Facebook Twitter
మమకారం

 

మమకారం

  

గోపీచంద్ తెలుగు కథకు శిల్పనడకలు నేర్పిన రచయిత. తండ్రి రామస్వామి చౌదరి నేర్పించిన ప్రశ్నించడం అనే హేతుదాన్ని పునికిపుచ్చుకొని అనేక తాత్వికమైన రచనలు చేశారు. పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, అసమర్థుని జీవయాత్ర లాంటి నవలలు గోపీచంద్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. ఇక కథల విషయానికి వస్తే ధర్మవడ్డీ, జనానా వంటివి ఆణిముత్యాలు. అలానే గోపీచంద్ రాసిన తత్వవేత్తలు గ్రంథం మరో ముఖ్యమైన రచన. ఆధునిక సాహిత్యానికి, ప్రపంచానికి కావాల్సిన తాత్విక దోరణులు వీరి రచనల్లో కనిపిస్తాయి. అలానే గోపిచంద్ వారి మమకారం కథ రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల రైతుల మానసిక స్థితికి ఈ కథ అద్దం పడుతుంది.

 కథలోని ఇతివృత్తం గురించి చప్పాలంటే- జోగయ్య మామకు పొలం అంటే ప్రాణం. ప్రాణం కన్నా ఎక్కువే. ఆ పొలం గట్టుమీద పుట్టి, పెరిగిన తుమ్మచెట్లు అతనితోనే పుట్టి పెరిగాయి. వాటిలో రెండు చెట్లు నరికి నాగలి చేయించినందుకే బాధపడే మనస్తత్వం జోగయ్యది. పొలం వస్తే గట్టుమీద ఉన్న నేరేడు చెట్టుకింద కూర్చొంటాడు. వాటి నీడనే అన్నం తింటాడు. ఎడ్ల వ్యాపారిగా ఆ వూరు వచ్చిన జోగయ్య మంచితనం గుర్తించి ఆ ఆసామి తన కూతుర్ని ఇచ్చి ఇళ్లరికం ఉంచుకున్నాడు. అప్పుడు మామ పొలం కేవలం అయిదు ఎకరాలే. కానీ జోగయ్య కష్టపడి దాన్ని వందఎకరాలు చేస్తాడు. దాన్ని బట్టే అతనికి పొలం అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.
       అతనికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వాళ్లని చూడకుండా ఉండగలడు కానీ, పొలం మాత్రం చూడకుండా ఉండలేడు. పెద్దకొడుకు నరసయ్య అతనితోపాటు పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. రెండో కొడుకు వేరే ఊళ్లో బట్టలదుకాణం పెట్టుకుంటాడు. కానీ అది నరసయ్యకు ఇష్టం ఉండదు. మూడో కొడుకు ఇంగ్లిషు చదువులు చదువుతుంటాడు. కానీ జోగయ్యకు మాత్రం అందరూ పొలాన్ని వృద్దిచేయాలని కోరుకుంటాడు. ఒకసారి పొలానికి నీళ్లు పెట్టే విషయంలో గొడవ వస్తే నరసయ్య కర్రపట్టుకొని గట్టుమీద నిలబడతాడు. దాంతో అవతలి వాళ్లు భయపడతారు. గట్టు పడగొట్టి పొలానికి నీళ్లు పెడతాడు. పొలం నీళ్లు తాగుుతుంటే, చంటిబిడ్డ పాలుతాగున్నట్లు అనిపిస్తుంది జోగయ్యకు. పెద్ద వయసైన జోగయ్యను కొడుకు ఇంట్లో ఉండు పొలం పనులు నేను చూసుకుంటాను అంటే మాత్రం ఒప్పుకోడు, పొలానికి వెళ్తాడు. దగ్గరుండి పనులు చేయిస్తాడు. అతనికి దానిలో దొరికే తృప్తి అంతా ఇంతా కాదు.
         ఒకరోజు భార్యకు బాగుండదు. కొడుకు నువ్వు ఇంట్లో ఉండి అమ్మను చూసుకో, నేను పొలం వెళ్లి దమ్ముకు నీళ్లు పెట్టి వస్తాను అని పొలం వెళ్తాడు. అంతలో పొలానికి నీళ్లు పెట్టనివ్వకుండా అవతివాళ్లు కర్రలు, ఈటెలతో గొడవకు వస్తున్నారని కబురు వస్తుంది. భార్య బాగోగులు కూడా పట్టించుకోకుండా కర్ర తీసుకొని పొలం వెళ్తాడు జోగయ్య. దాంతో అవతలి వాళ్లు తగ్గుతారు. కొడుకు ఇంటికి వస్తాడు. వెంటనే భార్య పరిస్థితి బాగలేదని తెలిసినా పొలం మొత్తం నీళ్లతో తడిసిందాకా ఆగి, తర్వాతే ఇంటికి వెళ్తాడు జోగయ్య. భార్య ఇంటి బాధ్యతలు అన్నీ మాట్లాడుతూ అతని చేతిలోనే ప్రాణం విడుస్తుంది.
      తర్వాత జోగయ్య ప్రెసిడెంట్ అయినా పొలం పోవడం మాత్రం మానుకోడు. కూలీలు పనులు చేస్తుంటే చూస్తూ, వారిచేత మంచిగా పనులు చేయిస్తూ ఉంటాడు. మనవడు పొలం వస్తే ఇదంతా మన పొలం అని గర్వంగా చెప్పి పొంగిపోతాడు. అలానే మనవరాలు పొలానికి అన్నం తెస్తుంది. పట్టుపరికిణిలో వచ్చిన ఆ అమ్మాయిని పట్టించుకోకుండా పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆవకాయ, గోంగూరతో అన్నం తింటాడు. వర్షం మొదలయ్యేలా మేఘాలు కమ్ముకుంటాయి. జోగయ్య నేరేడు చెట్టుకింద కూర్చొని తొలి చినుకులను ఆనందిస్తూ ఉంటాడు. వాన పెద్దది కావడంతో కొడుకు, మనవరాలు అతని దగ్గరకు వచ్చి పిలుస్తారు. అతను వర్షానికి తడిసిన మట్టిని గుప్పెట్లోకి తీసుకొని వాసనను పీల్చుకొని ఆనందించినట్లు తెలుస్తుంది. చేతిలోని మట్టి కిందకు జారుతుంది. జోగయ్య మాత్రం ఆ మట్టిలోనే కలిసిపోయినట్లు వాళ్లకుస అర్థం అవుతుంది.
    ఈ కథ- రైతు పొలాన్ని కన్నబిడ్డలకన్నా, భార్య కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు అన్న విషయాన్ని చెప్తుంది. రైతును పట్టించుకోని నేటి ప్రభుత్వాలకు, రైతును పట్టించుకోని రాజకీయ నాయకులకు ఈ కథ ఓ మేలుకొలుపు లాంటిది. ఇక శిల్పం విషయానికి వస్తే గోపీచంద్ ఒక వరుసలో రైతుకు భూమికి ఉన్న అనుబంధాన్ని పాఠకులకు చెప్పాడు. కథను ఏ నేరేడు చెట్టుకింద ప్రారంభించాడో అక్కడే ముగించాడు. అలానే జోగయ్య, పొలం అనుబంధాన్ని ఆత్మీయంగా చెక్కాడు. కథను చెప్పడంలో ముందు వెనుకలు అంటే ప్లాష్ బ్యాక్ కథనాన్ని తీసుకొన్నాడు. అందుకే నేటి తరం చదవాల్సి కథ మమకారం.

  
                                                        .....డా. ఎ.రవీంద్రబాబు