతటి మహరాజు.." ఎర్రన విచారంగా అన్నాడు.
   "ఎంతటి మహరాజయిననూ విధిని తప్పించలేము కదా!"
   "అవును తాతగారూ! హరిశ్చంద్ర మహారాజుని చూడండి.. ఆయన తప్పు కానీ ప్రమేయం కానీ లేకుండా ఎన్ని కష్టాల పాలయ్యాడో.. విధి కాక ఇంకేమిటి?"
   "నిజమే! హరిశ్చంద్రుడు ఆ మాతంగ కన్యలను వివాహమాడి ఉంటే ఆ కష్టాలే ఉండేవి కాదు కదా!"
   "అదెటుల కుదురుతుంది.. హరిశ్చంద్ర మహారాజు ఏక పత్నీ వ్రతుడు. మాట తప్పని వాడు."
   "హు.. భార్యా బిడ్డలను అష్టకష్టాల పాల్చేసే ఏం వ్రతం అది.." ఎర్రపోతన మనవడిని రెచ్చగొట్టాడు.. ఆ బుడుతడి అభిప్రాయములెలా ఉంటాయో చూద్దామని.
   "కష్టముల నెదిరించి ధీరుడై నిలచాడు హరిశ్చంద్రుడు. పంతమునకు పోయినది విశ్వామిత్ర మహర్షి. ఎన్ని ఇక్కట్లు వచ్చిననూ నియమ నిష్ఠలను వదల కూడదని పాఠం చెప్పిన వాడు హరిశ్చంద్రుడు."
   "నీకు హరిశ్చంద్రుని చరిత్ర అంత బాగా తెలుసునా ఎర్రనా?"
   "అక్షర జ్ఞానం వచ్చిన వెనువెంటనే నేర్చుకొన వలసిన పురాణ గాధలలో నది ఒకటి కద తాతగారూ!
    ఒక నాడు ఇంద్ర సభలో సత్యము నిక్కముగ పలికెడి వారెవరైననూ ఉన్నారా అనే ప్రశ్న వచ్చింది. వశిష్ఠుడు లేచి హరిశ్చంద్ర మహారాజు పేరు చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచి, "హరిశ్చంద్రుడు సత్య వాక్య పరిపాలకుడు కానేకాడని" నిరూపిస్తానన్నాడు. వశిష్ఠుడు అది నీ వల్ల కాదన్నాడు. విశ్వామిత్రుడిలో పట్టుదల పెరిగింది. హరిశ్చంద్రుని రాజ్యానికేగి, తానొక యజ్ఞం తలపెట్టాననీ, ఆ యజ్ఞానికి ధనం కావలెననీ అడిగాడు.
   "మీకు కావలసినంతటి ధనం నేను సమ కూరుస్తానని" హరిశ్చంద్రుడు మాట ఇచ్చేశాడు. సమయం వచ్చినపుడు వచ్చి అడిగెదనని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు.
    ఒక నాడు హరిశ్చంద్రుడు వేటకి వెళ్లి నప్పుడు విశ్వామిత్రుడు ఇరువురు మాతంగ కన్యలను రాజు వద్దకు పంపాడు. వారు ఎంత ఆకర్షించిననూ రాజు చెక్కు చెదర లేదు. తరువాత సభకు వచ్చిన ఋషి మాతంగ కన్యలను వివాహమాడ వలెనని బలవంత పెట్టాడు. తాను ఏక పత్నీ వ్రతుడనని రాజు నిరాకరించాడు.
   "రాజ్యాన్ని వదులుకుంటా కానీ వ్రత భంగం చెయ్యను" అన్నాడు.
   "అయితే రాజ్యం వదులుకో.. అడవికి వెళ్లిపో." ఋషి ఆదేశించాడు.
   నిస్సంకోచంగా అడవికి వెళ్లిపోయాడు హరిశ్చంద్రుడు. అప్పుడు, సమయం చూసుకుని తన యజ్ఞానికి ధనం సమకూర్చమని, ఆ సత్య వ్రతుడిని నిర్దయగా ఇక్కట్ల పాల్చేశాడు విశ్వామిత్రుడు.
    మానవమాత్రుడెవడూ సహించలేని కష్టాలు.. భార్యని అమ్మేసి, కొడుకుని పోగొట్టుకుని, కాటి కాపరిగా చేసి.. చివరికి భార్యని దొంగతనం, హత్య నేరాల మీద  శిరఛ్ఛేదనం చెయ్యబోతే అప్పుడు దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రుని కొనియాడుతారు. ఆ చక్రవర్తి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది..
   ఏ విధంగా అంటే.. సత్యానికి మారుపేరు హరిశ్చంద్రుడేనని అనేంతగా!"
   "చాలా బాగా చెప్పావు ఎర్రనా! ఆ కాలంలో సత్యవ్రతం అనీ, ఏకపత్నీ వ్రతం అనీ, ప్రజా వాక్కులనీ.. మునులను, స్త్రీలను హింసించే రాక్షుసుల వల్లనూ, వారిని సంహరించుటకునూ కష్టాల పాలయ్యే వారు. యుగాలు మారుతున్న కొలదీ రాజ్యాల కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి. బంధుత్వాలు అన్నీ గంగ పాలే. చేరదీసి మంచి పదవి నిస్తే.. ఆ చేరదీసిన వారినే తునిమేసి.. వారి స్థానాన్ని ఆక్రమించేటి ధూర్తులు కోకొల్లలు. అదే కలి ప్రభావం." ఎర్రపోతన గట్టిగా నిట్టూర్చి అన్నాడు,
   "ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు.. సుఖమున్న చోట దుఃఖము.. పాప పుణ్యములు, కష్ట సుఖములు.. అదే జీవితం. ఏ కాలమందైననూ.. ఏ యుగమునందైననూ తప్పదు. మార్పల్లా జరిగే, జరిపే విధానము లోనే."
  
  "మరి మనుమసిద్ధి మహారాజు ఎంతకాలం అక్కడా ఇక్కడా తలదాచుకున్నాడు తాతగారూ?"
    మరునాడు ప్రాతఃకాల క్రియలు అయ్యాక, మామూలు స్థలంలో కూర్చున్నారు తాతామనవలిద్దరూ.
    ఆ రోజే సూరన్న అద్దంకి నుండి వస్తున్నాడు. ఇంట్లో అత్తా, కోడలూ ఆయనకి ప్రీతికరమైన భక్ష్యాలు చెయ్యడంలో నిమగ్నమై ఉన్నారు.  ఎర్రపోతసూరి కొంత అసహనంగా ఉన్నాడు. అద్దంకి నుండి ఏ వార్త వస్తుందో.. రాజుగారు ఎందుకు రమ్మన్నారో.. రాజకీయ పరిస్థితి ఎలా ఉందో!
   మహరాజుకీ శాంతి లేదు.. మామూలు ప్రజకీ సుఖం లేదు. కడుపుకింత తిని, కంటి నిండుగా నిదురించడానికి లేదు. వంద సంవత్సరాల క్రితం అంతే, యాభై ఏళ్ళ క్రితం అంతే.. యుగాల క్రితం అంతే! ఇప్పుడూ అంతే.. ఎప్పటికైననూ పరిస్థితులు మారునా!
   "తాతగారూ!"
   "ఆ.. ఆ. మనుమసిద్ధి కదూ! ఆయన ఎవరికీ తెలియని చోట తల దాచుకున్నాడు. తెలిస్తే ఏమవుతుందో.. తలలు నరకడం రాజులకి సొరకాయలు నరికినంత సులభం. రాజ్యకాంక్ష అటువంటిది.
   ఎందరికో సిరి సంపదలు, పదవులు ఇచ్చిన రాజు.. కవులకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన సాహిత్య ప్రియుడు.. కొండల్లో కోనల్లో, సెలఏటి గలగలలే వీణా నాదంలా, కోయిల కూతలే గానంలా.. నెమలి అడుగులే నాట్యంలా.. లేళ్లు, జింకలు, వానరాలు సభ్యుల్లా అడవిలో కొలువు తీరుస్తూ కాలం గడుపుతున్నాడు.
   అప్పుడు.. మనుమసిద్ధి ప్రాణ స్నేహితుడు, మంత్రి తిక్కన.. నేనున్నానని ముందుకు వచ్చాడు. అప్పటి ఏలికలు కవుల జోలికి వెళ్ళినట్లు లేదు. అందునా.. కావ్య రచనలో మునిగిన తిక్కనమంత్రి, తన మిత్రుని అడవుల పాల్జేసిన రాజుగారి తమ్ముని కంట పడక పోవడంలో ఆశ్చర్యం లేదు.
   "మామా!" మనుమసిద్ధి ఆదరంగా ఆహ్వానించాడు తిక్కనని.
   "నీకు ఉచితాసనం ఇవ్వలేకున్నాను.. ఏమనుకోకుమా!" మహారాజు కంఠం జీరపోయింది.
   స్నేహితుని గాఢాలింగనం చేసుకుని వెన్ను తట్టాడు తిక్కన.
  "రాజా! రుద్రదేవుని కాలంలో రచించిన నీతి శాస్త్ర గ్రంధాన్ని మనమిరువురమూ కలిసి పఠించితిమి కదా.. మరచితివా? విభజించి పాలించడం అందులోని రాజనీతికి మొదటి పాఠం. అదే విధముగా విభజించి శిక్షించవలెను కూడా..
   పెక్కుండ్రు జనులు నేరమి
   యొక్కట జేసినను వారి నొకమరి గినియం
   జిక్కరు గావున నేర్పున
   నొక్కొకరన పాపి శిక్ష యొనరింప దగున్.
   అన్నదమ్ముల నిరువురినీ ఒక్క దగ్గర నుండేటట్లు జేయుట దగని చర్య అయినది. ఇప్పుడు మనం విడిదీసి, విడి విడిగా వారిని ఓడించి వెళ్లగొట్టవలె.. అదియును మరికొందరు మంచి మిత్రుల సహకారముతో."
   మనుమసిద్ధి మహరాజునకు మహోత్సాహము వచ్చింది, ప్రియమిత్రుని ధైర్య వచనములతో.
   "నిక్కము మామా! తండ్రిగారి అనారోగ్యముతో నమ్మి బాధ్యతల నప్పగించిన దగ్గరి బంధువు, ఈ విధముగా మహారాజు యని చూడక బంధించి, రాజ్యమపహరించునని ఎటుల ఊహింతును? ఆ సమయమున నీతిసారము.. రాజనీతి, ఏమియును జ్ఞప్తికి రాలేదు."
   "అవును కదా మిత్రమా! తల్లిని జూచుటకు వెళ్ళినపుడు కూడ రాజు భవన శోధన చేయించాలని ఉదాహరణములతో చెప్పాడు కదా కామందక గ్రంధ కర్త.. నిరంతరము అప్రమత్తుడవై మెలగవలె నని కదా ఆర్యులు చెప్పినది.
   భద్రసేనుడు భార్య వద్దకు వెళ్తే అతని తోబుట్టువే అతన్ని దునిమాడు.
   తేనేలో విషము కలిపి వనిత ద్వారా బావమరదులు కాశిరాజుని అణచారు.
   తల్లి మంచము కింద దాగి పుత్రుడే తండ్రిని పొడిచాడు.
   జడలో జాతుషీ శస్త్రము దాచి ఒక రమణి విదో రధుని జంపింది.
   ఎవ్వరినీ.. సతిని, దమ్ముల దాయాదుల, బావల ,బావమరదుల.. నెవ్వరినీ నమ్మవలదు.. నమ్మ వలదు.. నమ్మ వలదు."
   ముమ్మారు జాగ్రత్తలు చెప్పి, తను చెయ్యగల కార్యము చేసి వచ్చెద నని వీడ్కోలు చెప్పి తిక్కన మనుమసిద్ధిని వదిలి వెళ్లాడు."
   "ఓరుగల్లుకేనా తాతగారూ?" ఎర్రన ఒకింత ఆవేశంగా, ఒకింత ఉత్సాహంగా అడిగాడు.

 

……… ( ఇంకా వుంది) ………..

 

 

 

 

 .... మంథా భానుమతి