Facebook Twitter
స్నేహం ఖరీదు...?

            స్నేహం ఖరీదు...?

 


    'పోస్ట్...' పిలుస్తూనే కాలింగ్ బెల్ కొట్టాడు పోస్ట్ మేన్. సెకండ్ సాటర్ డే...కొంచెం ప్రశాంతంగా టి.వి. చూస్తున్న సుమ లేచి వెళ్ళి తలుపు తీసింది.

    మామూలు ఉత్తరాలు కాదు. రిజిస్టర్డ్ లెటర్. సంతకం చేసి లోపలికి వచ్చి కవరు ఓపెన్ చేసింది.

    గుండె ఆగినట్లయి మళ్ళీ కొట్టుకుంటోంది వేగంగా... ఎందుకిలా జరిగింది. ఎక్కడుంది పొరపాటు. తనకేనా ఈ కోర్టు నోటీసు.. మళ్ళీ మళ్ళీ చదివింది. తనే... అనుమానం దేనికి? ఇంత స్పష్టంగా కన్పిస్తుంటే...

    తార ఎంత పని చేసింది. నమ్మించి మోసం చేయటం ఎంత నీచం. కాని ఎవరో అన్నట్లు నమ్మకం ఉన్నచోటే మోసం ఉంటుంది. నమ్మలేని వాళ్ళని ఎవరు మోసం చేస్తారు?

    వళ్ళంతా చెమటలు పట్టినట్లయింది. లేచి చల్లని మంచినీళ్ళు తాగింది సుమ. పిల్లలు ఇంకా కాలేజినించి రాలేదు. ఈ విషయం శ్రీధర్ కి తెలిస్తే ఎంత బాధపడ్తాడు. ఎలా రియాక్టు అవుతాడు. స్నేహితురాలని నమ్మి మూడు లక్షల చిట్ కి ష్యూరిటీ సంతకం ఎంత ప్రేమగా చేసింది తను. అసలు తార ఎందుకిలా చేసింది. రెండురోజుల క్రితం ఫోన్ చేస్తే నెంబరు వాడుకలో లేదని టేప్ వచ్చింది. ఇంటికి వెళ్తే ఇల్లు కూడా ఖాళీ చేశారని వార్త. అయినా ఏదో ఆశ... ఈ నోటీస్ తో ఆ కాస్త ఆశ తేలిపోయింది. కోర్టు దాకా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వెళ్ళారంటే అన్ని విధాలా ప్రయత్నం చేశాకే గదా! నిట్టూర్చింది సుజాత. మనసు అంతా చేదుగా ఉంది. టి.వి. ఆపేసి బెడ్ మీద వాలిపోయింది. ఆపినా ఆగని ఆలోచనలు. ఎ.సి. ఉన్నా ఆవిర్లెత్తే ఆలోచనలు గతంలోకి ప్రయాణం చేస్తున్నాయి. 

    స్కూల్లో చదువుకునే రోజులు. తార గలగలా పారే సెలయేరులా అందంగా... చురుగ్గా... అందరినీ ఆకర్షించేది. సగటు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నలుగురు ఆడపిల్లలో ఒక ఆడపిల్లగా కోరికలు నెరవేర్చుకోలేని సుమకు తార అంటే ఆరాధన. తార తండ్రి ఆ వూళ్ళో కాలేజీలో ప్రొఫెసర్. వాళ్ళకి ఒకే ఒక్క సంతానం తార. అల్లారుముద్దుగా... గారాబంగా ఏది కోరితే అది అందించే తల్లిదండ్రులు.

    స్కూల్లో అమ్మాయిలంతా తారని చూసి అసూయ పడేవాళ్ళు. ఆ అమ్మాయి పక్కన కూర్చున్నా మాట్లాడినా తరించి పోయామనుకునే వాళ్ళు... డాన్స్, సంగీతం, వీణ... ఎన్ని విద్యలు తెలుసో... తారే కళ్ళు తిప్పుతూ తన టైమ్ టేబుల్ చెప్పేది. లేచింది మొదలు ఇంట్లో పని లేదు. అవీ ఇవీ నేర్చుకోవటమే. స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్స్ లో తార నృత్యం తప్పని సరి. ఆ వయసుకే పట్టు వోణీలు, పట్టు చీరలు కట్టే తార అందరికీ స్వప్న సుందరిలా ఉండేది. కొన్నాళ్ళకి తార తండ్రికి బదిలీ కావటాన ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడో తిరపతిలో తార బిఎస్సీ చదువుతోందని ఒ గాలి వార్త... పెళ్ళి అయిందని మరో వార్త...

    జీవన పోరాటంలో అస్తిత్వ సంఘర్షణలో సుమ ఉద్యోగం వేట మొదలెట్టింది. తండ్రికి అసలు ఇష్టం లేదు. స్త్రీకి ఆర్ధిక స్వేచ్చ ఉండటం మీద సుమ తండ్రికి నమ్మకం లేదు. అయినా సుమ పట్టుదలతో గ్రూప్ -టూ పరీక్ష రాసి హైద్రాబాదులో సచివాలయంలో ఉద్యోగంలో చేరింది. సుమ స్మృతుల్లో తార ఒక స్నేహగీతం. సుమ హైదరాబాద్ లోనే ఓ బ్యాంక్ ఉద్యోగిని పెళ్ళి చేసుకుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు రమ ఇప్పుడు ఇంటర్, కృష్ణ పదో క్లాసు. దైనందిక జీవన వేగంలో సుమకి ఎవరి గురించి ఆలోచించే తీరిక లేదు.

    ఆ రోజు మధ్యాహ్నం పూట. ఆఫీసులో అందరూ క్యాంటీన్ లోనూ... చెట్ల కింద కాసేపు సేద తీరుతున్నారు. సుమ సీటు దగ్గరే మరో ఇద్దరు కొలీగ్స్ తో లంచ్ చేస్తోంది. హఠాత్తుగా ఎక్కడ్నుంచో ఆ పిలుపు.

    "హలో సుమా... బాగున్నావా! ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి" చొరవగా వచ్చి ఎదుటి సీటులో కూర్చున్న ఆ భారీకాయం... ఎవరబ్బా! ఇంత తెలిసినట్లు మాట్లాడుతోంది!

    "బాగానే ఉన్నానండి... మీరు..." పోల్చుకునే ప్రయత్నం చేస్తోంది సుమ.

    పెద్దగా నవ్వింది ఆమె. ఆ బుగ్గమీది సొట్ట... అవును అది తారే! చిన్ననాటి నేస్తాన్ని చూసిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది సుమ.

    "తారా! నువ్వా! ఎన్నాళ్ళకి ఇలా... ఉండు" చెయ్యి కడుక్కొని వచ్చింది. కొలీగ్స్ నవ్వుతూ వెళ్ళిపోయారు.

    "థాంక్స్... నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నా" అంది తార అందంగా నవ్వుతూ.

    "నిన్నెలా మర్చిపోతాను. కానీ నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు" సుమ అంది ఉద్వేగంగా.

    "మన వూరు వెళ్ళాను పనిమీద. మీ నాన్నగారింటికి వెళ్తే నీ వివరాలు అడ్రసు చెప్పారు."

    "అయినా ఆఫీసుకేంటే! ఇంటికి రా" అంది సుమ ఆప్యాయంగా స్నేహితురాలి చెయ్యి పట్టుకుని.

    "ష్యూర్! చాలా కబుర్లున్నాయి" అంటూ తార వెళ్ళిపోయింది.

    తర్వాత తార తన కారును సుమ ఇంటికి పంపింది.

    "అమ్మగారు తీసుకు రమ్మన్నారు" వినయంగా అన్నాడు తార డ్రైవర్. సుమ ఆనందంగా ఆ విదేశీ కారులో తార ఇంటికి వెళ్ళింది. తార బోలెడు కబుర్లు... నవ్వులు... కేరింతలతో తన జీవితాన్ని విన్పించింది.

    తార బిఎస్సీ చదువుతుండగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఆమె భర్త సుందర్. ఫోటో చూస్తే నల్లగా పొట్టిగా అందమైన తార పక్కన దిష్టిబొమ్మలా అన్పించాడు పెద్ద బిజినెస్ మాగ్నెట్ ట. అన్నీ తారే గబగబా చెప్పింది.

    అయినా తార ప్రేమించి చేసుకుందంటే మంచి వాడయి ఉంటాడు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి శాంతి. డిగ్రీ చదువుతోంది. రెండో పిల్ల సుగుణ ఇంటర్ లో ఉంది.

    "అమ్మ పోయింది సుమా" తార దిగులుగా చెప్పింది.

    "నాన్నని హోంలో చేర్చాం" తనే అంది.

    "ఎందుకు. నువ్వు చూసుకోలేవా" సుమ అడిగింది.

    "ఆయన ఒప్పుకోలేదు. ఆస్తి నాకు రాసి హోంలో చేరారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాను" తార సంజాయిషీగా అంది.

    "నువ్విలా ఇరవయ్యేళ్ళ తర్వాత నన్ను వెదుక్కుంటూ రావటం నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు మనం ఎక్స్ కర్షన్ వెళ్ళినప్పటి సరదాలు సంగతులు, తల్చుకుంటాను. అదేం పాట నువ్వు పాడే దానివి...?" హఠాత్తుగా అడిగింది సుమ.

    'అదా! అవన్నీ నువ్వింక మర్చిపోలేదన్న మాట..'

    "సయొనారా... సయొనారా... వాదా నిభావుంగీ సయొనారా". తార మళ్ళీ రాగం తీసింది అల్లరిగా.

    "ఈ పాట రేడియోలో... టి.వి. లో ఎప్పుడు ఎక్కడ విన్పించినా నువ్వు గుర్తు వస్తావే" సుమ అంది ప్రేమగా.

    "మన క్లాస్ మేట్స్ లో ఉష అనే అమ్మాయి ఉండేది చూడు. 'మనసున మనసై' పాట పాడేదీ..." తార గుర్తుచేసింది.

    "ఆ! అవును గుర్తొచ్చింది. ఎక్కడుందో" సుమ దిగులుగా అంది.

    "మొన్న ఎయిర్ పోర్టులో కన్పించింది. నేనే గుర్తు పట్టి పలకరించాను." తార చెప్పింది ఇన్వెంటివ్ గా.

    "చాలా మంచి గొంతు. ఆ రంగంలో కృషి చేసి ఉంటే మంచి సింగర్ అయి వుండేది" సుమ నిట్టూర్చింది.

    "నన్ను చూడు... అన్ని నేర్చుకున్నా ఏదీ లేదిప్పుడు... ఇల్లు... పిల్లలు... బిజినెస్ అంతే..." పక పకానవ్వింది తార.

    "నీది వడ్డించిన విస్తరి. నాలా కాదు"

    "అలా అనొద్దే. నీది స్వయంకృషి" తార అనునయించింది.

    ఇలా స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుని గతస్మృతుల్లో తేలారు. ఒకళ్ళ ఇంటికి మరొకరు రాకపోకలు జరిగాయి. సుమకి తార తిరిగి పరిచయం కావటం చాలా బాగుంది. బాల్య స్నేహం అంటే అపురూపమైంది సుమకి... ఎవరికైనా కూడా...

    హఠాత్తుగా ఓ రోజు తార ఫోన్. ఒకటే ఏడ్చింది. పెద్ద కూతురు శాంతికి జ్వరమొస్తే మెడికల్ రిపోర్టులు తీయించారట. బ్లడ్ కాన్సర్... తట్టుకోవటం తారావల్లేమౌతుంది!

    సుమ ఆ సాయంత్రం తార దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కొంత వేదాంతం, కొంత కర్తవ్యం కలిపి హితబోధ చేసింది. శాంతిని చూస్తే జాలేసింది. మనసు కలత పడింది. సంబంధాలు చూసి పెళ్ళి చేద్దామనుకునేంతలో ఇలా... తార దుఃఖం ఆపటం కష్టంగానే ఉంది. శాంతి అందమైన పిల్ల. పెద్ద జడ. అంతా కుచ్చులు కుచ్చులు ఊడిపోతుంటే గుండు చేయించింది తార.

    సుమకి ఆ రాత్రి నిద్రలేదు. శాంతి ఊరికే గుర్తొస్తోంది. మూడు నెలలు గడిచాయి. శాంతి క్షీణిస్తోందిట; తార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి.

    ఆరోజు ఆదివారం. మధ్యాహ్నం ఎండలో తార, భర్త రెండో కూతురితో హడావుడిగా వచ్చింది.

    "సుమా! ఈ పేపర్ మీద సంతకం చేయవే" కాయితాలు చేతికిచ్చింది.

    అవి చిట్ ఫండ్ కంపెనీకి ష్యూరిటీ ఇస్తున్నట్లు బాండ్ పేపర్లు. ప్రశ్నార్ధకంగా చూసింది సుమ.

    "మూడు లక్షల చిట్... శాంతి ట్రీట్ మెంటుకి డబ్బుకావాలి. ష్యూరిటీ గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చిట్ ఫండ్ వాళ్ళు అంటున్నారు."

    "కానీ నేను..."

    "ఏం మాట్లాడకే. గంపెడాశతో వచ్చా. పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఈ డబ్బుతో దానికి ట్రీట్ మెంట్ చేయించాలి" చేతులు పట్టుకొని ఏడ్చేసింది తార.

    "బిజినెస్ లో డిపాజిట్స్ ఫిక్స్ డ్ లో ఉన్నై. రెండు నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి. చేయండి ప్లీజ్" తార భర్త ప్రాధేయపడ్డాడు.

    సుమ వణుకుతున్న హృదయంతో సంతకం చేసింది. ఆ కుటుంబం థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి శాంతి మరణించిందని తెల్సి తారని పరామర్శ చేయటానికి తారని కలిసింది సుమ. కొంతసేపు గడిచాక...

    "చిట్ కడ్తున్నావా" అడిగింది సుమ మెల్లగా.

    "రెండు నెలల డ్యూ ఉంది. కట్టేస్తాను" అంది ముభావంగా తార.

    మరో ఆర్నెల్లకి ఈ నోటీస్. ఇప్పుడేం చేయాలి. తార ఇల్లు తెలీదు. ఫోన్ నెంబరు లేదు. ఈ రెండున్నర లక్షలు తనెక్కడ్నుంచి తేగలదు.

    తెల్సిన ఓ పోలీస్ ఆఫీసర్ సహాయంతో వాకబు చేసింది సుమ.

    తార ఎందరినో ఇలా ముంచిందనీ, ఆమె భర్త పచ్చి మోసగాడనీ... రెండు నెలలకో ఇల్లు మారుతుంటారనీ...  ఒక్కొక్కటీ ఒక్కొక్క పిడుగులా సుమ హృదయాన్ని అశాంతికి గురిచేశాయి. ఎంతో ప్రయాసతో తార అడ్రస్ సంపాదించింది సుమ.

    ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళింది. బతిమాలి అయినా కట్టిద్దామని.

    వాకిట్లోనే పనిపిల్ల లంఖిణిలా నిల్చుంది. "అమ్మగారు లేరు. రెండు నెలలు ఊరెళ్ళారు" చల్లగా చెప్పింది.

    లోపల కిటికీ కర్టెన్ చాటునించి తొంగి చూస్తున్న కళ్ళు తారవి కావని సుమ ఎలా అనుకోగలదు. అలాగని తోసుకుని ఇంట్లోకి ఎలా వెళ్ళగలదు.

    ఎందుకింత వంచన. తనేం పాపం చేసింది. స్నేహితురాలని కష్టంలో ఆదుకుంటే ఇంత మోసమా!

    అసలు మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించింది ఇందుకేనా. సుమ దిండు కన్నీటితో తడిసిపోయింది. రెండున్నర లక్షలు తనలాంటి చిన్న ఉద్యోగికి ఎంత కష్టం. పిల్లలు ఏది అడిగినా డబ్బుల్లేవని, ఆఖరికి తన ఆరోగ్యం బాగా లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చవుతాయని, ఆటో ఎక్కితే ఖర్చని బస్సుల్లో వేళ్ళాడుతూ, అమ్మా నాన్నలకి కొంచెం కూడా సాయం చేయలేక పోతున్నందుకు బాధపడుతూ... చివరికి ఇంత మొత్తం ఇలా ఇరుక్కుపోవటం హృదయాన్ని కోసేస్తోంది.

    మోసం వల్ల డబ్బు నష్టం కలగటం సరే! స్నేహంలో మోసపోయాననే భావం సుమని నిలువెల్లా దహిస్తోంది. జీవితంలో ఇంక ఎవరిని నమ్మాలి. స్నేహం శాశ్వతం అంటారు... మధురమైంది అంటారు. అది నిజమైనదైతే! కానీ ఎలా తెలుస్తుంది. తార ఇందరిని మోసగించి డబ్బు సంపాదిస్తుంది కానీ... మళ్ళీ ఆ నిర్మలమైన స్నేహాన్ని పొందగలదా!

    కాలింగ్ బెల్ మోగింది. శ్రీధర్ వచ్చాడు. 'ఏమయింది' సుమ మొహం చూసి అడిగాడు. కోర్టు నోటీసు చూపింది సుమ గిల్టీగా.

    "సర్లే ఏం చేస్తాం. బాధపడకు. నాకెందుకో ఆవిడ పటాటోపం చూసి అప్పుడే అనుమానం వేసింది. నీ స్నేహితురాలు కదా! నీకు తెలీదా అనుకున్నా. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం.." అనునయించాడు శ్రీధర్. సుమ మనసు కుదుటపడినట్లు లేదు.

    "ఏమిటిది సుమా! చిన్న పిల్లలా" శ్రీధర్ సుమను దగ్గరకు తీసుకున్నాడు.

    "కాదండీ! నేను దాన్ని చిన్నప్పటినుంచీ ఎంతో ప్రేమించాను. అది అడిగితే చేతయినంత సాయం చేసేదాన్ని.... ఇలా."

    "కొందరంతే సుమా! నీకు ఇంకా లోకం అర్ధం కాలేదు. వాళ్ళకి డబ్బే అన్నీ..." శ్రీధర్ ఓదార్చాడు. అయినా సుమ సమాధాన పడలేక పోయింది.

    చిన్ననాటి నేస్తం గురించి మనసులో దాచుకున్న స్మృతి ఫలకం ముక్కలై పోయిందనే భావం ఆమెను నిలవనీయటం లేదు. స్నేహానికి ఖరీదు కట్టిన తార మాత్రం విలాసంగా విదేశీ కారులో ఎవరితోనో నవ్వుతూ ప్రయాణిస్తోంది. ఆ బుగ్గ మీది సొట్ట అందమైన తాచులా ఈసారి ఎవర్ని కాటు వేస్తుందో మరి!

            * * *