Facebook Twitter
రిక్షావాలా

 

రిక్షావాలా

 


సామ్యవాద భావాలతో రచనలు చేసిన అలనాటి మేటి రచయిత్రుల్లో వట్టికొండ విశాలాక్షి ఒకరు. అభ్యుదయ సాహిత్య పంథాలో జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని గడిపారు. గుంటూరు జిల్లాకు చెందిన విశాలాక్షి రాసిన భారతనారి నవల అప్పట్లో గొప్ప పేరు పొందింది. ఆమె రాసిన గీతాలు ప్రజాసభల్లో మారుమ్రోగేవి. నీతితో, నిబద్ధతతో ప్రజల పక్షాన పోరాడిన వనిత విశాలాక్షి. అందుకే ఈమె రచనలు కూడా వాస్తవపరిస్థితులకు అతి దగ్గరగా ఉంటాయి. అలాంటి కథే రిక్షావాలా. ఈ కథను విశాలాక్షి బహుశా 1950లలో ప్రచురించి ఉండవచ్చు.

కథలోకి వెళ్తే- బక్కచిక్కిన ఓ పేదవాని జీవిత పోరాటమే రిక్షావాలా కథ. మంచి ఎండాకాలం కావడం వల్ల రోడ్లమీద జనాలు కనపడరు. కానీ ఓ రిక్షా  అతను మాత్రం ఏదన్నా బేరం దొరక్కపోతుందా... అని, ఎదురు చూస్తూ ఉంటాడు. అతనిని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది... పాపం ఆకలికి తాలలేక, నీరసించి పోయున్నాడని. అతనే కాదు, అతని భార్యాపిల్లల పరిస్థితి కూడా అంతే. అతనికి ఆ వూరుకూడా కొత్తే. ఎవరైనా ఏదైనా చోటుకు తీసుకెళ్లమంటే, సొంతగా ఎటూ తీసుకెళ్లలేడు. ఎక్కిన వాళ్లే జాగ్రత్తగా చూసుకుంటూ సరైన స్థలానికి వెళ్లాలి. అతని వాలకం చూసిన ఎవరూ అతని రిక్షా ఎక్కరు. ఒకవేళ ఎక్కినా మరోసారి మాత్రం ఎక్కరు. ఎండిపోయిన డొక్కలతో ఉన్న అతన్ని ఒకామె పిలుస్తుంది. ఆ పిలుపుకు అతను ఆశతో "ఎక్కడికమ్మా?" అని అడుగుతాడు. "బ్రాడీపేట. ఎంత తీసుకుంటావ?"ని అడుగుతుంది. "ఎంతో మీదయ" అని అంటాడు. ఆమె రిక్షా ఎక్కుతుంది. ఆకలితో మాడిపోతున్న అతను కొంతదూరం లాగి. "కాళ్లు కాలుతున్నా యమ్మా" అంటాడు. అతని కాళ్లకు చెప్పులు లేవని గమనించి ఆమె అడుగుతుంది. "చెప్పులు వెసుకోడానికి కాళ్లు ఇంకా అలవాటు పడలేదు. కొత్త చెప్పులు కొనుక్కునే డబ్బు లేదు" అని బదులిస్తాడు. కొంత దూరం వెళ్లాక వేరే దారిలో వెళ్తున్నాడని ఆమె తెలుసుకుంటుంది. "ఇలా తీసుకొచ్చావు?. అటు వెళ్లుంటే తక్కువ సమయంలో వెళ్లే వాళ్లం కదా" అంటే, "ఇఫ్పుడిప్పుడే దారి గురుతులు పెట్టుకుంటున్నానమ్మా" అంటాడు.

కొంతదూరం వెళ్లాక. చెట్టునీడన రిక్షా ఆపి "తర్వాత తీసుకెళ్తానమ్మ" అంటాడు. ఆ ఎండలో అతను రిక్షాలాగుతుంటే అతని కన్నీళ్లు, చెమట కలిసి పాదాలముందు కాలుతున్న నేలపై పడతాయి. అతని బాధ చూడలేక ఆమె కూడా తల పక్కకు తిప్పుకుంటుంది. అంతలో అటుగా జడ్కా వస్తుంది. ఆమె "రిక్షా బ్రాడీపేట పోవడానకి ఎంత తీసుకుంటావో చెప్పు, అంత ఇచ్చి నేను జడ్కాలో వెళ్తాను" అంటుంది. కానీ అందుకు రిక్షావాలా ఒప్పుకోడు. జడ్కాబండి అతను కూడా "బాడెగ ఒప్పకున్నాను" అని చెప్తాడు. రిక్షావాలా మాత్రం "నేను తీసుకెళ్తాను. మీరు వూరికే డబ్బులిస్తే, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే నేను సుఖంగా ఉండను" అని చెప్పి మళ్లీ రిక్షాలాగటం మొదలు పెడతాడు. ఆమె తన దగ్గరున్న డబ్బులు లెక్కచూసుకుంటుంది. కేవలం మూడు పావలాలు ఉంటాయి. ఆమె ఇంకా రెండు మూడు చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఆ డబ్బులు సరిపోతాయా, లేదా అని ఆలోచిస్తుంది. కానీ రిక్షా దిగిన తర్వాత ఆమె తన దగ్గరున్న మూడు పావలాలు అతనికి ఇచ్చేస్తుంది. అతను "దయగల తల్లి" అని ఉత్సాహంతో రిక్షాని చూడ్చుకుంటూ వెళ్లిపోతాడు.

కథలో ఒకవైపు ఆకలితో అలమటిస్తున్నా శ్రమచేయకుండా డబ్బు తీసుకోకూడదనే రుక్షావాలా నిజాయితీ... తనకు సరిపడా డబ్బులు లేకపోయినా అతని దీన స్థితిని చూసి మొత్తం ఇచ్చేసిన ఆమె నిజమైన మానవీత మనల్ని కదిలిస్తాయి.  అనుక్షణం అతని కష్టాలకు చెలించిపోతూ "ఏమీ చేయాలా" అని ఆలోచిస్తూంది ఆమె.

ఈ కథ మొత్తం ఆర్ద్రంగా నడుస్తుంది. ఒకప్పటి నగరజీవితాల్లోని రిక్షావాలాల నిజజీవితాన్ని దగ్గర నుండి చూస్తున్నట్లు ఉంటుందీ కథ చదువుతుంటే. కథ ఉత్తమ పురుషలో రచయిత్రే చెప్పినట్లు నడుస్తుంది. అందుకే రిక్షావాళ్ళ చరిత్రకు సాక్షిగా ఈ కథను గుర్తించాల్సిన అవసరం ఉంది.

- డా. ఎ.రవీంద్రబాబు