Facebook Twitter
విషాద గీతాలని పలికించిన ‘అల్లం రాజయ్య’ కలం

విషాద గీతాలని పలికించిన ‘అల్లం రాజయ్య’ కలం

 

పేదవాడి కన్నీటి గురించి ఎవరైనా రాయగలరు. కాస్త పరిశీలన, మరికాస్త సృజన ఉంటే.. ఏ రచయిత కలం నుంచైనా బడుగుల మీద సాగే వివక్ష అక్షరాలుగా రూపుదిద్దుకుంటుంది. కానీ అందులో గాఢత ఎంతవరకు ఉంటుందన్నది అనుమానమే! ఎందుకంటే చాలామంది రచయితలు తాము పేదల పక్షం అని చెప్పుకొనేందుకు... ఏవో పైపైన తడిమి చూసిన జీవితాల గురించి రాస్తారే కానీ... గుండెలోతుల తడిని గమనించేంత నిబద్ధత వారిలో ఉండదు. అలాంటి నిబద్ధత కలిగిన రచయిత కనుకే అల్లం రాజయ్య రచనలు పేదవాడి సాహిత్యంలో దీపస్తంభాలుగా వెలుగుతూ ఉంటాయి.

కరీంనగర్ జిల్లా మంథని తాలూకాలోని మారుమూల గ్రామమైన గాజులపల్లిలో 1952లో జన్మించారు అల్లం రాజయ్య. వారిది పేదరైతు కుటుంబమే అయినా సామాజికంగా కాస్త పై మెట్టు మీద ఉన్న వర్గం కావడంతో... ఇంటి ముందు రకరకాల పంచాయితీలు జరుగుతుండేవి. వాటిని నిశితంగా గమనించిన రాజయ్యకు అందులో పేదల సమస్యలు, ఆ పేదలని అణచివేసేందుకు పెద్దలు వేసే ఎత్తులు కనిపించేవి. పల్లెటూరిలో ఉన్నప్పుడు రాజయ్యది బలవంతుల వర్గం. కాబట్టి బలహీనుల పట్ల ఉన్న వివక్షను గమనించే అవకాశమే చిక్కింది. కానీ ఉన్నత పాఠశాల చదువు కోసం మంథనికి చేరుకున్నప్పుడు.... గ్రామీణుడిగా పీడితపక్షంలో భాగమయ్యాడు. పట్నవాసుల చేతిలో అవహేళనలు ఎదుర్కొని వివక్ష ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించాడు.

 

ఒక పక్క తాను ఎదుర్కొంటున్న వివక్షని వ్యతిరేకించేందుకు విద్యార్థిసంఘాలలో చురుగ్గా పాల్గొంటూనే, తనలో రేగుతున్న ప్రశ్నలకు సాహిత్యంలో జవాబుని వెతుక్కునే ప్రయత్నం చేయసాగారు రాజయ్య. రష్యన్ సాహిత్యం నుంచి చలం రచనల వరకూ రకరకాల పుస్తకాల ఆయనలోని తిరుగుబాటు ధోరణికి ఒక సహేతకతని అందించాయి. కాలేజిలో చేరిన రాజయ్య విద్యార్థినాయకునిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. అదే సమయంలో తొలి తెలంగాణ ఉద్యమం రాజుకుంది. అందులో చురుగ్గా పాల్గొన్న రాజయ్య ఒక ఏడాదిపాటు చదువుకి దూరమైనా పదేళ్లకు సరిపడా పరిణతి దక్కింది.

ఎలాగొలా రాజయ్య బి.ఎస్.సి పూర్తిచేశారు. వ్యవసాయం చేసే ప్రయత్నం చేసి, అది గిట్టుబాటు కాక ఓ చిరుద్యోగంలో చేరారు. ఇదే సమయంలో (1975-77) దేశంలో ఎమర్జన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. రాజయ్యలోని ఆలోచనాపరుడు రచయితగా మారిన సందర్భం అదే! ఆ సమయంలో తాను చూసిన ఒక సంఘటన ఆధారంగా ఆయన ‘ఎదురు తిరిగితే’ అనే కథను రాశారు. అదే రాజయ్య తొలి కథ! కానీ చేయి తిరిగిన కథకులకు సైతం కన్ను కుట్టేంతగా ఆ కథ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. రాజయ్య కథలను ఉద్యమకారులు సైతం పదిమందికీ చదివి వినిపించడం అనేది ఆయన తొలి కథతోనే మొదలైపోయింది.

అల్లం రాజయ్య ఎనిమిది నవలలతో పాటుగా వందలోపు కథలు రాశారు. రాశిపరంగా చూసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువగానే కనిపించవచ్చు. కానీ సాహితీకారులు ఆయన చేసిన ప్రతి ఒక్క రచననీ ఒక క్లాసిక్గా భావిస్తారు. ముఖ్యంగా ‘మహాదేవుని కల’, ‘మనిషి లోపలి విధ్వంసం’ వంటి రచనలు ఆయన ప్రతిభకు పరాకాష్టగా నిలుస్తాయి. ఇంతవరకు మనం బడుగువర్గాలు భూమి మీద పెంచుకున్న మమకారం గురించిన కథలే చదివాము. కానీ ఒక బ్రాహ్మణకుటుంబానికి చెందిన వ్యక్తి వ్యవసాయం మీద మక్కువ పెంచుకుంటే... దానిని సమాజం ఎలా స్వీకరిస్తుంది అన్న ప్రశ్నకు జవాబే ‘మహాదేవుని కల’ కథ. సమాజపు వైఖరితో పిచ్చెత్తిపోయిన మహాదేవ్ ప్రవర్తన ఆధారంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఒక పిచ్చివాడికి కనిపించేది ఏమిటి? అతని చుట్టూ ప్రజలు అనుకునేది ఏమిటి? వంటి విషయాలను కథనంలోకి మార్చడమే కష్టం అయితే, దానికి తోడు... పాత్ర వెనుక ఉన్న సామాజిక విషాదాన్ని కూడా పలికించిన అద్భుతం ‘మహాదేవుని కల’.

‘మహాద్భుతమైన మనిషి, ఆరోగ్యవంతమైన మనిషి, మట్టి నుంచి పచ్చటి మొక్కలు, పంటలు- సర్వ సంపదలు సృష్టించదలచుకున్న మనిషి మహాదేవ్ సకల కలలను, సర్వశక్తులను హరించిందెవరు? ఈ విధ్వంసం ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా ఆరంభమయ్యింది? ఎప్పుడుఅంతమౌతుంది?’ అంటూ వర్ణవ్యవస్థ మూలాలనే స్పృశించే వాక్యాలతో ‘మహాదేవుని కల’ ముగుస్తుంది.

 

రాజయ్య కథల్లో ప్రముఖంగా వినిపించే మరో శీర్షిక ‘మనిషి లోపలి విధ్వంసం’. తన జీవితం సుఖంగా సాగిపోతోందని భ్రమించే నాగరికులకి ఈ కథ చదివిని తరువాత మత్తు దిగిపోవడం ఖాయం. భూమిని నమ్ముకున్నవారి జీవితాలూ తనచుట్టూ ఎలా జీవచ్ఛవాలుగా మారిపోతున్నాయో ఒక్కసారిగా కళ్లకి కడుతుంది ఈ కథ. కథలోని వాస్తవం, దానిని అక్షరబద్ధం చేసిన తీరు వల్ల ఇది విశ్వజనీనమైన కథగా మారిపోయింది. అందుకే అనేక భాషలలోకి అనువదించబడింది. ఒక రైతు కొడుకు రైలు పట్టాల మీద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడం ఈ కథలోని నేపథ్యం. కానీ ఆ నేపథ్యంలో సాగే కథనం గుండెలను పిండేస్తుంది. కావాలంటే అందులోంచి ఈ మాటలు చదివి చూడండి...

‘రాజారాంకు (కొడుకుని పోగొట్టుకొన్న రైతు) ఈ ప్రశ్నలన్నీ సలుపుతున్నాయి. తన కొడుకును తన దగ్గరే ఉంచుకుంటే చావకపోయేటోడా? తనే ఎప్పుడో చచ్చిపోయినంక వాళ్లనెట్లా ఉంచుకుంటాడు? తన చావు ఎప్పుడు ఆరంభమయ్యింది. తన కలల ప్రపంచాన్ని ఎవరు విధ్వంసం చేశారు. ఎప్పుడు చేశారు? తన ఏడుపు ఎక్కడ, ఎప్పుడు తెగిపోయింది. తన బండరాయా? తన నరాలు ఒక్కొటొక్కటే పుటుక్కుపుటుక్కున తెంపిందెవరు? చనిపోయిన అన్నా? చదువు ఆపి పెద్ద కుటుంబాన్ని సాదుక వచ్చినప్పుడా? మిరప తోటకు కొరుకుడు రోగం తాకి మాడిపోయినప్పుడా? అప్పుకింద షావుకారు భూమి గింజుకున్నప్పుడా? అంజుమన్ అప్పులు, తనఖా బ్యాంకు వాళ్లు వేలం పాడినప్పుడా? సర్వం ఒక్కొక్కటే ఊడ్చుకుపోయి రైతు, కూలిగా మారినప్పుడా? కాదు, ఈ అన్నీ జాగల్ల తన జీవనాడులు ఒక్కొక్కటే తెగిపోయినయ్.’

చెప్పుకొంటూ పోతే అల్లం రాజయ్య రాసిన ప్రతి కథలోనూ ఏదో ఒక వేదన కనిపిస్తుంది. రైతులు, కూలీలు, ఆదివాసులు, గిరిజనులు, అంటరానివారు... ఇలా ప్రతి ఒక్కరి పట్లా సాగుతున్న వివక్ష కనిపిస్తుంది. అస్తవ్యవస్తమైన వ్యవస్థల మధ్య ఛిద్రమవుతున్న వారి జీవితం కనిపిస్తుంది. ఆ జీవితాలను ప్రతిబించేందుకు రాజయ్య పుంఖానుపుంఖాలుగా రాయనవసరం లేదు. రాసిన ప్రతి కథా సుదీర్ఘంగా సాగనక్కర్లేదు. ఉదాహరణకు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు రాజయ్య రాసిన ‘బూడిద’ అనే కథ ఒక పెద్ద పేజీకి మించదు. విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేందుకు అంతకంటే పేజీలు కావాలా అనిపిస్తుంది ఆ కథని చదివితే! రాజయ్య కలం నుంచి ప్రస్తుతం కథలు తగ్గిపోయాయి. అయితే తాను మారుతున్న జీవితాలను పరిశీలిస్తున్నాననీ... త్వరలోనే మళ్లీ కలం పడతాననీ చెబుతున్నారు రాజయ్య. ఈసారి ఆయన కలం ఏ విషాద రాగాన్ని పలికిస్తుందో మరి!                                    

- నిర్జర.