Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 8


వలచి వచ్చిన వనిత

-వసుంధర

 

పార్ట్ - 8

    "నేనునమ్మను సుజాత నాకు బాగా తెలుసు__"అన్నాడా యువకుడు.

    "ఇంతకూ మీకు మీరంటున్న సుజాతాకు సంబంధమేమిటి?" అన్నానుచిరాగ్గా.

    "అది మీకానవసరం__" అన్నాడతను తడబడుతూ.

    "కానీ నాకు అవసరం. ఉమ  నా భార్య అన్నసంగతి మీకు వేరే చెప్పనవసరంలేదనుకుంటాను-"

    హల్లో దీపాలారిపోయాయి. నేను ఉమను చేతిమీద నెమ్మదిగా గిల్లి__"అతను తెలుసుకదూ?" అనడిగాను.

    "ఊఁ" అన్నదామె.

    సినిమానుంచి ఇంటికి వెళ్ళేవరకూ నేను మరి ఆ యువకుని ప్రసక్తి తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళేక భోజనంచేసి పడుకునేటప్పుడు ఆమెను అడిగాను__"నీవు చాలా మందితో గడిపిన కారణంగా ఎంతో మందికి ఎన్నోపేర్లతో పరిచయమై ఉంటావు. అందులో నాకేమీ ఆశ్చర్యంలేదు. అయితే నీ వృత్తి తెలుసుండీ ఆ యువకుడు నిన్ను సినిమాలో అలా పేరు పెట్టి పలకరించడానికి కారణం నాకు అర్ధంకాలేదు__"అన్నాను.

    ఆమె తమాషాగా నవ్వి_"నన్ను మీరు  ఉమ అని పిలుస్తారు. కానీ తరవాత ఎప్పుడైనా ఎక్కడైనా  ఒక మగవాడి పక్కన తటస్ధపడితే మీరు నన్ను ఉమ  అని పిలిచి పలకరించరు. అప్పుడు నాపేరు రమ అనివిన్నా  ఆశ్చర్యపడరు. కారణం__ మీకు నావృత్తి తెలుసు__" అని ఊరుకుంది.

    అంటే ఆ యువకుడికి ఈమె వృత్తి తెలియదన్నమాట! అటువంటప్పుడు ఏ పరిస్ధితుల్లో వీరి పరిచయం సంభవించిందీ అన్న కుతుహలం నాకు కలిగింది. అందుకే ఆమెను మళ్ళీ  ప్రశ్నించకుండా ఉండలేకపోయాను. జవాబుగా ఆమె__"ఇప్పుడు ఇక్కడ నేను రహశ్యంగా మరో యువకుడితో పరిచయం పెట్టుకోవడం జరిగితే అతను నన్ను మీభార్యగా భావిస్తూంటాడు. ఆ యువకుడి విషయంలోనూ అంతే జరిగింది. నాపక్కన భర్తస్ధానంలో మిమ్ముల్ని చూడటం అతనికి ఆశ్చర్యంకలిగించడం సహజమేనని మీకు ఇప్పుడు అర్ధమయి ఉంటుందనుకుంటాను."

    ఉలిక్కిపడ్డాను. నా బుర్రలో ఏదో తళుక్కుమన్నట్లయింది. శారదగా వ్యవహరించబడే ఒక అమ్మాయిని నేనూ పార్వతి అనిపిలిచేను. అప్పటి నా స్దితిలోనే ఇప్పటి ఈ యువకుడు ఉండి ఉండాలి.

    "బహుశా నన్ను వేధిస్తున్న ఒక ప్రశ్నను సమాధానం  దగ్గర లభించగలదనుకుంటాను. శ్రీధర బాబు అని నాకో మిత్రుడున్నాడు అతని చెల్లెలు పార్వతి అన్నను  చూడటానికి  వచ్చిన   తరుణంలో అక్కడ  నేనుండడమూ, అతను లేకపోవడమూ జరిగాయి. ఆమెతో నాకు పదహారురోజుల పరిచయముంది. ఆ తర్వాత ఆమెను మా ఊళ్ళో శంకర్రావు అనబడే ఒకతని భార్యగా చూసాను. పాతపరిచయాన్ని పురస్కరించుకుని ఆమెను  శారీరకంగా లోంగదీసుకోగలిగినా తను పార్వతి అని ఒప్పించలేకపోయాను. అదినాకు మిస్టరీగా  మిగిలింది. శ్రీధరబాబు చెల్లెలు అనుమాన పరిస్ధితుల్లో ఇంట్లోంచిమాయమైనట్లు నాకు తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఎలా  ఏర్పాటు చేస్తున్నారు? ఏదైనా పెద్దముఠా, అందమైన ఆడపిల్లల్ని అపహరించి బలవంతగా వ్యభిచారంలోకి దింపుతోందా?" అనడిగాను.

    ఈ పర్యాయం ఆమె బాదగా నవ్వి__"అందమైన ఆడపిల్ల కోసం వేలకొద్ది రూపాయలు కుమ్మరించగల యువకులూ జీవిత భాగస్వామిగా రాబోయే భార్య అంతులేని ధనరాసులు కూడా  తీసుకురావాలనుకునే ఆశపోతులూ, దేశంలో అంతులేని పేదరికమూ__ఉన్నంతకాలమూ ఏ ముఠాలూ అవసరం లేకుండానే మాబోటిగాళ్ళం మాకుమేమై ఈ వృత్తిలో దిగవలసి ఉంటూనే ఉంటుంది.__"అంది.

    అంతకుమించి ఆమెనుంచి  నాకు ఏ సమాధానమూ లభించలేదు. కులాసాగా గడపవలసిన సమయాన్ని వృధా చర్చలతో వెళ్ళబుచ్చడం ఇష్టంలేక నేను మరి ఆమెను గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.

     
    ఆరోజు నాకు సరిగ్గా ఏడు వుత్తరాలు వచ్చాయి. ఒకటి మామగారి దగ్గరనుంచీ, ఒకటి నాన్నగారి దగ్గరనుంచీ, రెండు ఓమాదిరీ పరిచయమున్న స్నేహితుల దగ్గరనుంచీ, ఒకటి చందా గడువు తేదీ పూర్తవున్నట్లు ఒక పత్రికనుంచి గుర్తువేస్తూ వచ్చినదీ__మిగిలిన రెండు శుభలేఖలు.

    ముందు ఉత్తరాలు చదవడం అయ్యేక శుభలేఖలు తీశాను. ఒకటి గతసంవత్సరందాకా  ఇక్కడ నాకు కొలీగ్ గా  వుండి ట్రాన్స్ ఫర్ మీద మరో నగరం  వెళ్ళిపోయిన  ప్రకాశరావుది. పెళ్ళికి సరీగ్గా పదమూడు రోజుల వ్యవధి ఉంది. వధువు పేరు పార్వతి. ఊరు పేరు చదువుతూంటే తెలిసినట్లుగా అనీపించింది. కానీ  చటుక్కున గుర్తురాలేదు.

    రెండవ శుభలేఖ ఫ్రం అడ్రస్ చూడగానే ఆ ఊరు నాకెలా తెలుసో స్పురించింది. ఆ శుభలేఖ శ్రీధర బాబు దగ్గర నుండి వచ్చింది. శుభలేఖలోని వధువు అతని చెల్లెలు పార్వతి వరుడు ప్రకాశరావు!

    ప్రకాశరావు నాకు చెప్పుకోతగ్గ స్నేహితుడు పార్వతి వధువుగా కళ్యాణ మంటపం ఎక్కబోతోందన్న వార్త నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించందో_ఆమె పెళ్ళాడ బోయేది ప్రకాశారావుని అన్నవిషయం అంత బాధను కలిగించింది. ప్రకాశరావు ఆడవాళ్ళ శీలానికి చాలా ప్రాముఖ్యతనిస్తాడు. అతను కూడా ఎంతో బుద్ది మంతుడు. అలాంటివాడికి పార్వతిలాంటి దుశ్శీల. నెరజాణ__భార్యగారావడం నిజ్మగా దురదృష్టం. ఇందులో నేను చేయగలిగినదేమీ లేదా అని తర్జన  భర్జన చేసుకున్నాక__ఏమీ  లేడనే అనిపించింది. అయినా  మనసు పికుతూనే ఉంది.

    మొట్ట మొదటీసారిగా శ్రీధరబాబు ఊరికి వెళ్ళాను. నన్నుచూసి శ్రీధర బాబు చాలా  సంతోషం వెలిబుచ్చాడు. కానీ నా మనసు అదోలాగుంది వేళాకొళానికే కావచ్చు. అతన్నోక్కసారి  బావా అని పిలిచినందుకు తాత్కాలికంగానైతేనేం అతని  చెల్లెలు నా సొంతమయింది. ఈ భయంకర కఠొర సాతుం  సహాయంతో శ్రీధర బాబు  చెల్లెలి వివాహం చెడగొట్టగలను. ఆ విధంగా నన్ను స్నేహితుడిగా నమ్మిన ప్రకాశరావుకు ద్రోహం  చేశాననే వ్యధ నన్ను బాధించకుండా చేసుకోగలను.

    కానీ తన చెల్లెల్ని పొరబాటునైనా ఎవరైనా చిన్న ముక్క అవడం సహించలేని శ్రీధర బాబును ప్రళయకాళరుద్రునిగామార్చే అవకాశం కూడా  ఉన్నదని నాకు తెలియకపోలేదు.

    నేను ఒక రకమైన ఎక్సయిటెడ్ స్టేట్ లో ఉన్న  కారణంగా ఎప్పుడు  ఏ క్షణంలో ఏంచేస్తానో తెలియకుండా ఉంది. ముహుర్తసమయం సమీపిస్తూన్నకొద్దీ వధూవరులకూ. వారి తల్లిదండ్రులకులేని ఉద్వేగం నాకు కలగసాగింది. నేను మంచి వాడినో చెడ్డవాడినో నీకే తెలియదు కానీ వెయ్యి అబద్దాలైనా ఆడి నిలబెట్టవలసిన పెళ్ళిని ఒకేఒక్క నిజంచెప్పి చెడగొట్టడం మాత్రం చెయ్యలేదు. పార్వతి ప్రకాశరావు భార్య అయింది.

    రిసెప్షన్ సమయంలో ప్రకాశరావు పక్క వధువుస్ధానంలో ఉన్న స్త్రీని చూసి షాక్ తిన్నాను. ఆమె నేనెరిగిన పార్వతికాదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైము పట్టింది. ఆ తర్వాతా రోజంతా జాగ్రత్తగా పరిశీలించి శ్రీధరబాబు చెల్లెలూ, ప్రకాశరావు భార్యఅయిన పార్వతి నేననుకుంటున్న స్త్రీ కాదని దృవపర్చుకున్నాను.

    అంతేకాదు, ఒకప్పుడు పార్వతి ఇతనికోసం ఇల్లు వదిలి పెడితే __ ఏమయిందో తెలియక ఇంటిల్లపాది ఖంగారు పడ్డారనీ తమ వివాహం జరిపించడానికి పెద్దలు అంగీకరించినాకనే ఆమెను ప్రకాశరావు __ తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాడనీ ఒక కొత్త నిజంకూడా తెలుసుకున్నాను.

    పెళ్ళిపీటలమీద పార్వతిని నేను సరిగ్గా చూడలేదు. నేను మంటపానికి దూరంగా ఉండడమూ, విపరీతమైన వస్త్ర వేషధారణలతో ఆమెముఖం అష్పస్టంగా ఉండడమూ, తప్పుచేసిన వాడి అనుభూతితో వధూవరులను నేను సూటిగా చూడలేక పోవడమూ _వగైరా కారణాలవల్ల ఈ విచిత్ర సత్యాన్ని ముందుగానే గ్రహించలేకపోయాను.

    నేను గ్రహించిన సత్యం నన్నెన్నో బాధలనుంచి విముక్తి చేసింది. అయితే ఒకసందేహం మాత్రం నాకింకా మిగిలిపోయింది. నాకు తెలిసిన పార్వతి ఎవరు?

    ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా దొరుకుతుందని నేననుకోలేదు. కానీ పెళ్ళినుంచి తిరిగి వెళ్ళాక __ నాకు తెలిసిన పార్వతితోగల అనుభవాలు వివరాలనూ ప్లస్ శ్రీధరబాబు చెల్లెలి పెళ్ళికి  వెళ్ళి షాక్ తిన్న సందర్భమూ__శివరావుకు వివరించి చెప్పగా - అతడు అరటిపండు ఒలిచిన విధంగా నాకు ఏంజరిగి ఉండవచ్చునో చెప్పాడు.

    దూర ప్రాంతాల తక్కువ వ్యవధిలో ఉండే ఎండరో యువకులకు ఆడవాళ్ళను సరఫరా చేసే సంస్ధ ఒకటిఉంది, డానికి దేశంనిండా  బ్రాంచిలున్నాయి. నేను ఆ సంస్ధ ద్వారానే ఉమను రప్పించుకున్నాను. శివరావుకు ఆ సంస్ధగురించి చాలా వివరాలు తెలుసు వారివారి సౌకర్యాన్నిబట్టి యువకులు__యువతులను తమకు కావలసిన బందుత్వపు వరుసలలో రప్పించుకావచ్చును.

    శ్రీధరబాబు ఆ విధంగా చెల్లెలి పేరుతో యువతులను తమ  అవసరానికి రాప్పించుకుంటూ ఉండి ఉండవచ్చు. చెల్లెలు అనగానే ఎవరూ చటుక్కున తప్పు సంబంధం అంటత్వంలోని నిజా నిజాల విచారణ వ్రసక్తి ఉండదు శ్రిభరబాబు బుక్ చేసుకున్న  అమ్మాయి వస్తున్నట్లు వచ్చిన టెలిగ్రామ్ అతడు లేని సమయంలో నాకు అందడం జరిగింది.

    ఆ అమ్మాయికి వ్యాపారరీత్యా ప్రతిరోజుకూడా ముఖ్యం ఆమె చక్కగా నన్ను వినియోగించుకుని __శ్రీధరబాబు లేనప్పటికీ  తన ఆదాయం దెబ్బతినకుండా చేసుకోగలిగింది. ఆమె శ్రీధరబాబుకు చెల్లెలే అయుంటుందన్న అపోహ __ నాకు ఆమె  పట్ల  ఆకర్షణనూ, అంతులేని అతురుతను కలిగించింది.

    నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ ఒక్క విషయం నాకు  చాలా బాధను కలిగించింది. తన చెల్లెల్ని ఎంతగానో అభిమానిస్తున్న శ్రీధర బాబు-ఇతర ప్రాంతాల్లో నలుగురూ  తన చెల్లెలుగా భావిస్తున్నస్త్రీతో కాపురం చేస్తున్నాడు. ఆ విషయం అతను తప్పుగా భావిస్తున్నాడనుకొను. కానీ  అతన్ని తప్పు పట్టబోయేముందు_ నాకటువంటిఅర్హత ఉన్నదా అని కూడా ఆలోచించవలసిఉన్నది. అలా ఆలోచించ వలసిన అవసరం లేనివ్యక్తి నాకు తెలిసినవాళ్ళలో ప్రకాశరావు ఒకడే ననుకుంటాను.

    స్నేహితుడి చెల్లెలు అని  తెలిసుండీ అందు బాటులోకి వచ్చినప్పుడు అనుభవించి ఆ తర్వాత మరచిపోవాలని వ్యక్తిని ప్రయత్నించీన నేను! తను నమ్మి తనకోసం ఇల్లు వదిలి వచ్చిన ఆడదాన్ని ఏమాత్రమూ మోసం  చేయకుండా నిగ్రహంతో  వ్యవహరించి__చిట్ట చివరకు ఎలాగో పెద్దలనొప్పించి ఆమెనే వివాహంచేసుకున్న వ్యక్తి ప్రకాశరావు!

    బహుశా అందుకే  నన్నుకుంటాను__తన చెల్లెలిపై మాట వీసర బడడం సహించలేని శ్రీధరబాబు-మనిషినే స్వంతం చేసుకోవాలను కున్న ప్రకాశరావు చర్యను క్షమించగలిగాడు. నాబోటి వ్యక్తితో పార్వతి లేచి వచ్చి ఉంటే శ్రీధర బాబు చేతిలో ఆవ్యక్తి హత్యచేయబడి ఉండేవాడనడంలో సందేహంలేదు.

    ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీతిపరుడి ముందు_ అవినీతి పరుడెన్నడూ బలహీనుడు గానే ఉంటాడన్న సత్యం నా అనుభవంలో మరోసారి రుజువైంది.