Facebook Twitter
అమ్మ పిలుపు

అమ్మ పిలుపు

- వసుంధర


    సీతాదేవికి తనతో ఎవరు మాట్లాడుతున్నదీ అర్ధంకావడం లేదు. కానీ గోపీ పిలుపు విని ఆమె చలించిపోతూ గోపీ, గోపీ, గోపీ అని అదేపనిగా అరుస్తోంది. గోపీ ఆ పిలుపు ఎట్నించి వస్తున్నదో అటే నడవసాగాడు. వాడికి దారి కనిపించడం లేదు. ప్రపంచం తెలియడంలేదు. వాడికున్న దొక్కటే ఆధారం... అదే కన్నతల్లి పిలుపు.

    తానెక్కడికి పోతున్నదీ వాడికి తెలియదు. కానీ వాడు నడుస్తున్నాడు. నడుస్తూనే వున్నాడు. తను సొరంగంలోంచి  బయటపడ్డానని గానీ, ఆలయం లోంచి బయటకు వచ్చాననిగాని, కొండ దిగుతున్నాననీ గాని వాడికి తెలియదు.

    తల్లి పిలుస్తోంది. ఆ పిలుపు వాడికి వినపడుతూనే వుంది.

    అలాగే వాడు సరాసరి తన యింట్లోని తన గదిలోకి వెళ్ళిపోయాడు.

    అంతవరకూ గోపీ గోపీ అన్న పిలుపుతో నిండివున్న ఆ గదిలో అప్పుడున్నపళంగా నిశ్శబ్దం ఆవరించింది. వున్నట్లుండి గదిలోకి అవతరించిన సన్యాసి శరీరుణ్ణి చూసి అంతా ఉలిక్కిపడ్డారు.

    పిలుపు ఆగిపోగానే గోపీ ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు వాడికి మంచంమీద స్పృహ లేకుండా వున్న తన శరీరం కనిపించింది. ఆ పక్కనే తల్లి కనపడింది.

    "అమ్మా!" అంటూ అరిచాడు వాడు.

    సీతాదేవి వాడివంకే చూస్తూ "స్వామీ! నా ప్రాణాలైనా తీసుకుని నా బాబు గోపీని రక్షించండి" అంటూ అరిచింది. ఆ స్వామి ఎవరని కూడా ఆమె ఆలోచించలేదు.

    అప్పుడు గోపీకి కర్తవ్యం గుర్తుకొచ్చింది. తన శరీరాన్ని సమీపించి "పెద్ద తాతయ్యా-నేనొచ్చేశాను-" అన్నాడు.

    అంతే! వాడి నోట్నించిలా మాటలు వెలువడ్డాయోలేదో సన్యాసి శరీరం దబ్బున నేలమీద పడింది. అంతా కంగారుగా ఆ సన్యాసిని సమీపించారు. సన్యాసి ఒక్కసారి కళ్ళు తెరిచి వాళ్ళను చూసి "నా ఈ శరీరం ఈ వాతావరణంలో ఎంతోసేపుండదు. నేను రఘురామయ్య ముత్తాత గోపాల్రావును. నన్ను సగౌరవంగా దహనం చేయండి. గోపీకింక ఏ ప్రమాదమూ వుండదు" అని కళ్ళుమూసుకున్నాడు.

    ఆతర్వాత కాసేపటికి గోపీ మామూలుగా లేచాడు. గోపాల్రావు తాతయ్య చచ్చిపోయాడు.


        *    *    *


    ఆ రాత్రి గోపీ ప్రశాంతంగా నిద్రపోయాడు. వాడికి కలలో ఓ విచిత్ర వ్యక్తి కన్పించి యిలా చెప్పాడు:

    "గోపీ! నేను జడ్యాగ్రహాధినేతను. నీ శరీరాన్నంటి పెట్టుకుని దాన్నెంతో శ్రమ పెట్టిన నీ తాతయ్యను వదల్చుకునేందుకు మెదడు వేడెక్కి అదుపు తప్పింది. అప్పుడే నీ తాతయ్య జీవశక్తి కొస ప్రాణాలకు వచ్చింది. నీ తల్లి పిలుపు నందుకుని నువ్వు రావడం కాస్త ఆలస్యమయుంటే నీ శరీరమే మరణించి వుండేది. కానీ మాటవిన్న మరుక్షణం కొస ప్రాణంతో తాతయ్య జీవశక్తుల్ని ఆయా శరీరానికి మార్పిడి చేశాడు. ఆ విధంగా నీ ప్రాణాలు దక్కించాడు.

    ఇప్పుడు నేను నీ కెందుక్కనిపించానంటే. నీకో ముఖ్య విశేషం చెప్పాలని! మా జడ్యాగ్రహవాసి సృష్టించిన అభేద్య మైన  సొరంగానికి తరతరాల చరిత్ర వుంది. ఆ చరిత్ర ఈ నాటితో అంతమయింది. అందుక్కారణమేమిటో తెలుసా? నీ తాత నీ రూపంలో వచ్చి తన శక్తితో నీ క్లాస్ మేట్ చలపతిని, పాల పాపారావును, కిళ్ళీ కొట్టు అప్పారావును చిత్తుచేశాడు. అందులో పెద్ద సారాంశం లేదని ఊరుకున్నాడు కానీ చాకలి కనకయ్యతో భోంచేయగలిగేడు. అయితే అందుకు వైజ్ఞానిక శక్తియే అవసరంలేదు. కృషిలో అవన్నీ సాధించవచ్చు.

    "ఎందుకంటే తల్లిని చూడాలన్న నీ కోరిక, నిన్ను బ్రతికించుకోవాలన్న నీ తల్లి తపన-ఈ రెండూ ఏకమై అసాధ్యమూ, అభేద్యమూ అయిన సొరంగమార్గంలో నీకు దారి చూపించాయి. వైజ్ఞానికంగా మీకంటే ఎన్నో కోట్ల రెట్లు ప్రగతిని సాధించిన మా అడ్డుగోడల్ని నీ తల్లి పిలుపు, తల్లిని కలవాలన్న నీ కోరిక భేదించాయి. కార్య దీక్షలో ఏమైనా సాధించవచ్చుననడానికింతకంటే ఉదాహరణ ఏం కావాలి?

    నిన్ను కన్న సీతాదేవి నీ తల్లి. నీ వున్న దేశం నీ తల్లి. నిన్ను తనపై నిలుపుకున్న భూమాత నీ తల్లి. ఆ తల్లుల కోసం నీవు జీవించు. వారి పిలుపు నీకు అసాధ్యాలను సాధ్యంచేసి, అభేద్యాలను భేదించి పెడుతుంది.

    "వైజ్ఞానికంగా మీ మానవులు సాధించిన ప్రగతి గొప్పదే! మీ మానవులకిప్పుడిక వైజ్ఞానిక ప్రగతి అవసరం లేదు. నీ సోదరులంతా నీకులాగే సుఖంగా వుండేందుకు, నీ చుట్టూ వాతావరణం ఎప్పటికీ సహజంగా వుండి నిన్ను రక్షించేందుకు కృషిచేయి."

    "కొందరు స్వార్ధపరులు చేస్తున్న దోపిడీ వల్ల నీ దేశంలోనే ఎందరో అన్నం లేక మాడిపోతున్నారు. మీ మానవులు వైజ్ఞానిక ప్రగతి పేరు చెప్పి భూమిని మనుష్యులకే నివాసయోగ్యం కానివిధంగా చేస్తున్నారు. ఈ రెంటినీ నివారించడానికి నీవు కృషిచేయాలి. నీలో పట్టుదల వుండాలి. ఇందుకు జడ్యాగ్రహాధినేతల సాయం నీకవసరం లేదు. సీతాదేవి, భారతమాత, భూదేవి చేతులెత్తి ఎలుగెత్తి నిన్నూ నీ సోదరులనూ పిలుస్తున్నారు. ఆ పిలుపు మీకు అందరికీ దారి చూపిస్తుంది. ఆ దారిలో నడవడమే మీకు, మున్ముందు తరాలకు శ్రేయస్కరం."

    ఇలా చెప్పి జడ్యాగ్రహాధినేత మాయమైపోయాడు.

    గోపీ అప్పటికింకా నిద్రపోతున్నాడు. వాడికి మెలకువ వస్తే తను లేవడమే కాక తన సహోదరులెందరినో నిద్రలేపగలడు.

    వాడు పొందిన అనుభవాలు సామాన్యమైనవి కనుకనా-వాడినిప్పుడు సామాన్యుడనుకునేటందుకు!

                    (అయిపోయింది)