Facebook Twitter
అక్షరంతో అణచివేతని ఎదుర్కొన్న – కొలకలూరి ఇనాక్

అక్షరంతో అణచివేతని ఎదుర్కొన్న – కొలకలూరి ఇనాక్

బలహీన వర్గాల పీడన గురించి ఎవరైనా స్పందించి రాయవచ్చు. కానీ అందులో సానుభూతి పాళ్లే ఎక్కువగా కనిపిస్తాయి కానీ సమస్య మూలాల చిత్రణ అసంపూర్ణంగా సాగుతుందన్నది ఓ ఆరోపణ. అందుకే ఏ వర్గానికి చెందిన రచయితలు తమ వర్గంలోని కన్నీటిగాథలను అక్షరబద్ధం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అలా దళితుల తరఫున కలాన్ని ఎక్కపెట్టినవారి జాబితా ఒకదాన్ని రూపొందిస్తే అందులో ఆచార్య కొలకలూరి ఇనాక్ పేరు తప్పక ప్రస్తావనకు వస్తుంది.

1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఇనాక్‌. వెనుకబడిన కులాలవారు చదువుకోవడమే సాహసమనుకునే రోజులవి. కానీ ఇనాక్‌కి ఆ పట్టింపు లేకపోయింది. తను చూస్తూ ఉన్న అణచివేతని అక్షరంతోనే ఎదుర్కోవాలన్న తిరుగుబాటు ధోరణో, తను మోస్తూ ఉన్న అస్పృశ్యత బరువుని విదిలించి వదిలించుకోవాలనే తాపత్రయమో... కారణం ఏదైనాగానీ ఇనాక్ చదువు మీద పట్టు బిగించారు. తెలుగులో ఆచార్యుడిగా పదవిని సాధించేవరకూ ఆ పట్టు కాసింతైనా సడలనే లేదు.

ఇనాక్‌ అక్షరాన్ని జ్ఞానసముపార్జన కోసమే కాదు... తన భావాలకీ, బాధలకీ ఒక రూపాన్నించేందుకు కూడా ఉపయోగించారు. ఆ దిశగా సాగేందుకు ఆయనకు గుర్రం జాషువా, కరుణశ్రీల ప్రభావం తోడ్పడింది. అలా 1950ల నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. పీడనకు సంబంధించి తన నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనే ప్రేరణగా 1954లో ‘ఉత్తరం’ పేరుతో తొలి కథను రాశారు. అప్పటికి ఆయన వయసు 15 ఏళ్లు మాత్రమే. అది మొదలు కథలు, కవితలు, నాటకం, నాటిక, పద్యాలు, పరిశోధనా వ్యాసాలు... ఇలా సాహిత్యానికి సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ తనదైన అరుదైన అక్షరంతో సాగిపోయారు.

ఒకపక్క ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూనే, సృజనరంగంలోనూ తన ఉనికిని చాటుకున్నారు. అందుకనే ఉద్యోగిగా అటు  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి స్థాయిని చేరుకున్నారు. ఇటు రచయితగా పద్మశ్రీవంటి గౌరవాలనూ అందుకున్నారు. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అందించే ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి పురస్కారా’న్నీ సాధించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక తెలుగు రచయిత ఇనాకే కావడం విశేషం.


ఒక అంచనా ప్రకారం కొలకలూరి ఇనాక్‌ సాహిత్యం 70కి పైగా గ్రంథాలలో వెలువడింది. ఇంత విస్తృతంగా రచనలు చేసినప్పటికీ వాటిలోని భావం ఏమీ పల్చబడినట్లు తోచదు. హడావుడిగా రాసినట్లు అసలే అనిపించదు. అందుకు మచ్చుగా పదులకొద్దీ ఉదాహరణలను చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల క్రితం రాసిన ఊరబావితోనే ఇనాక్‌ దళిత సాహిత్యాన్ని ఒక్క ఊపు ఊపారు. కొందరి విశ్లేషణ ప్రకారం ఇది తెలుగులో తొలి దళిత స్త్రీవాద కథ! ఊరిలోని ఉమ్మడి బావిలోని నీటిని తోడుకునేందుకు దళితులు సాగించిన పోరటమే ఈ కథలోని ఇతివృత్తం. ‘చిదంబరం భార్య’ అంటూ అస్తిత్వం లేని వారి బతుకులని గుర్తుచేస్తూనే... ఊరి పెద్దల మీద ఆ ‘చిదంబరం భార్య’ కక్ష తీర్చుకున్నట్లుగా చూపిస్తారు. విషయాన్ని నేరుగా చెప్పకుండానే వర్ణనల ఆధారంగా పాఠకులకు కథావస్తువుని అందించిన ఊరబావి, ఇనాక్ శైలికి మచ్చుతునకగా మిగిలిపోయింది.

ఇనాక్‌ కథలలో ఇతివృత్తాలన్నీ బడుగు జీవితాలే. అణగారిన వర్గాలే! అది పురాణాలలోని శూర్పనఖ (కన్నీటి గొంతు) పాత్ర కావచ్చు, ఆళ్వారులలో దళితుడైన తిరుప్పాన్‌ ఆళ్వార్‌ (మునివాహనుడు) కావచ్చు. ఏ పాత్రను తీసుకున్నా... దాని ద్వారా సమాజంలో పడుకుపేకలుగా పెనవేసుకుపోయిన కులవ్యవస్థని కళ్లకు కట్టడమే ఇనాక్‌ లక్ష్యంగా తోస్తుంది. పాత్రను ఎన్నుకోవడం, కథా వస్తువుని ఎంచుకోవడమే కాదు... కథలోనూ అడుగడుగునా బడుగుల బాధల వర్ణన కనిపిస్తుంది. ఏ వర్గంవారితోనైనా అయ్యో అనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ‘తల లేనోడు’ కథని చెప్పుకోవచ్చు.

ఇనాక్‌ కథలలో ప్రసిద్ధమైన కథలలో ‘తల లేనోడు’ కూడా ఒకటి. మంగలిపని చేసుకునే నాగలింగానికీ, ఊరి మునసబు వీరన్నకీ మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. నాగలింగానికి జీవనాధారంగా ఉన్న రెండెకరాలనీ వీరన్న మోసంతో లాక్కొంటాడు. ఆ మరుసటి రోజే తనకి క్షవరం చేయమంటూ నాగలింగానికి కబురు పంపుతాడు వీరన్న. చేయక తప్పని కులవృత్తి. ఆపై దానిని వదులుకుంటే ఊళ్లో ఉండనిచ్చే ప్రసక్తి లేదంటూ వీరన్న నుంచి వచ్చిన బెదిరింపు. ఆ బెదిరింపుకి తలొగ్గి క్షవరానికి పూనుకొన్న నాగలింగం. టూకీగా ఇదీ కథ! కానీ క్షవరం చేస్తున్నంతసేపూ ముందుకీ వెనక్కీ సాగే కథనం అపూర్వంగా తోస్తుంది. నాగలింగం చివరికి తన కత్తితో వీరన్న గొంతుని కోసిపారేస్తాడేమో అనిపిస్తుంది. కథలో మాటిమాటికీ ఈ అనుమానం రేకెత్తేలాంటి ప్రస్తావనలు కనిపిస్తాయి- ‘నాగలింగం వీరన్న గొంతు చూస్తున్నాడు. ఒకనాటి మిత్రుడి గొంతు, నేటి మునుసబు గొంతు, అమృతం (సారా) తాగిన గొంతు, తాగించిన గొంతు, పేకాడించిన గొంతు, పెడసరంగా మాట్లాడిన గొంతు, డబ్బు అడిగిన గొంతు, అబద్ధం ఆడిన గొంతు, మోసం చేసిన గొంతు, కోర్టుకీడ్చిన గొంతు- కత్తి కింద మెత్తగా ఒత్తుగా చర్మపు పొరతో, అరతో కదులుతున్న సాగుతున్న జారుతున్న గొంతు!’ అంటూ వర్ణిస్తాడు రచయిత ఒకచోట. ఇంత చదివాక నాగలింగం ఆ గొంతుని కోసిపారేస్తే బాగుండు అని పాఠకుడికే అనిపిస్తుంది. కానీ చివరికి అలా జరగదు. రచయిత చాకచక్యంగా అటు పాఠకుడిలో తిరుగుబాటు ధోరణిని రెచ్చగొడుతూనే సీదాగా ముగిసిపోతుంది.

అలాగని ఇనాక్ ప్రతికథా నిస్సహాయంగానే ముగుస్తుందని అనుకోవడానికి లేదు. ఊరబావి కథలో లాగానే అణగారిని వర్గాలు తిరగబడే సందర్భాలూ కనిపిస్తాయి. అందుకు ‘సూర్యుడు తలెత్తాడు’ అన్న కథే సాక్ష్యం. ఇందులో రావడనే మనిషికి మొదట్లో ఏమాత్రం ప్రశ్నించే ధోరణి కనిపించదు. ‘రావడి శరీరాన్ని పంచభూతాలు బతికుండగానే పంచుకున్నాయి. ఏం పొరపాటు జరిగిందో ఎముకలు మిగిలాయి. మరేమయిందో అవి కదులుతున్నాయి’ అంటూ రావడి తీరుని వర్ణిస్తాడు రచయిత. ఆ రావడి పేదరికం కారణంగా కుటుంబం యావత్తూ చిన్నాభిన్నం అయినా అతనిలో చలనం కలగదు. భూమి చుట్టూ తిరిగే సూర్యుడిలాగా రావడి జీవితం అతని పొలం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒకప్పటి వందరూపాయల బాకీని సాకుగా చూపి, రావడి పొలాన్ని దిగమింగే ప్రయత్నాలు మొదలయ్యాయో అప్పుడు రావడిలో చలనం మొదలవుతుంది. ‘కుంకిన సూర్యడు రావడి ముఖంలో అర్ధరాత్రి పుట్టాడు,’ అంటాడు రచయిత.

అది కులవృత్తుల సమస్య కావచ్చు, ఆర్థిక దోపిడీ కావచ్చు, పెత్తందారీతనం కావచ్చు... అణగారిన వర్గాలకు సంబంధించిన ఏ సమస్యనైనా తలకెత్తుకున్న రచనలని చదవాలంటే- ఇనాక్‌ రాసే అక్షరాలను అనుసరిస్తే చాలు.
 

- నిర్జర