Facebook Twitter
ప్రాణానికి ప్రాణం

 ప్రాణానికి ప్రాణం

 

 
 
ఈ అమ్మాయి ఎవరూ? అంది సీత. లలితతో పాటు వచ్చిన అమ్మాయిని చూస్తూ.
''మా పక్కింట్లో వుంటుంది మేడమ్‌. ఈ అమ్మాయి పేరు రమ్య. ఈ మధ్యే  అద్దెకొచ్చారు. మిమ్మల్ని చూపిస్తానని తీసుకొచ్చా'' అంది లలిత.
రమ్యచూపు సీతావాళ్ళ ముందుగదిలోవున్న లైబ్రరీపై పడింది. అబ్బ! ఎన్ని పుస్తకాలో అంటూ ఆశ్చర్యంగా ఆ లైబ్రరీ ముందు నిలబడి పుస్తకాలు చూడటం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి రమ్యకి అనిపించింది. తన కాలేజీలో వ్యాసరచనపోటీలో తను పాల్గొంటోంది కదా! ఈ పుస్తకాలలో ఓ వ్యాస సంకలనం వుంటుందేమో....
లలిత, సీత ముందుగదిలో కూర్చొనున్నారు. ''త్వరలో కాలేజ్‌డే వస్తున్నది కదా! నీదొక్కటే కూచిపూడి డాన్స్‌ ప్రోగ్రామ్‌. మరి నువ్వు బాగా ప్రాక్టీస్‌ చేయాలి లలితా'' అంది సీత. లలితకి చాలా ఆనందమేసింది కాలేజీలో తాను కూచిపూడి డాన్స్‌ చేయబోతుందని అంతలో రమ్య ఒక పుస్తకం పట్టుకొని ''మేడమ్‌! ఈ పుస్తకం నాకు కావాలి. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ తెచ్చిస్తాను'' అంది సీతతో.
సీత ముఖంలో మార్పొచ్చేసింది.  తన లైబ్రరీని ప్రాణంతో సమానంగా చూసుకుంటుంది. పుస్తకాలు ఇవ్వటం, తీసుకున్నవాళ్ళు తిరిగి తెచ్చివ్వకపోవటంతో ఎన్నో విలువైన పుస్తకాలు పోగొట్టుకుంది సీత ఇప్పటికే.
''లేదమ్మా! నా పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని నిశ్చయించుకున్నా. ఇక్కడ కూచుని చదువుకో. అంతేకానీ ఇంటికి తీసుకెళ్ళటం అనే విషయం మర్చిపో రమ్యా. షాపులో దొరకొచ్చు కొనుక్కో'' అంది సీత.
''చూసాను మేడమ్‌. ఇప్పుడీపుస్తకం రావటం లేదటండీ. ఈ వ్యాసాలు ఒక్కసారి చదువుకొని మీకు తెచ్చిస్తాగా. నామాట నమ్మండి'' అంటూ బతిమాలింది రమ్య. సీత మనసు కరగలేదు. 
''సీతా'' అంటూ గదిలోంచి రవీంద్ర సీతను పిలిచి ''ఆ అమ్మాయి అంతగా బతిమాలుతుంటే, పైగా రెండురోజుల్లో తెచ్చిస్తానంటోంది. ఇవ్వొచ్చు కదా!'' అన్నాడు రవీంద్ర.
''అబ్బ! మీకు తెలియదు. మీరు కల్పించుకోకండి'' అంది సీత చిరాగ్గా. 
''ఇటు విను. ఒక విద్యార్థి చదువుకొని ఇచ్చేస్తానని వేడుకుంటుంటే అంత నిర్దయగా ఇవ్వనని ఎలా చెప్పగలవ్‌ సీతా? ఆ పిల్లకి ఆ పుస్తకం ఇస్తే  అది ఒక విధంగా పుణ్యకార్యం చేసినట్టే. విద్యాదానఫలం దక్కుతుంది నీకు. అలాంటి పుస్తకం దొరకటంలేదేమో. అయినా అలా షెల్ఫ్‌ల్లో పుస్తకాలు మగ్గిపోవటం కన్నా ఒక దీపం నుంచి ఇంకొక దీపంలాగ, ఒక పుస్తకం నుంచి ఒకమ్మాయి, మరో పుస్తకం నుంచి మరోఅమ్మాయి. పుస్తకం పదిమంది చదువుకుంటే ఎంతోమంచిపని చేసినట్టే సీతా. నా మాటవిని ఆ అమ్మాయికి పుస్తకం ఇవ్వు. నీ అభిమాన స్టూడెంట్‌ లలితకి ఆ పుస్తకాన్ని రెండురోజుల్లో తెచ్చియిచ్చే బాధ్యత అప్పగించు సరేనా'' అన్నాడు రవీంద్ర.
''ఈ మేడమ్‌ అలాగే అంటుంది కానీ తీసుకెళ్ళు. మళ్ళీ తెచ్చియ్యి. లలితా! నీదే బాధ్యత'' అన్నాడు రవీంద్ర.
''థ్యాంక్స్‌ అంకుల్‌'' అంది పుస్తకం తీసుకొని రమ్య.
''థ్యాంక్స్‌ అంకులా''! నవ్వుకుంది సీత. పోన్లే చదువుకొని ఇచ్చేస్తుంది అనుకుంది మనసులో మళ్ళా.
þ þ þ þ þ 
సీత, రవీంద్ర వేసవిలో పదిరోజులు ఊటీ వెళ్ళిపోయారు. లలిత తన  పిన్నికూతురు పెళ్ళికి చెన్నై వెళ్ళింది. రమ్య కాలేజీలో వ్యాస రచన పోటీలో పాల్గొని ఫస్టు వచ్చింది.
ఇలా చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి.
þ þ þ þ þ 
లలిత ఉలిక్కిపడింది. మేడమ్‌ పుస్తకం?
''రమ్యా! రమ్యా! పిలిచింది లలిత ఫోన్‌లో.
''పుస్తకం..!''
''ఏ పుస్తకం'' అంది రమ్య. అదే! సీతామేడమ్‌ దగ్గర బతిమాలి, ఇంచుమించుగా ఏడ్చి, పాపం అంకుల్‌ కల్పించుకొని నీకిప్పించలేదా ఏమిటీ? ఆ పుస్తకాన్ని.
ఓ... అదా! గుర్తొంచ్చింది. వుందిలే, ఇచ్చేస్తాలే ''ఫోను పెట్టేసింది'' రమ్య. లలితకి చాలా కోపమొచ్చింది. అంత నిర్లక్ష్యమా! అయినా నాదేతప్పు. రమ్యని మేడమ్‌ ఇంటికి తీసుకెళ్ళటం, తీసుకెళ్ళినా లైబ్రరీ చూడనియ్యటం, చూసినా పుస్తకం తీసుకెళ్ళనియ్యటం, మా మేడమ్‌ ఏమనుకుంటున్నారో? రమ్య ఎంత తొందరగా ఆ పుస్తకం తెస్తే అంత త్వరగా మేడమ్‌కి ఆ పుస్తకం ఇచ్చేయాలనుంది లలితకి.
ఓరోజు రమ్య పుస్తకం తీసుకొచ్చి పనిమనిషి గదులు వూడుస్తుంటే దాని చేతికిచ్చి లలితకి యిచ్చేయి అని హడావిడిగా వెళ్ళిపోయింది.
రెండురోజుల తరువాత అమ్మా! ఇది మీకిమ్మంది అంటూ బట్టలబుట్ట వెనకాలదాచిన పుస్తకం లలితకిచ్చింది రాములమ్మ.
þ þ þ þ þ 
లలితకళ్ళల్లో నిప్పులు కురిసాయి. ఆ పుస్తకంలోని కాగితాలు చూస్తుంటే. ఆ క్షణంలో రమ్యగొంతు నొక్కేయాలనిపించింది లలితకి.
పుస్తకంలో చాలా పేజీలు బ్లేడుతో కట్‌ అయిపోయాయి. ఛీ! అందుకే ఎవరికీ పుస్తకం యియ్యననటం.
లలిత గబగబా రమ్య ఇంటికెళ్ళింది. పుస్తకం చూపించింది. ఓ... ఇదా! నేను చూడలేదే. ఎవరీపనిచేసారో? ఆ పుస్తకం తీసుకున్నప్పుడే... ఏదో అనబోయింది రమ్య.
లలిత మండిపడిపోతూ ''ఛీ! నీ చదువెందుకు? నాలుగుపేజీలు రాసుకోలేవా? ఇప్పుడీ పుస్తకం మేడమ్‌కిఎలా ఇస్తాను'' అంది వచ్చే ఏడుపును ఆపుకుంటూ. రమ్యకి తెలుసు. తన దగ్గరున్న బ్లేడ్‌ ఆ పని చేసిందని. కానీ ఇప్పుడు ఎదురుతిరిగి దబాయించాలనుకుంది రమ్య.
''ఏమిటీ? పెద్దగోల చేస్తావ్‌. లైబ్రరీలో ఎన్నో పుస్తకాల్లో మధ్యమధ్యలో కాగితాలు చింపేయటం కొత్తవిషయమా? ఎవరుచించారో? ఎందుకు చించారో ఎవరు ఎవర్ని అడుగుతున్నారు? ఏమో? ఎవరు చింపారో? ఈ గోలంతా నీకెందుకు? మేడమ్‌కి ఈ పుస్తకం ఇచ్చెయ్‌. అంతే'' అంది నిర్లక్ష్యంగా రమ్య.
ఇలాంటి విద్యార్థులే సమాజానికి చీడపురుగులు అని అనిపించింది లలితకి.
''రమ్యా! ఆ పుస్తకం నువ్వే పట్టుకెళ్ళివ్వు. నేనివ్వను'' అంది బాధగా లలిత.
''ఓకే... అంటూ భుజాలు ఎగరేసుకుంటూ పుస్తకం పట్టుకెళ్ళింది రమ్య.''
ఆపుస్తకం ఇచ్చినప్పుడు మేడమ్‌ ఎంత బాధపడ్డారో ఒక్కసారి కళ్ళముందు కదిలింది లలితకి. పుస్తకం విలువ తెలియని రమ్యలాంటి వాళ్ళెందరో? నాదే తప్పు... నాదే తప్పు. అని అనుకుంటూ లలిత చెంపలేసుకుని దేవునికి దణ్ణం పెట్టుకుంది.
మర్నాడు పొద్దున ఆరుగంటలకి రమ్య పుస్తకం పట్టుకెళ్ళి ఇంటిముందు ముగ్గేస్తున్న పనిమనిషికిచ్చి ఇది మీ అమ్మగారికి ఇచ్చెయ్యి. లేకపోతే మీ అమ్మగారి పుస్తకాలున్నాయి కదా! దాంట్లోపెట్టు. నేను తరువాతొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతా'' అంది. పనిమనిషి తలూపింది. రమ్య స్కూటర్‌ స్టార్ట్‌ చేసి వెళ్లిపోయింది.
లలితకి నిద్రపట్టటం లేదు. ఎలాగైనా పుస్తకం మేడమ్‌కి ఇవ్వాలి. ఎలాగా? ఏ షాపులో ఆపుస్తకం దొరుకుతుంది? ఆరాత్రి లలితపిన్ని లలితకి ఫోన్‌చేసింది. ఒక్కసారిరా, ఇంట్లో నాకిష్టమని కొనుక్కున్న పుస్తకాలు కొన్ని పెయింటిగ్స్‌, కొన్ని ఫ్లవర్‌వాజ్‌లు ఇలా చాలా వున్నాయి. ఎవరెవరికి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళమంటున్నా. నీకు తెలుసుగా నేను, బాబాయిగారు అమెరికా వెళ్ళిపోతున్నాం పెద్దబ్బాయి దగ్గరకి. లలితకి పిన్ని అంటే చాలా ఇష్టం. తనకన్నా పెద్దదయినా స్నేహంగా వుంటుంది. విశాఖపట్నంలో వుండే పిన్నిదగ్గర ఓ నెలరోజులు వుండాలని వచ్చింది లలత.
లలితకి ఒక ఆశ మదిలో మెదిలింది. పిన్ని దగ్గరున్న పెయింటింగ్స్‌, ఫ్లవర్‌వాజ్‌లు నాకేమీ వద్దు. ఆ పుస్తకం ఒక్కటివుంటే నాకు చాలు. ఏమో ఉండొచ్చేమో. మేడమ్‌కి నా ముఖం చూపించే యోగ్యత ఉందేమో!
þ þ þ þ þ 
''అమ్మా! ఆ అమ్మాయి ఎవరో ఇక పుస్తకం తెచ్చింది. మీ పుస్తకాల షెల్ఫ్‌లో పెట్టానమ్మా'' అంది రాములమ్మ గిన్నెలు లోపలపెడుతూ. సరే.. సరే.. అంది సీత ఏదో పనిలో.
లలితకళ్ళు ఆనందంతో వెలిసిపోయాయి. హమ్మయ్య.
''లలితా ఇన్నివుంటే ఈ పుస్తకం కావాలంటావేమిటే. పైగా నీకేమో ఇంగ్లీషు, హిందీ తప్ప తెలుగు చదవటం రాదుగా'' అంది పిన్ని పుస్తకాన్ని గుండెలకి హత్తుకుని మురిసిపోతున్న లలితతో.
''ఇది నా ప్రాణానికి ప్రాణం. అంతే పిన్నీ'' అంది కళ్ళలో తిరిగిన నీళ్ళు తుడుచుకుంటూ లలిత.
þ þ þ þ þ þ
సీత, రవీంద్ర టి.వి. చూస్తున్నారు. ''మీరెన్నన్నా చెప్పండి. శ్రీదేవి అందం శ్రీదేవిదే'' అంది. శ్రీదేవి 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' సినిమా చూస్తూ సీత.
''ఈ ఒక్క విషయంలో మనిద్దరి అభిప్రాయాలూ ఒకటయ్యాయి'' అన్నాడు గలగలానవ్వుతూ రవీంద్ర.
అంతలో కాలింగ్‌బెల్‌ మోగింది.
కొరియర్‌... విశాఖపట్నం నుంచి.
సీత తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది.
తన లైబ్రరీలో వున్న వ్యాస సంకలనమే. ఇదేమిటీ? రాములమ్మ ఆ అమ్మాయి తెచ్చియిచ్చిందని షెల్ఫ్‌లో పెట్టిందిగా.
సీత పుస్తకాన్ని తెరిచింది.
ఓ కాగితం కిందపడింది.
''మేడమ్‌! క్షమించండి నన్ను'' చదువుకునే వాళ్ళ చేతిలోనే పుస్తకం వుండాలని మీరనే మాట వాస్తవం. ఆ పుస్తకం తీసి పారేయండి. ఈ పుస్తకం అక్కడ పెట్టండి. నేను పై వారం వస్తున్నాను. నమస్కారాలతో లలిత.
సీతకి ఏమీ అర్ధం కాలేదు. ఆ పుస్తకం ఏమిటీ? ఈ పుస్తకం ఏమిటీ? సీత పుస్తకాల షెల్ఫ్‌లోనించి ఆ పుస్తకం తీసింది. అవాక్కయిపోయింది. ఎన్ని కాగితాలు బ్లేడుతో తెగిపోయాయో. లలితా? నువ్వంటావు చూడు. ''ఏలనా హృదయంబు ప్రేమించునిన్ను'' ఇందుకే ఇందుకే. నా ప్రాణానికి ప్రాణం పుస్తకం. నీలాంటి మంచి విద్యార్థి ఎందరికో మార్గదర్శకమయితే నా జన్మధన్యమయినట్టే లలితా! 
 
 
 
- డా|| ముక్తేవి భారతి
 
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో