Facebook Twitter
సూసైడ్-నోట్

 

సూసైడ్-నోట్

                                                                                                                              - సంహిత్

                                                

   

     మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు. ఇవన్ని కలిసి మనిషి సమర్దవంతుడైన సరే  సొమ్మసిల్లునట్లు చేస్తున్నాయి.ఈ సమస్యలనేవి మనిషి నే తన కంట్రోల్ లో చేసుకొని తను చెప్పినట్లు ఆడిస్తున్నాయి.దీని నుండి బయటపడేటట్లు మనిషి ఎంత ప్రయత్నించినా అది చాలా కష్టతరమవుతుంది.అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది అని ఆలోచిస్తే మనకు కొంతమేరకు అర్దమవుతుంది.

                                                   * * * * * * *

   ఆ రోజు తెల్లవారుఝామున్నే అందరికంటే ముందుగా లేచాడు "రాజు". కాలేజ్ కి వెళ్ళేప్పుడు   ఎన్నడూ ఇంత పొద్దున్నే లేచేవాడుకాదు.వేడి నీళ్ళతో తల స్నానం చేసి, వాళ్ళ అమ్మ,నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు.తను ఎప్పుడు కాలేజ్ కి వెళ్ళే దారిలో ఉండే బాబాయ్ హొటల్ కి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ తిరిగిరానివాడు చెప్పినట్లుగా బాబాయ్ కి వీడ్కోలు చెప్పి అక్కడనుండి బయలుదేరాడు.తను వెళ్ళే దారిలో చెట్లు,చేమలు అన్ని అతనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.అయిన ఏమీ అలోచించకుండా,వెనక్కి చూడకుండానే తను వెళ్తున్నాడు. వీటన్నింటికి తెలియదు తను ఇక మళ్ళీ ఆ దారిలో రాలేడని. ఇంతకి తను ఎక్కడికెళ్తున్నాడో తెలుసా.... "ఆత్మహత్య" చేసుకోడానికి......

రాజు ఎందుకు చనిపోవాలనుకున్నాడంటే....రాజు వాళ్ళ నాన్న(రామకృష్ణ) ఒక ప్రైవేట్ ఎంప్లాయ్.ఒకటో తారీఖు వచ్చేసరికి జీతం కన్నా వాళ్ళు ఇవ్వాల్సిన అప్పులవాళ్ళు ఇంటికొస్తారు.చాలి చాలని ఆ జీతం తో రాజు వాళ్ళ నాన్నరామకృష్ణ ఎలాగోలా ఇంటి బండి ని లాక్కొస్తున్నారు.

సరైన అవగాహన లేక రామకృష్ణ గారు, రాజు వాళ్ళ గురించి చాలా అప్పులు చేస్తారు.ఇప్పుడు రాజు చేతికి వచ్చాడు అప్పులు తీర్చగలడు కాని తను దేనిలోనైనా ఒక దానిలో సెటిల్ అవ్వడానికి ఒక సంవత్సరం అయినా పడుతుంది.కాబట్టి ఇప్పుడే ఇంటి బాధ్యతలను తీసుకోలేడు.ఒక రోజు ఆ అప్పులబాధ భరించలేక రామకృష్ణ గారు రాజు ని పెళ్ళి చేసుకో, ఎంతో కొంత కట్నం వస్తుంది.దానితో మన అప్పులన్నీ తీరిపోయి హ్యాపీ గా ఉండవచ్చునని అంటారు.అది చెప్పడానికి బాగుంది కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఉద్దేశం లేదు అని రాజు వాళ్ళ నాన్న రామకృష్ణ గారితో చెబుతాడు.

నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి ఎంతో కొంత సంపాదిస్తుంటే బాగుంటుంది. అప్పటిదాక నేను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను.కానీ రోజు రోజు కి ఇంట్లో సమస్య లు ఎక్కువవుతున్నాయ్.వీటన్నింటిని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనిపిస్తుంది,కాని వాళ్ళని వదిలి ఉండలేను.కాబట్టి శాశ్వతంగా వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నా.అని ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్తాడు రాజు.

అంతకు ముందే చూసుకున్న సూసైడ్ స్పాట్ దగ్గరకువస్తాడు. అక్కడ ఆల్‍రెడీ ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు.అతనితో మట్లాడిన కొద్దిసేపటికే రాజు కి తెలుస్తుంది,అతను కుడా సూసైడ్ చేసుకోడానికే వచ్చాడని.అప్పుడు రాజు కు కారణం అడగాలనిపించలేదు ఎందుకంటే ఎవరికి సంబందించిన బాధలు వారికి ఉంటాయి కదా అని.మాటల సందర్బంలో తన పేరు రాజు అని చెప్పి,మీ పేరు... అని అతన్ని అడుగుతాడు.అతడు తన పేరు ఆనంద్ అని సమాధానమిస్తాడు.కొద్దిసేపటి తర్వాత అక్కడకు శ్రీను అనే ఇంకో వ్యక్తి వస్తాడు.తనుకుడా అదే ఘనకార్యం చేద్దామనే వచ్చింది.ముగ్గురూ మాట్లాడుకొని ఆలోచిస్తుంటారు ఎవరు ముందు చావలి అని....

ఇంతలో ఆనంద్ ... మీ సమస్యలెమిటో నాకు తెలియదు కాని నాది చాలా పెద్ద సమస్య "సో" నేను ముందు చనిపోతాను...ప్లీజ్...ప్లీజ్....అంటూ

వేడుకుంటాడు.

రాజు తనకు తెలిసిన అనుభవంతో చనిపోయే ముందు మనకు బాగా ఇష్టమైన, కాన్ఫిడెంట్ అని అనుకున్న పనిని చేసి చనిపోతే స్వర్గానికి చేరుతాం అని అంటాడు.అప్పుడు శ్రీను, తనకు రేపు ఎక్జామ్ మొబైల్ కంప్యూటింగ్ ఉందని,ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని,దానిలో మా కాలేజ్ ర్యాంకర్ కన్నా కూడా నేనే బాగా రాస్తాను.అది మా ఫ్రోఫెసర్ కి కూడా తెలుసు అని అంటాడు. అయితే నువ్వు రేపు ఆ ఎక్జామ్ రాసి సాటిస్ఫైడ్ అయ్యి అప్పుడు చనిపో అని చెబుతాడు రాజు.

మరి .. నువ్వు ఏం చేస్తావు? అని రాజు ను శ్రీను అడుగుతాడు.నేను సాటిస్ఫై కావడానికి చిన్న చిన్న పనులు ఏమి లేవులే వాటికి చాలా తతంగం ఉంది. అయిన పర్వాలేదు నేను ఎల్లుండు చస్తా అని అంటాడు.

మీరు ఎప్పుడైన చనిపోండి నేను మాత్రం ఈ రోజు కచ్చితంగా చనిపోవాల్సిందే అని అంటాడు ఆనంద్. అయితే సరే నీ ఇష్టం అని అనుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోతారు రాజు,శ్రీను లు.

ఆనంద్, నాన్న నన్ను క్షమించండి అనుకుంటూ అక్కడవున్న బావి లో దూకి చనిపోతాడు.

ఆనంద్ చనిపోయాడని విషయం తెలిసిన వెంటనే పరుగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రాజు. అప్పుడు తనలో తాను ఇలా మదనపడ్డాడు...నిన్న నాతో గంటల కొద్దీ మట్లాడిన ఆనంద్ ఇప్పుడు శవమై పడి ఉన్నాడు.

ఆనంద్ చనిపోయాడని తెలిసి స్ప్రుహ కోల్పోయిన ఆనంద్ వాళ్ళ అమ్మగారు.శవం పై మీద మీద పడి ఏడుస్తున్న వాళ్ళ నాన్న.ఇంతకీ తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అని తన రూమ్ లోకి వెళ్ళి చూసా అక్కడ ఏదో పేపర్ మే బి అది ఆనంద్ రాసినదే అనుకుంటా అని వెళ్ళి దాన్ని చూసా. యస్ అది ఆనంద్ రాసిన "సూసైడ్-నోట్".

ఆనంద్ కి వాళ్ళ నాన్న ఒకసారి లక్ష రూపాయలు దాయమని ఇస్తే వాటిని పోగొట్టుకొని వస్తాడు.అవి పోయిన విషయం వాళ్ళ నాన్న కి చెప్పడానికి భయపడతాడు, ఎందుకంటే ఆనంద్ వాళ్ళ నాన్న మనుషులకంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తాడు.ఒకవేళ ఆనంద్ ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఆనంద్ ని చంపేస్తాడని అతడి భయం...

శవం పై మీద మీద పడి ఎడుస్తున్న వాళ్ళ నాన్న కు అది తెలిసి ఇంకా ఎక్కువగా రోదిస్తూ....

అయ్యో దేవుడా లక్షరూపాయలు పోగొట్టుకున్నావని చనిపోయావా.ఇక మిగిలిన లక్షల ఆస్తి ఎవరు అనుభవిస్తారు రా నాన్న....అంటూ బిగ్గరగా ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతాడు.

ఎంత విచిత్రం అదే విషయం ఆనంద్ వాళ్ళ నాన్నకు ముందే చెప్పితే ఎంత బాగుండేది అనిపించింది ఒక్కసారి రాజు కి...

ఇంతలో ఈ రోజు సూసైడ్ చేసుకోబోయే శ్రీను గుర్తుకువస్తాడు.వెంటనే అక్కడ నుండి బయలుదేరి శ్రీను వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటాడు.ఇంతలో శ్రీను నే ఎదురై ఆనంద్ ని చూసొచ్చావా అని రాజు ని అడుగుతాడు.అవును అన్నట్లుగా తల ఊపిన రాజు ని చూసి కంటతడి తో ఇలా అంటాడు......

కష్టమో,నష్టమో ఏదైనా బ్రతికి సాదిద్దాం చచ్చి ఏం ప్రయోజనం అని.....

ఇలా తను మాట్లాడుంటే రాజు కు కూడా ఏంతో సంతోషంగా అనిపించింది.

ఆనంద్ చావు శ్రీను లో కొంత మార్పును తెచ్చింది.తను చనిపోవాలి అని అనుకున్న డెశిషన్ మార్చుకున్నాడు.

అప్పుడు శ్రీను ని రాజు అడిగాడు అసలు నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నవని,దానికి శ్రీను సమాదానమిస్తూ.. నాన్న ప్రతీరోజు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అయ్యా!!మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి,ఈ కాక హొటల్ ని పెద్ద 5 స్టార్ హొటల్ చేయాలని అంటూ ఉంటాడు.కాని రాస్తున్న ఎక్జామ్స్ లో మూడు సబ్జెక్ట్స్ సరిగా రాయలేకపోయా అంటాడు.అందుకే నాన్న ఆశలను నేను నెరవేర్చలేకపోతున్న అందుకే చావాలనుకున్నా. కాని ఆనంద్ ని అలాచూసి ఏదైనా బ్రతికిసాధిద్దాం అని అనిపించింది.

అప్పుడు సూసైడ్ చేసుకోవాలనే వారికి ఏం చెప్పి వారిని ఆపాలో తెలిసేది కాదు. కాని ఇప్పుడు మాత్రం జీవితం యొక్క విలువేంటో కొంచెం చెప్పగలను అని అనిపిస్తుంది అనుకున్నాడు రాజు.

చనిపోతే భాధలు,సమస్యలు అన్నీ తీరిపోతాయని అందరూ అనుకుంటారు కానీ మిగిలున్న వారికి ఎంతో భారం అవుతుందని ఇప్పుడే తెలిసింది..

ఇప్పుడు జెనరేషన్ లో సూసైడ్ ఒక ఫ్యాషన్ అయ్యింది.అదృష్టం కలిసిరాక కొంతమంది,అప్పులబాధ బరించలేక కొంతమంది,లవ్ ఫెయిల్ అయ్యిందని కొంతమంది,ఎక్జామ్ ఫెయిల్ అయ్యారని ఇంకొంతమంది.అమ్మ తిట్టిందని,నాన్న కొట్టాడని,పరువు పోయిందని,కష్టపడినా ఫలితం దక్కలేదని కొంతమంది,బాధ్యతలు ఎక్కువయ్యాయని,తగ్గని రోగం తనకు ఉందని ఇలా చాలా రకాలుగా కారణాలు ఉన్నాయి సూసైడ్ చేసుకోడానికి.

జీవితం అనేది చాలా విలువైనది.ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనిషి గా పుట్టడం జరగదు.అలాంటి జీవితాన్ని ఏవో చిన్న,చిన్న సమస్యలకు బలి ఇవ్వడం ఎంతవరకు సమంజసం.తప్పు చేసిన వారైన సరే "ఆత్మహత్య" చేసుకోవడం అనేది చాలా నేరం.

ఒక ఊరిలో దుర్మార్గుడు,బహిష్కరింపబడిన వాడు వేరొక ఊరిలో రాజు లా బ్రతుకవచ్చు.

ప్రపంచం మొత్తం నాశనమై నువ్వు ఒక్కడివే బ్రతికి ఉన్న మళ్ళీ నువ్వే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలవు అంత శక్తి ఉంది మనిషికి... ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించినది మనిషే కదా...! అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.