Facebook Twitter
దుస్తులు... వ్యక్తిత్వం

 

దుస్తులు-వ్యక్తిత్వం

 

ఒక ఊళ్ళో వినోద్ అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళది ధనవంతుల కుటుంబం. అతను ఎప్పుడూ ఖరీదైన బట్టలే వేసుకునేవాడు. ఒక రోజున వినోద్ బడికి వెళ్తుంటే దారిలో ఒక అబ్బాయి కనిపించాడు-

వాడు వినోద్ ని చూసి నవ్వుతూ "నా పేరు శీను. మేము ఈ వీధిలోకి కొత్తగా వచ్చాం. నేను కూడా మీ బడిలోనే చదువుతున్నాను!" అని చెప్పాడు. శీను వేసుకున్న నలిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వినోద్ కి ఏమాత్రం నచ్చలేదు.

వాడు శీనుతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా, ముఖం ప్రక్కకు తిప్పుకొని, గబ గబా నడుస్తూ వెళ్ళి-పోయాడు. శీను పాపం, చిన్నబోయాడు. ఆ రోజున బడిలో కూడా చాలాసార్లు ఎదురయ్యాడు శీను- కానీ అన్నిసార్లూ ఈసడింపుగా ముఖం తిప్పుకుంటూనే ఉన్నాడు వినోద్. "వీడికేముంటై, తెలివి తేటలు?" అనుకున్నాడు తప్ప, శీనుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడు.

ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అయినా వినోద్ దృష్టిలో శీను విలువ ఏమాత్రం పెరగలేదు- "నాకు వాడంటే ఇష్టం లేదు-అంతే! నేను అట్లాంటి వాళ్లతో మాట్లాడనే మాట్లాడను!" అనుకున్నాడు .

 

అయితే ఆ తర్వాత ఒక రోజున వినోద్ బడికి వెళ్తూండగా అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడబోయింది. సమయానికి దగ్గర్లోనే ఉన్న శీను ముందుకి దూకి, వాడి చెయ్యి పట్టుకొని ఇవతలికి లాగకపోతే వాడు ఆస్పత్రి పాలై ఉండేవాడు!

చుట్టూ ఉన్నవాళ్లంతా శీనును మెచ్చుకున్న తర్వాత, వినోద్‌కు అర్థమైంది, అతని మంచితనం ఏమిటో! తను వాడిని ఎంతో చులకనగా చూసినప్పటికీ, అది మనసులో పెట్టుకోకుండా తనను కాపాడాడు వాడు!

వినోద్ శీనుకు కృతజ్ఞతలు చెప్పటమే కాకుండా తన ప్రవర్తన పట్ల క్షమాపణ కోరాడు. అటు తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. శీను స్నేహం వల్ల వినోద్ కూ మంచితనం అలవడింది!


Courtesy..
kottapalli.in