Facebook Twitter
ఇలాంటి మగాళ్లూ ఉంటారా

ఇలాంటి మగాళ్లూ ఉంటారా

                                                                                                       శ్రీమతి శారద అశోకవర్ధన్


    సముద్రపు అలలు కేరింతలు కొడుతూ పరుగులు పెట్టి ఆడుకుంటున్న పిల్లల్లా ఒడ్డుని తాకి మళ్ళీ వెనక్కి వెళుతున్నాయి. సంధ్యచీకట్లు అలుముకుంటున్నాయి. సముద్రపు ఒడ్డున  జనసంచారం లేదు.

    రాజశేఖరం ఇసకను  తన్నుకుంటూ, ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ మెల్లగా నడుస్తున్నాడు. అతని దృష్టి దూరంగా  ఓ చోట ఇసకలో కూర్చుని  సముద్రంవైపు  చూస్తున్న  ఓ స్త్రీ మీద పడింది.

    ఒంటరిగా ఉన్న ఆ స్త్రీని  చూడగానే  రాజశేఖరం  మనసులో ఏదో అనుమానం కలిగింది. అంతలోనే  ఆమె పైకిలేచి నిలబడి  సముద్రపు  అలలవైపు  గబగబా  నడవటం అతనిలో  ఆందోళన కలిగించింది.

    అంతే, రాజశేఖరం  ఆలస్యం  చేయకుండా  వేగంగా  ఆమె వైపు పరుగుతీశాడు.

    సముద్రపు అలలు ఆమె కాళ్ళను తాకాయి. ఆమె గభాల్న ముందుకి వంగింది. రాజశేఖరం  ఒక్క ఉదుటున ఆమెను చేరి ఆమె చెయ్యిపట్టుకుని బలంగా  వెనక్కిలాగాడు. ఆమె విసురుగా  వెళ్ళి వెనక్కి పడింది. ఒక్కసారిగా  కెవ్వున  అరిచింది.

    రాజశేఖరం ఆమె దగ్గరకు నడిచాడు. "నన్నేం చేయకండి ప్లీజ్!" ఆమె కలవరిస్తున్నన్నట్లుగా  అరిచింది.

    "నేను మిమ్మల్ని  ఏమీచేయను, భయపడకండి."  అన్నాడు రాజశేఖరం.

    అతని  కంఠంలోని సౌమ్యం, మనిషి ప్రవర్తననుబట్టి  అతని వలన తన కెలాంటి  హానీ  కలగదని అనిపించిందామెకి.

    మెల్లగా లేచి నిలబడింది.

    రాజశేఖరం ఆమె దగ్గరగా వచ్చాడు.

    "మీరు చదవుకున్నవారిలా ఉన్నారు. ఆత్మహత్యా ప్రయత్నం  చేయటం తప్పుకదా! క్షణికావేశంలో నూరేళ్ళ నిండు జీవితాన్ని బలిపెట్టేందుకు  ఎందుకు సిద్ధపడ్డారు?" అన్నాడు రాజశేఖరం.

    ఆమె చిన్నగా నవ్వింది.

    "మీరు పొరపడ్డారు. నేను ఆత్మహత్య చేసుకొనేంత  బలహీనురాలిని  కాను. సముద్రపు  అలలతో నా గోడు చెప్పుకొని సేద తీరాలని  ఇక్కడికి  వచ్చాను. అంతే!" అందామే.

    "నాతో అబద్ధం  చెప్పినంత మాత్రాన దాన్ని నిజమని నమ్ముతానని మీరనుకుంటున్నారేమో! మీరు ఉన్నట్లుండి సముద్రంలోకి  నడిచివెళ్ళటం చూసే, నేను పరుగున  వచ్చి మీ చెయ్యిపట్టుకు లాగాను, చావాలని వచ్చిన వాళ్ళంతా  ఇలా మధ్యలో అవాంతరం రాగానే తాము చేయబోయే  తప్పుని కప్పి పుచ్చుకోవడం కోసం, ఇలా జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళలా  మాట్లాడుతారు. మేకపోతు  గాంభీర్యం ప్రదర్శిస్తారు." ఆమెను మందలిస్తున్న  ధోరణిలో అన్నాడు రాజశేఖరం.

    "నన్ను అనవసరంగా  అపార్ధం చేసుకొంటున్నారు. కెరటాలు  ఒడ్డుకి నెట్టుకు వచ్చే సముద్రపు గవ్వల్ని ఏరుకొనేందుకే నేనలా వెళ్ళాను. ఆత్మహత్య చేసుకొనే  ఆలోచన  నాలో ఏ కోశానా లేదు" అంది ఆమె గంభీరంగా.

    "మరి నేను మిమ్మల్ని చెయ్యిపట్టుకు  లాగగానే  అలా ఎందుకు గావుకేక పెట్టారు?" తన సందేహాన్ని  వ్యక్తం చేశాడు రాజశేఖరం.

    "నా జీవనయానంలో నేను  ఎదుర్కొన్న  సంఘటనల ఛాయలే నన్నలా  భీతితో అరిచేలా  చేశాయి! నా బతుకులోని  ఎత్తు పల్లాలను  పోలిన  ఈ ఇసుక తిన్నెలను చూస్తూ  ఎలాంటి కాలుష్యంలేని, కపటంలేని  ఈ సాగర కెరటాలతో నా భాదను చెప్పుకొని  సేదతీరాలని నేనిక్కడికి వచ్చాను. అది ఎవరినీ ఇబ్బంది పెట్టే పనికాదుగదా!" అంది ఆమె జీవం లేని ఒక నవ్వు నవ్వుతూ.

    ఆ మసక చీకట్లో  ఆమె నవ్వుకి అర్ధంగానీ అసలు ఆ నవ్వుగానీ రాజశేఖరంకి తెలియలేదు.

    "ప్రాణంలేని  ఆ కెరటాలతో  మీ వ్యధ చెప్పుకొంటే  ప్రయోజనం  ఏముంటుంది? ఆలోచించి  ఆదుకొనే  మనుషులకి చెప్పుకుంటే  కొంత ఫలితం ఉంటుందేమో?" అన్నాడు రాజశేఖరం.

    ఆమె పెదవి విరిచింది నవ్వింది.

    "ఈ సమాజంలోని  మనుషుల మీద నాకు నమ్మకం పోయింది. వాళ్ళ కంటే  ఈ చెట్లు, చేమలు, ఇసుకతిన్నెలు, సముద్రపు కెరటాలు వెయ్యి రెట్లు నయం. అందుకే వాటితో నా మనో వేదన చెప్పుకొని  ఊరట చెందాలనుకుంటున్నాను. 'జీవమున్న మనిషికన్నా  ఈ శిలలే నయం' అని సినారే రాసిన పాట మీకు తెలిసే ఉంటుంది. అందుకే  నేనీ నిర్ణయానికొచ్చాను" అందామె.

    "మీకు ఎదురైన సంఘటనలు  మీలో అలాంటి మార్పుని  తెచ్చాయని నాకు అర్ధమయింది. అలా అని సమాజంలోని  అందరు మనుషులూ  మీరనుకున్నట్లుంటారనుకోవటం పొరపాటు. మీకు అభ్యంతరం లేకపోతే  మీ ఆవేదనలో  నన్నూ పాలు పంచుకోనిస్తారా? మీ బాధ ఏమిటో చెప్తారా?" సందేహిస్తూనే అడిగాడు రాజశేఖరం.

    "ఒంటరిగా ఆడది కనిపిస్తే వెకిలివేషాలు  వేసే మగమహారాజులున్న  ఈ రోజుల్లో మీలాగ సానుభూతి చూపి, ఎదుటివారి కష్టాన్ని  తెలుసుకొని సాయం చేద్దామనే తత్వంగలవాళ్ళు ఉండటం అరుదు. మీ మొదటి పలకరింపులోనే  మీలోని సంస్కారం, మంచితనం అర్ధమయ్యాయి. కానీ, నా చితికిన బతుకుని గురించి ఏమని చెప్పను?" ఆవేదనగా అందామె.

    "మీ కథ చెప్పండి!"

    ఆమె నవ్వింది.

    "కథేమిటి సార్? జీవన సత్యాలు. గుండెలను మండించే  యదార్ధచిత్రాలు ఏమని చెప్పను? ప్రేమించి పెళ్ళాడినవాడు ప్రేమ ఇగిరిపోగా, పెళ్ళిని వ్యాపారానికి పెట్టుబడిగా మార్చి కర్కోటకుడిగా మారి, నలుగురికీ నన్ను తార్చటానికి సిద్ధపడగా, నేనెందుకు వప్పుకోలేదని  నన్ను నానా రకాలుగా హింసలు పెట్టి నరకాన్ని చూపిస్తే భరించలేక ఆ బంధనాలు తెంచుకొని బయటపడ్డానని చెప్పనా?

    శాడిస్టు భర్త పెట్టే హింసల నుంచి విముక్తి  పొందేందుకు విడాకులు ఇప్పించమని  సాయంకోరితే, విడాకులిప్పించిన తరువాత నువ్వు ఒంటరిదానివి అయిపోయాక  నాకు ఉంపుడుగత్తెగా ఉండి  నా ఫీజుని చెల్లిస్తావా అని అడిగిన ప్లీడరును పెళ్ళు పెళ్ళున చెంపలు వాయించానని చెప్పనా?

    ఆ తర్వాత  మహిళాకోర్టు సాయంతో విడాకులు పొంది, స్వతంత్ర జీవనం గడపాలని ఉద్యోగంకోసం వెళితే, 'నీకు ఉద్యోగమిస్తే నాకు లంచంగా ఏమిస్తావ్?' అంటూ  నా శరీరపు ఒంపుసొంపుల్ని  కళ్ళతో తడిమేసిన కామపిశాచం లాంటి ఆఫీసర్ని తిట్టినతిట్టు తిట్టి బయటపడ్డానని చెప్పనా?

    పడుచుపెళ్ళాన్ని  ఇంట్లో ఉంచుకొని, ఒంటరి ఆడదాన్నని నన్ను అలుసుచేస్తూ, పిట్టగోడమీంచి లొట్టలువేస్తూ తొంగిచూస్తుండే పక్కింటి పరంధామయ్యలు, ఆర్ధిక ఇబ్బందిని  కొండంతలుగా చేసి చూపిస్తూ, ఆ సమస్య తీరాలంటే తాము ఎన్నుకున్న మార్గంలో నడవమని  ప్రలోభపెట్టి ఆ పాప పంకిలంలోకి నన్ను కూడా లాగాలని చూసే మెల్లకన్ను  మీనాక్షులు, ఆడది ఒంటరిగా కనిపిస్తే వెకిలిచేష్టలతో అల్లరిచేసే రోడ్డు రోమియోలు నా మనసుని కకావికలు చేస్తున్నారని చెప్పనా?

    ఏం చెప్పను సార్! ఆడదాన్ని అబలగా  ముద్రవేసి, ఆటబొమ్మగా  చేసి ఆడుకుంటున్న  ఈ సమాజంలోని  మగమృగాల వలయంలో  పవిత్రంగా బతికి బట్టకట్టటం ఎంతో కష్టమనిపించినా, ఆత్మస్థయిర్యంతో, బతుకుమీద కొండంత ఆశతో  ముందుకి  నడవటానికే నిర్ణయించుకున్నానని  చెప్పగలను సార్! చెప్పగలను!"

    ఆమె వాగ్దోరణికి రాజశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో ఆమె గుండెల్లో గూడుకట్టుకున్న  ఆవేదన, ఆవేశం వ్యక్తమయింది. అతను నోరు తెరిచి ఏదో అడగబోయేంతలో  మళ్ళీ ఆమె చెప్పటం సాగించింది.

    "సార్! ఆడదాని బతుకుల్లో  ఎదురయ్యే కష్టాలు, అవమానాలు ఎంత చెప్పినా  తక్కువే అవుతాయి. ఆడపిల్ల పుట్టగానే 'ఆడపిల్లా!' అంటూ  పెదవి విరుస్తారు. ప్రతి సందర్భంలోనూ ఆడపిల్లని కించవరుస్తూ  పెంచుతారు. దాని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా  పెళ్ళి చేస్తారు. కట్టుకున్నవాడి హింసలు భరించలేక ఏ ఆడదైనా పుట్టింటిని ఆశ్రయిస్తే పెళ్ళయ్యాక ఆడది భర్త పాదాల దగ్గరే పడుండాలి గాని పుట్టింటికి రాకూడదు.   ఆడపిల్ల - ఆడపిల్లే! అంటూ నీతులు చెప్పి తమ చేతులు దులిపేసుకుంటారు. ఆడపిల్లకి  ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది సార్! నా పుట్టింట్లోనూ అలాంటి సంఘటననే ఎదుర్కొన్నాను. ఒంటరి పోరాటం సాగించాలని  సిద్ధపడితే అడుగడుగునా  అవాంతరాలే!"

    ఆమె చెప్పటం ఆపి అతని ముఖంలోకి చూసింది.

    రాజశేఖరం ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు.

    "ఏమిటిసార్ అలా చూస్తున్నారు? ముక్కు మొఖం తెలియని  మీతో ఇన్ని విషయాల్ని మొహమాటం లేకుండా చెప్తున్నానేమిటా అని వింతగా ఉంది కదూ! అవును, వింతగానే ఉంటుంది. కానీ, ఇంతవరకు నాపై సానుభూతి చూపి, ఏమిటమ్మా నీ బాధ అని అడిగినవారు లేరు.  సాటి ఆడవాళ్ళు కూడా నన్ను అపార్ధం చేసుకొని నన్ను ఆడిపోసుకున్నవారే! ఆడదానికి ఆడది శత్రువు అంటారు. నిజమే సార్! సాటి ఆడది కష్టాలు పడుతుంటే చూసి తృప్తిగా నవ్వుకునేవాళ్ళనే చూశాను. వీలుంటే వారిపై విమర్శల గులకరాళ్ళను  విసిరి మరింత ఆనందిస్తారు. ఇదీ సార్ లోకం తీరు!"

    ఆమె ఆగింది.

    రాజశేఖరం భారంగా నిట్టూర్చాడు.

    "మీ జీవితం చాలా చిత్రంగా ఉంది. నీతిగా, న్యాయంగా, పవిత్రంగా బతకాలంటే సమాజం మీకు సహకరించటం లేదు. భర్త వలన ఇన్ని హింసలు పడిన మిమ్మల్ని గురించి తెలుసుకుంటుంటే మగాళ్ళలో ఇంతటి దుర్మార్గులు ఉన్నారా? అనిపిస్తుంది. ఇంతకాలం ఆడవాళ్ళని అసహ్యించుకుంటూ గడిపాను" అన్నాడు రాజశేఖరం.

    "ఆడవాళ్ళమీద అసహ్యమా?" విస్మయంగా అడిగిందామె.

    "అవును. మీలాగే నా స్నేహితుడి జీవితం పెళ్ళయ్యాక భార్య మూర్ఖత్వానికీ, నిర్లక్ష్యానికి, అహంకారానికి మధ్య నలిగిపోయింది. రోజూ అతను నాతో తన బాధల్ని చెప్పుకోనేవాడు. ప్రతిక్షణం అతడిని మాటలతో హింసించేదట. అతడిని ఒక పురుగులా చూసేదట. ఒక్కమాట కూడా లెక్కచేసేది కాదట. ఇంట్లో ఉండకుండా  తన సరదాలు, విలాసాలకు షికార్లు  కొట్టేదట. ఆమెకి చాలా మందితో సంబంధాలున్నప్పటికీ  అతడు ఆమెని ఏమీ అనలేకపోయేవాడు. దానికంతటికీ  ఆమెపట్ల  అతనికున్న  అపారమైన ప్రేమే కారణం. చూశారా, అతని జీవితానికీ, మీ జీవితానికీ ఎంత వ్యత్యాసమో! స్త్రీ మూలంగా అతని జీవితం నలిగిపోతుంటే, పురుషుని మూలంగా మీ జీవితం నరకప్రాయం అయింది. మానవ జీవితం చాలా చిత్రమైంది సుమండీ!" అన్నాడు రాజశేఖరం.

    "ఎవరో ఒక్క ఆడది.... తన భర్తని  ఇబ్బందులు  పెట్టిందని  ఆడవాళ్ళందరి మీదా అసహ్యం పెంచుకోవటం ఏం న్యాయం సార్?"

    "ఏమో! ఇలా భర్తలని హింసించే ఆడవాళ్ళు ఎందరో ఉండొచ్చు. ఆడవాళ్ళు బైటపడినట్లు మగాళ్ళు తమ భార్యలతో హింసింపబడుతున్నామని చెప్పుకొనేందుకు  అంత త్వరగా  బైటపడరు" అన్నాడు రాజశేఖరం.

    "మీకు పెళ్ళయిందా?"

    హఠాత్తుగా  ఆమె అడిగిన ప్రశ్నకి  రాజశేఖరం ఉలిక్కిపడ్డాడు.

    "లేదు" అన్నాడు.

    "మీరు అవివాహితులు. ఆడదాని ప్రేమలోని  మాధుర్యాన్నిగానీ, పగలో కర్కశత్వాన్నిగానీ చవిచూసే అవకాశం మీకు లేదు." ఎవరో మీ స్నేహితుడు తన భార్యవల్ల పడే బాధల్ని మీకు వివరించి చెప్తే సానుభూతి చూపించి ,స్త్రీల మీద ఒక దురబిప్రాయం ఏర్పరుచుకొన్నారు. నేను....ఈ పురుష ప్రపంచం నుంచి ప్రత్యక్షంగా అసహ్యకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. నా తండ్రి, భర్త, లాయరు, ఆఫీసరు, ఆఖరికి ఆటోవాడు కూడా ఆడదానిగా నన్ను అవమానించినవారే! అయినా పురుషులమీద నాకు ద్వేషంగానీ, అసహ్యంగానీ లేదు. ఇంత హీనంగా దిగజారిపోయిన  ఈ సమాజ పరిస్థితులను చూసి బాధగా ఉంది. ఈ వ్యవస్థమీద  అసహ్యం కలుగుతోంది. అంతేసార్! మీ స్నేహితుడికి నా సానుభూతి తెల్పండి. నాలాగ ఆమె నుండి విడాకులు తీసుకొని స్వేచ్చగా బతకమనండి!" అందామె.

    "అబ్బే! ఆ అవకాశం లేదు. అతనా నిర్ణయం తీసుకోవటానికి ముందే ఆమె ఎవడితోనో లేచిపోయిందట. పాపం, ఆమె మీద అతను పెట్టుకున్న ఆశలు కూలిపోయి కుమిలి కృశించిపోతున్నాడు" అన్నాడు రాజశేఖరం.

    "పూర్ ఫెలో!" అనుకుందామె.

    "మీ పేరు?" సందేహిస్తూ అడిగాడు రాజశేఖరం.

    "రజని." చెప్పిందామె.

    "రజనిగారూ! ఇలాంటి పరిస్థితులను  ఎదుర్కొన్న మీరు, జీవితం విషయంలో  ఎలాంటి నిర్ణయానికి వచ్చారో నేను తెలుసుకోవచ్చా?" రాజశేఖరం ప్రశ్నకి ఆమె పేలవంగా నవ్వింది.

    "ఈ సమాజంలో  తోడులేని  ఆడదాని ప్రతివారూ  చులకనగా చూస్తారు. మీసాలు మొలిచిన కుర్రవెధవ దగ్గర్నుంచి కాటికి కాలుచాపుకొన్న  ముసలాడి వరకు మగదిక్కులేని ఆడది అతితేలిగ్గా  తమ కౌగిట్లోకివచ్చి వాలుతుందనే  ఆశతో లొట్టలు వేస్తూ చూస్తుంటారు. నేను బాధలుపడ్డ ఆడదాన్నేగాని, బరితెగించిన ఆడదాన్ని కాను. నన్ను అర్ధం చేసుకొని ఆదరించి, నన్ను తనతోటి మనిషిగా చేసుకొని నాకు నీడగా నిలిచే వ్యక్తికోసం చూస్తున్నాను. అంతే సార్!" అంది రజని.

    ఆమెలోని  నిజాయితీకి, నిష్కల్మష మనస్తత్వానికి రాజశేఖరం చాలా ఇంప్రెస్ అయ్యాడు.

    ఆమె మాట్లాడే ప్రతి మాటను విశ్లేషణాత్మకంగా  ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన మనసులో మాటని ఆమెతో చెప్పాడు.

    "మీకు అభ్యంతరం లేకపోతే....నేను మిమ్మల్ని  పెళ్ళి చేసుకుంటాను."

    ఆమె చివాల్న అతని ముఖంలోకి  చూసింది.

    రాజశేఖరం కాస్త కంగారుపడ్డాడు.

    "అంటే....మీకిష్టమైతేనే! నాకు వెనుకా ముందు ఎవరూ లేరు. బతకటానికి ఉద్యోగం ఉంది. భార్యా పిల్లల్ని పోషించగలిగే సత్తా ఉంది. ఎదుటి వారిని అర్ధం చేసుకోగలిగే హృదయం ఉంది. ఇంకా ....

    అతని మాటలకి అడ్డం వచ్చిందామె.

    "మీరింకేమీ చెప్పనక్కరలేదు. ఏడాదిన్నర ఆలోచించి ,ప్రేమించి ప్రేమించి, ప్రేమ పండించుకొని, పెళ్ళాన్ని తార్చేందుకు సిద్ధపడ్డ ఒక దౌర్భాగ్యుణ్ణి కట్టుకుని జీవితంలో  పెద్ద పొరపాటు చేశాను. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ, అంతకంటే  ఇంకా పెద్ద పొరపాటు చేసే అవకాశం లేదు. అంతకు మించి నేను నష్టపోయేది ఏమీ లేదు సార్, నేను మీ పేరు అడగలేదు. పేరుతో నాకు అవసరంలేదు కూడా! మీ మాటల్లో మంచితనం, మీ ప్రవర్తనలోని సంస్కారం గమనించాను. మీరు నాకు అండగా నిలవడానికి సిద్ధపడటం నా అదృష్టం. దీనికి కాదంటే నిజంగా  నేను మూర్ఖురాలిని అవుతాను" అంది రజని.

    రాజశేఖరం కళ్ళు ఆనందంతో మెరిశాయి. పొంగిపోతూ  కుడిచెయ్యి ముందుకి చాపాడు. రజని అతని చేతిని పట్టుకొని ముందుకి నడిచింది.


        *    *    *


    "ఇంత కాలానికి మీరు వివాహం చేసుకోవటం, అదీ ఒక అభాగ్యురాలికి అండగా నిలిచేందుకు ఆదర్శవివాహం చేసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. రాజశేఖరంగారూ! మనకి పరిచయం అయిన ఆర్నెల్లలో  ఒకరి గురించి ఒకరు పూర్తిగా  తెలుసుకొని  మంచి స్నేహితులం అయ్యాం. ఆ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పెళ్ళయిన మర్నాడే మొదటి వ్యక్తిగా నన్ను మీ ఇంటికి ఆహ్వానించటంవల్ల నా మీద మీకుగల అభిమానం వ్యక్తం అవుతోంది. మిమ్మల్ని పెళ్ళాడిన ఆ అదృష్టవంతురాల్ని  అభినందించే అవకాశం నాకు కలుగుతోంది" అన్నాడు సుబ్బారావు సోఫాలో కూర్చుంటూ.

    రాజశేఖరం కూడా అతని పక్కనే కూర్చున్నాడు.

    ఆ రోజు ఉదయమే రజనితో చెప్పాడు రాజశేఖరం - తన స్నేహితుడు సుబ్బారావుని ఇంటికి భోజనానికి తీసుకువస్తానని.

    అంతలో లోపలినుంచి ట్రేలో రెండు కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది రజని.

    "రజనీ! ఈయనే  నేను నీకు చెప్పిన భార్యా బాధిత మిత్రుడు. పేరు సుబ్బారావు." పరిచయం చేశాడు రాజశేఖరం.

    రజని సుబ్బారావుని చూసి షాక్ తింది.

    సుబ్బారావు పరిస్థితీ అలాగే ఉంది.

    "రజనీ! నువ్వా?" అన్నాడు సుబ్బారావు.

    "రాజశేఖరంగారూ! కట్టుకున్న పెళ్ళాన్ని  ఇతరులకు తార్చటానికి బలవంతం చేస్తే, ఆమె ఒప్పుకోలేదని  రకరకాలుగా  హింసించి, ఆమె ఆ బాధలు పడలేక విడాకు లిచ్చి తన దారిన వెళ్ళిపోతే, ఆ సంగతి బయటపడనీయకుండా ఆమెపట్ల అసహ్యం కలిగేలా  కట్టుకథలల్లి చెప్పి మీ సానుభూతిని సంపాదించుకున్న  ఈ 'పిచ్చి కుక్కా' మీ స్నేహితుడు!?" ఆవేశంగా అరిచింది రజని.

    ఈసారి ఆశ్చర్యపోవటం రాజశేఖరం వంతు అయింది. 'ఈ లోకంలో ఇలాంటి మగాళ్ళూ ఉంటారా?!'  అనేది ఆ ఆశ్చర్యానికి అర్ధం అని మాత్రం ఎవరూ ఊహించలేరు.            *