Facebook Twitter
పువ్వూ-ముల్లూ

పువ్వూ-ముల్లూ

 

నాలుగ్గోడల మధ్య నుంచి,
నలుగురు మనుషుల్లోకి
సాయంత్రం అలా నడుచుకుంటూ
కాస్త చల్ల గాలి పీలుద్దామని
కాసిని పువ్వుల నవ్వుల్ని,
కాసిని నవ్వుల పువ్వుల్ని,
లేత ఎండ పూయించే
కొన్ని బుగ్గల సిగ్గుల్ని
ఏరుకుందామని వెళ్తానా.......!
అందరూ నన్ను చూసి నవ్వుతారు
నింగీ నేలా, పచ్చ గడ్డీ,
చల్లగాలీ, తెల్ల మబ్బులూ,
అప్పుడే పూసిన గడ్డిపూలూ,
ప్రొద్దుటే రాలివాడుతున్న పారిజాతాలు....
మురిపెంగా, ఒక్కొక్కటీ అందుకుంటుంటే
ఎదురయ్యింది నిన్నటిదాకా
నన్నుచూసి అందంగా నవ్విన అమ్మాయి
కానీ ఏదీ ఆ చిరునవ్వు ఇవ్వాళ
గుబులు కళ్ళగూళ్ళలో ముడుచుకున్న నవ్వు,
ఉబికి వచ్చే అలల సంద్రాలను
అదిమిపట్టి రెప్పల తీరం దాటకుండా
కట్టడి చేస్తున్న ఆ కళ్ళ ముడతలు,
ఇష్ట మైన వారు చేసిన ఖాళీలు
మనసున ఎక్కు వైనపుడు కాబోలు
దిగులు దిగమింగడానికన్నట్లు
దుఖాన్ని గొంతున నొక్కేసినట్లు
కింది దవడ వెనక్కి లాగేసి
బిగ పట్టిన బుగ్గలు, పెదాలు,
ఆమె కళ్ళలోకి చూస్తూకాస్త నవ్వుదామంటే...
ఆమె మాత్రం శూన్యంలోకి చూస్తున్నట్లు
అసలు నన్నెరుగనట్లు వెళ్ళిపోయింది
ఖంగారుగా నా పూల బుట్టలో
చెయ్యి పెట్టానా?
కసుక్కున గుచ్చుకున్న ముల్లు
నా ర క్తం కళ్ళ చూసి నవ్వింది
నవ్వులనేగా ...........
అందుకే ఈ నవ్వునికూడా పదిలంగా ఏరుకున్నాను.

- శారద శివపురపు