Facebook Twitter
ప్రేమాన్వేషణ

    

 

ప్రేమాన్వేషణ

                                                                                                            - వసుంధర

         చదువు పేరు చెప్పి ఆరేళ్ళున్నాను చాలా అనుభవాలు పొందాను అమెరికాలో, వెళ్ళినప్పుడు నా ముఖ్యంగా ప్రేమ విషయంలో వయసు ఇరవై రెండు. అక్కడ అమెరికాలో అడుగు పెట్టిన ఆర్నెల్లలోనే ఒకమ్మాయి నన్ను ప్రేమించింది. ఆమె పేరు మిస్ స్వీట్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా తియ్యగా ఉండేది. నాకోసం ఎన్నో కొనేది. నాకు దగ్గర కావాలని ప్రయత్నించేది. మొదట్లో దూరంగా ఉండాలనుకున్నాను. కానీ అక్కడి వాతావరణమే వేరు. ఆకర్షణకు లొంగిపోయాను. ఒకసారి లొంగిపోయాక మిస్ స్వీట్ కు నావల్ల అన్యాయం జరక్కూడదనిపించింది. ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. స్వీట్ నవ్వి "ఇంకో పదేళ్ళదాకా నేను పెళ్ళి గురించి ఆలోచించను'' అంది. ఆమె కొన్నాళ్ళు నాతొ చనువుగా తిరిగి నన్ను వదిలేసింది.

మానసికంగా దెబ్బతిన్నాను. అయితే అక్కడి వాతావరణానికి ఆడతోడు అవసరం. అందుకని డిస్కో రెక్స్ కి వెళ్ళి ననే కొందరమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాను. కాస్త పరిచయంలోనే ఆకలిచూపులు చూసి, బాగా దగ్గరకువచ్చి కూడా పెళ్ళి గురించి అడగని అమెరికన్ అమ్మాయిలూ నాకు నచ్చారు.

నాలుగేళ్లలో నా చదువైపోయింది. మరో రెండేళ్లు ఉద్యోగం చేశాను. ఆ ఆరేళ్ళలోనూ ఎందరో అమ్మాయిలతో సన్నిహితంగా మసిలాను. ప్రేమ కబుర్లు చెప్పాను, విన్నాను.

"ప్రేమానుభవాలకి ఎవరైనా అమెరికా రావాలి'' అని తరచుగా స్నేహితులతో అంటూండేవాణ్ణి. అంతా ఒప్పుకునేవారు. కానీ ఒకసారి ప్రసాద్ అనే బీహారీ యువకుడు మాత్రం "ఇదంతా కామం. ప్రేమానుభవం ఇండియాలో తప్ప దొరకదు. ఒక యువతి, ఒక యువకుడు ఒకరికోసం ఒకరు కలిసి జీవించాలి. తమ పరిచయాన్ని శాశ్వతం చేసుకోవాలి'' అన్నాడు.

ముందు నేనతన్ని నిరసించాను. కానీ ప్రసాద్ మాత్రం "నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉండాలనుకున్న యువతని శ్రద్ధగా చూడు. ఆమె చూపులు నిన్ను పన్నీట జలకా లాడిస్తాయి. ఆమె పెదవులు నీచేత అమృతాన్ని తాగిస్తాయి. ఆమె స్పర్శ నిన్ను దివ్యలోకాలకు తీసుకుని వెడుతుంది. ఆమె మనసు నిన్ను దేవతాపురుషుణ్ణి చేస్తుంది. ఇది అనుభవంలో మాత్రమే తెలిసే విశేషం'' అన్నాడు.

నేను ప్రసాద్ ని నిరసించినా అతడి మాటలకు ప్రభావితున్నయ్యాను. ప్రేమగురించి అడిగి అడిగి అతడినుంచి చాలా తెలుసుకున్నాను. ప్రసాద్ ఇండియాలో ఒక యువతిని ప్రేమించాడు. ఆమె కోసమే ఇంకా అమెరికాలో కూడా అతడు పరితపిస్తున్నాడు. ఇక్కడి స్త్రీలకు దూరంగా ఉంటున్నాడు.నాకూ ప్రసాద్ లా ఓ అమ్మాయిని ప్రేమించాలనిపించింది. అందుకో చక్కటి అవకాశం వచ్చింది.

మా కంపెనీ ఆర్నెల్లపాటు ఇండియాలో ఏదో సర్వే చేయమని నన్ను పంపించింది. ఆ పనికి నా ప్రేమాన్వేషణను జతపరచి ఇండియా వచ్చాను.విశాఖపట్నంలో నా మకాం. కంపెనీ తరపున నాకో పెద్ద బంగ్లా, ఇంపోర్టెడ్ కారు, ఊర్లో పెద్ద పరిచయాలు.

ప్రిన్స్ లా వెలిగిపోతున్నాను. చాలామంది బంధువులు వచ్చి పలకరించి వెళ్ళారు. పరిచయాలను పునరుద్ధరించుకున్నారు. అప్పుడు నాకు ఇరవై ఎనిమిదేళ్ళు."పెళ్ళి చేసుకో'' అన్నారు చాలామంది.

విశాఖపట్నంలోనే నాకు నలుగురు యువతులు పరిచయమయ్యారు. వాళ్ళు ఫారిన్ అమ్మాయిలంత డాషింగ్ గానూ ఉన్నారు. వాలకు నేనే కాక ఇతర స్నేహితులూ ఉన్నారు. రాజకీయాలు, స్పోర్ట్సు, సినిమాలు వగైరాల్లో నాకంటే చాల ఎక్కువ పరిజ్ఞానంతో ఉన్నారు. వాళ్ళను చూడగానే ప్రసాద్ చెప్పిన యువతి గుర్తుకు రాలేదు.ఇండియా వచ్చి నెల్లాళ్ళయింది.

విశాఖపట్నంలో బంధువులు నాకూపిరి సలపనివ్వడం లేదు. అలాంటి సమయంలో లచ్చన్న మామయ్యా నన్ను పల్లెటూరికి ఆహ్వానించాడు.ఏదో దూరపు వరుసలో అమ్మకు అన్నయ్యవుతాడాయన. ఆయనకు నేనంటే ఏంతో యిష్టం. హైస్కూల్ చదువు పల్లెటూళ్ళోనే చదివాను నేను. లచ్చన్న మామయ్యదీ, మాదీ పక్కపక్కనే ఇల్లు. నేను వాళ్ళింట్లో ఆడుకునేవాణ్ణి. లచ్చన్న మామయ్యా కూతురు సరోజకూ, నాకూ మంచి స్నేహం. అప్పట్లో సరదాగా మా యిద్దరికీ పెళ్ళి చేస్తామని చెప్పుకునేవారు. సరోజ నాకంటే ఆరేళ్ళు చిన్న.

నా హైస్కూల్ చదువు కాగానే నాన్న వ్యాపారం చేయాలని బొంబాయికి మకాం మార్చాడు. మేము ఆర్థికంగా బాగా ఎత్తుకి ఎదిగాం. అప్పటికీ ఇప్పటికీ లచ్చన్న మామయ్యే మా పొలాలు చూస్తున్నాడు.

"అత్తయ్య నిన్ను చూడాలంటోందిరా'' అన్నాడు లచ్చన్న మామయ్యా.

అది నిజమే అయుండాలి. నేను బొంబాయి వెళ్ళాక అత్తయ్య కోసమే నాలుగుసార్లు మా ఊరువెళ్లాను. అయితే నేను ఊరు వెళ్ళి ఇప్పటికి పదేళ్ళయింది.

ఇంపోర్టెడ్ కార్లో వెళ్ళానా పల్లెటూరు. అక్కడ నా కారే ఒక ఆకర్షణ అయింది.

ఇంటికి వెళ్ళగానే అత్తయ్య నాకు దిష్టి తీసింది. ఏంటో అభిమానంతో ఆదరించింది. నాకిష్టమైన పదార్థాలన్నీ గుర్తుంచుకొని మరీ వండిపెట్టింది. చిన్ననాటి సంగతులెన్నో గుర్తు చేసింది. అవి వింటూంటే నాకు సిగ్గేసింది కూడా. అత్తయ్యకు నేను చిన్నతనం నుంచీ తెలుసేమో ... నా రహస్యాలన్నీ బట్టబయలవుతున్నట్టే ఫీలయ్యాను.

ఏడెనిమిదేళ్ళు దాటేదాకా నాకు సిగ్గు తెలిసేది కాదు. ఇంట్లో సాధారణంగా బట్టలు విప్పుకునే తిరిగేవాణ్ణి. చంటిపిల్లయినా ఆడపిల్ల కాబట్టి సరోజ కెప్పుడూ ఓ లాగు తొడిగేవారు. సరోజ నవ్వుతుందిరా అని నన్ను వేళాకోళం చేసేది అత్తయ్య. అప్పుడు సరోజా నిజంగానే నవ్వేది. ఆ నవ్వెంత బాగుండేదో!

ఎవరి దగ్గరా సిగ్గుపడని నేను ఎడాదిపిల్ల నవ్వుకి సిగ్గుపడి లాగు వేసుకునేవాణ్ణి.అత్తయ్య ఆ విషయం గుర్తు చేయగానే సిగ్గుపడ్డాను. అప్పుడే పక్క గదిలోంచి నవ్వు వినబడింది.ఏంటో మనోహరంగా ఉందా నవ్వు. నన్నేదో వింత లోకాలకు తీసుకుని పోయిందా నవ్వు. 

"ఎవరది?'' అన్నానప్రయత్నంగా.

"సరోజ ... నీ ఎదుట పడడానికి సిగ్గుపడుతోంది'' అంది అత్తయ్య.

"సరోజకు నాదగ్గర సిగ్గెందుకు?'' అన్నాను. కానీ కారణం నాకూ తెలుసు. బాల్యం ఎవరినైనా దగ్గర చేయగలదు. కులమతాలు, స్త్రీపురుష విభేదాలు అందుకడ్డురావు. కానీ వయసు మనిషికీ మనిషికీ మధ్య ఎన్నో అంతరాలను సృష్టిస్తుంది.వయసు స్త్రీ పురుషులను దగ్గర కమ్మని ప్రోత్సహిస్తుంది. అందుకే వయసులో వారొకరికొకరు వీలనినంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలకు అందాన్నిచ్చేది సిగ్గు.

"రావే సరోజా ... బావే కదా!'' అంది అత్తయ్య.

తల్లి బలవంతం మీద సిగ్గునదుపు చేసుకుంటూ నా ముందుకు వచ్చి తలవంచుకొని నిలబడింది సరోజ.నా ఊహల్లో సరోజ వేరు ... ఎదుట నిలబడ్డ సరోజ వేరు.సరోజ కట్టుకున్న చీర ఆమెకందాన్నివ్వలేదు సరికదా ... చీర అందం కూడా పాడైంది ఎగుడు దిగుడులుగా కట్టుకుందామె చీర. పూర్వకాలపు మోడల్లో జాకెట్టు, బిగించి వేసుకున్న జడ.

"చిన్నప్పుడు చెట్టాపట్టా లేసుకుని తిరిగేవారు. ఇప్పుడింత సిగ్గేమిటీ ... తలెత్తి బావని చూడు ...'' అందత్తయ్య.

చిన్నప్పట్నుంచీ అత్తయ్య మాటలు కాస్త మోటుగానే ఉండేవి. అత్తయ్యాలో ఇప్పటికీ పెద్దమార్పు లేదు.సరోజ తలెత్తింది.ముఖానికి కాస్మెటిక్స్ లేవు. పసుపు వాడుతుందేమో బాగా పచ్చగా ఉంది ముఖం. బొట్టుకాస్త పెద్దసైజులో వుంది. కళ్ళకు కాటుక పెట్టుకుంది. ఆ నలుపు కళ్ళకేకాక కాస్త ముఖానికి అంటింది.సరోజ వంకే చూస్తున్నాను.

"ఆ కన్నులు నిన్ను పన్నీట జలకాలాడిస్తాయి. ఆ పెదవులు నీ చేత అమృతాన్ని తాగిస్తాయి. ఆమె స్పర్శ నిన్ను దివ్య లోకాలకు తీసుకొని వెడుతుంది. ఆమె మనసు నిన్ను దేవతాపురుషుణ్ణి చేస్తుంది'' ప్రసాద్ మాటలు నా చెవుల్లో గింగురుమన్నాయి.

సరోజ పెద్ద అందంగా లేదు. కానీ ఆమె కనుల్లో అమాయకత్వముంది. ఆమె పెదవుల్లో ఏదో ప్రత్యేకత వుంది.ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలనుకున్నాను.పల్లెటూళ్ళో రెండ్రోజులున్నాను.క్రమంగా సరోజలో భయం, సిగ్గు తొలగిపోయాయి.చిన్నప్పుడు మేము కలిసి స్నానం చేసేవాళ్ళం సామెతపరంగా కాక ఒకే కంచంలో భోంచేసి ఒకే మంచంలో పడుకున్న సందర్భాలు నిజంగానే ఉన్నాయి. మేమిద్దరం ఎప్పుడూ దెబ్బలాడుకోలేదు.అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకుంటూంటే చాలా మధురంగా వుంది.

సరోజ మాటల్లో అమాయకత్వంతో కలిసి మాధుర్యముంది. ఆమె మాట్లాడుతుంటే ఏరుకుని భోంచేయాలనిపిస్తుంది. ఆమె నవ్వుతూంటే పెదాలపై ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంతకుమించి ఆమె నుంచి నాకేమీ లభించేలేదు.నేను నా అమెరికా జీవతం గురించి ఆమెకు కొంత చెప్పాను.సరోజ ప్రయివేటుగా బియ్యే చదివింది. ఆంగ్లభాష అర్థమవుతుంది కానీ మాట్లాడలేదు.

ఆమెకు మంచి సంబంధంచూసి పెళ్ళి చేయాలని లచ్చన్న మామయ్యనుకుంటున్నాడు. ఒక్కతే కూతురు, కొడుకు పట్నంలో చదువుకొంటున్నాడు.కూతురి కొచ్చిన సంబంధాల్లో కొన్ని అత్తయ్యకు, కొన్ని మామయ్యకు నచ్చడం లేదు. అందరికీ నచ్చిన సంబంధాల్లో కట్నం సమస్య వచ్చింది. 

ఓ ఇంజనీరు కుర్రాడు యాభైవేలడిగాడు. "నిన్ను కట్న మడగడం అన్యాయం. నేనైతే నీకే ఎదురిస్తాను'' అన్నానొక రోజున అప్రయత్నంగా.సరోజ సిగ్గుపడింది "నువ్వు అమెరికాలో ఉన్నాననుకుంటున్నావు బావా'' అందామె.ఆమె బావా అన్నప్పుడల్లా నా మనసు వింత అనుభూతి చెందుతోంది.సరోజను పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. అయితే పెళ్ళికిముందు ఆమెను నాకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇప్పటి వేషంలో సరోజను చూస్తే నా యింటి పనిమనిషిగా కూడా ఎవరూ అంగీకరించరు.

"మీరు కొన్నాళ్ళు వచ్చి నాతొ ఉండాలి'' అని అత్తయ్యను బలవంతపెట్టాను. కుటుంబసమేతంగా వాళ్ళను నా కార్లో విశాఖపట్నం తీసుకుని వెళ్లాను. అక్కడ సరోజ కోసం బ్యూటీ పార్లర్ నించి ఓ యువతిని రప్పించి నియమించాను

సరోజ హెయిర్ స్టయిల్ మార్చడానికిష్టపడలేదు."నీ అందానికి తగ్గ హెయిర్ స్టయిలుండాలి కాదనకు'' అని సర్దిచెప్పాను. ఒప్పుకుంది.సరోజ బట్టల విషయంలోనూ ప్రతిఘటించింది."నీ వంటికి తగిన అలంకరణ కావాలి ...'' అన్నాను. వింది.

సరిగ్గా వారంరోజుల్లో సరోజ మారిపోయింది. ఆమెను చూసి నేనే ఆశ్చర్యపడ్డాను.అనాకర్షణీయంగా ఉండే సరోజ ఇప్పుడు అప్సరసలా మారిపోయింది. అలంకరణ మనిషినెంతగానైనా మార్చగలదనడానికి సరోజ ఉదాహరణ.

అత్తయ్య నన్ను మెచ్చుకుని "అమ్మాయిని గొప్పగా మార్చేశావు. ఇలా దీన్ని పెళ్ళిచూపుల్లో చూపించామంటే ...'' అంది కాస్త మోటుగానే.అత్తయ్య మాత్రం నా బలవంతంమీద విశాఖపట్నంలో ఉండిపోయింది కూతురితో సహా. ఆమెకు అంతరాంతరాల్లో నేను సరోజను వివాహం చేసుకుంటానన్న ఆశ కూడా ఉందనుకుంటాను. లేకపోతే అన్నాళ్ళు ఉండదు.

నేనే సరోజను, అత్తయ్యను ఊరంతా తిప్పాను. పెద్ద పెద్ద పరిచయాలు వాళ్ళకు కలిగించాను. నా హోదాకు వాళ్ళిద్దరూ దిగ్భ్రాంతి చెందేలా ప్రవర్తించాను.అత్తయ్య నోరు విప్పితే నా గురించే పొగడ్తలే.

ఇప్పుడు నేను అప్పుడపుడు సరోజను స్పృశించగల్గుతున్నాను. ప్రసాద్ చెప్పినట్టే దివ్యలోకాలకు వెళ్ళిపోతున్నాను.సరోజ నాకు ఎక్కువ చనువివ్వడంలేదు. అందుకేనేమో ఆమె పట్ల నా ఆకర్షణ దారుణంగా పెరిగిపోతోంది.

అమెరికా మనిషినేమో ... ఆమెను స్వంతం చేసుకోవాలన్న కోరిక నానాటికీ బలాప్డుతోంది ఇక ఆగలేక ఒకరోజున సరోజను బీచికి తీసుకుని వెళ్లాను. ఆకక్డే నా మనసులోని మాట చెప్పాలనుకున్నాను."సరోజా ... ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది ...'' అన్నాను.

"ఇదంతా నీ చలవ బావా'' అంది సరోజ."నీ వేషాన్ని మార్చి నీ వ్యక్తిత్వాన్ని బాధించలేదు కదా'' అన్నాను."లేదు బావా! వ్యక్తిత్వానికి వేషం కూడా జోదవుతుందని నీ వల్లనే గ్రహించాను. చదువు నాకివ్వలేని గౌరవాన్ని వేషం నాకిచ్చింది. ప్రకృతి నా కివ్వలేని అందాన్ని అలంకరణ యిచ్చింది. అయితే నువ్వు నాకోసం ఇంతలా ఎందుకు శ్రమించావో అర్థం కావడం లేదు'' అంది సరోజ.

"నీ వంటికి తగ్గ అలంకరణ నీకుండాలని భావించాను. ఇందులో శ్రమ ఏముంది?'' అన్నాను.

"థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ... ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా''

"లేదు ...''

"ఎందుకని?''

"ఇప్పుడు నీ రూపానికి తగిన విశేషాలు నీకుండాలి ...''

"ఉన్నాయిగా'' అంది సరోజ.

"పెద్ద బంగ్లా ... ఇంపోర్టెడ్ కారు ... దాసదాసీజనం ...''

సరోజ నవ్వి "అన్నీ ఇచ్చినట్టే యివి కూడా నా కివ్వగలవా?'' అంది.

"ఎక్కడ కావాలో చెప్పు నీకోసం నీవు కోరిన విధంగా బంగ్లా కట్టిస్తాను. నీకు నచ్చిన కారు ఎన్నిక చేసుకునేటందుకు నిన్ను నేను అమెరికా తీసుకుని వెళతాను. నీవు కోరిన విధంగా సేవలు చేసేటందుకు ఏ దేశంనుంచైనా మనుషుల్ని రాప్పిస్తాను''

"నిజంగా!''

"నిజంగా!''

సరోజ ఆశ్చర్యంతో కళ్ళు రెప రెప లాడించి "ఎందుకు బావా నేనంటే నీకింత అభిమానం?'' అంది.

"నేను నిన్ను ప్రమిస్తున్నాను సరోజా!'' అన్నాను చటుక్కున ఇంత సూటిగా ఆ మాట చెప్పడం ఇదే మొదటిసారి.సరోజ చలించలేదు "అయితే?'' అంది.

"ప్రేమించిన యువతికోసం ఏమైనా చేయగలదడు ప్రేమికుడు ...''

"అయితే నీకు తెలియదా? స్త్రీ జీవితంలో కోరుకునేది బంగళా కాదు, కారు కాదు, దానదాసీ జనాల సేవలు కాదు ...''

"మరి ...''

"తగినజోడు''

నా తనువు పులకరించింది.

"నీ మాటలు నిజం ... నీ మనసులోని మాట చెప్పు ... వెంటనే నీ కోరిక నెరవేరుతుంది''

"నా మనసులోని మాట నువ్వే చెప్పు....''

"సరోజా!'' అన్నాను. "నీ మనసులోని మాట, నిర్భయంగా నాకు చెప్పకపోతే నీ మనసు నా ముందు మూగబోయిందన్న బాధ నాక్కలుగుతుంది ...''సరోజ కొద్దిక్షణాలు తటపటాయించి "నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను బావా'' అంది.

"థాంక్స్ సరోజా'' అన్నాను అప్రయత్నంగా.

"అందుకే నాకు తగిన వరుణ్ణి చూసే బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను ...''అంది సరోజ."నువ్వెవరిని ప్రేమిస్తున్నవో అతడినే పెళ్ళిచేసుకో'' అన్నాను."అదెలా సాధ్యం బావా? నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను. నాన్నని ప్రేమిస్తున్నాను, నా తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా చాలామందిని ప్రేమిస్తున్నాను. ప్రేమకూ పెళ్ళికీ ముడిపెట్టకు'' అంది సరోజ.

నేను తెల్లబోయి "నీ పెళ్ళి విషయంలో నేనెలా సాయపడగలనో చెప్పు?'' అన్నాను.

"నా మనసు నీకు తెలుసు. నేనెలా పెరిగానో నీకు తెలుసు. నేను నమ్మే సంప్రదాయం నీకు తెలుసు. నా గురించి నీకు తెలియనిది లేదు. ఒక్క చూపులో నా వంటికేమినప్పుతాయో గ్రహించావు నువ్వు. ఇప్పుడు నేను నా వంటిని కూడా ఎంతో ప్రేమిస్తున్నాను నాకు తగిన వరుణ్ణి కూడా నువ్వే చూడు బావా'' అంది సరోజ.సరోజ భావం నా కవగతమయింది.

నేను చెప్పిన బట్ట, నేను చెప్పిన విధంగా కట్టుకుంటే ఆమె అప్సరస అయింది. ఆమె కాలి నడక, భాషోచ్చారణ నా సూచనలతో ఆమె వ్యక్తిత్వాన్నే మార్చాయి.సరోజకు నేనంటే గౌరవం, నమ్మకం బయల్దేరాయి. ఇప్పుడామె నన్నే తగినవరుణ్ణి చూడమంటోంది. తను జీవితంలో ఆ వరుడితో సుఖపడగలనని నమ్ముకుంటోంది.

తన సంప్రదాయానికి నా అమెరికా సంప్రదాయం అడ్డు వస్తుందని పరోక్షంగా ఆమె సూచించిందా? లేక అమాయకంగా ఆమె నా ఔన్నత్యాన్ని నమ్ముతోందా?ఒకటి మాత్రం నిజం. సరోజకు తగిన వరుడిగా నా గురించి ఆలోచించుకాగానే నాలో చాలా లోపాలు కనబడ్డాయి.

నా లోపాలను సరిదిద్దుకోమని సరోజ చెపుతోందా?ఎన్ని లోపాలు దిద్దుకున్నా నేను కోల్పోయిన పవిత్రత తిరిగి రాదు కదా! అది నేను సరిదిద్దుకోలేని లోపం గదా!ప్రేమాన్వేషణకై ఇండియా వచ్చాను. ఆ ప్రేమ కారణంగానే ప్రస్తుతం నేను సరోజకై వరాన్వేషణలో ఉన్నాను.