Facebook Twitter
కామిని హృదయం

 

కొడవగంటి కుటుంబరావు గారు రాసిన

" సరితా దేవి డైరీ" "సరోజ డైరీ" "కామిని హృదయం "

ప్రముఖ ఆంగ్ల రచయిత్రి Jene Austen గారు రాసిన Pride and Prejudice  అనే నవల చదువుతుంటే  నాకు కొడవగంటి కుటుంబరావు గారు రాసిన " సరితా దేవి డైరీ" "సరోజ డైరీ" అనే నవలలు గుర్తొచ్చాయి.   రెండు నవలలు మధ్య తరగతి అమ్మాయిల పెళ్లి సమస్యలే.   Pride and Prejudice  18  వ శతాబ్దంలో బ్రిటిష్ దేశపు నేపధ్యంలో రాసిన నవల.  
       సాహిత్యం తో పరిచయం ఉన్న వారికి కొడవగంటి కుటుంబరావు గారి గురించి పరిచయ వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు.   నేను అంత సాహసం కూడా చేయలేను.    ఆలిండియా రేడియో వారి ' రేడియో మాసం'  సందర్భం లో సీరియల్ గా ప్రసారం చెయ్యడానికి 'డైరీ' రూపం లో రాసిన పెద్ద కథ   సరితా దేవి డైరీ.   డైరీ అనంగానే తేదీల వారీగా కాకుండా కథ లాగా ఉండి ఉత్తమ పురుషలో స్వగతం లాగా సాగుతుంది.   ఐతే కథ చెప్పేపాత్రకు తన చుట్టూ అప్పటివరకు జరిగిన జరుగుతున్న విషయాలే తప్ప ముందు జరుగబోయే విషయాలు గాని ఇతరుల మనసులో ఉన్న విషయాలు గాని తెలియవు.    "రేడియో వరకు కధ సరిపోయింది గాని కథ పూర్తి కాలేదనిపించి  సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ అనే నవలా కామిని హృదయం అనే నాటకం రాశాను" అని ముందు మాటలో రాసుకున్నారు.  మూడింట్లోనూ  హాస్యం వ్యంగ్యం తగు పాళ్ళలో ఉండి చాలా సరదాగా సాగుతుంది.  
         సరితా దేవి కూతురు పెళ్లి కోసం ఆరాట పడే సగటు మధ్య తరగతి ఇల్లాలు.    ఆమె ఉద్దేశంలో భర్త ఒట్టి నసుగుడు.     సందర్బానికి తగినట్టు మాట్లాడలేని   అడవి మనిషి.   సరితాదేవి కూతురు సరోజ.  ఇంటర్ ఆ సంవత్సరమే పాస్ అయింది.   తల్లి ధృష్టిలో విషయం అర్ధం చేసుకోలేని పెద్దమ్మ.   కానీ కూతురంటే విపరీతమైన ప్రేమ.    ఎవరు చక్కటి చీర కట్టుకున్నా నగలు పెట్టుకున్నా తన కూతురుకి కూడా అలాంటివి దిగేసి  నలుగురు కూతురిని అందంగా ఉందని మెచ్చుకోవాలి అని ఆరాటం.     సరొజకు ఇవన్ని నచ్చవు.    ఇలాంటి విషయాలలో తల్లి కూతురు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.  
        సరోజ ఇంటర్ ఆత్తెసరు మార్కులతో పాస్ అయిన అమ్మాయి.    " అమ్మకు అర్థం అయ్యేటట్టు చెప్పడం నాకు చేత కాదు.  ఆమె నామీద ఆపేక్ష తోనే చెబుతుంది.  గాని, ఆవిడ చెప్పినట్టాల్లా చేస్తే నేను నవ్వులపాలై పోవాలిసిందే.  ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోదు.  అటువంటి మనిషి ఆపేక్షకు వీలువేమిటి.    ఏదో కట్టుకోమంటుంది,  ఏవో పెట్టుకోమంటుంది.   నా వయసు తక్కువ చెప్పమంటుంది.   నన్ను నాలగా ఉండనివ్వక ఇంకే మహాలక్ష్మి లాగానో, అనసూయ లాగానో, రాధలాగానో చేస్తానంటుంది.  నన్ను నలుగురు అందగత్తె అనాలన్న ఆదుర్ధా నాకే లేనప్పుడు ఆవిడ ముచ్చట నేనేం తీర్చను." సరోజ ఆలోచనలు ఇలా సాగుతాయి.  
 సరోజ స్నేహితురాలు సావిత్రి.   ఇంటర్  ఫస్ట్ క్లాసు లో పాస్ అవుతుంది.    సరోజ ఉద్దేశం లో  సావిత్రి చాలా బాగా,  మగ స్టూడెంట్ లాగా చదువుతుంది.   ఎన్ని నగలు వేసుకుంటే మాత్రం  ఫస్టు మార్కు కు సరి అవుతుందా  అనుకుంటూ ఉంటుంది.
సావిత్రి తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్.   సమాజం లో బాగా పలుబడి ఉన్న పెద్ద మనిషి.    ఆమె తల్లి సుశీలా,  సరితా దేవి  కూతుర్ల పెళ్లి విషయం లో పోటీ పడుతూ ఉంటారు.    
          సరితాదేవి  తమ్ముడు వాసు  డిల్లీ లో ఉంటాడు.   అతని ఆఫీసులోనే పనిచేసే  మనోరంజన్  తో కలిసి అక్కను  చూడడానికి సరితా దేవి ఇంటికి వస్తాడు.   మనోరంజన్ ఇంకా  పెళ్ళికాని అందగాడు.   డిల్లీ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు  అని తెలిసినప్పటి నుండి  ఎలాగైనా  కూతురిని  రంజన్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాట  పడుతుంది.    ఆరోజు పుట్టిన రోజు కాక పోయినా  రంజన్ ని  బుట్టలో వేయడానికి సరోజకు  తలంటి  పోయడం మంచి చీర కట్టి నగలు పెట్టి అలంకారం చేయడం లాంటి వన్ని చేస్తూ ఉంటుంది.    రంజన్ సావిత్రి అన్న రాఘవరావుకి ఇంటర్ లో క్లాస్ మెటు కమ్ రూమ్మేటు.  అందుకని   అటు సుశీల కూడా  రంజన్ ని తన అల్లుడిని చేసుకోవాలని పన్నాగాలు పన్నుతుంది.  భర్తకున్న  పరపతీ కూడా ఉపయోగించి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది.    రంజన్  చివరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు  అనే విషయాన్ని చాలా సరదాగా హస్యోక్తంగా చెప్పారు కుటుంబరావు గారు.   సరితాదేవి, సరోజ స్వగతం లో చెప్పినా ఎక్కడా గందరగోళం లేకుండా ఉంది.    ఇద్దరి మనసుల్లో పరకాయ ప్రవేశం చేసి రాశారు.    వీళ్ళ సమక్షం లో జరగని విషయాలు ఎవరో అమ్మలక్కల ద్వారా చెప్పించడం,   కథని ఏమాత్రం అటూ ఇటూ కాకుండా నడిపించడం,  హాస్య చతుర సంభాషణలు   చదువుతూ ఉన్నంత సేపు మనల్ని మనం మరచి పోతాం.  
           ఈ రెండు కధలకు  అనుబంధంగా రాసిన నాటకం కామిని హృదయం.   ఇది సుశీల ఇంట్లో జరిగిన సంభాషణల తోనూ , డిల్లీ లో రంజన్, వాసుల మధ్య సంభాషణలతోనూ ఉంటుంది.  
"నాకు పెళ్లి అంటెనూ- నీళ్ళు అంటెనూ భయం లెదు.  కానీ వాటిల్లోకి ప్రవేశించడానికి కొంత మానసిక  ప్రయత్నం ఉండాలి.   స్వయం నిర్ణయం కావాలి.   అంతేగానీ,  ఎవరో వచ్చి వెనుకనుంచి అమాంతం తోసేస్తె?"--రంజన్
" సుశీలమ్మగారు మా అమ్మ కన్నా చెడ్డది కాదు.   మా అమ్మ అయితే ఇంత నాజుకులు కూడా ఉండవు.  మిమ్మల్ని పడగొట్టడానికి రోకలి బండ ఒకటి తీసుకొని వెంట బడుతుంది."  - సరోజ.
" ఎంతసేపు చచ్చినవాళ్ల ఆత్మ కోసమే ప్రార్ధిస్తారు గాని, బతికుండగానే నాలాగా పోగొట్టున్నావాడి ఆత్మ కోసం ఎవరూ ప్రార్దించరు."-  రంజన్.
బుద్ధి తెలిసినప్పటి నుండి నన్ను నేను కాపాడుకోవడమూ,  అనుక్షణము ముందు వెనుకా చూసుకుంటూండటమూ,  ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయమూ నిర్ణయించుకోవడం చేస్తూ వచ్చాను.    నా బుద్ధీ, మనస్సూ,  అంతరాత్మా అహోరాత్రులు నాకోసం కాపలా కాశాయి.  మా అమ్మ ఆధారపడే మనిషైతే నేనింత ఘోరంగా తయారై ఉండను. " -- సరోజ.

         సంభాషణలలో ఎంత హాస్యముందో  అంత ఆలోచింప జేస్తాయి.  చదువుతున్నంత సేపు  అమ్మాయిల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పడే  ఆరాటం అందులో ఉన్న సమస్య తీవ్రత అంతా కనబడుతుంది.    సరితాదేవి అల్లుడిని సంపాదించే జిమ్మిక్కులు చూసి కాసేపు నవ్వుకున్నా నెమ్మదిగా ఆమె అంటే జాలి పుడుతుంది పాఠకుల్లో.       ఈ కథలు యాభైల్లో రాశారు. అంటే  అరవై ఏళ్ల తరువాత కూడా సమస్య పూర్తిగా పోలేదు.   కాస్త తీవ్రత తగ్గింది అంతే.  
కధలు చదువుతున్నంతసేపూ ఇదివరకు కొడవగంటి కుటుంబరావు గారి కధలు చదవని వాళ్ళయితే చదవనందుకు నిజంగా బాధ పడతారు.

 

 

 

 

 

- ఝాన్సి మంతెన