Facebook Twitter
అనిత పార్ట్ - 5


               

  - డా|| సి|| ఆనందారామం


 పార్ట్ - 5

 

"అవునత్తయ్యా!ఇంకా నాకు పెళ్ళి కాలేదు."

    తల గిర్రున తిరగసాగింది రాజారావుకు. సుశీల వణికే క్రింది పెదవిని మునిపంటితో నొక్కి పట్టుకుంది.

    "మరి....మరి....కూతురెలా పుట్టిందీ?" అయోమయంగా అడిగింది శారదమ్మ.

    పకపక నవ్వింది అనిత.

    "ఇంత వయసొచ్చి పిల్లలెలా పుట్టారని అడుగుతున్నానా అత్తయ్యా!"

    ఆ వయసులో శారదమ్మ సిగ్గుతో చితికిపోయింది. పెళ్ళి కాకుండా తల్లి కావటమే కాక తన సంతానాన్ని చేత్తో పట్టుకుని  నిర్లక్ష్యంగా నవ్వుతోన్న ఆ సుందరమూర్తిని పిచ్చి పట్టిన వాడిలా చూశాడు రాజారావు.

    "ఆ పాపకి తండ్రి ఎవరు?"

    అతని కంఠంలో పలికింది క్రోధమో, అమాయో, అసహ్యమో సరిగా అర్థంకాలేదు.

    "అది చెప్పగలిగేస్థితిలో నేనుంటే నా కింత ప్రయాసదేనికి? సమయం సందర్భం కుదరగానే మీ కందరికీ అన్నీ చెపుతాను, అంత వరకూ నన్నేమీ అడగకండి..."

    "మీరీ ఇంట్లో వుండటానికి వీల్లేదు___"

    లోపలకు వెళ్ళబోతున్న అనిత రాజారావు కటు స్వరం విని ఆగిపోయింది.

    పెంకిగా కవ్విస్తున్నట్లు రాజారావును చూస్తూ "మీ బంధువులను ఆదరించగలిగే సంస్కారం మీకుందన్నారుకదూ ఇప్పుడే. క్షణాని కొక మాటా మీకు?"

    రాజారావు తడబడ్డాడు.

    "కానీ. కానీ...మీరు..."

    "ఊ! నేను?"

    నడుం మీద చేతులాన్చి విలాసంగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చూస్తోన్న ఆ మధురమూర్తిని క్షణకాలం మైమరచి చూస్తూ నిలబడి పోయాడు రాజారావు.

    పకపక నవ్వింది అనిత.

    రాజారావు వులికిపడి లజ్జ పడ్డాడు.

    "మీ పాపకు ఇక్కడ సరిగా జరగదు."

    "రాణికి అయావుంది. ఇంకాసేపట్లో వస్తుంది. ఇక్కడ దాని బంధువు లున్నారట! అక్కడ దిగింది. రోజూ ప్రొద్దున్నే వచ్చి నాయంకాలంవరకూ చూసి నిద్రపుచ్చి వెళ్ళిపోతుంది."

    "మీ కారు కిక్కడ షెడ్ లేదు."

    "ఆ ఏర్పాటుకూడా చూసుకున్నాను. నా కారు కేశవరావుగారింట్లో ఉంటుంది. డ్రైవరూ అక్కడే వుంటాడు."

    కేశవరావంటే, రమణరావు తండ్రి...."

    "అవును........."

    "ఆయన మీకు తెలుసా?"

    "ఇంతకు ముందు తెలియదు. ఈ ఊరు రావాలని నిర్ణయించుకున్నాక తెలుసుకున్నాను."

    అనితను చూస్తున్న కొద్దీ  విభ్రమం కలుగసాగింది రాజారావుకి.

    "ఆఖరు ఆటంకం కూడా చెప్పండి. నేను ఉండటంవల్ల మీకు ఇబ్బంది....దానికి నా సమాధానం...నా ఖర్చు నేనే  భరించుకుంటాను."

    ఈ మాటలు రాజారావు ఆహాన్ని గుచ్చాయి. "ఆఖర్లేదు మీ అంత ఐశ్వర్యవంతులం కాకపోయినా తిండికి లేనివాళ్ళం కాము."

    "అయితే నేను వుండటానికి అభ్యంతరం ఏం లేనట్లేగా:"

    "ఉంది అప్రతిష్ఠ.........."

    "నా వల్ల మీకేం అప్రతిష్ఠ? నేను మీ భార్యను కామగా..." విస్తుపోయి చూస్తోన్న రాజారావును దాటుకుంటూ చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది అనిత................