Facebook Twitter
కర్షకుల జీవనం - కొమురయ్య

కర్షకుల జీవనం

                                                                                                                                                                      ఎ.కొమురయ్య

 

 పల్లెవాసులం

పసి మొక్కలకు

ప్రాణం పోసెడి

జీవన దాతలం.

 

రెక్కలు ముక్కలుచేసుకుని

మా డొక్కలనంటగట్టుకుని

మా రక్తాన్ని చెమటగా మార్చి

సేద్యం చేసే శ్రమ జీవులం.

 

దుక్కులు దున్ని

మొక్కలు నాటి

మొక్క మొక్కకు నీరందించి

పైరు పంటలే ఎన్నో తీసిన

 

పల్లె సీమకే ముద్దు బిడ్డలం.

పల్లె దొరలకు బానిసలమై

పట్నం దొరలకు దాసులమై

బడి బాసండ్లెన్నో తోన

 

బ్రతుకు సాగని బడుగు జీవులం.

అప్పుల కోసం తిప్పలు బడుతు

మండుటెండలో మలమల మాడి

రేయిపగలు కష్టం చేసి

 

మంచి నీళ్ళతో కడుపు నింపుకుని

ఆకలి మంటల నదుర గొట్టిన మేం

అన్నపూర్ణకే సవతి బిడ్డలం.

పుడమి తల్లితో పోరాడి

 

భూమాత మెప్పుల పొంది

పుడమినుంది పసిడి తీసిన ప్రతిభావంతులం.

పుట్ల కొద్ది పంటలు దీసి

పండిన పంటను పట్నం బంపి

 

ప్రజా క్షేమమే మా ధ్యేయమని

ప్రజా శ్రేయస్సుకై అంకితమైన

కపట మీరుగనీ కష్టజీవులం.