Facebook Twitter
అరుదైన కథల - సదానంద్ శారద

 

అరుదైన కథల - సదానంద్ శారద

 

 

కొందరు కథకుల గురించి చెప్పాలంటే ఫలానా కథ రాసిన రచయిత అంటే సరిపోతుంది. సాహిత్యలోకం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అలా ‘జాడీ’ అనే ఒకే ఒక్క కథతో తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న రచయిత సదానంద్‌ శారద.

సదానంద్ శారద అసలు పేరు పాకాల సదానంద్. పుట్టింది పోరుగడ్డ వరంగల్లులో. వరంగల్ చరిత్రలోని పౌరుషమే ఒంటపట్టిందో, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్న సాహిత్యమే వెన్ను తట్టిందో.. 1977లో ప్రచురితం అయిన తొలి కథ జాడీతోనే తనేమీటో నిరూపించుకున్నారు. తన శ్రీమతి శారద పేరుతో కలుపుకొని ‘సదానంద్‌ శారద’గా సాహితీలోకానికి పరిచయం అయ్యారు. కథానిలయం అందిస్తున్న వివరాల ప్రకారం ఈయన రాసిన కథలు 100లోపే. చాలాకథలలో పేదవారి వెతలే ఇతివృత్తంగా సాగుతాయి. తెలంగాణ ప్రాంతపు బడుగుల జీవితాలను కళ్లకు కడతాయి.

‘మన సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి- మన సంఘంలో ఎన్నో దురాచారాలున్నాయి- మన దేశంలో ఎంతో పేదరికం ఉంది. వీటిని పరిష్కరించగలిగే వాళ్లం మనమే. అది గుర్తుచేయడానికే సాహిత్యం అని నమ్మేవాళ్లలో నేను ఒకణ్ని’ అంటారు సదానంద్‌. ఈ మాటల్ని బట్టే ఆయన ఆషామాషీగా కథలు రాయదల్చుకోలేదని అర్థమవుతుంది. సదానంద్ కథలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇందులో పేదలు పేదలలాగానే కనిపిస్తారు. వారి మాటల్లో కసి ఉండదు. తిరుగుబాటు కనిపించదు. పైగా జీవితంతో రాజీపడిపోయిన ధోరణి కనిపిస్తుంది. కానీ చదివే పాఠకుడిలోనే కసి పెరుగుతుంది. తెలియని తిరుగుబాటు మొదలవుతుంది.

పోలిక, వ్యంగ్యం... ఈ రెండూ సదానంద్‌ కథల్లో తొంగిచూస్తుంటాయి. ఊహకిందని భిన్నమైన ఇతివృత్తం ఆయన కథనంలో వినిపిస్తుంది. పేదరికాన్ని ఫొటో తీసి బహుమతి కొట్టే ఫొటోగ్రాఫరు అందలాలు ఎక్కుతాడు సరే, మరి ఆ ఫొటోలో ఉన్న పేదవాడి బతుకు ఏమన్నా మారి ఉంటుందా! ఈ ఆలోచనతో ‘ఫొటో’ అనే కథే రాశారు రచయిత. అలాగని కేవలం పేదరికపు కష్టాలతోనే సదానంద్ కథలన్నీ నిండిపోయాయనుకోవడానికి లేదు. ‘ఎంత కష్టం వచ్చినా నిజాయితీగా ఉండాలనుకునే ఓ ప్రభుత్వోద్యోగికి చేతిలో చిల్లగవ్వైనా లేని సందర్భం వస్తే ఎలా ఉంటుంది!’ అని ఊహించి ‘తులసి మొక్క’ అనే కథ రాశారు. ఈ కథ చదువుతున్నంత సేపూ కథానాయకుడిలాగానే పాఠకుడి గుండె కూడా దడదడా కొట్టుకోవడం ఖాయం.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రాయాలంటే హత్యలు, దయ్యాలే అవసరం లేదనీ... మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఉద్విగ్న పరిస్థితులను కూడా పటువైన కథలుగా రాయవచ్చనీ ‘తులసి మొక్క’ను చదివితే అర్థమవుతుంది. ఇక కులం హద్దులు చెరిగిపోయాయని ఎవరెంతగా ఘోషిస్తున్నా, అవి రంగుటద్దాలులాగా ప్రతి మనిషి జీవితంలో భాగంగానే ఉన్నాయని తేల్చి చెబుతుంది ‘ఉప్పునీళ్లు’ అనే కథ. హరిజనులకు చెందిన ఒక అమ్మాయి కాలేజీలో ప్రవేశిస్తే, ఆమె ఎలాంటి క్షోభకు గురికావల్సి వస్తుందో ఈ కథతో తేలిపోతుంది. సదానంద్‌ శారద తన మనసుకి తట్టిన ఏ బాధనీ అలా ఊరికనే వదిలిపెట్టినట్లు కనిపించదు. ఆ బాధని ఒక కథారూపంలోకి మార్చేందుకు తగిన ఊహని చేరుస్తారు. ఆ ఊహ ఒకోసారి సినిమాఫక్కీలో కృత్రిమంగా తోచినా, దాని వెనుక ఉన్న స్ఫూర్తిని కాదనలేకపోతాం.


సదానంద్‌ గురించి ఇంత చెప్పుకొన్నాక ఆయన రాసిన జాడీ కథ గురించి ప్రస్తావించి తీరాలి. గవురయ్య అనే పల్లెటూరి రైతు తన దొర దగ్గర్నుంచీ జాడీని పట్నానికి మోసుకుపోయి దొర బిడ్డకు అందించాలి. ఇదే జాడీ కథలోని ఇతివృత్తం. ఇందులోని ప్రతి వాక్యమూ గవురయ్య దైన్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ‘దొర ఒంటి మీద పదిమందికి సరిపోయే దుస్తులు, సంపద ఉన్నాయి. ఉన్నదంతా పదిమందికి దానం చేసిన వ్యక్తినాగున్నాడు గవురయ్య’ వంటి పోలికలు తరచూ కనిపిస్తాయి. ఊరగాయ ఉన్న ఆ జాడీని భద్రంగా ఇరవై మైళ్లు మోసుకుపోతాడు గవురయ్య. తనకి ఉండాల్సిన అంగీని కూడా ఆ జాడీకే రక్షగా కప్పుతాడు. ఇరవై మైళ్లు నడిచి, పట్నంలో నానా అగచాట్లు పడి చివరికి ఎలాగొలా దొర కొడుకు ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ అతడిని పట్టించుకునే నాధుడే ఉండడు సరికదా! ఒళ్లు తూలిపోతున్నా కాసిని గంజి నీళ్లు పోసేందుకు కూడా దొరగారి కోడలికి చేతులు రావు. గవురయ్య చేతుల మీదుగా పెంచిన దొర కొడుకు, గవురయ్య కాయకష్టంతో పెరిగిన వారి ఐశ్వర్యం ముందు నిస్సహాయంగా మిగిలిపోతాడు గవురయ్య. జాడీ కథ చదివాక ఎంతటి మనసైనా చెమ్మగిల్లాల్సిందే!

- నిర్జర