Facebook Twitter
కన్ హొపాత్ర – మరాఠీ

 

కన్ హొపాత్ర – మరాఠీ


ఒక అందమైన అమ్మాయి , అందమైన అనే విశేషణం లేకపోయినా పరవాలేదేమో, అన్ వాంటెడ్ అట్టెన్షన్ పొందకుండా ఈరోజుకీ నడిరోడ్డులో వెళ్ళలేకుండా ఉంది. అదే ఏడెనిమిది శతాబ్దాలముందు, ఒక వేశ్య కులంలో పుట్టి పైగా, బాద్ షా కూడా కామించి పొందాలని వెంటబడేంత అందం., నేను ఎవరికీ వశపడను, నన్ను ఎవరూ ముట్టడానికి వీల్లేదని కూర్చుంటే కుదిరే పనేనా. కాని కొన్ని శతాబ్దాల క్రితం కన్ హోపాత్ర అనే వేశ్య చివరికి తన ప్రాణాలు కూడా అర్పించి తన ఈ పంతం ఎన్నో సినిమా కష్టాలకోర్చి నెగ్గించుకుంది. అయితే క్రితం వారం మనం తెలుసుకున్న అక్కమహా దేవి లాగానే ఈమె కూడా ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది భక్తి మార్గమే.

కన్ హొపాత్ర వర్కారి సంత్ అంటే, కృష్ణుడిని విఠోబా రూపంలో కొలిచే ఒక హిందూ వైష్ణవ సంప్రదాయంకి చెందినది. కన్ హొపాత్ర జీవించిన కాలం 14 నుంచి 16 వ శతాబ్దం వరకు ఎప్పుడైనా అయుండచ్చట. ఈమె మహరాష్ట్ర కి చెందిన పండర్పూర్ దగ్గరలో మంగల్ వెధె, అనే చోట ఒక ధనికురాలైన వేశ్య శ్యామ కు పుట్టింది. ఆమె చిన్నతనం అంతా అత్యంత విలాసవంతంగా, రాజ సౌధం లాంటి ఇల్లు, సేవకుల మధ్య సాగింది. అప్సరసలను పోలిన అందము, సంగీత నృత్య కళల్లో శిక్షణ, పొందిన ఈమె తన వృత్తి లోనే స్థిరపడాలని తల్లి శ్యామ ఆశించింది. కాని కన్ హొపాత్ర ఇందుకు భిన్నంగా ఆలోచించింది. అయితే తల్లికి మాత్రం కన్ హొపాత్ర, బీదరు ముస్లిం బాదుషా దగ్గర స్థిరపడితే, ధనానికి, సంపదలకి సౌఖ్యానికీ లోటుండదని ఆశ పడింది. కాని కన్ హొపాత్రకి తనకన్నా అందంగా ఉన్నవాడిని పెళ్ళి చేసుకోవాలని ఆశ. ఇది వెర్రి ఆశ పాపం, ఆనాటి సమాజంలో, వేశ్యలు పెళ్ళి చేసుకోవడానికి అర్హులు కారట. ఒకసారి ఆ కులంలో పుట్టాకా, వేశ్య గానే జీవితం గడపాల్సిన స్తితి.

సదాశివ మలగుజార్, శ్యామ ప్రకారం కన్ హొపాత్ర తండ్రి. ఆమె ఎంత చెప్పినా తను తండ్రి అయుండచ్చని నమ్మడు. అవున్లెండి ఇప్పటిలాగ డీ ఎన్ ఏ టెస్ట్ లు అప్పుడు లేవుగదా. పోనీ తండ్రి కాకపోయినా, కూతురి వయసు కన్ హొపాత్రది అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెని పొంద గోరతాడు. అయితే కన్ హొపాత్ర ఇందుకు ఒప్పుకోదు. సదాశివ కక్ష్య కట్టి ఆ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తాడు. ఉన్న డబ్బంతా పోయి చేసేదేమీ లేక తల్లి సదాశివ కి తన అంగీకారం తెలుపుతుంది. అయితే తన సేవకురాలి సహాయంతో ఒక సేవకురాలి వేషంలో కన్ హొపాత్ర ఇల్లు విడిచి పారి పోతుంది. పండరిపూర్ చేరుకుని ఒక చిన్న గుడిసలో జీవిస్తూ, రోజూ గుడి అంతా శుభ్రం చెయ్యడం లాంటి పనులు చేస్తూ విఠోబా ని కొలుస్తూ ఉండి పోతుంది. తన పాచిక పారని సదాశివ బీదరు బాధుషా కి కన్ హొపాత్ర అందం, సంగీతం నృత్యం గురించి చెప్పి తన కోటలో ఉంచుకోమని ఎగదోస్తాడు.

బాదుషా కన్ హొపాత్రని తీసుకు రావటానికి తన సైన్యాన్ని పంపస్తాడు. ఇక్కడ జరిగిన విషయాలే రక రకాల కధలుగా ప్రచారం పొందాయి. గుడి పక్కగా పారుతున్న భీమా నది పొంగి గుడిని ముంచెత్తిందని, ఆ వరదల్లో, సైనికులు కొట్టుకు పోయారని, ఆ తరవాత కన్ హొపాత్ర శవం గుడిలోని ఒక బండ మీద దొరికిందని, ఆమెను ఆ చోటనే సమాధి కట్టారని చెప్పుకుంటారట. అయితే ఇప్పటికీ కన్ హొపాత్ర సమాధి గుడి ఆవరణలోనే ఉంటుందట. ప్రజలంతా ఆమె సమాధికి కూడా మొక్కుతారట. అయితే నిజంగా ఏం జరిగుండచ్చని మనమంతా ఊహించవచ్చు. బాదుషా దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని కన్ హొపాత్ర, గుడిలోనే ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది. అచ్చం సినిమా కధలా ఉంది కదూ కన్ హొపాత్ర జీవితం.

ఆమె గుడిలో గడిపిన కాలంలోనే విఠోబాను, భర్తగా, తల్లిగా తన సర్వస్వంగా భావిస్తూ రాసిన కొన్ని అభంగ్ లు ఇప్పటికీ పండర్పూర్ వెల్తూ జనాలు పాడుకుంటారట. ఆమె సాటిలేని భక్తి తత్వం, ఆత్మ సమర్పణ, ఎటువంటి సంసారిక బంధాలలోనూ ఆసక్తి లేకుండా విఠోబా కు అంకితమయిన వైనం ఆమెను వర్కారి సంత్ లలో ఒకరుగా గుర్తించడానికి కారణాలు. సకల్ సంత్ గాధ అనే Anthology లో కన్ హొపాత్ర అభంగ్ లని కూడ చేర్చారట. ఆనాటి సమాజంలో వేశ్య కున్న స్థానం దృష్ట్యా ఇది చాలా అరుదైన విషయం.

ఆమె తన అభంగ్ (అంటే విఠోబాని కీర్తిస్తూ పాడే భక్తి రసభరిత కవిత. అ - భంగ్ అంటే భంగము లేకుండా సాగేదీ అని.) లలో ఆనాటి కుల వ్యవస్త గురించి ముఖ్యంగా, వేశ్యలంటే ఉన్న చిన్నచూపు గురించి పాడేదట. ఒకసారి ఎక్కడో చదివిన గుర్తు మన దేశంలో ఆడవారికి ఒకరికంటే ఎక్కువ మగవారితో సంబంధం పెట్టుకోవడం తప్పని, ఆ రకమైన స్వేఛ్చ లేదని అయితే పాశ్చాత్య దేశాల్లో ఆడవారికి ఆ స్వేఛ్చ ఉందని, కాకపోతే ఎవ్వరి వద్దకు వెళ్ళకుండా ఉండే స్వేఛ్చ్ మాత్రం వారికి కూడా లేదని. స్వేఛ్చకి కొన్ని నియంత్రణలు, నిబంధనలు చాలానే అలోచించి పెట్టారు ఆడవారి విషయంలో. ఒకటయితే మాత్రం నిర్ధారణగా తెలిసేదేంటంటే ఏ కాలంలో అయినా, ఏదేశంలో అయినా ఆడవారి స్వేఛ్చకి చాలానే ఆటంకాలున్నాయని. వారి జీవితాన్ని వారికిష్టమయినట్లు, ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యకపోయినా జీవించలేరని.

కన్ హొపాత్ర రాసి పాడిన అభంగ్ లు ఒక ముప్ఫై కన్నా మించి ఇప్పుడు లభ్యం కాలేదట. అవికూడా ప్రజల నోళ్ళలో నానుతూ ఉన్నవే. ఒక రెండు మాత్రమే నాకు, వికిపీడియాలో దొరికాయి. అవే ఇక్కడ ఇచ్చాను.

1.

O Narayana, you call yourself
savior of the fallen...
My caste is impure
I lack loving faith
my nature and actions are vile.
Fallen Kanhopatra
offers herself to your feet,
a challenge
to your claims of mercy.

ఓ నారాయణా నిన్ను నీవు
పతిత జనోద్ధారకుడవంటావే.......
నా కులం అపవిత్రమైనది,
ప్రేమ, నమ్మకం నాకు కొరత
నా గుణము, కర్మములు నీచమైనవి
కన్ హోపాత్ర అనే పతిత
తనను తాను నీ పాదాలకు అర్పించుకుంది,
ఇది ఒక సవాలు
నీ కారుణ్యం గూర్చిన ప్రగల్భాలకు.


అందము చందం, నృత్యం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మించి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండి కూడా, కేవలం జన్మతహా వచ్చిన కులవృత్తి (చెయ్యకపోయినా) వల్ల, పూజకి పనికిరాని ఒక పువ్వు అయినందుకు ఆమె ఎంత ఆత్మన్యూనతకి గురయ్యిందో ఈ అభంగ్ ద్వారా అర్ధం అవుతుంది.

2.
If you call yourself the Lord of the fallen,
why do O Lord not lift me up?
When I say I am yours alone,
who is to blame but yourself
if I am taken by another man.
When a jackal takes the share of the lion,
it is the great, who is put to shame.
Kanhopatra says, I offer my body at your feet,
protect it, at least for your title.

పతితజననాధుడనని నిను నీవు పిలుచుకున్నట్లయితే
ఓ దేవా నన్నేల ఆదుకోవు?
నేను నీదాననేనని చెప్పినపుడు,
నిన్ను కాక ఎవరిని నిందించాలి,
నన్ను వేరొకడు చేపట్టినపుడు?
ఒక సింహపు వేటను నక్క నుంచి కాపాడుకోలేనపుడు,
బలవంతమైన సింహానికే కదా సిగ్గు.
కన్ హోపాత్ర అంటుంది, 'నా శరీరాన్ని నీ పాదాలకర్పితం చేస్తాను,
దానిని రక్షించు, కనీసం నీ పేరు కోసమైనా'.

తన వద్దకు వచ్చే విటులు ఎలా తనను ఒక వస్తువు లాగా చూస్తారో, అందమైన స్త్రీ శరీరం ఒక పొందవలసిన ఆస్తిగా ఎలా మారిందో, సమాజంలో వేశ్యల స్తితి ఎంత దారుణంగా ఉందో ఆమె తన అభంగ్ లలో పాడేదట.
ఆమె కధను మరాఠీ లో సినిమాగా కుడా తీసారు, కానీ భాష సమస్య వల్ల దానిని అర్ధం చేసుకోవడం సాధ్య పడలేదు.
ఏ గురువు దగ్గరా శిష్యరికం చెయ్యకండా, వేరే ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా, కన్ హొపాత్ర, సమాజం నీచంగా చూసే వేశ్య కులంలో పుట్టి సంత్ పరివారంలో చోటు సంపాదించుకుందంటే, ఆరోజుల్లోనే కాదు, ఈరోజుకీ అది ఎంతో గొప్ప విషయమే.

Janabai - జానాబాయి

జానాబాయి గురించి కూడా ఈ వారమే తెలుసుకుందాము. ఎందుకంటే ఈమె కూడా మరాఠీ వర్కారి హిందూ సంత్. మళ్ళీ వారం ఈమె గురించి విడిగా చెప్పినా కొంచం మొనోటనస్ గా ఉంటుందేమోననిపించింది. పండర్పూర్ లో మరాఠీ సంత్ నామ దేవ్ ఇంట ఈమె పనిమనిషి. ఆ ఇంట ఉన్న భక్తి వాతావరణం వల్లనూ, స్వతహాగా కూడా భక్తి ఎక్కువే అయిన కారణంగానూ ఈమె కూడా తన జీవితాన్ని విఠోబాను కొలవడంలోనే గడిపేసింది. ఎటువంటి విద్యాభ్యాసం లేని ఈమె 300 అభంగ్ లు సంత్ నామదేవ్ అభంగ్ ల తో పాటుగా భద్రపడ్డాయంటే, అది కూడా, ఆయనతో పాటుగా సంత్ జానాబాయి గా గుర్తిస్తూ. ఒక శూద్ర కులస్తురాలైన ఈమె ది ఒక అద్భుత ప్రయాణం. ఈమెవి ఒక రెండు అభంగ్ లు ఇక్కడ చూద్దాం.

Cast off all shame
Cast off all shame,
and sell yourself
in the marketplace;
then alone
can you hope
to reach the Lord.
Cymbals in hand,
a veena upon my shoulder,
I go about;
who dares to stop me?
The pallav of my sari
falls away (A scandal!);
yet will I enter
the crowded marketplace
without a thought.
Jani says, My Lord,
I have become a slut
to reach Your home.



సిగ్గంతా విడిచివేయి
నిన్ను నువు మార్చుకో
ఈ బజారులోన
అప్పుడు మాత్రమే
నువు ఆశ పడగలవు
భగవంతుని చేరగలనని.


చేతిలో తాళాలతో
భుజాలపై వీణని వ్రేలాడేసి
నేను తిరుగుతుంటాను
నన్ను ఆపే ధైర్యమెవరికి?


నా చీర కొంగు
చెదరి పోతుంది
అయినా నే వెళ్తుంటాను
ఇరుకైన బజార్లలో
ఏ చింతా లేకుండా.


జానాబాయంటుంది, ఓ దేవా,
నీ నివాసం చేరడానికి
నేను పతితనయ్యానని.



Acceptance

If the Ganga flows to the ocean
and the ocean turns her away,
tell me, O Vitthal,
who would hear her complaint?
Can the river reject its fish?
Can the mother spurn her child?
Jan says,
Lord,
you must accept those
who surrender to you.


తన్ను చేర వచ్చిన గంగను
సముద్రుడు తిరస్కరిస్తే
చెప్పు ఓ విఠలా,
ఆమె మొర ఎవరు వింటారు?

చేపను నది తిరస్కరించవచ్చా?
శిశువును తల్లి కాదనవచ్చా?
జానాబాయంటుంది,
దేవా,
నీ శరణు కోరిన వారిని
నువు ఆదరించవలసిందే.

స్త్రీ జీవితమంటే, నిరంతర పోరాటం, పరిశ్రమ, దాస్యం, సంకెళ్ళు, అణిచివేత, పీడన, రోదన, శోధన. ఆమెది ప్రేమ తత్వం, పొందేది ప్రేమ రాహిత్యం, దూషణ, తిరస్కారం. పురుషుడు ఆమెకోసం కుతంత్రంగా నిర్మించిన సాలెగూడు లో చిక్కుకుని అందులోని విషపు కాట్లను లెక్క చెయ్యకుండా తెగిపడిన తన హృదయ శకలాలను తిరిగి అతికించుకుని బయటపడి తారల ఆకాశంలో తనకో స్థానం ఏర్పరుచుకోవడం ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న స్త్రీలకి తప్ప సాధ్యం కాదేమో.

ఇంకొక అద్భుతమైన రచయిత్రి పరిచయంతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.

 

 

 

 ........... శారద శివపురపు