Facebook Twitter
నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ

 

ఎపిసోడ్ - 5

- వసుంధర

వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిందించుకోవడం తప్పితే నా మాట గురించి పట్టించుకోరు. ఆఖరికి మామ్మ నన్ను నాలుగు ఉప్పురాళ్ళు నమలమంటుంది. అందువల్ల కంటి మంటతోపాటు నోరు కూడా ఉప్పగా అయిపోతుంది.

    ఈరోజు కూడా ఉప్పురాళ్ళు నముల్తూండగా బాబాయి నన్ను పిలిచాడు.

    అమ్మ లేపి తలంటు హడావుడి చేయగానే అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు బాబాయి నాకు బహుమతి ఇస్తానని చెప్పాడు. అదేమిటో మరి !

    "బాబాయ్!" అని పరిగెత్తాను.

    అలా పరుగెడుతూంటే అమ్మ నా తలకు కట్టిన గుడ్డ జారిపోయింది. నేను వంటికి చుట్టుబెట్టుకున్న తువ్వాలు కూడా జారిపోతే మళ్ళీ ఆదరాబాదరగా చుట్టుకున్నాను. అదృష్టం కొద్ది అమ్మ చూడలేదు. లేకపోతే "ఆడపిల్లవు సిగ్గు లేదుటే?" అని తిడుతుంది. మరి మగపిల్లలకు సిగ్గక్కర్లేదేమో నాకు తెలియదు.

    బాబాయి కనబడేదాకా పరిగెత్తాను. నాక్కాస్త ఆయాసం కూడా వచ్చింది. తువ్వాలు గట్టిగా పట్టుకున్నాను. అది మళ్ళీ జారి పోతోంది మరి.

    బాబాయి చేతిలో ఓ అట్ట పెట్టివుంది. అది లావుగా, ఎత్తుగా లేదు. సన్నగా వుంది. అందులో నేను కలలుగంటున్న బొమ్మ వుండే అవకాశం లేదు. ఇంకా పరీక్షగా చూడాలనుకునేలోగా కళ్ళు మండాయి. తలవంచుకుని తువ్వాలు అంచుతో కళ్ళు తుడుచుకున్నాను.

    "హాపీ బర్త్ డే టూ యూ అమ్మలూ!" అన్నాడు బాబాయి.

    అప్పుడు నాకు గుర్తుకొచ్చింది.

    అరే! బాబాయి వచ్చే ముందురోజు దాకా నా పుట్టినరోజు సంగతి నాకు గుర్తుంది. అలా ఎలా మర్చిపోయానా? అమ్మ, నాన్న, మామ్మ ఎవ్వరూ గుర్తు చేయలేదేమిటి? మామ్మ సంగతి సరే- ఆవిడదంతా తెలుగు క్యాలెండరు లెక్క. కానీ అమ్మ, నాన్నగారు....? 

    "నీకోసం అమెరికా నుండి ఏమి తెచ్చానో చూడు" అన్నాడు బాబాయి.

    చటుక్కున ఆ పెట్టె అందుకున్నాను. తెరిచాను. అందులో ఎంతో అందమైన గౌను వుంది.

    "ఇది నీకోసమే !" అన్నాడు బాబాయి. "ఇప్పుడే వేసుకోవాలి"

    నాకు చాలా ఉత్సాహం కలిగింది. బాబాయి నాకోసం అమెరికా నుండి గౌను తెచ్చాడు. ఎంత బాగుందో!

    చటుక్కున తువ్వాలు విప్పిపారేసి వెంటనే ఆ గౌను వేసుకున్నాను. ఎప్పుడు వచ్చిందో అమ్మ అప్పుడే అక్కడ ప్రవేశించి "హవ్వ !" అంది.

    అమ్మ హవ్వ ఎందుకు అన్నదో నాకు తెలుసు. బాబాయి ముందే ఆ గౌను తొడిగేసుకున్నావే! ఇప్పుడు నువ్వే అమెరికా బొమ్మలాగున్నావు" అంది అమ్మ.

    అందుకే అమ్మంటే నాకు ఇష్టం. ఒకోసారి నన్ను తిట్టాలనుకుని కూడా వెంటనే మరచిపోతుంది. బాబాయి ముందే గౌను వేసేసుకున్నానని తిట్టాలకుకుంది. కానీ ఆ గౌన్లో నన్ను చూడగానే అయా విషయం మరిచిపోయింది.

    "అమ్మా! చాలా బాగుంది కదూ!" అన్నాను సంతోషంగా.

    "ఊ! ఒకొక్కరికే దణ్ణం పెట్టిరా" అంది అమ్మ. "గౌనిచ్చాడు కాబట్టి ముందు బాబాయికి దణ్ణం పెట్టు"

    "ఊహూ- అలా కాదు. ముందు పెద్దవాళ్ళతో ప్రారంభించాలి. మామ్మకీ తర్వాత మీ అమ్మకీ, నాన్నకీ- ఆ తర్వాతే నాకు!" అన్నాడు బాబాయి.

    వెళ్ళి మామ్మకు దణ్ణం పెట్టాను. నన్ను ఎన్నో విధాలుగా దీవించింది. ఆ తర్వాత నన్ను దగ్గరగా తీసుకుని ముద్దులాడి ఓ పెద్ద కేక పెట్టింది-నాకు దిష్టి తీయమని. మామ్మ దిష్టితీయమందంటే దాని అర్ధం నేను చాలా అందంగా వున్నానని. అందుకోసమని అద్దమున్న గదిలోకి పరుగెత్తాను.

    "ఒక్క క్షణం ఆగండమ్మా" అంటూ నన్ను వారించింది పని మనిషి రత్తమ్మ. అదప్పుడా గది తుడుస్తోంది. అప్పుడే నాకు మా బాబాయి మాటలు గుర్తుకు వచ్చాయి.

    "నేను గుమ్మం దగ్గరే ఆగి "రత్తమ్మా! నువ్వు మా అమ్మకంటే, నాన్నగారి కంటే పెద్ద దానివి కదూ" అన్నాను.

    "అవునమ్మా, ఏం?" అంది రత్తమ్మ.

    "అయితే ఒక్కసారి అలా నిలబడు" అన్నాను.

    "ఎందుకమ్మా?" అంటూనే అది నిలబడింది.

    నేను చటుక్కున లోపలకు వెళ్ళి దాని కాళ్ళకు దణ్ణంపెట్టి "ఈ రోజు నా పుట్టిన రోజు. కొత్త గౌను వేసుకున్నాను. ఇది మా బాబాయి అమెరికా నుండి తెచ్చాడు బాగుంది కదూ?" అన్నాను.

    "బాగుంది కానమ్మా-నువ్వు నాకు దణ్ణం పెట్టావేమిటి?" అంది రత్తమ్మ.

    "నువ్వు పెద్ద దానివి కదా! నన్ను దీవించాలి" అన్నాను.

    అది చటుక్కున నన్ను దగ్గరగా తీసుకుని "వెయ్యేళ్ళు వర్ధిల్లమ్మా" అంది. అప్పుడు నాకు దాని దగ్గర అదోరకం వాసిన వేసింది. శంకరం గుడిసెలో వచ్చిన లాంటిదే ఆ వాసన.

    చటుక్కున రత్తమ్మను విడిపించుకున్నాను. అయితే అదంటే నాకు అసహ్యం వేయలేదు. జాలి వేసింది. స్నానం చేస్తే వళ్ళు రుద్దుకునేందుకు సబ్బు కూడా వుండదు వీళ్ళకు.

    నేను వెనక్కు తిరిగే సరికి గుమ్మంలో అమ్మ వుంది. అమ్మ నాకేసి కాస్త కోపంగా చూస్తోంది. అమ్మ పిడికిలి మూసి వుంది. అందులో ఉప్పు వుంటుందని నాకు తెలుసు. మామ్మ ఏ పని చెప్పినా అమ్మ వెంటనేవినదు. కానీ దిష్టి తీయమంటే మాత్రం వెంటనే ఆ పని చేస్తుంది.

    నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను. "నాన్నగారికి దణ్ణం పెట్టావా?" అని అడిగింది అమ్మ కోపంగా.

    "లేదు. పెద్దవాళ్ళు ఒకొక్కరికే పెట్టుకు వస్తున్నాను. ముందు మామ్మకు అయింది. అప్పుడు రత్తమ్మకి అయింది. ఇంక నాన్నగారూ నువ్వూ, బాబాయి వున్నారు" అన్నాను.

    "అఘోరించావులే" అంటూనే అమ్మ దిష్టి తీసింది.

    తర్వాత ఒకొక్కరికే దణ్ణాలు పెట్టాను. అమ్మ అందరికీ నేను చేసిన పని చెప్పింది. బాబాయి నన్నెత్తుకుని ముద్దులాడి "ఈ ఇంటి మొత్తానికి నువ్వే నచ్చావు నాకు. నిన్ను చూసి అంతా నేర్చుకుంటారని ఆశిద్దాం. నువ్వు చాలా గొప్ప దానివి కదా! అందుకని నీకు ఇంకా గొప్ప బహుమతి ఇవ్వాలి. ఆ బహుమతి అందుకునేందుకు స్పెషల్ డ్రస్ వుండాలి. అందుకనే ముందుగా గౌను ఇచ్చాను. నాతో రా" అన్నాడు.

    అంటే బాబాయి నా కోసం ఇంకేదో ఇచ్చాడన్న మాట. అదేమిటి?

    నేను బాబాయి వెంట నడిచాను.

    అప్పుడు ఇచ్చాడు బాబాయి నాకు చక్కని అమెరికా బొమ్మ !

    ఎంత చక్కని బొమ్మ అది! అచ్చం మనిషిలా వుంది. లేత గులాబీ రంగు వళ్ళు. వంటి రంగుకు నప్పే మ్యాచింగ్ ఫ్రాక్, బూరి బుగ్గలు, చేపల్లాంటి కళ్ళు. రెండడుగుల పొడవు వుంది. దానికి బుల్లి బుల్లి సాక్సు. బూట్సు.

    "ఇది నీకు పుట్టిన రోజు బహుమతిగా ఇవ్వాలనుకుని వెంటనే ఇవ్వలేదు. బాగుందా?" అన్నాడు బాబాయి.

    బొమ్మను గుండెకు గట్టిగా హత్తుకుని ఎంత బాగుందో చెప్పాలనుకున్నాను. సంతోషంతో మాటలు రాలేదు నాకు.

    పరుగు పరుగున వెళ్ళి ఆ బొమ్మను మామ్మకూ, రత్తమ్మకూ, అమ్మకూ, నాన్నగారికీ చూపించాను. అయితే ఎక్కడా మాట రాలేదు.

    అప్పుడు నాకు కిష్టిగాడు గుర్తుకు వచ్చాడు. కిష్టిగాడు గుర్తుకు రాగానే నాకు మాటలు వచ్చేశాయి. బాబాయి దగ్గరకు వెళ్ళి "బాబాయ్-నువ్వు అందరి బాబాయిల్లాంటి వాడివి కాదు. కిష్టిగాడు చెప్పాడూ - బాబాయిలు రాబోయే పెళ్ళాల గురించే ఆలోచిస్తారు తప్పితే చిన్న పిల్లల గురించి ఆలోచించరుట. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. నాకెంతో సంతోషంగా వుంది. ఇప్పుడే వెళ్ళి వాడిని పిల్చుకుని వస్తాను. బొమ్మ చూపిస్తాను" అన్నాను.

    బాబాయి చాలా గర్వంగా నవ్వాడు. కానీ కిష్టిగాడి దగ్గరకు వెళ్ళడం అప్పుడే కుదరలేదు. అమ్మ నాకు జడవేస్తానంది. తలంటుకున్నాక వెంటనే జడ వేయడం అంటే అది పెద్ద నరకం. కానీ తప్పదు మరి.

    అమ్మ నాకు జడ వేస్తూంటే బాబాయి పక్కనే కూర్చుని "అమ్ములూ నువ్వు కూడా నీ బొమ్మకు ఇలాగే జడవేసుకోవచ్చు. తెలుసా?" అన్నాడు.

    "నిజంగా!" అన్నాను.

    "నేను అబద్ధం చెప్పనుగా" అన్నాడు బాబాయి.

    "అయితే నా బొమ్మకు తలంటవచ్చా?" అనడిగాను.

    "ఆహా! మీ అమ్మ నీకేం చేస్తుందో అవన్నీ నువ్వు నీ బొమ్మకు చెయ్యొచ్చు" అన్నాడు బాబాయి.

    "అమ్మ బాబోయ్! నిజంగానే" అని ఉత్సాహంగా చప్పట్లు కొట్టేయబోయాను.

    "కుదురుగా కూర్చోవే" అని అమ్మ తన చేతిలో వున్న నా జుట్టును ఓసారి గట్టిగా లాగింది.

    "అమ్మా! నువ్వు నాకు అమ్మవు. నా బొమ్మకు నేను అమ్మను" అన్నాను సంతోషంగా.

    "బాగా అన్నావు. 'నాకున్నది ఒక చక్కని బొమ్మ-దానికి నేను అమ్మ' అని రోజూ పాడుకోవచ్చు నువ్వు"     అన్నాడు బాబాయి.

    ఆ పాటకూడా నాకు నచ్చింది. వెంటనే మొదలు పెట్టేశాను.

    అమ్మ జడవేయడం ముగించి "ఇప్పుడు ఎక్కడికి వెడతావో వెళ్ళవే" అంది.

    నాకు కిష్టిగాడింటికి వెళ్ళాలనిపించలేదు. కాసేపు తనివితీరా ఆ బొమ్మను చూసుకోవాలనిపించింది.

    బొమ్మ దగ్గరకు వెళ్ళాను. దాన్ని ముద్దులాడాను.

    ఆ బొమ్మను పడుకోబెట్టగానే కళ్ళు మూసేస్తోంది. దాని నోట్లో చిన్న పాలసీసా వుంది. నిలబడినప్పుడు ఫరవాలేదు. కానీ పడుకున్నప్పుడు పాలసీసా తీస్తుంటే ఏడుస్తోంది. సీసా నోట్లో వుంచగానే ఊరుకుంటోంది. బొమ్మ వెనకాలే ఓ మీట వుంది. అది నొక్కగానే పాట పాడుతోంది.

    నాకు ఇంగ్లీషు అర్ధం అవుతుంది. కానీ ఈ బొమ్మ పాడే ఇంగ్లీషు నాకు అర్ధం కావడంలేదు. బాబాయి నడిగితే తనే చెప్పాడు. 'తానొక అందమైన పాపననీ, తన్ను చూసి ముచ్చటపడి పలకరించి రమ్మని చంద్రుడు వెన్నెలను పంపిస్తా'డనీ ఆ పాటకు అర్ధమట. అమెరికన్ ఇంగ్లీషు అర్ధం చేసుకోవడం చాలా కష్టమని బాబాయే అన్నాడు.

    బొమ్మతో చాలాసేపు కాలక్షేపం చేశాను.

    మామ్మ, నాన్నగారు, అమ్మ, బాబాయి అంతా ఎవరి పనుల్లో వాళ్ళుంటున్నారు. నేను దగ్గరగా వెడితే "నీకు బొమ్ముందిగా దాంతో ఆడుకో పో" అంటున్నారు. నాకెంతో సంతోషంగా వుంది. ఆ సంతోషాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి. ఇంక తప్పలేదు. బొమ్మను జాగ్రత్తగా బజ్జుండ బెట్టి నోట్లో పాలసీసా వుంచి కిష్టిగాడి ఇంటికి వెళ్ళాను.

    వాళ్ళింటికి వెళ్ళడానికి ఒక్కటే భయంగా వుంది. కిష్టిగాడి అమ్మకు నా మీద కోపంగా వుందేమోనని! ముందు ఆవిడ కాకుండా కిష్టిగాడే కనిపిస్తే బాగుండుననిపించింది. కానీ అనీ మనం అనుకున్నట్లే జరుగవు కదా!

    ముందుగా నాకు కిష్టిగది అమ్మే కనబడింది. 

    నన్ను చూస్తూనే ఆవిడ "అరే అమ్ములు కొత్త గౌను వేసుకుందే!" అంది. నాకెంతో సంతోషం కలిగింది. "ఈరోజు నా పుట్టిన రోజు ఆంటీ" అన్నాను.

    "అలాగా. గౌను చాలా బాగుంది" అంది కిష్టిగాడి అమ్మ. ఆవిడ నా గౌను కేసే రెప్పవాల్చకుండా చూసింది.

    "ఇది అమెరికా నుండి నాకోసం తెచ్చాడు మా బాబాయి" అంటూ "ఆశీర్వదించు ఆంటీ అందుకే వచ్చాను" ఆవిడ కాళ్ళకు దణ్ణం పెట్టాను.

    ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని "నువ్వు చాలా బుద్ధిమంతురాలివి" అంది.

    నిజానికి నేను వచ్చిన పని వేరు. అయితే ఇలాంటి అబద్ధాలు చెప్పడం నేను మా అమ్మదగ్గర నేర్చుకున్నాను. చిన్నచిన్న అబద్ధాలు చెప్పి అమ్మ మామ్మను చాలాసార్లు మోసం చేసింది. అలా చేయడం తప్పుకాదా అంటే ఎదుటి వాళ్ళకు సంతోషం కలిగించేటప్పుడు, ఇతరులకు ఎటువంటి హానీ కలిగించనప్పుడు అబద్ధం చెప్పడంలో తప్పులేదని అమ్మ నాకు చెప్పింది. అది నిజమే ఏమో! ఇప్పుడు కిష్టిగాడి అమ్మ కూడా ఎంతో సంతోషించినట్లే కనబడుతోంది.

    "కిష్టిగాడింట్లో లేడా ఆంటీ!" అనడిగాను.

    "వున్నాడు. పింగాణీ ప్లేటు బద్దలు కొట్టాడని వాళ్ళనాన్న వాడి వీపు బద్దలు కొట్టారు. ఆ గదిలో కూర్చుని ఏడుస్తున్నాడు" అందావిడ.

    వాడేడుస్తున్నాడనగానే నాక్కాస్త నిరుత్సాహం కలిగింది. మా మూలప్పుడే వాడికి అసూయ ఎక్కువ. ఇప్పుడసలు నా సంతోషంలో పాలు పంచుకుంటాడా? అని అనుమానం వచ్చింది. అయినప్పటికీ వెళ్ళాను.

    నన్ను చూడగానే కిష్టిగాడు ఏడుపు ఆపేశాడు.

    "ఏరా కిష్టీ, నిన్ను మీ నాన్న కొట్టాడా?" అనడిగాను.

    "ఎవరు చెప్పారు? నేను ఏడుస్తున్నానని అలాగ అనుకుంటున్నావా ? ఇదంతా నటన. నాకసలు మా నాన్న ఎంత కొట్టినా ఏడుపు రాదు. ఎందుకంటే నేను నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని గదా! ఆయన నన్ను గట్టిగా కొట్టలేరు. కానీ ఏడ్చేదాకా కొడతారు. అసలు నాన్నకి నన్ను కొట్టడం ఇష్టం వుండదు. ప్లేటు బద్దలు కొట్టానని అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న 'ఊఁ' అని విని వూరుకుంటే 'అలా వూరుకుంటే ఎలాగండీ, రోజూ ఓ ప్లేటు బద్దలుకొట్టేస్తాడు' అంది అమ్మ. 'ఏం చేయమంటావూ?' అనడిగారు నాన్న. 'వాణ్ణి కొట్టండి' అంది అమ్మ.

                    (సశేషం)