Facebook Twitter
వినిమయం

            వినిమయం


సి. భవానీ



    మమత మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆవేదన ఉంది. కళ్ళల్లో మాటిమాటికీ నీళ్ళు ఊరుతున్నై. తుడుచుకుంటున్న జీవనదుల్లా ఆ కన్నీళ్ళు....

    తనమీద తనకే కోపంగా నిస్సహాయంగా అన్పిస్తుంది.

    నీరసంగా లేచి చిన్నాకి స్నానం చేయించింది.

    పౌడర్ వేసి కొత్త చొక్కా వేసి పాలు పట్టింది.

    ఎంత ఆకలి వేసిందో చిట్టి తండ్రికి. బుజ్జి పొట్టలో పాలు పడగానే సొమ్మసిల్లినట్లు ఆదమరిచి నిద్రపోయాడు.

    ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేచింది మమత. కంప్యూటర్ ఓపెన్ చేసి ఇ మెయిల్స్ చెక్ చేసింది. తను పనిచేస్తున్న కంపెనీకి ఇ మెయిల్ ద్వారా రాజీనామా పంపింది. రవికి ఫోన్ చేసింది.

    "రవీ! కాస్త త్వరగా రాగలవా!" మమత గొంతులో దిగులు రవిని కదిలించింది.

    "ఏంటి మమతా! ఎనీ ప్రాబ్లెమ్..?" టెన్షన్ గ అడిగాడు 'నో' ప్రాబ్లెం వస్తే హ్యాపీ' అని ఫోన్ డిస్కనెట్ చేసింది.

    చిన్నా హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మ వళ్ళో పడుకున్నంత ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది. వాడి చిట్టి గుప్పెటలో మమత చున్నీ కొసలు గట్టిగా పట్టుకున్నాడు. తను లేస్తే చిన్నాకి నిద్రాభంగం అవుతుందని అలాగే వాడి పక్కనే పడుకుంది మమత. అలాగే ఆలోచనల్లోకి జారిపోయింది.

    రవి, తను అప్పుడు ఎమ్.టెక్ చదువుతున్నారు. పరస్పరం ఆకర్షణ, ప్రేమ. అది అవగాహన, పరిణతిలో ఉన్నదే గాని తాత్కాలిక ప్రలోభాలు కావు. చదువు పూర్తయ్యాక పెళ్ళిచేసుకోవాలనే తమ ఆలోచనను పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్ళిపుస్తకంగా శ్రీకారం చుట్టారు.

    ఇద్దరికీ సాఫ్ట్ వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చినై. అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా....

    రవికి తండ్రి లేడు. అత్తగారు తమ దగ్గర ఉంటుందని పెళ్ళికి ముందే రవి చెప్పాడు. ఆవిడ పెళ్ళిచూపులకి వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలతోనే పూర్తిగా అర్ధమైంది మమతకు.

    "వంట వచ్చా?" అనే ప్రశ్నకు నిలువూ అడ్డం కాకుండా తలూపింది మమత.

    "ఈ ప్రశ్నను ఆడపిల్లల్నే అడుగుతారు మగపిల్లల్ని ఎందుకు అడగరు. వాళ్ళకీ ఆకలేస్తుంది. వాళ్ళు కూడా తింటారు కదా! మరి వాళ్ళకీ వంట రావాలి కదా!" మమత ఆలోచనల్ని ఎవరితో పంచుకోగలదు.

    'సంగీతం వచ్చా?' మరో ప్రశ్న కాబోయే అత్తగారినుంచి.

    'రాదు' అంది ముక్తసరిగా మమత.

    'కనీసం నాలుగు మంగళ హారతులైనా..' ఆశగా అడిగిందావిడ.

    'సినిమా పాలు కొద్దిగా... తెలుసు' అందామనుకుంది.

    రవి చేసిన హెచ్చరిక గుర్తొచ్చి జవాబును గొంతులోనే దాచుకుంది.

    ఈ ప్రశ్న కూడా ఆడపిల్లలే ఎదుర్కొంటారు. మగపిల్లల్ని 'సంగీతం వచ్చా' అని ఆడ పెళ్ళివాళ్ళు అడగరు. అయినా మనసుకు నచ్చిన పాటను హాయిగా ఎవరైనా హమ్మింగ్ చేసుకోవచ్చు. మొక్కుబడిగా ఎవరూ వినకపోయినా పాడే మంగళ హారతులు నేర్చుకోవటం మమతకే కాదు. ఏ అమ్మాయికి మాత్రం ఆసక్తిగా ఉంటుంది. అలా పాడే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది కూడా!

    అత్తగారు తమతో ఉండటం మమతకి బాగానే ఉంది. ఓ పెద్ద దిక్కు... తోడు. పైగా రవి తల్లి. కానీ రోజు రోజుకీ ఆవిడ మనస్తత్వమే అర్ధం కాకుండా పోతోంది. ఏ పనీ తనని చెయ్యనివ్వదు. చేసినా ఏదో ఒక వంక పెడుతుంది. రవికి అన్నం పెట్టాలన్నా హడావుడిగా తనే ముందుకు వస్తుంది.

    "అదేమిటి మమతా! అన్ని పాలు పోశావు... నువ్వుండు. నేను కలుపుతా." అని కాఫీ కలపనీయదు.

    ఓ ఆదివారం బజ్జీలు చేస్తుంటే "నీ చేయి ఎక్కువ నూనె పీల్చేలా చేస్తుంది. నేచేస్తా నుండు" అంటూ తనని పక్కకి జరిపి ఆమే చేసేసింది.

    రవి తరపు చుట్టాలెవరో వస్తే వాళ్ళతో చాటుగా అత్తగారన్న మాటలు విన్నాక మమత మనసు కకావికలమై పోయింది. "చదువుకున్న కోడలు, ప్రేమించాడు, సంపాదించి పెడుతుందన్న మాటేగానీ.... నాకే సుఖం ఉంది చెప్పు. ఆ పిల్లకి నిద్రలేవటం అదీ లేటుగా... తయారవటం, వెళ్ళిపోవటం. రాత్రి పొద్దు పోయి వాళ్ళిద్దరూ వచ్చేసరికి నేను పడుకుంటూనే ఉంటాను. ఆయన అలా దాటిపోయారు. ఈ చాకిరీ నా పాలబడింది" అని కళ్ళొత్తుకుంటున్న అత్తగారి ద్విముఖ వ్యూహం మమతకి చూచాయగా తెల్సిపోయింది.

    చూసే వాళ్ళకి తను పనిచేతగాని అసమర్ధురాలుగా కన్పించటానికి వంటమనిషి దోహదం చేస్తుంది. మిగిలిన పనిలో అత్తగార్కి తన అజమాయిషీ ఎక్కడ చేజారి పోతుందోననే అభద్రతా భావం కన్పిస్తుంది.

    అందుకే తనేదీ పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటూ ఉద్యోగానికే పరిమితంగా ఉంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్నా వంట, పిల్లల పెంపకం, చుట్టాలకి మర్యాదలు, వృద్ధుల బాధ్యత, బ్యాంక్ పోస్టాఫీస్ పన్లు, పిల్లల హోంవర్కు, పేరెంట్స్ మీటింగ్స్ కి హాజరు కావటం అన్నీ భార్యే చేయాల్సి వస్తోంది. అప్పుడూ ఇప్పుడూ మగవాళ్ళకి ఉద్యోగం తప్ప మరో పని లేదు. చదువుకొని ఉద్యోగాలకి రావటం వల్ల స్త్రీలు ఏం సుఖపడ్తున్నారు. అన్నిటా ప్రవీణత చూపించే ఈ 'సూపర్ ఉమెన్' అవతారం ఆమెకెంతో భారంగా పరిణమించి ఆమె ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ హరించి వేయటం లేదా?

    వీకెండ్ పార్టీలు, సినిమాలు, జీవితం జాలీగా ఉంది కానీ బోర్ గా కూడా ఉంది.

    హృదయంపై తల వాల్చి పడుకున్న మమత పరధ్యానంగా ఉన్నదని రవి గ్రహించాడు.

    "ఏంట్రా! వంట్లో బాగా లేదా" తలమీద ప్రేమగా నిమిరాడు.

    "బాగానే ఉంది"

    "ఎందుకీ డల్ నెస్" గడ్డం కింద చెయ్యివేసి తలెత్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ మనసును చదివే ప్రయత్నం చేశాడు. 

    "లైఫ్ బోర్ గా ఉంది" చిన్నగా నవ్వింది.

    తనూ నవ్వాడు చిలిపిగా. "ఓ పనిచెయ్. జూనియర్ రవి నివ్వు" అల్లరిగా అన్నాడు.

    మమత నిజంగా సిగ్గు పడింది.

    "అరె! నీకు సిగ్గుపడడం వచ్చన్నమాట. నేను సీరియస్ గానే చెప్తున్నా"

    "మరి నా జాబ్. సెలవు దొరకదు" మమత ఆలోచిస్తూ అంది.

    "ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొకటి వెతుక్కోవచ్చు" సరదాగా అన్నాడు రవి మమత పొట్టమీద మునివేళ్ళతో రాస్తూ. ఆమె సీరియస్ నెస్ గమనించి మళ్ళీ తనే చెప్పాడు.

    "మమతా! పిల్లల్ని కనే వయసులో కనేయాలి. తర్వాత ప్రాబ్లెమ్స్ రావచ్చు. కెరీర్ ముఖ్యమే. ఫ్యామిలీ కూడా ముఖ్యమే. మనకో జూనియర్ వద్దా మరి...?" ఆమె కళ్ళలోకి లోతుగా చూశాడు.

    'సరే!' అంది నిశ్చింతగా.

    మరో సంవత్సరానికి పండంటి బాబుకు తల్లయింది. అత్తగారి హడావుడి చూస్తుంటే ఆశ్చర్యంగా అన్పించింది. చనిపోయిన మామగారే ఇలా పుట్టాడని ఆవిడ నమ్మకం. బారసాల... వగైరా... వైభవంగా జరిగాయి. బాబుని ఒళ్లోంచి దింపట్లేదావిడ. వాడి పన్లన్నీ ఆవిడే చేస్తోంది.

    వాడికి క్రమంగా మూడో నెల వచ్చింది. వాడి బోసి నవ్వులతో ఇల్లంతా పండగ వాతావరణం.

    ఇంక ఉద్యోగంలో చేరవచ్చనిపించింది. నాలుగైదు అప్లికేషన్స్ పంపించింది. ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం త్వరగానే దొరకటం మమతకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటిల్లిపాదీ సంతోషించారు.

    మమత రోజూ ఉద్యోగానికి పోయి రావటంతో బాగా అలసిపోయేది. టార్గెట్ వర్క్ ఉద్యోగాల్లో వత్తిడి ఎక్కువగా ఉండటం సహజం కూడా.

    ఓ రోజు రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఫోన్ కాల్ పిడుగులాంటి వార్తని అందించి ఇంటిని శోకసముద్రంలో ముంచేసింది. ఆడబడుచు పద్మ భర్త శేఖర్ యాక్సిడెంట్ లో పోయాడని.

    అత్తగారు కుప్పకూలి పోయింది.

    అంతా కలిసి రాజమండ్రి వెళ్ళారు. అన్ని కార్యక్రమాలు రవి దగ్గరుండి జరిపించాడు. తమతో వచ్చేయమనీ పిల్లల్ని హైద్రాబాదులోనే చదివిస్తామంటే పద్మ ఒప్పుకోలేదు. భర్త ప్రేమగా కట్టించిన ఇంట్లో అలాగే ఉంటూ తన టీచర్ ఉద్యోగంలో అలాగే కంటిన్యూ అవుతానంది. అత్తగారు కూడా ఆ పరిస్థితిలో పద్మకి సాయంగా ఉండిపోయింది.

    భారమైన మనసుతో వెనక్కి తిరిగి వచ్చారు మమత, రవి దంపతులు. అసలు సమస్య హైద్రాబాదుకి వచ్చాక భూతంలా ఎదుట నిల్చింది. బాబుని ఎవరు చూస్తారు. తను వెళ్తే సాయంత్రమో రాత్రో వచ్చేది. క్రచ్ లో చేర్చుదాం అనుకొని కొన్నిచోట్ల వెళ్ళి విచారించింది. కానీ అక్కడి పరిస్థితులు, వాతావరణం నచ్చలేదు.

    చివరికి తెల్సినవాళ్ళ ద్వారా ఇంట్లో ఉండి బాబుని చూసుకునే ఆయాను కుదుర్చుకుంది. బాబు అలవాట్లు అవసరాలు ఆయాకి నేర్పి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది మమత.
    అంతా బాగానే జరిగిపోతోంది. బాబు కూడా పెద్దగా పేచీ పెట్టకుండా ఆయాకి మాలిమి అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్నాడు.
    ఓ రోజు ఇంటికి వచ్చేసరికి బాబు మురికిగా చిరిగిన చొక్కాతో కనపడేసరికి మమతకి చాలా కోపం వచ్చింది.
    "ఆయా! ఈ చొక్కా ఎక్కడిది. తీసేసిన చొక్కానా! చిరిగింది వేశావే? స్నానం చేయించలేదా" తీవ్రంగా అడిగింది.
    "అయ్యో! చిరిగిందా! చూడలేదమ్మా" అంటూ హడావుడిగా స్నానం చేయించి మంచి చొక్కా వేసింది ఆయా!
    బాబు మొహం వాడిపోయి ఉంది.
    "బాబుకి వంట్లో బాగా లేదా" నుదుటిమీద చేయి వేసి చూసింది మమత. నులివెచ్చగా ఉంది.
    "బాగానే ఉన్నాడమ్మా! ఇప్పటిదాకా బాగా ఆడాడు" సంజాయిషీగా చెప్పింది ఆయా.
    మమతకి మాత్రం ఆ సమాధానం తృప్తినివ్వలేదు. జవాబు దొరకని ప్రశ్నలేవో తల్లి హృదయాన్ని వేధిస్తున్నాయి.

    ఆరోజు మధ్యాహ్నం నుంచి మమతకి కడుపులో నొప్పి... వాంతులు. ఇక ఆఫీస్ లో కూచోలేక లీవ్ లెటర్ ఇచ్చి వెంటనే ఇంటికి బయలుదేరింది. కారు డ్రైవ్ చేస్తోందన్న మాటేగానీ సౌఖ్యంగా లేదు. చికాకుగా ఉంది.

    లిబర్టీ దగ్గర ఎర్ర లైటు పడింది. కారు ఆగగానే చుట్టూ ఈగల్లా బిచ్చగాళ్ళు.

    "ఈ బెగ్గర్స్ తో వేగలేక ఛస్తున్నాం. రోజూ ఇదే రూటులో వస్తాం. రోజూ ఎందుకు. నెలకోసారి తీసుకో" టూ వీలర్ వ్యక్తి విసుక్కున్నాడు.

    కారు అద్దాల్లోంచి దూరంగా ఓ బిచ్చగత్తె. మెడచుట్టూ తిప్పి కట్టుకున్న పాతచీర జోలెలోంచి పసివాడి బుల్లి కాళ్ళు, చేతులు అస్పష్టంగా కన్పిస్తున్నాయి. కార్లు చీమల్లా కదుల్తున్నయ్. గాలికి జోలె చీర అల్లల్లాడింది. ఆ పసివాడ్ని, ఆ బిచ్చగత్తెని ఎక్కడో చూసినట్లనిపించింది.... మమతకి... అదేంటి... అదే... వాడు... వాడు... గుండె బద్దలైంది. బ్రేకుతో కారు ఆగింది. వెనకనించి ఒకటే హారన్లు.

    ఒక్క ఉదుటున ఇంట్లోకి వచ్చి పడింది. మెయిన్ డోర్ కి తాళం కప్ప వెక్కిరిస్తోంది.

    దడదడలాడుతున్న మనసుతో తాళం తీసి బెడ్ రూంలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. కన్నీటితో దిండు తడిసిపోతోంది. కడుపునొప్పి ఏమయిందో.... కన్నపేగు మెలి తిరిగి బాధ పెడ్తోంది.

    మరోగంటలో ఆయా బాబుతో వచ్చింది. తాళం తీసి ఉండటంతో కంగారుపడింది.

    ఆయా కట్టుకున్న చిరుగు పాతచీర తనెప్పుడూ చూసింది కాదు. బాబు వంటి మీద పాతచొక్కా కూడా వాడిది కాదు.

    పచ్చని బాబు వళ్ళు అంత నల్లగా...

    ఆయా చేతుల్లోంచి ఆవేశంగా బాబుని లాక్కుంది మమత. మమత కోపం చూసి హడలిపోయింది ఆయా.

    "బాబు ఏడుస్తుంటే పార్కుదాకా... అలా..." నసిగింది ఆయా.

    "నోర్ముయ్... ఇంకో మాట మాట్లాడావంటే పోలీసులకి పట్టిస్తాను.. సిగ్నల్ దగ్గర నీ నాటకం చూళ్ళేదనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు" మమత కళ్ళు నిప్పులు కురిసాయి.

    "గెటౌట్ ఇడియట్..." అరిచింది మమత. ఆయా జారుకుంది తలొంచుకుని.

    కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల్లోంచి బయటపడింది మమత.

    తలుపు తీస్తే... ఎదుట రవి.

    "ఎలా ఉంది మమతా.." అంటూ లోపలికి వచ్చిన రవిని కౌగిలించుకుని ఒకటే ఏడుపు.

    "అదేంట్రా... కొంచెం వంట్లో బాగాలేకపోతే ఇంత భయమా. అమ్మని పిలిపించనా, బాబు ఏడీ..." సోఫాలో కూర్చొని బూట్లు విప్పుతున్న రవి పక్కన కూర్చుని కళ్ళు తుడుచుకుంది మమత.

    మమతకేసి పరిశీలనగా చూశాడు రవి. తను ఇంతగా బాధపడ్తున్నదంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. మెల్లగా వివరాలు రాబట్టాడు. కొయ్యబారిపోయాడు. ఇలాంటి మానవమృగాలుంటాయా! పసివాణ్ణి వ్యాపారవస్తువు చేయటం ఎంత అమానుషం. కోపంతో అతని దవడ ఎముక బిగిసింది. కాస్త తమాయించుకున్నాడు.

    "పోన్లే మమతా! మనకిప్పుడైనా తెలీటం మన మంచికే. ఇంకా ఏమేం జరిగేవో! నీ నిర్ణయం కరెక్టే. సూపర్ ఉమన్లా అన్ని పన్లు ఎలా చేస్తావ్. పిల్లలకి ప్రేమానురాగాలు ఇవ్వలేని జీవితం ఎందుకు. డబ్బు సంపాదించుకోవచ్చు. వాడి బాల్యం మళ్ళీ రాదు. వాడు పెద్దయితే మనల్ని ప్రేమగా చూడాలనుకోమూ" అంటూ మమత చేయి పట్టుకొని బాబు దగ్గరికి తీసికెళ్ళాడు.

    నిద్రలో బాబు ఉలిక్కిపడ్డాడు.

    మమత బాబు పక్కనే కూర్చుని మెత్తగా జో కొట్టింది. వాడి పెదవులపై సన్నని చిరునవ్వు సంతృప్తిగా వెలిగింది.

    కంప్యూటర్ కలల నుంచి కన్నబిడ్డ చిరునవ్వుకు ప్రయాణించిన మమతను చూస్తుంటే రవి మనసు అంకెలకందని ఆనందంతో నిండిపోయింది.

            * * *