Facebook Twitter
లేచిరా తల్లీ

 లేచిరా తల్లీ

                                                                                   - శారద అశోకవర్ధన్

   వాళ్ళు వెళ్ళగానే తలుపు ధబాల్న వేసి గడియ పెట్టింది పార్వతి. ఆ చప్పుడుకి  శివప్రసాద్ ఉలిక్కిపడ్డాడు. అవంతికి అర్ధమయిపోయింది, కాస్సేపట్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయా అన్నంత తీవ్రంగా పార్వతి స్థాయి పెరిగి దండకం మొదలెడుతుందని. అందుకే అవంతి అక్కడ కూర్చోలేక పక్కగదిలో కెళ్ళిపోయింది. శివప్రసాద్ కూడా లేవబోయాడు.

    "కూర్చోండి! ,మీరెక్కడికి? అది వెళ్ళగానే తోకలాగా మీరూ దాని వెనకాలే వెళ్ళాలా?" ఉరుములూ వుంది కంఠం శివప్రసాద్ మాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాడు. "వీళ్ళ మొహాలు చూస్తే మీకేమనిపిస్తోంది?" అదే స్థాయిలో ప్రశ్నించింది.

    మొహాలు చూసి ఏం చెబుతాం? వాళ్లు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని నాలుగయిదు రోజుల్లో ఏ సంగతీ చెప్తామన్నారుగా! చూద్దాం" అన్నాడు ప్రశాంతంగా శివప్రసాద్. ఆయనకి తెలుసు పార్వతి మూడ్ చూసి మాట్లాడడం. ఆమె అపరకాళిలా అరుస్తూంటే, ఆయన కంఠం అసలు పలుకదు.

    "ఏమిటి వాళ్ళు చెప్పేదీ మనం చూసేదీ? వాళ్ళ మొహాలు చూస్తే మీ కర్ధంకాలేదేమో కానీ, నాకర్ధమయింది. పచ్చి వెలక్కాయ తిన్నట్టు పెట్టారు మొహం."

    "అది నీ కాఫీ తాగుతున్నప్పుడు కాబోలు. కానీ, అవంతిని  చూస్తున్నప్పుడు  వాళ్ళకి అవంతి నచ్చినట్టుగానే  అనిపించింది నాకు." నెమ్మదిగా అన్నాడు నవ్వుతూ పార్వతి మూడ్ మార్చే ప్రయత్నంలో.

    "ఛ! ఊరుకోండి. జోక్ చెయ్యడానిక్కూడా, ఒక సమయమూ సందర్భమూ ఉండాలి. ఈ దేవేరి వాళ్ళకి నచ్చలేదు. ఈ శని నాకు ఒదిలేటట్టు  లేదు. వాళ్ళమ్మ కనిపారేసి కళ్ళు మూసుకుంది. నాన్న సంసారం కంటే సన్యాసమే  సుఖమని దేశాలు పట్టిపోయాడు. బోడి ఆరు తులాల బంగారం, పాతికవేలు ఇన్సూరెన్సు, పెళ్లెట్లా చెయ్యాలి? అక్క కూతురని ఆప్యాయంగా  ఆదర్శవంతంగా ఇంటికి పట్టుకొచ్చేశారు ఏం? తల్లి పోయేనాటికి  అవంతి పసిపిల్లేం కాదు కదా? పదో క్లాసు చదువుతోంది. ఏ హాస్టల్లోనయినా  పెడ్తే  ఏమయ్యేదంట?" ఆమె గబగబా  దండకంలా చదివేస్తోంది. "తల్లి తరువాత మేనమామంటారు. నేను ఈ ఊళ్ళోనే వుండగా  దాన్ని హాస్టల్లో పెడితే  నలుగురూ  ఏమనుకుంటారు? అయినా ఒకరనుకుంటారని కాదు. ఆమాత్రం  ఆ పిల్లకి అండగా  నిలిస్తే మన సొమ్మేం పోతుంది?" అదే స్థాయిలో  సమాధానం చెప్పాడు శివప్రసాద్.

    "ఛస్తున్నాను చాకిరీ చెయ్యలేక నీతులు నేనూ చెప్తాను." మరింత రెచ్చిపోతూ  అంది పార్వతి.

    ఏమిటే నువ్వు దానికి చేస్తున్న చాకిరీ? మెట్రిక్ ప్యాసయిందో లేదో చదువు మాన్పించి, దానిచేత  ఇంటెడు చాకిరీచేయిస్తున్నావు. వాళ్ళమ్మే బతికుంటే అది ఈ రోజు లక్షణంగా ఏ ఎమ్.ఎ.నో చదివుండేది అది నీకు చాకిరీ చేస్తొందే. నువ్వు  చేస్తూన్నదేమిటి దానికి తిట్లు, శాపనార్ధాలూ పెట్టడం తప్ప?" ఈసారి శివప్రసాద్ కోపం తారాస్థాయికి చేరుకుంది.

    "ఏదో కాస్త ఇంట్లో పనిచేస్తే ఆ సుకుమారి కందిపోతుందా? దురదృష్ట జాతకురాలు ఎమ్.ఏ.లూ ఎమ్ బి.బి.ఎస్ లూ చదివే అదృష్టం వుంటే తల్లినెందుకు  మింగేస్తుందీ? ప్రతిసారీ పెళ్ళి చూపులంటూ  ఎవరో రావడం, కాఫీలు, ఫలహారాలు చెయ్యడం, వాళ్ళవన్నీ మెక్కి వెళ్ళడం, ఆ తరువాత నచ్చలేదనో గిచ్చలేదనో తిరిగి చూడక పోవడం ఇప్పటికి పదిసార్లయింది. నే వేగలేను. ఈ తతంగం అంతా నేను పడలేను గనకే మూడోసారి గర్భవతినని  తెలిశాక స్కానింగ్ చేసినపుడు ఆడపిల్ల అని తెలీగానే గర్భవిచ్చేదం చేయించుకున్నాను." కోపంలో  గబగబా అనేసి నాలిక్కరుచుకుంది పార్వతి.

    "ఏమిటీ ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు శివప్రసాద్.

    ".... ....    ....."

    "మాట్లాడవేం?" గద్దించాడు.

    "ఏమిటి, మాట్లాడేది, చెప్పానుగా  సురేష్, సుభాష్ చక్కగా  రెండు కళ్ళలా ఇద్దరు మొగపిల్లలుండగా ఆడపిల్ల అనవసరపు ఖర్చని, మీరు టూరెళ్ళినప్పుడు  ఆ పని చేశాను." లాభం లేక నిజం చెప్పేసింది పార్వతి.

    "ఓసి దౌర్భాగ్యురాలా! ఎంత పనిచేశావే! ఇంటికి ఆడపిల్ల వుంటే ఎంత అందమే! ఆప్యాయతా అభిమానానికి నిలయమే ఆడపిల్లలు. అలా ఎలా చెయ్యగలిగేవ్? నువ్వాడదానివి కావా? మీ అమ్మ నీలాగ అనకుంటే  నువ్వెక్కడుండే దానివిప్పుడు? అంత నీచానికెలా ఒడిగట్టగలిగావ్? నిన్ను చంపినా  పాపంలేదు" కోపంతో  వొణికిపోయాడు శివప్రసాద్.

    అవంతి గుండెలో  గునపం  గుచ్చుకున్నట్టయింది పార్వతి మాటలు.ఆమెకి పార్వతి రాక్షసత్వం, తనను తిట్టేతిట్లూ, పెట్టే శాపనార్ధాలు ఆలవాటయి పోయినా, అంతా మామయ్య మొహం చూసి, అతని మంచితనం చూసి ఊరుకుంది. కానీ ఈ నిముషంలో  ఆమె నోటినుంచి తను విన్న మాటలకి  షాక్ కొట్టింది. చెంపలమీదుగా కన్నీరు జలజలా రాలి గుండెని తడిపేస్తున్నాయ్.

    "వెధవ దరిద్రం. శనిలా దాపురించింది నాకు. వాళ్ళమ్మ లాగే ఇదీ చస్తేపోయేది. నన్ను చంపేలా వుంది. నా కాపురంలో నిప్పులు పొయ్యడానికే నా ఇంటికొచ్చినట్టుంది. లేకపోతే  ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో  దాచుకున్న  ఆ విషయం ఇవ్వాళ  ఇలా నోరు జారి బయటపడింది" అంటూ  మళ్ళీ దండకం అందుకున్న అత్తయ్య నోరు ఒక్కసారిగా మూతపడడం, "చెళ్ళు" మని కొట్టిన చప్పుడూ ఒక్కసారే జరగడంతో  వొణికిపోతూ అటుకేసి తొంగిచూసింది అవంతి. మామయ్య రుద్రనరసింహుడిలా వున్నాడు - కోపంతో ఊగిపోతూ.

    "కొట్టండి! చంపండి! దానికోసం  మీరేమైనా చేస్తారు. నాకన్నా మీకది ఎక్కువయిందేం?" రొప్పుతూ సెగలు కక్కుతూ అంది.

    "ఛీ....నోర్మూసుకో!......" అసహ్యంగా ఆమెకేసి చూసి బయటకెళ్ళిపోయాడు శివప్రసాద్.

    "ఎందుకు నోర్మూసుకోవాలి? మీరొక్కరే మామయ్యున్నారా దానికి?? ఎవరూ రమ్మని దగ్గరుంచుకోలేదే మీలాగా! మీకేనా అది అక్క కూతురు? ఎవరికీ లేని ప్రేమ మీకే ఎందుకు? అసలది నన్ను చంపడానికే బతికున్నట్టుంది.     
లేకపోతే ఏ రోగమో వొచ్చి పోగూడదూ ఇది కూడా, లేకపోతే ఉరేసుకు చావకూడదా? ఇప్పటివరకూ  పదిమంది చూసి వెళ్ళారు. ఒక్కరికీ నచ్చలేదే? వీళ్ళకి మాత్రం నచ్చి చస్తుందా? ఛీ....ఛీ!" శివప్రసాద్ అక్కడ లేకపోవడంతో మరీ గట్టిగా అరిచింది పార్వతి. పార్వతి ప్రతీమాటా ములుకుల్లా గుచ్చుకున్నాయి అవంతికి. "ఇంతకుముందు ఆమె అన్నట్టుగానే  పదిసార్లు పెళ్ళివారొస్తున్నారని, పట్టుచీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నింటికీ తలొంచుకుని సమాధానాలు చెప్పడం, పెళ్ళికొడుకూ  ప్లస్ అతనితో వచ్చిన వాళ్ళందరూ తినేసేలా తనని చూడడం, అత్తయ్య కాఫీలు, ఫలహారాలు ఇవ్వడం వాళ్ళందరికీ, ఆ తరువాత కట్నాలు సరిపోవనో, పిల్ల చదువు సరిపోలేదనో, ఉద్యోగంచేసే పిల్ల కావాలనో, ఏదో వంకతో కాన్సిల్ చేసుకోవడం. సంతలో పశువులా ఎన్నిసార్లు  తను అందరి ఎదుటా అలా కూర్చుంది? ఛీ....తనకైనా సిగ్గుండాలి" అనుకుంటూ  ఆ మూల అలాగే చతికిలబడి గంటలకొద్దీ ఏడ్చింది.

    పార్వతి దండకం చదువుతూనేవుంది. ఆ తరువాత అలసిపోయినదానిలా నోరు మూసుకుని పనిలో పడిపోయింది. వాతావరణం తుఫానొచ్చి వెలిసినట్టుగా  వుంది. అప్పుడే బయటినుంచి లోపలికి అడుగు పెట్టిన శివప్రసాద్ అవంతి దగ్గరకొచ్చి "నువ్వింకా ఇలాగే కూర్చున్నావా? మీ అత్తయ్య మాటలకి బాధపడుతూ ఏడుస్తున్నావా తల్లీ! బాధపడకమ్మా.. నీకూ మంచి రోజులొస్తయ్! నాకెందుకో ఇందాకొచ్చి వెళ్ళిన ఈ బ్యాంకబ్బాయి సంబంధానికి నువ్వు నచ్చావనే అనిపిస్తోంది. అబ్బాయి తల్లీ, తండ్రీ కూడా ఉత్తముల్లాగే అనిపిస్తున్నారు" అన్నాడు అవంతి తలని ఆప్యాయంగా నిమురుతూ. అవంతి పసిపిల్లలా అతణ్ణి చుట్టేసి బావురుమంది. అతడి కళ్ళూ తడయ్యాయి! రెండు హృదయాలూ  ఆప్యాయపు జల్లులలో తడిసి చల్లబడ్డాయి. అవంతి లేచివెళ్ళి బట్టలు మార్చుకుని పనిలో పడిపోయింది.

    దాదాపు రెండు వారాలు గడిచిపోయినా పెళ్ళివారి నుండి పిల్ల నచ్చినట్టు గానీ, నచ్చనట్టుగానీ సమాధానం రాలేదు. "వీళ్ళకీ ఏవో అడ్డొచ్చిందా? నచ్చనట్టేనా? మరోసారి పెళ్ళిచూపులకి సిద్ధంకావాలి కాబోలు!" అవంతి గుండెల్లో గుబులు అలుముకుంది. దానికితోడు ఆ రోజే పార్వతి మళ్ళీ ఆమె పురాణం మెదలెట్టింది.

    "పంచాంగం విప్పావా? ఇంకా లేదే అనుకుంటున్నా!" అన్నాడు శివప్రసాద్.

    "ఈసారి పెళ్ళిచూపులూ అని ఎవరన్నా అన్నారో, 'దానికి పెళ్ళి కాదు, మీరు రాకండి' అని ముందే చెప్పేస్తా. ఆ తంతంగం ఇంక నావల్ల కాదు" ఖచ్చితంగా అంది పార్వతి. ఆ మాటలు అవంతి చెవుల్లో రింగుమన్నాయ్. ఏ పనిచేస్తున్నా ఆ మాటలే గుర్తుకొస్తున్నాయ్ నీరసం ముంచుకొచ్చింది. గబగబా బాతురూంలోకెళ్ళి తలుపులు మూసుకుంది.

    ఇల్లంతా ఏడ్పులతో పెడబొబ్బలతో బంధువులతో, స్నేహితులతో, అయినవారితో, కానివారితో  క్రిక్కిరిసిపోయింది.

    "బొద్దింకల మందు తాగేసిందంట! ఏం పోయేకాలం?" అంది ఒకావిడ.

    "ఏమోనమ్మా, ఈ కాలపు  పిల్లల్ని ఎవరు నమ్మమన్నారు? ఏం తిరుగుళ్ళు తిరిగిందో! కడుపో కాలో వొచ్చుంటుంది, చచ్చూరుకుంది." మరో ఆవిడ గుసగుస.

    "అందులో తల్లీతండ్రీ లేరాయె. చెప్పేవాళ్ళెవరూ, మంచీ చెడునూ." దీర్ఘం తీసింది మరో గొంతు.

    అంతలో శవం చీర కొంగుముడిలో  ఈ ఉత్తరం దొరికిందని  ఓ ఉత్తరాన్ని ఇనస్పెక్టర్ గారికి తీసిచ్చాడు పోలీస్ కానిస్టేబుల్.

    ఇన్స్ పెక్టరు అది చదివి శివప్రసాద్ కిచ్చాడు. శివప్రసాద్ కి అక్షరాలు కనబడడం లేదు. మెల్లగా కూడబలుక్కుని, కళ్ళు తుడుచుకుని, పైకే చదివాడు.

    "మామయ్యా, అవంతి నమస్కారం! ఇదే నా తుది నమస్కారం. పెళ్ళి కొడుకుల వేటలో, పెళ్ళిచూపుల సంతలో అమ్ముడుపోని, అమ్ముడు కాని దౌర్భాగ్యురాలిని. ఆ తతంగంలో అత్తయ్యే కాదు, నేనూ విసిగిపోయాను. ఈ నికృష్టపు జీవితానికి స్వస్తి చెప్పాలని, మా అమ్మను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ వుంటే నీ కడుపునే పుడతాను. అత్తయ్యతో చెప్పు ఆడపిల్లగా మాత్రం పుట్టను. ఉంటాను. బతికి అత్తయ్యనీ, చచ్చి నిన్నూ బాధ పెడుతున్నాను. ఏం చెయ్యను? నీకూ అత్తయ్యకూ నా చివరి నమస్కారం. నన్ను మన్నించండి.

                                                                                                           ఇట్లు
                                                                                                       అభాగిని
                                                                                                    అవంతి"   

    ఉత్తరం చదివి ఘొల్లుమన్నాడు శివప్రసాద్. అక్కడున్న వాళ్ళందరి కళ్ళూ వర్షించాయి. అవంతి కేసి చూసి కన్నీటి బొట్లు రాల్చని వారు లేరు. భగవంతుడూ కరిగిపోయాడేమో! 'టెలిగ్రాం' అన్న పిలుపు విని అందరూ అటుకేసి చూశారు. గుంపులోంచి  ఎవరో వెళ్ళి సంతకం చేసి టెలిగ్రాం అందుకున్నారు.

    'బాయ్....లైక్ డ్ ది.... గర్ల్....ఫిక్స్ ది మ్యారేజ్ నెక్ట్స్ మంత్.... నో డౌరీ రిక్వైర్డ్ ప్లీజ్...."

    పిచ్చివాడిలా అరిచాడు అది చదివిన శివప్రసాద్ "అవంతీ.... లేచి రావమ్మా...." అంటూ....అతడి మాటలకి భూమి దద్దరిల్లింది!

    ఆకాశం కంపించింది!

    మేఘాలకి చిల్లులు పడ్డట్టు వర్షం ప్రారంభమయింది! కన్నీరు, వర్షపు నీరూ సెలేరులా ప్రవహించింది. అందులో ఆనందంగా సాగించింది అవంతి తన ప్రయాణాన్ని! అవంతీ. ఎందుకమ్మా తొందరపడ్డావ్? ఈ పెళ్ళి కొడుకుల సంతలో నువ్వు అమ్ముడుపోనందుకు, నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికే దాకా ఆగినందుకు నువ్వు గర్వపడాలమ్మా! సిగ్గుపడవలసిందీ, తలదించుకోవలసిందీ సమాజమమ్మా! నువ్వు కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికాడు తల్లీ! లేచిరా! అమ్మా....అవంతీ...."

    అతనిని ఆపటం జనానికి సాధ్యం కావడం లేదు.... మబ్బులు కమ్మేసి వర్షం తీవ్రమై అందరినీ తమేస్తోంది!