Facebook Twitter
అనసూయ

అనసూయ

 

 

 

ఆలోచిస్తోంది అనసూయ. తనలో తనే తెగ మధనపడుతోంది. మనసులో ఆందోళన. ఏం చేయాలి? కరుణకి చెప్పాలా? వద్దా? చెప్తే తనని అసహ్యించుకుంటుందేమో! కానీ ఇప్పటికీ చెప్పకపోతే ఎలా? దుఃఖం తన్నుకొస్తోంది. సన్నగా తలనొప్పి మొదలయింది. ఇంక చేసే పని వదిలి కూర్చుండిపోయింది. కళ్ళమ్మట కన్నీరు ధారగా కారసాగింది.
రాఘవరావు పూజ కానిచ్చి ప్రసాదం తీసుకుని నెమ్మదిగా భార్య దగ్గరికి వచ్చాడు. ఉలుకూ, పలుకూ లేని భార్యని చూసి అతని హృదయం ద్రవించింది. భార్య చేతిలో ప్రసాదం పెట్టి, పక్కనే కూర్చున్నాడు. అలవాటుగా ప్రసాదాన్ని తీసుకున్నా ఆమె మనసు మాత్రం అక్కడ లేదు. ఎలా? కరుణకి చెప్పడం ఎలా? చెప్పాలని ఊహించుకుంటూంటేనే గొంతుక్కేదో అడ్డం పడ్డట్టు ఉంది. ఇంక చెప్పడం ఎలా? అసలు చెప్పినా అర్ధం చేసుకుంటుందా?

భార్య భయాన్ని, ఆలోచనల్నీ అర్ధం చేసుకున్న రాఘవరావు, నెమ్మదిగా ఆమె భుజంమీద చెయ్యివేసి అనునయంగా తట్టాడు. “అనసూయా! తప్పనప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. దేనికైనా సంసిధ్ధంగా ఉండాలి.” అన్నాడు ధైర్యం చెబుతూ.

సాయంత్రందాకా అలానే కూర్చుని, నెమ్మదిగా మనసుని కూడదీసుకుని లేచి దీపం వేసింది అనసూయ. ఆరు అవుతూంటే కాలేజీనుంచి వచ్చింది కరుణ. తలుపు తీసిన అనసూయని చూస్తూనే, “ఏమిటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా?” అని అడిగింది. “ఏమీ లేదే! కాఫీ ఇస్తాను ఉండు,” అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలపసాగింది. ఏమిటో! అమ్మ వారం రోజులనించి ఏదోలా ఉంది. ఏమయింది? అడిగితే ఇలాగే మాట దాటేస్తుంది. పోనీలే, రేపు మాధవీఆంటీ వస్తోందిగా, ఇంక అమ్మకి సందడే సందడి. ఎందుకో చుట్టాలందరిలోకీ మాధవీఆంటీ అంటే అమ్మకి ఎంతో ఇష్టం. బహుశా చుట్టరికం కంటే స్నేహం ఎక్కువ మూలాన కాబోలు! ఆలోచిస్తూ కరుణ పెరట్లోకి వెళ్ళి మొక్కలకి పైపుతో నీరు పెట్టసాగింది. మొక్కలన్నా, చెట్లమీద వాలే పిట్టలన్నా కరుణకి ఎంతో ఇష్టం. ఇల్లంటే మరీ ఇష్టం. ఇంక అమ్మానాన్న అంటే చెప్పలేని ప్రేమ! ఇప్పటికీ అమ్మ ముద్దలుచేసి నోట్లో పెడితేనే అన్నం తినడం ఇష్టం.

తెల్లవారింది. ఆరుగంటలికి రాజమండ్రినించి మాధవి వస్తోంది. రాఘవరావు స్టేషనుకి వెళ్ళాడు తీసుకురావడానికి. అనసూయ పాలుకాచి, డికాక్షనువేసి, ఉప్మాకి అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఆదివారం మూలాన కరుణ ఇంకా పక్కమీంచి లేవలేదు.

మాధవి చాలా చలాకీ మనిషి. అందరికీ సహాయం చేయాలనే ఆలోచనే ఎక్కువ. వాళ్ళ కాలనీలో అందరి సమస్యలూ తెలుసుకోవడం, అందరూ కలిసి ఎలా వాటిని పరిష్కరించుకోవాలో చర్చించుకోవడం, దానికోసం అవసరమైన వారిని కలిసి చక్కని వాక్చాతుర్యంతో వారిని మెప్పించి కార్యం సాధించుకురావడం ఆమె గొప్పతనం. అందరి దగ్గిరా పోగుచేసిన వస్తువులని, బట్టలని అనాధశరణాలయాలలో అందించడం కూడా ఆవిడ కార్యక్రమాలలో ఒకటి. ఎంతటి త్యాగానికైనా, శ్రమకైనా వెనుకంజవేయదు.

ఏడుగంటలయింది. కారులో రాఘవరావుతో వచ్చిన మాధవి ఇంటిముందు దిగింది. కాలింగ్ బెల్లు శబ్దం వినగానే అనసూయ వడివడిగా వచ్చి తలుపుతీసింది. ఆప్యాయంగా అనసూయని హత్తుకుంది మాధవి. ఆ కౌగిలిలోని భరోసాతో మనసు తేలికబడింది అనసూయకి.

ఏదీ కరుణ? ఇంకా లేవలేదా? అంది సోఫాలో కూర్చుంటూ మాధవి. ఇంకా లేచినట్టులేదు, ఆదివారం కదా! అంది అనసూయ ఉప్మాకి పోపు వేస్తూ. కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ సువాసనకు మాధవికి ఆకలి గుర్తొచ్చి కడుపులో ఎలకలు పరిగెట్టడం మొదలయ్యింది. మాధవికి ఉప్మా అంటే చాలా ఇష్టం! అదీ హోటల్ తాజ్ లోలా జారుగా నెయ్యి, జీడీపప్పులతో ఘుమఘుమలాడుతూ ఉండాలి. అందుకే అనసూయ ఈరోజు ఉప్మా చేస్తోంది. కాళ్ళూ, చేతులూ కడుక్కుని వంటింట్లోకి వచ్చి కూర్చుంది మాధవి. కాఫీకప్పు మాధవి చేతిలో పెట్టి, ఇంకొక్క పది నిముషాలలో ఉప్మా రెడీ అంది నవ్వుతూ అనసూయ. అనసూయ మొహంలోకి పరిశీలనగా చూసింది మాధవి. మొహమంతా పీక్కుపోయినట్టయి తనకంటే పదేళ్ళు పెద్దదానిలా ఉన్న అనసూయతో, “బెంగపడకు, ఏంకాదులే! ఎప్పటికైనా తెలియవలసినదేగా?” అంది భుజంమీద చెయ్యి వేస్తూ. బెంగని మనసులోనే అణుచుకుని పైకి నవ్వింది అనసూయ.

సాయంత్రం అందరూ కలిసి పార్కుకి వెళ్ళారు. దారి పొడూగునా తనతో కాలేజీ కబుర్లు చెప్తూనే ఉన్న కరుణని చూస్తుంటే ఒక్క నిముషం మనసు చలించింది మాధవికి. మరునిమిషంలోనే సర్దుకుంది.
“రాధని, రవిని కూడా కూడా తీసుకుని రావలసింది”, అన్నాడు రాఘవరావు పార్కులోని గడ్డిలో చతికిలబడుతూ. అనసూయ, మాధవి, కరుణ కూడా కూర్చున్నారు. “లేదు, అన్నయ్య! దానికి డిగ్రీ పరీక్షలూ, వాడికి ఏవో జాబ్ ఇంటర్వ్యూలు, తీరికలేకుండా ఉన్నారు”, అంది నవ్వుతూ మాధవి.

అనసూయకి పన్నెండేళ్ళప్పటి నించే మాధవితో స్నేహం. మాధవి అనసూయకి దూరపుబంధువే కానీ, రాజమండ్రిలో ప్రక్కఇంట్లోనే ఉండడం వలన బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ! ఇద్దరూ ఒకే ఈడు, ఒకే స్కూలు, ఒకే క్లాసు అవడంతో ఆ స్నేహం ఇంకా బలపడింది. ఇద్దరూ పంచుకోని విషయాలు లేవు, ఏ అరమరికలు లేవు. కబుర్లు, ఆటలతో స్కూలయాక సాయంత్రం కూడా కలిసిమెలసి ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒకళ్ళింట్లో టిఫిను తింటే ఇంకొకళ్ళింట్లో భోంచేశేవారు. పరీక్షల్లో కలిసి చదువుకోవడం .... మరి పడుకోవడం కూడా ఒక చోటే! డిగ్రీ దాకా చదువుకున్న వీళ్ళిద్దరికీ ఒకటి రెండు సంవత్సరాల తేడాలో పెళ్ళిళ్ళుకూడా అయిపోయాయి.

అనసూయ, భర్త రాఘవరావుతో పాటు హైదరాబాదు వస్తే, మాధవి, తన భర్త నారాయణకి ఉద్యోగం అక్కడే ఉండడం మూలాన రాజమండ్రిలోనే ఉండిపోయింది. ఆ రోజుల్లో ఉత్తరాలతోనేగా కబుర్లు! తెగ రాసుకునేవారు.

పండగలకి శలవులకి వెళ్ళినప్పుడల్లా కలుసుకోవడం, సరదాగా గడపడం మామూలు అయిపోయింది. ఒక ఏడాది ఇట్టే గడిచిపోయింది. తరవాత ఏడాదికి మాధవికి కొడుకు పుట్టాడు. ఇంకో రెండేళ్ళకి కూతురు కూడా పుట్టింది. అప్పుడు శలవలలో పుట్టింటికి వచ్చిన అనసూయ మాధవి ఇంటికి వెళ్ళింది. దిగులుతో చిక్కిపోయిన అనసూయని చూసి మాధవి కంగారుపడింది. నెమ్మదిగా ఒకరోజు కారణమేమిటని అడిగింది. అనసూయకి పిల్లలు లేరని అత్తగారు తెగ సాధిస్తోందిట. ఆడబొడుచులు కూడా సూటీపోటీ మాటలు అంటున్నారని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అనసూయ. మూడేళ్ళేగా, కొంతమందికి కొద్దిగా ఆలస్యమవచ్చు బెంగపెట్టుకోకని ఓదార్చింది మాధవి.

ఇంకో ఏడాది గడిచింది. డాక్టర్ని కలిసి అన్ని  పరీక్షలు చేయించుకున్న రాఘవరావు, అనసూయలకి రాఘవరావుకి పిల్లలు పుట్టే అవకాశంలేదని తెలిసింది. ఇంటికి వచ్చి ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లిపోయింది అనసూయ. అత్తగారికి బెంగ ఎక్కువయింది. చుట్టుపక్కల పిల్లల్ని చూస్తూంటే బాధ ఇంకా ఎక్కువవుతుంది. ఎవరినైనా పెంచుకుందామంటే తెలీని కుటుంబం నించి తెచ్చుకోవడానికి అత్తగారూ, భర్తా ససేమిరా ఒప్పుకోవడంలేదు. ఎదురు చెప్పలేని అనసూయ బెంగతో చిక్కి సగమయింది. తల్లి దగ్గిరకి వచ్చిన అనసూయని చూసిన మాధవికి మతిపోయింది. ఏమిటే ఇది? ఇలా అయిపోయావే? అంది అనసూయని కౌగిలించుకుంటూ. కడుపులోని బాధంతా ఉబికివచ్చింది అనసూయకి. అన్ని విషయాలు తెలుసుకున్న మాధవి ఆ తరవాత చాలారోజులు ఆలోచిస్తూనే ఉంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి నారాయణతో చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాకా హైదరాబాదు బయల్దేరారు.

ఆ దంపతుల నిర్ణయం విన్న అనసూయ ఆనందాశ్చర్యాలతో తలమునకలయ్యింది. రాఘవరావు నమ్మలేనట్టు చూశాడు. “నిజంగానేనా?”, అంది అనసూయ మాధవి పట్టుకుని. “అవును, ఇప్పుడు నాకు మూడవనెల. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అందుకని ఈ పుట్టబోయే బిడ్డని నీ కోసమే కంటాను”, అంది మాధవి అనసూయని దగ్గిరకి తీసుకుంటూ. అలాగే స్నేహితురాలి కోసం తొమ్మిదినెలలూ మోసి చక్కని పాపని కన్నది ఆ త్యాగమూర్తి! స్నేహానికి మారురూపు ఆమె. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? జన్మజన్మల రుణానుబంధమే ఇది, అనుకుంది అనసూయ.
పాపకి మూడవనెల రాగానే మంచి ముహూర్తం చూసి శాస్త్రప్రకారం దత్తత చేసుకున్నారు రాఘవరావు, అనసూయ. అనసూయ మొహంలోని సంతోషాన్ని చూస్తే తృప్తిగా అనిపించింది మాధవికి. అలా తీసుకువచ్చిన పాపకి కరుణ అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు అనసూయ, రాఘవరావు. రాకపోకలున్నా, ఎప్పుడూ ఆ రెండు కుటుంబాల మధ్య ఈ ప్రస్తావనే మళ్ళీ రాలేదు. మాధవీ నారాయణలు అంత సంయమనంతో ఉండబట్టి కరుణకి కూడా ఇంతవరకూ ఈ విషయం తెలియలేదు.

ఇంక ఎవరి ద్వారానో, ఎప్పుడో అకస్మాత్తుగా తెలుసుకుని ఆందోళన పడేకంటే అర్ధం చేసుకునే వయసు వచ్చింది కనుక ఇప్పటికైనా చెప్పడమే మంచిదని ఆలోచించిన రాఘవరావు అనసూయ, ఆ సమయంలో మాధవి కూడా ఉంటే బావుంటుందని పిలిపించారు. గతమంతా ఆ రోజు కరుణకి వివరించిన అనసూయ తన కూతురుకేసి ఆందోళనగా చూసింది.

కొద్ది నిముషాలు కరుణకి ఇది తన జీవితమేనా? కధ కాదు కదా? అనిపించింది. ఇది నిజమే అని అర్ధమయ్యాకా, మాధవి వైపు చూసింది. ఆమె ప్రశాంతవదనంతో ఎంతో ఉన్నతంగా కనిపించింది. తనని కన్న మాతృమూర్తిలో ఎంత త్యాగం ఉంది! ఒక స్నేహితురాలి కోసం ఇంత త్యాగాన్ని ఎవరైనా చేయగలరా? మమ్మల్ని కలుసుకుంటూనే ఉన్నా ఆమె మనసుకి, మాటకి, కట్టుబడి ఎంత నిగ్రహంగా ఉంది! ఒక్కసారిగా మాధవిని కౌగిలించుకుంది కరుణ. కరుణ కళ్ళనుండి కన్నీరు ఉబికింది. మాధవి కరుణ వీపు నిమురుతూ అంది, “అమ్మని చూడు కరుణా! నిజం తెలిసాక నువ్వు ఏమయిపోతావో అని ఎంత బెంగ పెట్టుకుందో!”

“అమ్మా!” అంటూ అనసూయని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడుస్తూ ఒడిలో వాలిపోయింది కరుణ. ఆ ఒక్క పిలుపుతో మనసు కుదుటపడ్డ అనసూయ ఆశృనయనాలతో తన ప్రాణస్నేహితురాలి కేసి చూసంది.

-కామేశ్వరీ చెల్లూరి