Facebook Twitter
పడగనీడ

 

పడగనీడ



    రజియా కొంత ఆందోళనకు గురయ్యింది. ఏమిటీ ప్రభాకర్‌! ఇంతదూ రమూ వచ్చి మరల వెనకడుగు వేస్తున్నాడా? కాకపోతే 'పెళ్ళి' అనగానే ఎగిరి గంతెయ్యవద్దూ? ఓసి పిచ్చిపిల్లా! నిజానికి ప్రభాకర్‌ మనసు ఎగిరి గంతు వెయ్యనేవేసింది. అయితే అది ప్రదర్శింపబడలేదు.  ప్రాంగణంలోకి వచ్చిన పిట్టలను లోపలికి రాకుండా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పిట్ట ఎగి రిపోదూ.ప్రక్కనుండి పిట్టను గమనిస్తూంటుంటే అది లోపలికి రానే వస్తుంది. లోపలికి రాగానే అది ఎంత గింజుకున్నా వల పట్టుమరింత బిగిసిపోతుంది...!
    ఆ మర్నాడు రజియా గట్టిపట్టు పట్టాలని నిర్ణయించుకుంది. తాడోపేడో తేల్చుకోవాలి...
    ''ప్రభాకర్‌! మన ఇద్దరం ఒకరికొకరం ఇష్టపడుతున్నాం కదా? దానికి ముగింపు పెళ్ళే కదా?? అది అసాధ్యం అంటున్నావే, ఎందుకని??''
    ''మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు. పెళ్ళంటే యువతీయువకులు  ఆవేశంతో తీసుకునే నిర్ణయం కాకూడదు. పూర్వాపరాలు బాగా ఆలోచించాలి''
    ''పెద్ద ఆరిందాలాగా మాట్లాడావు. సంతోషించాంకానీ మనిద్దరి పెళ్ళికి అడ్డంకి ఏమిటీ?''
    ''మన ఇద్దరిమధ్యే అడ్డంకి''
    ''అంటే?''
    ''అంటే ఏముంది? పెళ్ళి సమాన స్థాయిలో వున్నవాళ్ళు చేసుకోవాలి కానీ...'' పూర్తిచెయ్యనీయలేదు రజియా.
    ''సమాన స్థాయంటే ఏమిటీ?''
    ''మీ స్టేటస్‌ ఏమిటీ? నా పరిస్థితి ఏమిటీ? దీన్ని తెలిసికోవడానికి వివరణ కావాలా?''
    ''కావాలి''
    ''అయితే వినండి. మీ నాన్నగారు ప్రస్తుతం పదవిలోవున్న ఒక పెద్ద బ్యాంకు మేనేజర్‌. మీరు వారి ఏకైక కూతురు. నేను యాక్సిడెంట్‌లో చనిపోయిన ఒక పేద లారీ డ్రైవర్‌ కొడుకుని... ప్రస్తుతం పొట్టపోసుకోవడానికి ఒక పాత ఆటోను, అదీ ఎవరో ధర్మాత్ములు నామీద జాలితో ఇచ్చింది''
    ''నువ్వు చెప్పివన్నీ అబద్ధాలు కాదు. పెళ్ళికి ప్రధానం అమ్మాయి అబ్బాయిల మనస్సులు కలవడం. మిగిలినవన్నీ కృత్రిమమైన అడ్డంకులు''
    ''అలా చెప్పడం చాలా తేలిక మేడమ్‌. వీటితో ప్రాక్టికల్‌ ప్రాబ్లమ్స్‌ చాలా వస్తాయి''
    ''పెద్ద అనుభవజ్ఞుడిలాగా చెబుతు న్నావే. వీటన్నింటినీ ఫేస్‌ చేసినవాడిలాగా...''
    ''ప్రతీది అనుభవంమీదే తెలిసికోనక్కర్లేదు. కొన్ని ఇతరులను చూసి, మరి కొన్ని పుస్తకాలు చదివి.. ఇంకా కొన్ని సినిమాలు, టి.వీలు చూసి''
    ''సినిమాలు, టీవీలు చూసి అన్నావు ఒప్పుకుంటాను. నువ్వు పుస్తకాలూ చదువుతావా?''
    ''డ్యూటీ ముగించాక నేను పుస్తకాలే చదువుతాను. ముఖ్యంగా మన తెలుగు రచయిత్రులు రాసినవి. మీకు నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్‌కు రండి చూద్దురుగాని''
    ''చాల్లే, అదొకటా మళ్ళీ? ఇక్కడిలా మాట్లాడుకోవడానికే భయపడి చస్తుంటే, ఇంకా నీ రూముకి వస్తే  అందరి మాటా ఎలాగున్నా నువ్వే భయపడి పారిపోతావ్‌!'' అంటూ నవ్వడం మొదలు పెట్టింది.
    ''ఓసి పిచ్చిపిల్లా! ఇదంతా నటన  అని నీకు  తెలిసేసరికి సమయం మించిపోతుంది'' అని అనుకుంటూ మౌనముద్ర దాల్చాడు.
    రజియా కొనసాగించింది.  ఇవ్వాళ తేల్చుకోవాలని నిర్ణయించింది కదామరి.
    ''నేను మా నాన్నగారిని ఒప్పించగలననే ధైర్యం నాకుంది''.
    ''రజియా మేడమ్‌! మీ ఇంటిలో తుపాకి ఉందా?''
    ''అదేంటి? తుపాకీ ఊసిప్పుడెం దుకొచ్చింది?''
    ''చెబుతాను వినండి మీరు మీ నాన్నగారికి చెప్పి మన పెళ్ళికి ఒప్పిస్తానన్నారుకదా?''
    ''అవునూ!''
    ''ఆ సంగతి ఆయనకు మీరు చెప్పగానే తుపాకీ (ఉంటే) తీసుకొని సరాసరి నన్ను గురిచూసి కాలుస్తారు. ఎవరైనా అంతే. నేను మీ నాన్నగారి పాత్రలో ఉన్నా ఈ ప్రభాకర్‌గాడిని కాల్చి చంపేస్తాను. తరువాత జరిగే పరిణామాల గురించి ఆలోచించకుండా... ! ఇంకా వినండి, మీరు ఆయనకీవిషయం  చెప్పగానే నా దగ్గరకొచ్చి గదిలోంచి బయటికి పిలుస్తారు. ''ఓరి నీచుడా! ఏదో బ్రతుకుతెరువుకోసం నన్ను బ్రతిమాలితే మా అమ్మాయిని నీ ఆటోలో పంపిస్తుంటే ఇదా నువ్వు చేసేది? అదీ మా మాస్టారు లక్ష్మీనారాయణగారి మాటమీద. నిన్ను స్పేర్‌ చేయకూడదు. ఇంకా ఎన్ని కొంపలు ముంచుతావో అంటూ తుపాకీ గుండుని నా ఛాతీపైకి వదులుతారు. అంటే నాకు పారిపోవడానికి కూడా సమయం ఇవ్వరు. సరాసరి పైకే...''
    రజియా నిశ్చేష్టురాలయిపోయింది. అవున్నిజం. లక్ష్మీనారాయణగారి మాటమీదే నన్ను ఈ ఆటోలో పంపడానికి అంగీకరించారుకానీ ఈ ముక్కూ ముఖం తెలియనివాడిఆటోలో పంపేవారా? కొంతసేపు ఇద్దరూ మాట్లాడలేదు.

- కొట్టి రామారావు
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో