Facebook Twitter
తెలుగు సాహిత్యంలో ‘ఓల్గా’ తీరం

తెలుగు సాహిత్యంలో ‘ఓల్గా’ తీరం

 

అదేం అదృష్టమో కానీ తెలుగులో స్త్రీవాద సాహిత్యం పుష్కలంగానే కనిపిస్తుంది. గురజాడ రాసిన కన్యాశుల్కంలోనే స్త్రీవాద భావనలు కనిపిస్తాయి. ఇక చలం కాలానికి వచ్చేసరికి ఆ భావనలు పరిపక్వతకు చేరుకున్నాయి. ఆ తరువాత రంగనాయకమ్మవంటి వారి రచనలు ఆ రంగాన్ని పరిపుష్టం చేశాయి. ఇలా ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు స్త్రీవాదాన్ని తమదైన శైలిలో ముందుకు జరిపే ప్రయత్నం చేశారు. తమతో పాటుగా గళం ఎత్తేందుకు నిదర్శనంగా నిలిచారు. ఈ కాలంలో ఆ బాధ్యతను తలకెత్తుకున్నప్పటి నిర్ద్వంద్వంగా ఓల్గానే!

 

 

పోపూరి లలితకుమారి అన్న పేరు చెబితే బహుశా ఎవరికీ ఏదీ స్ఫురించకపోవచ్చు. కానీ ఓల్గా అన్న కలం పేరుతో ఆమె సాగించిన సాహితీ ప్రస్థానం తెలుగువారికి సుపరిచితమే! 1950లో గుంటూరులో జన్మించిన ఓల్గాకి సాహిత్యం అంటే మొదటినుంచీ అభిమానమే! బహుశా అదే ఆర్తితో ఆమె తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. సాహిత్యం మీద ఓల్గాకి ఉన్న అనురక్తికి మార్క్సిస్టు భావజాలం తోడైంది. అప్పటివరకూ స్త్రీల అణచివేత కేవలం కుటుంబ సమస్యగా భావించేవారు. ఒకవేళ కథలు రాసినా కూడా పరిధిని గీసుకుని ఓ ఇతివృత్తం చుట్టూనే కథనాన్ని నడిపించేవారు. కానీ ఓల్గా అలా కాదు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న వివక్ష కేవలం వ్యక్తిగతం కాదనీ, దాని వెనక లోతైన అణచివేత ధోరణి ఉందని భావిస్తారు. ఆ దృక్పథంతోనే రచనలు సాగిస్తారు.

 

 

ఓల్గా కథల్లో కనిపించే మరో ప్రత్యేకత దాని ప్రయోజకత్వం. తాను సాహిత్యానికి ఓ ప్రయాజనం ఉండాలన్న ఆశయంతోనే రచనలు మొదలుపెట్టానని చెబుతారు ఓల్గా. ప్రతి కథలోనూ తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఆమె కథలో ఓ సూటిదనం కనిపిస్తుంది. అందులో ఒకోసారి సుదీర్ఘమైన చర్చలూ వినిపిస్తాయి. చివరికి ఓ పరిష్కారమూ ఉంటుంది. పైపెచ్చు ఓల్గా ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం గురించి మాత్రమే కథ రాసినట్లు కనిపించదు. స్త్రీ ఎదుర్కొనే  ప్రతి సమస్య గురించీ ఆమె ఒకో కథలో కనిపిస్తుంది. ‘సీత జడ’ అనే కథలో ఆడవారి కట్టుబొట్టు గురించి సమాజం వివిధ సందర్భాలలో చేసే ప్రతిపాదనలని ప్రశ్నిస్తారు. ‘కళ్లు’ అనే కథలో ఆడదాని కళ్లు ఏ తీరున ప్రవర్తించాలో, ఏం చూడాలో, ఎలా ఏడవాలో సూచించే దృక్పథాలను ఎంగడతారు. ‘తోడు’ కథలో భాగస్వామి చనిపోయిన తరువాత స్త్రీ, పురుషలు జీవితాలలో వచ్చే మార్పుని సూచిస్తారు.

ఓల్గా తొలుత కవితలు రాసేవారు. తరువాత వచనంలోకి మారి కథలను సృజించారు. కొండొకచో నవలలూ రాశారు. కొన్ని అనువాదాలూ చేశారు. ఏం చేసినా కూడా అందులో స్త్రీవాదమే ప్రధానంగా సాగింది. ఉదాహరణకు ‘నీలిమేఘాలు’ అన్న పేరుతో వివిధ రచయిత్రల కవితల సంకలనాన్ని తీసుకువచ్చారు ఓల్గా! ఈ సంకలనం విడుదలై పాతికేళ్లు (1993) గడుస్తున్నా ఇప్పటికీ ఇది తెలుగు సాహిత్యంలో ఓ ఆగని సంచలనమే! ఇక ‘స్వేచ్ఛ’ నవల గురించైతే చెప్పనే అవసరం లేదు. ఏ బంధంలోనూ ఇమడకుండా స్వేచ్ఛగా సాగాలనుకునే ఓ స్త్రీ కథే ఇది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ నవలని తొలి స్త్రీవాద నవలగా భావిస్తారు.

 

 

ఓల్గా సాహిత్యంలోని అభిప్రాయాల పట్ల పాఠకులకు భిన్నమైన ఆలోచనలు ఉండవచ్చు. కానీ స్త్రీ విముక్తి కోసం ఆమెకు ఉన్న నిశ్చయం పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆ నిశ్చయం ఆమె ప్రతి కథలోనూ కనిపిస్తుంది. ‘మగాడినని రుజువుచేసుకోవాలనీ, స్నేహితుడినని రుజువు చేసుకోవాలనీ, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను – అలా నిరూపించుకోవాలనీ – ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా జీవితం గడపలేరా? సరే – మీరేదో సాధించుకోండి. కానీ, దాంట్లో ఆడవాళ్లనెంత ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించుకోండి,’ అంటూ స్పర్శలో కనిపించే తరహా వాక్యాలు ప్రతి రచనలోనూ పలకరిస్తాయి.


ఓల్గా రచనల్లో కనిపించే మరో విశేషం... ద్వేషాన్ని చిమ్మకపోవడం! చాలామంది రచయితలు ఏదన్నా వర్గానికి అనుకూలంగా రచనలు చేసేటప్పుడు మరో వర్గం మీద తమకు ఉన్న కోపాలన్ని అణచుకోలేరు. ఒకోసారి అది వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారుతూ ఉంటుంది. కానీ ఓల్గా రచనల్లో ఆ ధోరణి కనిపించదు. ఏ ఇతివృత్తాన్ని ఎంచుకున్నా, ఏ పాత్రని తీసుకున్నా దాని ఆధారంగా ఒక సమస్యను వెలికితేవడం, దానిని చర్చించి ఓ ముగింపుని ఇవ్వడమే ఆమె కథనాలు తీరుగా గోచరిస్తుంది. అందుకే పురాణ పాత్రలను ఇతివృత్తంగా తీసుకున్నా కూడా ఆమె తన పంథాను వీడలేదు. అలా రామాయణకాలం నాటి స్త్రీ పాత్రలతో ఆమె రాసిన ‘విముక్త’ కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది. పురస్కారం సంగతి పక్కనపెడితే ఓల్గా తన కథలతో ప్రతి స్త్రీవాది హృదయాన్నీ గెలుచుకుంది.

- నిర్జర.