Facebook Twitter
ఎదను తడిపిన పుట

ఎదను తడిపిన పుట

 


                              
             

   డా.ఎ.రవీంద్రబాబు


 
    కాలం ఎప్పుడూ ఇంతే...! నా మనసులాగా ఎన్నో వింతలు, గమ్మత్తులు చేస్తుంది. చల్లని సాయంత్రాలు, శీతాకాలం నాటి వెచ్చని కౌగిళ్లు పంచిన వెన్నెల రాత్రులు వెళ్లిపోయాయి. వేసవి తాపాలు ఎక్కువయ్యాయి. అసలు, ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక 'శిశిరానికి చివరెందుక'ని ప్రేమికులు ప్రశ్నించారని ఎక్కడో యవ్వనపు తొలి రోజుల్లో చదివిన గుర్తు. కానీ కాలచక్రం ఆగదు. నీ జ్ఞాపకాలు చక్రం కింద నలుగుతున్న నా హృదయ సవ్వడిలా...!         వేసవి అనగానే పచ్చటి మామిడి వాసనలు మదిని తాకుతాయి. మల్లెలు మొగ్గలై ఎదను పురికొల్పుతాయి. ఏ మధన మనోహరుడో, తన మనోహరికి బహుమతిగా ఇవ్వడానికి ఈ మల్లెలను కనిపెట్టి ఉంటాడు. అసలు సృష్టికర్త బ్రహ్మే ప్రేమికుల విరహాన్ని, తృప్తిని కవ్వించడానికి వీటిని భూమ్మీద పుట్టించి ఉంటాడు. శరీరం మొత్తాన్ని తెలియని మైకంతో కమ్మేసే ఆ సువాసనా పరిమళాన్నిఎంతమంది కవులు అనుభవాలతో గానం చేశారో...! అప్పుడే స్నానం చేసిన నీ కురల మధ్య నే దాక్కుని నీ చెవిలో రహస్యాన్ని విప్పుతున్నప్పుడు, కొబ్బరాకు సందుల్లోంచి చంద్రుడు వినటానికి ఎన్ని ప్రయత్నాలు చేసేవాడో కదా...! అయినా వేసవి రాత్రులు, మల్లెల పరవశాలు, వెన్నెల చినుకులు... ఇలా మన ప్రేమకు ఎన్ని కానుకుల్ని ప్రకృతి ప్రసాదించింది ఆ రోజుల్లో.
          గుర్తుందా... మిద్దెమీద మనిద్దరమే చుక్కలు లెక్కపెట్టాడానికి పోటీ పడి అసలసి పోయేవాళ్లం. చివరకు లెక్కలు కూడా మర్చిపోయేవాళ్లం. అలసి నీ ఒడిలో సేదతీరే నా శరీరాన్ని...! అయినా నీకేనా, ప్రతి స్త్రీకి అంత గొప్ప హృదయం ఉంటుందా...! బహుశా... స్త్రీ హృదయానికే సృష్టికర్త అంతటి బహుమానం ఇచ్చి ఉండాలి. నీ కొంగును నా కళ్లకు కప్పి, చంద్రుడ్ని మసగ్గా చూపిస్తూ ఆటలాడేదానివి. తెల్లటి నీ నడుము వొంపు చంద్రవంకతో పోటీ పడుతుంటే, నా చేతి వేళ్లు సరాగాలు పోయేవి. అప్పుడు భావావేశంలో ఏ షెల్లీనో, కీట్స్ నో గుర్తు చేస్తే...! ముఖం చిన్నబుచ్చుకునే దానివి. నిన్ను ఆటపట్టించడం నాకు బాగా సరదా. అప్పుడు నీ ముఖం బలే ఉంటుంది. ఎన్నో సౌందర్య రహస్యాల్ని నింపుకుని పురి విప్పిన నెమలిలా...! మన గిల్లికజ్జాలు చూడలేక చంద్రుడు కూడా మబ్బుల్లోకి వెల్లిపోయేవాడు.
           అవును, గుర్తుల ఎడారిలో ఒయాసిస్సులు పలకరించవు. ఎండమావులు మాత్రమే భ్రాంతిని కలిగిస్తాయి. నిన్న ఆఫీసు నుంచి వస్తున్నా...! బస్సులో నా ముందు సీట్లో ఓ అల్ట్రామోడ్రన్ అమ్మాయి మల్లెపూలతో కూర్చొంది. పచ్చని మెడపై తెల్లగా అవి నవ్వుతున్నాయి. ఆశగా వెక్కిరిస్తున్నాయి. ఆ అమ్మాయి పైటకు, జీన్స్ కు మధ్య వారధిలా అనిపించింది నాకు. డిగ్రీ చదివే రోజుల్లో హిస్టరీ లెక్చరర్ ప్రైవేటు క్లాసు తీసుకుని మరీ నోట్స్ చెప్తుంటే... ఉ. నా ముందు మల్లెల జడతో వచ్చి కూర్చొంది. ఇక నాబాధ ఎవరికి చెప్పుకోను. ఆ మత్తులో ఎన్ని తప్పులు నా నోట్స్ లో దొర్లాయో...! అనాలోచితంగా ఉ. జడ కదిలిస్తుంటే...! నా చిన్న ప్రాణం...! పునర్జన్మ మీద నాకు నమ్మకం లేకపోయినా...! ఏ హృదయగతపు పురావాసనలో నా నిండి ఉండాలి.
          ఇలా... వడపోతల మీద వడపోతలు చేసి మనసును మొద్దు బారిద్దామని ప్రయత్నం చేస్తుంటే...! అది మాత్రం మరీ సున్నితంగా, సుకుమారంగా తయారవుతుంది. ఈ మధ్య ఎక్కువసార్లు నాలోకి నేనే పరకాయ ప్రవేశం చేస్తున్నాను. నన్ను నేను మరీమరీ తొవ్వుకుంటున్నాను. అలా అయిన ప్రతి సారీ నువ్వే నాలోకి వచ్చేస్తున్నావు. కావాలనిపిస్తావు. చూడాలనిపిస్తావు. నీతోనే ఉండాలనిపిస్తావు. ఆరాధన, ఆర్తి, అభిమానం, మమకారం, ప్రేమ, స్నేహం, విరహం, తపన, తమకం... ఇలా ఆ భావనకు ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. అసలు భాషకందనిది ప్రేమ. దానికి పేరు పెట్టి దాని శక్తిని, ఉధృతిని, కాంక్షని తగ్గిస్తున్నారు ఈ పిచ్చి జనం. నిజమైన ప్రేమ ఈ కపట మనుషులకు దొరికితేనా...! అది వీళ్లని కాల్చి చంపుుతంటే తట్టుకోేగలారా...! నిజం చెప్పు. కాల్చి పుటం పెట్టదూ, మృధుత్వాన్ని దహించే అమృతం కదా అది. ఈ పిచ్చి వేదాంతులు పెట్టుకున్న అద్వైత భావన కన్నా గొప్పది. అసలు ప్రేమను తెలియజేయడానికి మాటలు, పదాలు, వాక్యాలు, చివరకు భాషే సరిపోదు. 
           ఎక్కడో చదివిన గుర్తు. ఓ ప్రేమికుడు తన ప్రేమను ప్రియురాలికి ఎలా చెప్పాలో తెలియక, ప్రేమదేవత గూర్చి కఠోర తపస్సు చేశాడట. చివరకు దేవత ప్రత్యేక్షమైతే తన బాధ చెప్పుకున్నాడట. అప్పుడు ప్రేమదేవత 'వెళ్లు అధరాల మృధుత్వాన్ని అధరాలే గ్రహిస్తాయి. నాలుక రుచిని నాలుకే స్వీకరిస్తుంది. దంతాలు సైతం తమ శక్తిన ధారాదత్తం చేస్తాయి. నీలో నుంచి అమూల్యమైన మాధుర్యం నేరుగా ఆమె లోకి ప్రవేశిస్తుంది.' అని చెప్పిందట. సరిగా అప్పుడే ఈ భూలోకంలో ముద్దు అనేది పురుడు పోసుకుందట. ఎంత అందమైన ఊహ...! కాదు వాస్తవమే....! నీవు నా దగ్గర ఉంటే ఈ వెచ్చని వేసవి రాత్రిని మల్లెలతో అభిషేకింతును కదా...!   నీకో విషయం చెప్పనా...! నీతో ఇన్ని ప్రేమ జ్ఞాపకాలను పంచుకుంటున్నానా...! మల్లెపువ్వుల్లాంటి అన్నం నల్ల గులాబీలా తయారైంది. నా చీకటి జీవితాన్ని గుర్తుకు తెస్తూ...
                                
                              
  

సెలవు ఇవ్వని నా మనసుతో...
                                                      నీ