Facebook Twitter
స్త్రీ జీవితానికి సాక్ష్యాలు- పి.సత్యవతి కథలు

స్త్రీ జీవితానికి సాక్ష్యాలు- పి.సత్యవతి కథలు

 

తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం ఏమోగానీ కొన్ని దశాబ్దాలుగా మన భాషలో స్త్రీవాద సాహిత్యానికి లోటు లేకపోయింది. వాసిలో ఎక్కువో తక్కువో కావచ్చు. ఇతర భాషలతో పోలిస్తే భావాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ స్త్రీ అణచివేత గురించి ఎవరో ఒకరు అక్షరబద్ధం చేస్తూనే ఉన్నారు. అలాంటి రచయితలలో పి.సత్యవతి ఒకరు. నిజానికి తెలుగు స్త్రీవాదులకి సత్యవతి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాకపోతే ఆమె కలం నుంచి వచ్చిన అపురూపమైన కథల్ని మరోసారి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఇది!

1940 జులై 2న గుంటూరు జిల్లాలోని కొలకలూరు అనే గ్రామంలో జన్మించారు సత్యవతి. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి వరకూ అక్కడే చదువుకున్నాక బీఎస్సీ కోసం హైదరాబాదులోని మేనమామ ఇంటికి చేరుకున్నారు. ఆమె మేనమామ పి.యస్‌.రావు మంచి విద్యావంతుడు. పైగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ఆయన ఇంట్లో పుస్తకాలకి కొదవ ఉండేది కాదు. ఇంకే! అప్పటికే సాహిత్యంతో పరిచయం ఉన్న సత్యవతికి ఆ పుస్తకాలు కావల్సినంత సరుకుని అందించాయి. అలా సాహిత్యం పట్ల ఏర్పడిన అభినివేశంతో ఆమె ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీయే పట్టా పుచ్చుకున్నారు. వివాహానంతరం ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తూ, తనకి ఇష్టమైన సాహిత్యాన్నే కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. తరువాత కాలంలో ఉద్యోగం మానివేసినా ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎమ్మె డిగ్రీని పుచ్చుకున్నారు. 1980 నుంచి 1996 వరకు ఆంగ్లోపన్యాసకురాలిగా ఈసారి సుదీర్ఘకాలం పాటు ఉద్యోగం సాగించారు.

 

 

సత్యవతిగారు కలం పట్టేనాటికే తెలుగునాట స్త్రీలకు సంబంధించిన ఎన్నో సమస్యలు కథల రూపంలో వచ్చాయి. కానీ వారి వెతలని చూపించే ఇతివృత్తాలకి కొదవ ఏముంటుంది. అందుకే ఎప్పటికప్పుడు భిన్నమైన కథలతో పాఠకుల్ని ఆశ్చర్యపరిచేవారు సత్యవతి. 1978లో ఆమె రాసిన ‘మాఘ సూర్యకాంతి’తోనే సత్యవతి సునిశిత శైలి పాఠకలోకానికి పరిచయం అయిపోయింది. ‘మారిటల్‌ రేప్‌’ గురించి ఇప్పుడంతా ధైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ పడకగదిలో మగవాడి అకృత్యాల గురించి దాదాపు 40 ఏళ్ల క్రితమే ‘మాఘ సూర్యకాంతి’ కథలో పేర్కొన్నారు.

కూతురికి ఎలాగొలా పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకునే తండ్రి, అలా పెళ్లి జరిగాక భర్త గొంతు పిసికినా కూడా మౌనంగా భరించాలని సూచించే సమాజం, నరకంకంటే దారుణమైన అలాంటి సంసారం అంటేనే వణికిపోయే ఆడవారు, ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయే తల్లి... ఇవన్నీ ఇప్పటికీ వ్యక్తమవుతున్న సందర్భాలే. కానీ ‘‘నాకు విడాకులు వద్దు. నేను కోర్టుకు రాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అతన్ని ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకోమను- నాకేం అభ్యంతరం లేదు. నేను కలుగజేసుకోను. నాకింతా బతకాలని ఉందమ్మా. నేను వెళ్లను. అక్కడికి వెడితే నేను చచ్చిపోవడం ఖాయం,’’ అంటూ వాపోయే కూతురికి తల్లి అండగా నిలబడటంతో ‘మాఘ సూర్యకాంతి’ సుఖాంతం అవుతుంది.

సత్యవతిగారి కథలన్నింటిలోనూ స్త్రీలే ప్రధాన పాత్ర కావచ్చు. అలాగని వాటిలో ఏదో ప్రత్యేకించిన చర్చలు కనిపించవు. కథనంలోనో, సంభాషణల్లోనో భాగంగా సమస్య వ్యక్తమయిపోతూ ఉంటుంది. ఆ సమస్యకి మూలం ఏమిటి, దానికి పరిష్కారం ఎలా అన్న ఆలోచనను పాఠకులలో రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకో కథలో అయితే కేవలం స్త్రీ ప్రధానమైన ఘట్టం మాత్రమే ఉంటుంది. దానికి ‘దమయంతి కూతురు’ అన్న కథే ఓ ఉదాహరణ. దమయంతి అన్నావిడ కుటుంబాన్ని వదిలి ‘వెళ్లిపోవడం’ అన్నదే కథలోని సన్నివేశం. ఆవిడ ఎందుకు వెళ్లిపోయింది? పసిపిల్లలని వదిలేసి అలా వెళ్లిపోవడం ఎంతవరకు సబబు? వంటి విషయాల గురించి పెద్దగా వివరాలు కథలో కనిపించవు. మానసిక క్షోభ అనుభవించలేక ఆమె వెళ్లిపోయి ఉంటుందనీ... ఆమె దూరమై పిల్లలు ఎంత బాధపడ్డారో, ఆమె కూడా అంతగానే బాధని అనుభవిస్తూ ఉండి ఉంటుందన్న సూచనని మాత్రమే అందిస్తారు. కానీ అలాంటి స్త్రీ పట్ల, ఆమె పిల్లల పట్లా సమాజపు అభిప్రాయాలు ఎలా ఉంటాయో మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.

 

సత్యవతిగారి కథల్లో కనిపించే మరో విశిష్టమైన లక్షణం మేజిక్ రియలిజం. కాల్పనిమైనది అనిపించే ఒక సంఘటనని మన జీవితాలను అన్వయింపచేయడమే ఈ మేజిక్‌ రియలిజం లక్షణం. స్త్రీవాద సాహిత్యంలో ఇది కొత్త కాకపోయినప్పటికీ, తెలుగువారి జీవితాలని ఈ తరహా కథనంతో ప్రతిబించాలనుకోవడం సాహసోపేతమే! ఎందుకంటే పాఠకుడికి ఈ శైలి ఏమాత్రం అర్థం కాకపోయినా కథ పేలవంగా మారిపోతుంది. పైగా రచయిత ఉద్దేశమూ వృధా అయిపోతుంది. మేజిక్ రియలిజంతో సత్యవతిగారు రాసిన కథలలో ‘సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌’, ‘మంత్రనగరి’ అనే కథలు రెండూ కూడా ఎన్నిదగిన తెలుగు కథల జాబితాలో చేరిపోయాయి.

ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్యోగం చేయాలి, అలాగే ఇంటిని కూడా మచ్చ పడకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, భర్తని చక్కగా చూసుకోవాలి, కూతురికి అమెరికా సంబంధం కట్టబెట్టాలి, కొడుకుని ఎలాగైనా విదేశాలకు పంపించాలి, శుభకార్యాలలో పాల్గొనాలి.... ఇలా ప్రతి విషయంలోనూ ముందుండాలనే తాపత్రయమే సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌ అంటారు రచయిత్రి. ఆ తపనలో తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ, మాత్రలు మింగుతూ ఉండే ఒక సూపర్‌మామ్‌ కథే ఇది. మాత్రలు మింగీ మింగీ ఆమె శరీరమంతా చివరికి మాత్రలమయంగా మారిపోవడంతో ఆమె జీవితం ముగిసిపోతుంది.

‘మంత్రనగరి’ కథ కూడా మేజిక్‌ రియలిజంతోనే సాగుతుంది. స్త్రీ తల ఎత్తుకు నిలబడేందుకు తరతరాల పోరాటం జరిగిందనీ... విదేశీ మోజులో పడి ఇప్పుడు మళ్లీ మరోరకమైన నిస్తేజంలోకి స్త్రీ సమాజం మారిపోతోందని హెచ్చరిస్తారు రచయిత్రి. అమెరికాను ఒక పైడ్‌ పైపర్‌గా (pied piper) వర్ణిస్తూ, ఆ ఆకర్షణలో పడిన జీవితాలు ఎంత కృతకంగా మారిపోతున్నాయో చూపిస్తారు. కూతుళ్లకి పురుడు పోయడానికి వెళ్లే తల్లులు, అక్కడి వ్రతాలలో జరిగే హంగామా వంటి సందర్భాలన్నీ వల్లిస్తారు. ఏతావాతా, భౌతిక ఆడంబరాలలో పడి మహిళలు మళ్లీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారన్నది రచయిత్రి భావనగా గ్రహించవచ్చు.

సత్యవతిగారు కథలే కాకుండా ‘ఇస్మత్‌ చుగ్తాయ్ కథలు’ వంటి అనువాదాలు కూడా చేశారు. ‘రాగం భూపాలం’ అనే వ్యాస సంపుటిని కూడా వెలువరించారు. సత్యవతిగారి కథలు ఇప్పటివరకూ నాలుగు సంపుటాలుగా వెలువడ్డాయి. సత్యవతి కథల, ఇల్లలకగానే, మంత్రనగరి, మెలకువ- అనేవే ఈ నాలుగు సంపుటారు. వీటిలోని కథలన్నీ కలిపి 60లోపే ఉంటాయి. ఈ కథలన్నీ అద్భుతాలు కాకపోవచ్చు. కానీ ఇలాంటి కథ రాయడం ఆవిడకే సాధ్యం ఆన్న తరహాలో చాలా కథలు సాగుతాయి. సంఘర్షణపూరితమైన స్త్రీ జీవితానికి ఇది ప్రతీక అనేలా ప్రతి కథా నిలుస్తుంది. ఇక దాదాపు ఓ ఇరవై కథలన్నా తెలుగు స్త్రీవాద స్థానంలో సుస్థిరస్థానంలో నిలుస్తాయి. ఏతావాతా సత్యవతి గారి కథలు... ప్రతి పాఠకుడినీ ఆలోచింపచేస్తాయి. ఒక రచయితగా ఇంతకంటే సార్థకత మరేముంటుంది!

- నిర్జర.