Facebook Twitter
బుచ్చమ్మనీతి శ్రమైక జీవనం

 

బుచ్చమ్మనీతి శ్రమైక జీవనం

 



విశ్వనాథరావుకి అరవై అయిదేళ్ల వయస్సు. ఈ వయస్సుకే ఆయన డీలా పడిపోయాడు. కర్ర చేతికొచ్చింది. ఇంటిముందు ఆడంబరానికి వాడుకున్న గుఱ్ఱ, దానితోపాటు బండి అమ్మేశాడు. ఆ వచ్చిన మూడువేల రూపాయలలో నూటయాభైమాత్రం వేరే మనీపర్స్‌లో దాచాడు. ఇంటిముందుకు వచ్చిన వేశ్య వరలక్ష్మిని చూచాడు. ఆమె వయస్సు ఉడిగిపోయింది. యవ్వనంలో ఉన్న శరీర వంపుసొపు కనపట్టం లేదు. విశాలమైన కళ్లు కుంచించుకుపోయాయి. నడుం కొంచెం వంగింది. వక్షోజాలు చాతికి అంటుకుపో యాయి. విశ్వనాథరావు ఆమెను రమ్మని కబురు పెట్టాడు. అంతకురెండు సంవత్సరాల మునుపు తానే గుర్రం బగ్గీలో ఆమె బంగళాకు వెళ్లి ఆమెను చూచి తన ప్రక్కన కూచోబెట్టుకుని, బుగ్గలు పుణికి, ముట్టుకొని వచ్చేవాడు. వరలక్ష్మి ఆయన సొమ్ము, ఆస్తి వాడుకున్నది. అందుకని ఆయన్ను ఈ సడించుకొనేది కాదు. నవ్వి ''మనద్దరి వయస్సు ఉడిగింది. చేతులతో తుడుముకోటంతో తృప్తిపడదాంలే'' అనేది...
ఇవ్వాళ చివరిసారి ఆమెను చూడాలని ముచ్చటపడ్డాడు విశ్వనాథరావు. ఆమె వచ్చింది. విశ్వనాథరావు భార్య శాంతమ్మ. ఆ వచ్చిన వేశ్యకాంతను చూచింది. వెంటనే ''రావమ్మా వరలక్ష్మి, నీకోసం మొగం వాచిపోయారు మావారు. అలా లోపలికెళ్ళు. ఆయన ముచ్చట ఎలా తీరుస్తావో నేనేమి అనుకోనులే!'' అని వంట గదిలోకి వెళ్ళింది శాంతమ్మ. శాంతమ్మ పేరుకు తగ్గట్లు శాంతం గలదే. పెళ్లినాడు తనకు పెట్టిన అత్తింటి నగలు పుట్టింటి నగలు ఎన్నుండేయో. తాను కాపురానికొచ్చేటప్పటికే విశ్వనాథరావు వరలక్ష్మి వలలో పడిపోయాడు. కాపురానికొచ్చిన మొదటి అయిదేళ్లలో ఒక్కో నగ తననుంచి దూరమైపోయింది. ఇరుగుపొరుగు ఎల్లమ్మ పుల్లమ్మలు విశ్వనాథరావు శృంగార చేష్టలుచెపుతుంటే ఆమె నోరు తెరిచి చెవులప్పగించి వేచి మగణ్ణి అడిగే, నిలేసే ధైర్యం ఆమెలో లేదు. గ్రామాల్లో వీధిబడులు, అక్కడక్కడ జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉండేవి. ఆడపిల్లలకు చదువెందుకు ఊళ్లేలతారా? ఉద్యోగాలకు పనికొస్తారా అనే రోజులు. పురుషాధిక్య సమాజం. ఆస్తి హక్కులు, గ్రామపెద్దరికాలు డబ్బు దస్కం పొలంపుట్ర ఉన్నవాళ్లు వెలిగించేవారు. మూఢవిశ్వాసాలు అందునా ఆడవాళ్లల్లో అధికంగా ఉండేవి. మగవాళ్లనెదిరించి మాట్లాడటం తప్పు అనే భావం బలంగా ఉంది. పతియే దైవం. ఆయన ఏమిచేసినా మిన్నకుండ ఉండి, గుట్టుగా సంసారం గడపటం ఆడవాళ్లకు బ్రహ్మగీసిన గీతని భావించే వాళ్లు ఆకాలంలో.
ఇక శాంతమ్మ మడిస్నానాలు, వ్రతాలు, ఉపవాసాలు, దేవాలయాలచుట్టూ ప్రదక్షిణలు చేయటం తల్లి తండ్రి నుండి నేర్చుకొన్న ఆనవాయితీలు. ఇంట్లోకి వరలక్ష్మిని 'నీకోసం మావారు మొగం వాచిపోయారు' అన్నదంటే ఆమె పతిభక్తి ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆమాటతో వరలక్ష్మిని పిలిచి తాను వంటింట్లోకి వెళ్లేటప్పుడు పనిమనిషి బుచ్చమ్మ 'అమ్మగారూ! ఒక మాట చెపుతా, కోప్పడరుగదా?'' అంది నీమీద నాక్కోపం ఏంటే? ఏంటో చెప్పు' అన్నది శాంతమ్మ.
ఏమి లేదమ్మా మీ ఇల్లు పిప్పి చేసిన ఆడోళ్లు ఇంటికొస్తే లోపలకు పో, నీకోసం మొగం వాచి ఉన్నారు మావారు అని అన్నారే. మీరక్తంలో రోసం, నరాల్లో ఉక్రోసం లేదా అమ్మగారూ.
''కోపం, ఉక్రోసాలున్న ఆడవాళ్లు ఏమి చేయగలుగుతారు? ఎదిరించటంవల్ల నిత్యం ఇల్లు రావణకాష్టంలా తయారవటం తప్ప ఫలితమేముంటుంది.'' అని గోడకు తగిలించి ఉన్న శేషపాన్పుపై పరుండి ఉన్న విష్ణుమూర్తి పాదాలను వత్తుతున్న శ్రీమహాలక్ష్మి ఫోటోను చూపించింది శాంతమ్మ''. ఆమెలాంటి వాళ్లే అలా పతిపాదాలను వత్తుతూ ఉంటే కలియుగంలోని ఆడవాళ్లం మనంమగడితో పోట్లాడగలమా! ఎవరినొసట ఎలా బ్రహ్మరాస్తే అలాజరుగక మానుద్దా అన్నది.
''ఏం మాట్లాడుతున్నారు అమ్మగారూ. వంద ఎకరాల పైచిలుకు పంటపొలాలు మీరు కాపురానికి వచ్చేప్పటికి ఉండె, మామూలుగా నూటయాభైఎకరాలుండేదట మీకుటుంబానికి. మీ మామయ్యగారికి మీవారిలాగ ఆడవాళ్ల పిచ్చి ఉండేది కాదట. కాని ఆయన ముగ్గురు కూతుళ్లకి రంగరంగ వైభోగంగా అయిదేసి రోజులు పెళ్లిళ్లు చేశారని మాతాతయ్య చెపుతుంటే విన్నాను. ఇటు చుట్టాలు అటు చుట్టాలు  ఏభై అరవై బళ్లు కట్టుకొని వచ్చేశారంట. బళ్లకు ఎద్దులు వాటికి మెళ్లల్లో గంటల పట్టెళ్లు ఎండతగలకుండా బళ్లమీద గూనెలుతో వచ్చేసి ఆయెద్దుల మేతకు ఇరవైబారల పొడుగున్న చొప్పవాములు రెండు, ఎడ్లమేతకే ఖర్చయిపోయేదంట. వందలమంది ఊరి జనాలు. ఎడ్లబళ్లు తోలుకువచ్చిన వాళ్లకు వీధి పొడవున తాటాకు పందిళ్లు వేసి భోజనాలు పెట్టేరంట. ఇక చుట్టాలకు అ అయిదు దినాలు భోజనాలు, బస్తీలనుంచి తెప్పించిన మడతమంచాలు కొట్టాలలో వేసి, విసనకర్రలు ఇస్తే చుట్టాలు తిని బ్రేవ్‌ బ్రేవ్‌మంటూ విసనకర్రలతో విసురుకుంటూ నిద్రపోయేవారంట. అట్లా పెళ్ళిళ్లు అందరూ ఆడిపిల్లలకు జరిపితే నలభైయాభై ఎకరాల భూమి అప్పుకింద సాహుకార్లకు దాఖలు చేశారు. కాని మన విశ్వనాధంగారు ఏం పెళ్లిళ్లు ఎలగబెట్టారు అమ్మగారు. ఒక్కగానొక్క కొడుకు మీకున్నది. ఆయన్నేమన్నా ఇంగలీసు బళ్లకు పంపి చదివించారా? బేనారసు పంపించి ఏదో సంస్కృతం చదువులకు పంపారు. కాని ఖర్చు కొడుక్కుఖర్చుపెట్టాడా? వడుగు అని ఎప్పుడో జరిపించారు. అదీ అచ్చట ముచ్చట లేకుండా. ఇక ఉన్న పొలం అంతా సానులకోసమే అమ్మి ఆగం చేశారుగా అమ్మా. మీరుగాబట్టి ఊరుకున్నారు. మేం అయితే ఊరుకునే వాళ్లమా'' అన్నది బుచ్చమ్మ. శాంతమ్మ అవాక్కయిపోయింది. పనిమనిషి ఎంత తెగువగా చెప్పింది. అని ఆశ్చర్యపోయింది. మళ్లీ బుచ్చెమ్మ ఏదో చెప్పబోయింది. అంతకుముందే శాంతమ్మ అందుకుంది. ''మీ ఇళ్లల్లో అయితే మగాళ్లు ఇలా ప్రవర్తిసే ఏంచేస్తారే?'' అని అడిగింది.
''ఇనండి అమ్మగారు. నాకు ఇది రెండోపెళ్లి. మొదటి పెళ్ళికొడుకు నావయస్సులో నా అందంచందంచూచి పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. తిరణాలకు మా అక్కోళ్లమ్మటిపోతిని. అతను పసిగట్టాడేమో తిరణాలకు వచ్చాడు. నన్ను చూశాడు. ప్రేమ మాటలు చెప్పటంతో నాకు భయమేసింది. మా అక్కను కేకేసి  పిలిచా. అక్క వచ్చింది. నా చెల్లితో సరసాలాడతావా? చెప్పుతిరగేస్తానంది.''    ''కాదు నేను నిజంగా పెళ్లిచేసుకుంటాను. మీ అమ్మ అయ్యతో వచ్చి మాట్లాడుతాను. ముందు మీ చెల్లిని అడిగిచూద్దామని మాట్లాడాను'' అన్నాడు.    మా అక్క శాంతించింది. నీకేమాస్తి వుంది. మీ ఊరేంది అని వివరాలు అడిగింది.
మాది ఫలనా ఊరు. నాలుగు ఎకరాల చలక నాభాగంలోకొచ్చింది. మా అయ్య చనిపోయాడు. నేనే సంబంధాలు వెతుక్కుంటున్నాను. బర్రెల బేరానికి మీ అమ్మగారింటికొచ్చాను. అప్పుడుమీ చెల్లలిని చూశా. చెల్లెలు ఊ అంటే మీయింటి కొచ్చి మాట్లాడతా పెళ్లివిషయం'' అన్నాడు.
''నాలుగెకరాల పొలం ఉంటే ఈపెళ్లి బాగానే ఉంటుంది అనుకుంది అక్క. ఇంకేముంది, తర్వాత మాట్లాడుకోటం పెళ్లి జరిగిపోయింది. యేడాదికి ఒక కొడుకు పుట్టాడు'' అన్నది బుచ్చెమ్మ.   
''అయితే మళ్లీ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు?'' అని అడిగింది శాంతమ్మ.
''ఇనండమ్మా, వాడికి గత్తరపడ. నామీద మోజు ఒక సంవత్సరంలోనే తీరిపోయిందట వాడికి. బజారు ఆడోళ్ళతో తిరగటం మరిగిండు. నాలుగు ఎకరాల్లో వచ్చే పంట ఖర్చుపెట్టాడు. ఇంతేగాకుండా ఒకరోజు రాత్రి తాగి ఒక గుంటని ఇంట్లోకి తెచ్చాడు. పిల్లగాడిని నన్ను ఇంటిముందుకు పంపించి దానితో ఇంట్లోకి పొయ్యి తలుపేసుకునే. నాకు కోపం నసాళానికంటింది. తలపుకొట్టి ఎవత్తివే నీవు నాచవితివా? ఇంట్లోకి జొరబడ్డావు అని తిట్టటం మొదలెట్టా. నామొగుడు బయటికొచ్చి నాజుట్టు పట్టి ఈడ్చిండు. ఇష్టమొచ్చినట్లు కొట్టిండు. మళ్లీ తలుపేసుకొని లోపలుండిపాయె. నేను పిల్లగాడిని చంకనేసుకొని కులపోళ్లకు చెప్పి మొత్తుకుంటిని. వాళ్లంతా ఇంటిముందు పోగైరి. తలుపు తెరిచి బయటికొచ్చిండు నా మొగుడు. వాడు నామీద నేరాలు మోపిండు. నేను మాఊరు వెళ్లి మాచుట్టాలతో పంచాయితీ పెట్టిస్తిని. వాడితో కాపురం చచ్చినా చేయనన్నా, వాడు తాగుబోతై ఊళ్లో తిరుగుతుంటే నాకీ సంసారం వద్దు. ఈ మొగుడు వద్దు. నాకొడుక్కు పొలంలో భాగం ఇప్పించండి నా తోవన నేను బతుకుతానన్నా. వాడితో విడాకులు రాయించుకొన్నా. రెండెకరాల పొలం నాకొడుక్కు వచ్చేట్టు పంచాయితీ తీర్పు దస్తావేజులు రిజస్టర్‌ చేయించుకున్నా'' అమ్మగారూ అన్నది బుచ్చమ్మ.
''అమ్మో అంత సాహసం చూపించావా? మరి మళ్లీ పెళ్లి చేసుకోవటం ఎందుకంటా? మొదట మొగుడుతో విసిగి పోతివిగదా! మళ్లీ పెళ్లి కోరిక వచ్చిందా?'' అన్నది శాంతమ్మ.
''అమ్మ గారూ! నేను ఒక విషయం చెపుతా. మీ అంత పెద్దోళ్ల కులంకాదు మాది. కష్టపడి పనిచేసుకునే వాళ్లం. నాకొడుకు పుట్టి వాడయ్యతో తెగతెంపు చేసుకొన్నప్పుడు నాకు పద్దెనిమిదేళ్లు. బయట ఏపనికెళ్లినా మొగాళ్ల దొంగ చూపులు నేను అర్థం చేసుకున్నా. ఆడదానికి మగతోడు, మగాడికి ఆడతోడు ఉంటేనే భద్రతగదమ్మా. అందుకని నాకు నచ్చినవాడిని. నా మొదటి మగడితో పుట్టిన నా కొడుకును, బాగా చూచుకొంటానికి ఒప్పుకొన్న వాడిని రెండో మనువాడినాను. ఈమగడితో ఒక ఆడబిడ్డ పుట్టింది. నామొగుడు ఇద్దరినీ మంచిగా చూసుకొంటున్నాడు. ఇప్పుడు నాకొడుక్కు పదిహేనేళ్ళు. బిడ్డపన్నేండేళ్లది'' అన్నది బుచ్చమ్మ.
చిన్నకులాల ఇళ్లల్లో ఆడవాళ్లకున్న స్వతంత్రం మాపెద్దకులపు ఆడోళ్లకు ఎక్కడిది? పూజలు, భక్తి, ఉపవాసాలు. రామకోటి రాసుకోటం తప్ప మగవాళ్లను ప్రశ్నించే తెగువ లేనేలేదు.'' అన్నది శాంతమ్మ నిట్టూర్పు వదులుతూ.
చిన్నకులపు వాళ్లమని మమ్మల్ని చిన్నచూపు చూస్తారు. పెద్దోళ్లకు మేము శ్రమించి పనులు చేయకుంటే ఒక్క పూటగూడ మాకు గడవదమ్మా! పొలాల్లో పంటపండించి ధాన్యం రాసులుజేసేది మాపేదవాళ్లేనమ్మా.  మా అమ్మ నాట్లు వేసేది. ఊడ్పులు కోతలుకోసేది. మా అయ్య అరకదున్నేవాడు. ఆసాముల ఇళ్ళల్లో పాలేరుగా ఉండి నామొగుడు ఇళ్లుకట్టే తాపీపని చేస్తడు. ఈ విధంగా మేము కష్టపడి పనిచేస్తే  మీపెద్దోరు వైభోగాలు అనుభవిస్తున్నారు. యసనాలకు పాల్పడి ఇల్లు, వళ్లు గుల్ల చేసుకుంటున్నారు'' అని ఇంటికి ''వెళ్లతానమ్మా'' అని చెప్పి బుచ్చమ్మ వెళ్లిపోయింది.
 þ þ þ þ þ
విశ్వనాథరావు వరలక్ష్మి పాత రాసక్రీడలను గుర్తు చేసుకుంటున్నారు. ఇరువురి మనస్సులు ఆనాటి పడక దృశ్యాలతో ముసిముసినవ్వులతో ఒకరినొకరు పొగడుకుంటున్నారు. వరలక్ష్మి చివరికి విశ్వనాథరావును ప్రశ్నించింది. ''మీరు కాశీయాత్రకు వెళదామనుకుంటున్నట్లు వినికిడిగా తెలిసింది. నిజమా?'' అన్నది.
''అవును వరం, చివరి దినాలు అక్కడ కాశీవిశ్వనాధుని పుణ్యప్రదేశంలో గంగాభవానిలో కలిసిపోదామని ఉంది'' అన్నాడు విశ్వనాథరావు.
వరలక్ష్మి ''చేసిన పాపాపలు, పరస్త్రీ సంగమాలు, ఇల్లు వాకిలి పట్టకుండా అడ్డమైన తిరుగుళ్ల వల్ల వచ్చిన పాపం గంగలో మునిగితే పోతాయండీ? గంగమ్మ తల్లికి, ఈ పాప పంకిలం మోసేట్లు చేయటం ఉచితమా!'' అన్నది.
''ఓసి నీవెంత జాణాతనంగ మాట్లాడినావే! నీ అందం చూచేగదే నేనుకట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేసి అప్పులు చేసి సొమ్ము సొట్రా చేయించాను. ఈపాపం నీకు మాత్రం ఉండదా?'' అన్నాడు విశ్వనాథరావు. 
''ఎందుకుండదు ఉంటుంది. నీబోటి రసికుల సాంగత్యంతో శరీరం అమ్ముకున్న ఫలితం ఇప్పుడు అంటు రోగాలతో అనుభవిస్తున్నాను. చేసిన తప్పుకు దేవుడు వేసిన శిక్ష. మీకులాగ గంగలో దూకితే నాపాపాలు పోతాయా? మీ పిచ్చిగాని నాకు ఆ నమ్మకం లేదు'' అన్నది.
ఈ అంటురోగాలతో కుమిలిపోవటమే 'నిజమైన శిక్ష' అన్నది వరలక్ష్మి. చేతిలో ఏదో సంచీతో విశ్వనాథరావు గది నుంచి బయటికి వచ్చింది. శాంతమ్మను చూచి చిరునవ్వు నవ్వింది. వరలక్ష్మి ఆమెను ఇలా  పలకరించింది. ''మీవారు కాశీకి వెళ్లి తన కాయం విశ్వనాధుని సన్నిధిలో గడిపి స్వర్గం పొందాలనుకుంటున్నారు. మీకు చెప్పారా?'' అయ్యో నాకు చెప్పి ప్రతి పనీచేస్తారటమ్మా! మగవాళ్ల చిత్తం ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆచరిస్తారు అన్నది శాంతమ్మ.
'అవును కొడుకు పెళ్లి చేసి కాశీకి పోతే బాగుంటుందేమో!'' అన్నది వరలక్ష్మి.
''అది ఆయనగారికి ఉండాలి నేను చెపితే వింటారటమ్మా' అన్నది శాంతమ్మ.
అవునండి, పతివ్రతలైన స్త్రీలు పతికి ఎదురురాకూడదు కదా! అందుకే మీరు మౌనంగా ఉండిపోయారనుకుంటాను. సరే ఏదో గతించిన దానికి చింతించిన లాభం లేదు. మీవారు గత ఇరవై సంవత్సరాల నుంచి సానివాళ్ల సహవాసంలో మునిగి తేలారు. నాతోను మంచి పరిచయం నెరిపారు. పొలం పుట్రా అమ్ముకొన్నారు జల్సాలకు ఖర్చుచేశారు. ఎందరాడవాళ్లతో సంబంధాలున్నా నామీద ఎక్కువగానే మక్కువతో ఉండేవారు. నేనుకోరకుండానే డబ్బు తలగడ క్రింద పెట్టేవారు. మీ పుట్టింటి సొమ్ములు, అత్తింటి సొమ్ములు గత పదేళ్లల్లో నా చేతికే ఇచ్చేవారు. ఇవి తన భార్యనడిగే తెచ్చేవాడినని చెప్పేవారు. ఇది ఎంత నిజమో తెలియదు. మీ సొమ్ములు శుక్రవారం పూట ధరించేదాన్ని. అప్పుడు మీరు నాస్మృతిపథంలో మెలిగేవారు. ఇప్పటికి మీ ఆస్తులు హరించుకుపోయినాయి. లంకంత మీ ఇల్లు తాకట్టులో ఉన్నట్లు విన్నాను. మీకు ఒకే అబ్బాయి. పెళ్లి కూడచేయలేకపోయారు. నేను సానిఇంటిలో పుట్టినా నాకూ హృదయమున్నది. భర్తను ఎదిరించలేని మీ స్థితి నాకు బాధ కలిగించింది. మీసొమ్ములు అన్నింటిని జాగ్రత్తపరిచాను. డబ్బు ఖర్చుఅయింది. సాని ఇల్లు అంటే అలంకరణలు, చీరెలు రవికెలు తళుకు బెళుకులు పందిరి మంచాలు, వగైరా ఎంతో ఖర్చుతో కూడి ఉంటుంది. అందువలన డబ్బు దుబారా ఎక్కువే. ఇక ఈ సొమ్ములు మీ విశాల హృదయం, ఎన్ని సొమ్ములు పోయినా భర్తకెదురుతిరగరాదనే మీ నడవడికి విచారం, జాలి కలిగింది.
ఈ సొమ్ములు మీవి. మీకు ముట్టచెపుతున్నాను. కొంత పైకం గూడ ఉంది. బ్యాంకులాకర్‌లో దాచిపెట్టినట్టు భావించండి. నేను ఇస్తున్నా మీరు పుచ్చుకుంటున్నట్లు భావించకండి. అడుగో మీ అబ్బాయి వస్తున్నాడు. మీ కడుపున పుట్టినా నేనూ నా కొడుకుగా భావిస్తున్నా, తీసుకోండి అని'' రిక్షాలో వెళ్లిపోయింది వరలక్ష్మి. విశ్వనాధరావు పాపపరిహారార్థం భార్యతో చెప్పకుండా కాశీకి ప్రయాణమై వెళ్లాడు. వరలక్ష్మి భర్త ఒక్కమాటకూడా తనకు చెప్పకుండా కాశీ వెళ్లినందుకు దుఃఖించింది. కొడుకును పిలిచింది.
''బాబూ, వరలక్ష్మి సానిదైనా ఎంతో మంచి మనస్సు కలిగింది. మీనాన్న నా మెడలో సొమ్ములు ఒక్కొక్కటి ఆమెకు ఇచ్చివేసినా ఆమె వాటిని నీపెళ్లికోసం ఉపయోగించమని చెప్పి ఇచ్చి వెళ్లింది. నీవు నాకడుపున పుట్టినా, వరలక్ష్మి నీకు తల్లిలాంటిది. ఈ డబ్బు, సొమ్ము జాగ్రత్త పరుచుకో అన్నది.
''అమ్మా! నాన్న నీకు నాకు చెప్పకుండానే కాశీ వెళ్ళారా?'' అని కొడుకు కామేశం కళ్లనీళ్ళుపెట్టికోవటం చూచింది తల్లి. ఆమె కొడుకుతో ''బాధపడకు. గొప్ప ఇంటిలో పుట్టటం, ధనగర్వంతో జీవితం గడపటం, చెడు వ్యసనాలకు అలవాటుపడటం, కులాధిపత్యంతో విర్రవీగటం నేటి సమాజానికి మంచిదికాదు. కాయకష్టంతో శ్రమించటంలోఉన్న ఆనందం మన పనిమనిషి నాకు బోధించింది'' అని బుచ్చెమ్మ చెప్పిన విషయాలు కొడుక్కు పొల్లుపోకుండా చెప్పింది. ఆమెతో మాట్లాడి ఏకులమైనా తగిన పిల్లను పెళ్లిచేసుకో నాన్నా. ఇక ఈఇల్లు వేలానికి రానుంది. నేను మీనాన్నతో ఏభైఏళ్లు గడిపి ఇప్పుడు ఒంటరిగా ఉండలేను. నాకూ కాశీకి రైలు టిక్కెట్టుకొని మనసారా పంపించు'' అన్నది. కొడుకు తల్లిమాట శిరసావహించాడు.

 

- రామిశెట్టి రోశయ్య
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో