Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 1

        వలచి వచ్చిన వనిత

-వసుంధర

 


పార్ట్  - 1

 "వాడికి మూడింది"_అన్నాడు శ్రీధరబాబు.

    శ్రీధరబాబు ఉద్దేశ్యంలో వాడు అంటే పుల్లారావని నాకు అర్ధమయింది.

    శ్రీధరబాబుని మాకాలేజీలో మొనగాళ్ళకు మొనగాడని చాలామంది చాటుగాను, కొంతమంది ఎదురుగానూ కూడా అనుకుంటూ, అంటు ఉంటాడు. రౌడి అన్నపేరు కూడా అతనికి లేకపోలేదు.

    అతను క్లాసులో బాగా అల్లరిచేస్తాడు. మేష్టర్లని ఏడిపిస్తాడు. ఆడపిల్లల వెంటబడడమూ, వాళ్ళూ వినేలా అసభ్యపదాలు మాట్లాడడమూ అతని హాబీ. ఆడపిల్లలకు శ్రీధరబాబు అంటే సింహస్వప్నం అనవచ్చు.

    నేను బుద్దిమంతుడిగా పేరు పడ్డానని చెప్పడంకంటె __కాలేజీలో ఒక అనామకుడినని చెప్పుకుంటే బాగుంటుంది. నన్నుగురించి- ఆఖరికి శ్రీధరబాబు రూమ్ మేటుగా నైనా కూడా  ఎంతోమంది ఎరుగరు. అందుకు కారణాలు లేకపోలేదు. నేను రూమ్ వదిలాక సాధారణంగా అతన్ని తప్పించుకుని తిరగడమే జరుగుతుంటుంది. అనవసరపు టనుమానాలకు లోనుకాగలనన్న భయంతో క్లాసులో అతని ప్రక్కన కూర్చోను నేను. ఆడపిల్లల వెంటబడడం ఊహలో నాకు ఆనందకరంగానే అవిపించే విషయం నిజమే అయినా - ఆ పద్ధతి వల్ల వచ్చే చెడ్డ పేరుకు నేను సిద్దపడని కారణంగా శ్రీధర బాబుతో బయట షికార్లు అట్టే చేసేవాడినికాదు.

    అసలు నేనూ, శ్రీధరబాబు హాష్టల్ రూమ్ మెట్సుగా ఆరునెలలు గడపగలడం నన్ను తెలిసన కొంతమంది స్నేహితులకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఒక్కమాట మాత్రం నిజం. నేనూ,  శ్రీధరబాబు నిజంగా స్నేహితులం. ఒకళ్ళ పద్ధతి ఒకరికి నచ్చనట్లు కనపడినా చాలా విషయాల్లో మా అభిప్రాయలు ఒకటే! రూమ్ తో ఉన్నప్పుడు మేమిద్దరమూ గంటలతరబడి మాట్లాడుకుంటూండే వాళ్ళం. నా పరిజ్ఞానాన్ని అతను మెచ్చుకుంటూండేవాడు. అతని  నిర్భాయత్వానికి నేను ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూఉండేవాడిని.

    ఒకరోజు మాటల ప్రసక్తిలో అతను ___"  నీతో. మాట్లాడం కోసం కాకపోతే అసలు నేను రూముకి రావలసిన అవసరమే కనపడదు పంతులూ!" అన్నాడు. అది నాకు కాంప్లిమెంటు.

    నాపేరు పంతులు కాదు. కానీ శ్రీధరబాబు రూమ్ మేటుగా వచ్చిన క్రొత్తలో నవ్నలా పిలువడం మొదలు పెట్టాడు. నన్నేడిపించాలన్నది బహుశా అతని ఆభిమతం అయుండవచ్చు. కానీ నేను అపిలుపుకు పలకడం మాత్రమేకాక __ "నీపలకరింపులో ఎంతో సాన్నిహిత్యం కనబడుతోంది __ బావా! అన్నాను. శ్రీధరబాబు ముఖం అప్పుడు అంత బాగాలేదు. అతను నాకేసి అదోకలా చూసి __"బావా  అంటున్నావు __ నీకు ఇంతకీ చెల్లెళ్ళున్నారా పంతులూ__" అన్నాడు.

    నేను చలించకుండా __ బావా అని పిలవడానికి నాకే చెల్లెళ్ళుండాలా __ నీకుంటేసరిపోదూ?" అన్నాను.

    భయంకరమైన ముఖం అనే పదానికి అర్ధం ఆక్షణంలో నాకు తెలిసింది. శ్రీధరబాబు ఒకసారి కుడిచేతి పిడికిలితో ఎడమ అరచేతిలో ఘట్టిగా కొట్టుకుని ___ నేను నిన్ను నిజంగానే ప్రేమతోనే పంతులూ అనిపిలిచాను. కానీ నువ్వు మాత్రం ఉద్దేశ్యం ఏమైనా __ బావా అని మాత్రం నన్ను  పిలవద్దు. బహుశా నాపదిహేనవ సంవత్సరంలో అనుకుంటాను __ నేను హంతకుడు కావసిలిన సంఘటన ఒకటి కొద్దిలో తప్పిపోయింది. కారణం తెలుసా"? అని ప్రశ్నార్ధకంగా నావైపు చూశాడు.

    నిజం చెప్పొద్దూ, నాకక్షణంలో అతని ముఖం చూస్తూంటే భయమేచేసింది. నేను మరి మాట్లాడలేదు.

    శ్రీధరబాబు కూడా ఒకటి రెండు నిముషాలపాటు మౌనంగా ఉండి ఆతర్వాత చెప్పడం ప్రారంభించాడు__ "నాకు ఒక్కగా నొక్కచెల్లెలు. పేరు పార్వతి. ఆరుగురు మగపిల్లలతర్వాత లేక లేక మాఇంట్లో పుట్టినాపిల్ల పార్వతి. మగపిల్లల్లో నేనే ఆఖరివాడిని కావడంచేతనూ, పార్వతికీ నాకు ఏణ్ణర్ధం మాత్రమే తేడా ఉండడంవల్లనూ___ మాఇద్దరి అను బంధం ఇంతా అంతాఅని చెప్పలేను. చిన్నప్పట్నించీ ఇద్దరూ ఒకే ప్రాణంగా పెరిగాం"___ శ్రీధరబాబు ఆగాడు

    నేను కుతూహలంగా వింటున్నాను భయం కూడా కాస్త తగ్గింది.

    అతను మళ్ళీ మొదలు పెట్టాడు ___ "నాకప్పుడు పదిహేను సంవత్సరాలు. ఫోర్త్ ఫారం చదువుతూండేవాడిని. అదే స్కూల్లో పార్వతి సెకండ్ ఫారం చదువుతోంది. నాకప్పుడూ   కాస్త పెద్దపరిచయాలే. చాలా మంది స్కూల్ పైనల్ చదువుతున్న కుర్రాళ్ళతో నాకు పరిచయముండేది. అందులో సుదర్శనం అనే అతనితో నేను చాలా తరచుగా తిరుగుతూండే వాడిని. సుదర్శనం గతమూడు నాలుగు సంవత్సరాలుగా అదే స్కూల్ విద్యార్ది నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. ఒకో తరగతి ఒకసంవత్సరం కంటె ఎక్కువ సార్లు చదవుతూ వచ్చినకారణంగా అతనుక్లాసులోని వయసు సొగసులను మగదృష్టితో చూచివర్ణించగల సమర్ధత అప్పటికే సంపాదించాడు. అతని వర్ణనలువిని ఆనందించడం కోసమే నేనతనితో ఎక్కువగా తిరుగుతూండేవాడిని___" అని ఒకసారి నాకేసి చూసి "వింటున్నావా"? అడిగాడు శ్రీధరబాబు.

    "ఊఁ" అన్నాను నేను.

    శ్రీధరబాబు చెప్పడం కొనసాగించాడు__" సుదర్శన మంటే స్కూల్లో ఆడపిల్లను హడిలి చచ్చేవారు. అతనితో పాటు నేను కూడా ఎన్నోపర్యాయాలు ఆడపిల్లల వెనక  పడినోటిదురద తీరేలా బూతులు మాట్లాడి సంతోషించేవాడిని. ఒకసారి సుదర్శనం నాకు ముందు చూపుగురించి చిన్నలెక్చరు దంచాడు__" వయసులో ఉన్న ఆడపిల్లలకు తమవెంట మగవాళ్ళు పడతారని గర్వంగా ఉంటుందట. అందుకని సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసుపిల్లలను మచ్చిక చేసుకుంటే___వాళ్ళు అప్పటికి అమాయకంగా చెప్పినమాట వినడమేగాక రెండుమూడేళ్ళు తర్వాత అన్నింటికీ పనికొస్తారు. అందువల్ల ఒక అందమైన ఆవయసు పిల్లని ఇప్పట్నించీ పటుకోవడాన్ని ముందుచూపు అంటారని అతను నాకు చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ"__...

    శ్రీధరబాబుముఖం మళ్ళీ కోపంగా మారింది. ఉద్రేకంవల్ల కాబోలు అతని చేతిపిడికిలి బిగుసుకుంది. తడబడతూ అతను"- "ఆరోగ్ , ఆపూల్ , ఆఇడియాట్, ఆరాస్కెల్ ఆస్కోండ్రల్__ సుదర్శనంగాడు ఉదాహరణగా నాకు నా చెల్లెలిని చూపించి"_మన ముందు చూపుకీ అమ్మాయెలా గుంటుందంటావు!" అడిగాడు. నేను షాక్ తిన్నాను. ఆక్షణంలో చటుక్కున పార్వతి నాచెల్లలని వాడికి చెప్పాలని కూడా తట్టలేదు.

    నేను గట్టిగా సుదర్శనం చేయి నొక్కి__వెనక్కులాగాను. "నాతోరా!" అన్నాను. మా స్కూల్ వెనకాల ఒక పెద్ద తోటఉంది. అందులోకి వాడిని తీసుకువెళ్ళి__హటత్తుగా అక్కడ వాడిని గట్టిగా ఒక్కతోపు తోశాను. సుదర్శనం క్రిందపడ్డాడు. నేను ఎగిరి వాడిపొట్ట మీద కూర్చుని  గొంతు నులమసాగాను. సుదర్శనం అసహాయుడై తన్నుకుంటున్నాడు. తన చేతులతో నన్ను తోయ్యడానికి విఫలప్రయత్నాలు చేస్తున్నాడు. నా చేతులు అతడి గొంతుకు గట్టిగా బిగుసుకుంటున్నాయి. ఆ  సమయంలో ఎవరో నన్నువెనక్కులాగేరు.  సుదర్శనం మాత్రం  కదల్లేదు. నన్ను లాగినదెవరా అని వెనక్కుతిరిగాను. మాలెక్కల మేస్టారు. ఆయన నాచెంప చెళ్ళుమనిపించాడు......