Facebook Twitter
" ఏడు రోజులు " 25వ భాగం

" ఏడు రోజులు " 25వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 


    ఆమె ఇంకేం అనలేదు. కృష్ణ ఆమెను బాత్ రూమ్ వైపు తీసుకెళ్లాడు. ఆమె బాత్ రూమ్ లోకి వెళ్లి నిముషం తర్వాత వచ్చింది.

    "గౌసియా నీకో నిజం చెప్తాను. నేను కోరింది ఇస్తావా?" చీకట్లో ఆమె చేయి పట్టుకున్నాడు కృష్ణ.

    "ఏంటీ?" ప్రశ్నార్థకంగా చూసింది అతడి విఅపు.

    "చెప్తాగాని ముందు నేను కోరింది ఇవ్వు" మాట మార్చాడు కృష్ణ.

    "నీకేం కావాలి?" అడిగిందామె.

    "నువ్వు కావాలి" గుసగుసగా అన్నాడు అతడు.

    "ఆ" ఆమెకు వెంటనే ఏం అర్థం కాలేదు.

    "నువ్వు కావాలి" మళ్లీ చెప్పాడు.

    "అం...టే?" ఆమె గొంతు అప్రయత్నంగా వణికింది.

    "ష్... మరేం కాదులే. నీకు డబ్బులు కూడా ఇస్తాను" ఆశపెట్టాడు.

    "ఆ...ఆ..." ఆమె తడబడింది.

    "హైదరాబాదులో ఏం జరిగింది అనేది ఫాదర్ నీతో దాచిపెట్టాడు. కాని నీకు మొత్తంగా చెప్పేస్తాను. నా కోరిక అంగీకరిస్తేనే" అన్నాడు కృష్ణ.

    "అమ్మో... వద్దు" భయంగా గుండెలపై చేయివేసుకుందామె.

    "ప్లీజ్ కాదనవద్దు" ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు.

    "వద్దు" అతడిని విడిపించుకునే ప్రయత్నం చేసింది.

    "కృష్ణా..." అంతలోనే స్టేషన్ లోపల్నుంచి వెంకట్ పిలుపు.

    "ఆ వస్తున్నా" అంటూ, "నేను ఇలా అడిగానని వాడితో చెప్పొద్దు" అని గౌసియాతో చెప్పి ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు కృష్ణ.

    "నీకు సర్కిల్ సాబ్ నుండి ఫోన్ వచ్చింది" చెప్పాడు వెంకట్.

    "ఏమన్నాడు?" అడిగాడు కృష్ణ.

    "ఇంటికి రమ్మంటున్నాడు" చెప్పాడు వెంకట్.

    వెంటనే బయటకు నడిచాడు కృష్ణ. అప్పటికి బాగా రాత్రయ్యింది. ఆవులిస్తూ వెళ్లి ఎప్పటిచోట కూర్చుంది గౌసియా. కాసేపటి తర్వాత ఆమె దగ్గరికి వెళ్లాడు వెంకట్.

    "హైదరాబాద్ లో ఏం జరిగింది?" అడిగింది గౌసియా.

    "ఏం జరగలేదు. ఆనందంగా వుండు" అంటూ వెళ్లి ఆమె పక్కగా కూర్చుని "నీవూ నీ ప్రియుడు కలిసి ఎక్కడెక్కడ తిరిగేవాళ్లు?" అడిగాడు.

    "ఎక్కడా తిరగలేదు. మైసమ్మ గుడి దగ్గర కల్సుకునేవాళ్లం" చెప్పింది.

    "అక్కడ ఏం చేసేవాళ్లు?" ఆరా తీసినట్టుగా అడిగాడు.

    "మాట్లాడుకునేవాళ్లం"

    "అంతేనా? ఇంకేం చేసేవాళ్లుకాదా?"

    "ఇంకేం చేస్తాం?" అతడివైపు అనుమానంగా చూసింది.

    అతడు చిన్నగా నవ్వాడు. నవ్వుతూనే "ఈకాలం పిల్లలకు ప్రేమంటే అదేకదా! అందుకే అడిగాను" అన్నాడు.

    "..."

    "అయినా అందులో తప్పేముంది?" అంటూనే ఆమె చేయి పట్టుకుని గట్టిగా నొక్కి వదిలేశాడు.

    "..."

    "ఒక్కసారి ఆ సుఖం తెలిస్తే నువ్వు ఇలా వుండలేవు" గొణిగినట్టుగా అన్నాడు.

    "ఫాదర్ ఎప్పుడు వస్తాడు?" అతడి మాటలు వింటూనే అడిగింది.

    "వస్తాడు" టైం చూసుకుంటూ అన్నాడు వెంకట్.

    "త్వరగా వస్తే బాగుణ్ణు" అందామె.

    "వస్తాడులే" ఆమెవైపు ఓరగా చూశాడు అతడు.

    అప్పటికి ఆ ఇద్దరి మెంటాలిటీ ఆమెకు అర్థమైపోయింది. వాళ్లు తనని ఏమైనా చేస్తారేమోనన్న భయం ఆమెను నిలువెల్లా వణికించసాగింది.

    ఇరవై నిముషాలు గడిచాయి. ఫాదర్ ఇంకా రాలేదు. ఆమెలో టెన్షన్ పెరిగింది. అంతలో ఫోన్ మోగింది. వెళ్ళి లిఫ్ట్ చేశాడు వెంకట్. వెంటనే అతడి ముఖంలో రంగులు మారాయి.

    "ఐసీ... ఓకే" అంటూ ఫోన్ పెట్టేశాడు.

    "ఎక్కణ్ణుంచి ఫోను? అడిగింది గౌసియా.

    "ఫాదర్ వాళ్లు వస్తున్న జీపుకి యాక్సిడెంట్ జరిగిందంట. నీకు చెప్పొద్దని చెప్పారు. కాని చెప్పాను. బాధపడుతూ కూర్చుని, నన్ను బయట పెట్టొద్దు" అన్నాడు అతడు.

    "హా....?" ఆమె తట్టుకోలేకపోయింది.

    "చెప్పానుకదా! నీకు తెలీనట్టుగానే వుండు" అన్నాడు అతడు.

    "ఎలా వుండమంటావు?" ఏడుస్తూ అంది గౌసియా.

    వాడికెవ్వడికో యాక్సిడెంట్ అయితే దీనికి ఇంత దుఃఖం ఎందుకో?' తనలో తను గొణుక్కుని "ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ల గాయాలు తగ్గిపోవు" అన్నాడు.

    "వెళ్లి చూసివద్దాం" ఏడుస్తూనే అంది గౌసియా.

    "నీకు చెప్పడమే నా బుద్ధి తక్కువ అయినట్టుంది" అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుని "సరేలే తీసుకువెళ్తాను. మరి నాకేం ఇస్తావు?" అడిగాడు.

    "ఏమివ్వాలి?" అందామె.

    "కోరింది ఇవ్వాలి" అన్నాడతడు.

    అతడు ఆమెకు అర్థమయ్యాడు. "ఇక్కడ వుండటం ఎంత మాత్రం మంచిదికాదు" మనసులో స్థిరంగా అనుకుంది.

    "సరేనా?" అన్నాడు అతడు.

    ఆమె భయంగా చూసింది. అతడు మాత్రం హాయిగా 'నాయక నహీ' పాటను హమ్ చేసుకుంటూ వెళ్లి ఏవో ఫైల్స్ సర్దసాగాడు.

    ఆమె ఆలస్యం చేయలేదు. అటుతిరిగి నిల్చునివున్న అతణ్ణే చూస్తూ వెలుపలికి నడిచింది.

    స్టేషన్ బయటకి వచ్చాక ఆమెకు అంతా గందరగోళంగా వుంది. రోడ్లమీద జనసంచారం అడపాదడపా అన్నట్లుగా ఉంది. మరియా ఆశ్రమానికి వెళ్లాలని బయటకి వచ్చిందేకాని అర్థంకాని ఆ రహదారుల వెంబడి తను వెళ్లాల్సిన చోటుకు వెళ్లలేనని అర్థమైపోయింది. దానికి తోడు నవీన్ వాళ్లు గుర్తొచ్చారు. అందుకే కొంతదూరం ముందుకు నడిచి 'స్టేషన్ కే వెళ్లిపోదామా?' అన్నట్టుగా వెనక్కి తిరిగి చూసింది. అదే సమయంలో స్టేషన్ ప్రహరీగోడలోంచి వెలుపలికి వస్తూ కనబడింది ఒక వాహనం.

    'తనకోసమే కావొచ్చు' అని ఆమె మనసు తలచగానే తిరిగి ఆమెకు భయమనిపించింది. 'దొరక్కూడదు' అని వెంటనే నిర్ణయించుకుంది. వాహనం ఆమెను దాటి వెళ్లి పోయింది.

    అక్కడ కారు షెడ్డువుంది. కార్లచాటుగా నక్కిన గౌసియా వాహనం వెళ్లిపోగానే వెలుపలికి వచ్చి అటూ ఇటూ చూసింది. ఆ తర్వాత కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా వడివడిగా వచ్చిన దారెంబడే వెనుతిరిగి సాగిపోయింది.

    స్టేషన్ ని దాటి కొంతముందుకు వెళ్లాక ఒక ఇంటిముందు హడావిడి కనబడింది. ఇంటికి వేసిన లైట్లు, జనాల్లో కనిపిస్తున్న ఆనందం, ఆ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోందని చెప్పకనే చెప్పింది.