Facebook Twitter
" ఏడు రోజులు " 17వ భాగం

" ఏడు రోజులు " 17వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 ఆమె వున్నది నాల్గవ అంతస్థు అయినప్పటికీ లిఫ్టు ఉపయోగించడం తెలియదు కాబట్టి వడివడిగా మెట్లు దిగసాగింది.
    
    కిందికి వెళ్ళాక రిసెప్షన్ లో నలుగురు ఉద్యోగస్థులు కూర్చుని వున్నారు. వాళ్ళ కౌంటర్ ముందు ఐదారుగురు వ్యక్తులు నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళెవ్వరూ గౌసియాబేగాన్ని పట్టించుకోలేదు. కాంపౌండ్ లోకి వెళ్ళాక కూడా ఎదురైన వాళ్ళెవ్వరూ ఆమెను పట్టించుకోలేదు.
    
    ఆమె ధరించిన బురఖా నలుపురంగులో వున్నందున ఆమె మీదకు ఎగజిమ్మిన రక్తం ఆ రంగులో కల్సిపోయింది. ముఖాన్ని చేతుల్ని తడిపేసిన రక్తాన్ని బురఖా ముసుగు కప్పివేసింది.
    
    ఏమాత్రం పరిచయంలేని మహానగరం, కాంపౌండ్ గేటు దాటి ముందుకు వెళ్ళీవెళ్ళగానే ఆమెను హడలగొట్టింది. తనకు పరిచయం వున్న హైదరాబాదే మహారణ్యంలా కనబడేది. అలాంటిది అంతకు ఐదురెట్లుగా కనబడుతున్న ముంబాయి నగరం ఆమెకు ఆగమ్య గోచరంగా కనబడుతుంటే గమ్యం తెలియని పక్షిలా అడుగులు ముందుకు వేయసాగింది.
    
    కొంతదూరం వెళ్ళాక పబ్లిక్ పార్క్ ఒకటి కనిపించింది. ఆకుపచ్చని తివాసిలా పార్క్ అంతా పరుచుకున్న గడ్డిపరకల్లో భిక్షగాళ్ళు సేదతీరుతున్నారు. వెళ్ళి పోకచెట్టు నీడలో కూర్చుంది గౌసియాబేగం.
    
    అప్పటికి ఒంటిని, బట్టల్ని అంటుకున్న రక్తం ఎండిపోయి వాసన వస్తోంది. దానికి తోడు దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది.
    
    ఎక్కడైనా పబ్లిక్ కుళాయి కనబడుతుందేమోనని అటూ ఇటూ చూసింది గౌసియా.
    
    కాసింత దూరాన ఫౌంటేన్ ఎగజిమ్ముతూ కనబడింది. వెంటనే లేచి అటు వైపు నడిచిందామె.
    
    అవి నిలవవుండిపోయిన మురికి నీరు అని ఆమెకు తెలీదు. వెళ్ళి ఫౌంటేన్ కట్టపై కూర్చుని నీళ్ళనంతా ఒకసారి కలియజూసింది. ఆకుపచ్చగా కనబడుతున్న నీళ్ళల్లో నాచు బాగా పేరుకుపోయివుంది. కాకపోతే ఫౌంటేన్ కదలికలవల్ల నాచు నతా పక్కలకు చేరిపోయి వుంది. శుభ్రమైన నీరు కాదు అని ఆమెకు అర్ధమైపోయింది. అయినాగాని దాహం తీర్చుకోడానికి అంతకన్నా వేరేదారి దొరకలేదు ఆమెకు.
    
    దోసిళ్ళతో నీరు తీసుకుని తాగబోయింది. నీరు చాలాకాలంగా నిలవవుండడంవల్ల మురికివాసన ఆమె ముక్కుపుటాల్ని అదరగొట్టింది. అయినప్పటికీ ఒక్క దోసిలి నీరు తాగింది. ఎండిపోయిన గొంతులో తేమ వూరినట్లుగా తోచింది. అందుకే కళ్ళు మూసుకుని ఐదారు దోసిళ్ళ నీటిని గబగబా తాగి, హాయిగా వూపిరి పీల్చుకుంటూ ఫౌంటెన్ కట్టదిగి పోకచెట్టువైపు నడవబోయింది.
    
    అంతలోనే ఆమె అడుగులు ఆగిపోయాయి కాసింత దూరంలో నిలబడి వెకిలిగా తననే చూస్తున్నారు ముగ్గురు యువకులు.
    
    "పోరికి దమాక్ ఖరాబ్ అయినట్టుంది" ఒక యువకుడు అన్నాడు.
    
    "ఇంతకీ ఈ పోరి ఎవరు?" మరో యువకుడు అన్నాడు.
    
    "లేచిపోయి వచ్చిన కేసులావుంది. లేకపోతే బురఖాలు పబ్లిక్ పార్కుల్లో కనబడ్డం, అందునా ఒంటరిగా కనబడ్డం అంటే అది ఆలోచించాల్సిందే" ఇంకో యువకుడు అనగానే.
    
    "ఆలోచించడం కాదురా అనుమానించాల్సిందే" మొదటి యువకుడు అన్నాడు.
    
    ఆ యువకులు మాట్లాడ్తున్నది స్వచ్చమైన హిందీ అయినప్పటికీ తమ ఇంట్లో మాట్లాడేది నాటు ఉర్దూ అయినప్పటికీ వాళ్ళు మాట్లాడే ప్రతిపదం ఆమెకు అర్ధమవుతోంది.
    
    వాళ్ళు ఆమె కంటికి కబళించడానికి వచ్చిన రాబందుల్లా కనబడ్డారు. అందుకే వెంటనే అట్నుంచి ముందుకు కదిలి వాళ్ళని దాటి వెళ్ళబోయింది.
    
    "ఏయ్ పోరీ" అంటూ ఒక యువకుడు ఆమె బురఖా పట్టుకు లాగాడు.
    
    ఆ విసురుకు తలమీద ముసుగు తొలగి రక్తపు మరకలు అంటివున్న ఆమె ముఖం వాళ్ళకు స్పష్టంగా కనబడింది.
    
    "హా!?" ముగ్గురూ ఒకేసారి కళ్ళింతచేశారు.
    
    ఆమెకు ప్రాణం పోయినంత పనయ్యింది నిలువెత్తున వణికిపోతూ చప్పున తొలగిన బురఖాని ఎప్పట్లా కప్పుకుని అక్కన్నుంచి పరుగెట్టబోయింది.
    
    "ఏయ్" ఇంకో యువకుడు ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు.
    
    ముసుగు చాటునుండి అతడివైపు భయంగా చూసిందామె.
    
    "నిజం చెప్పు? ఎక్కడనుంచి వస్తున్నావు? ఏం చేసి వస్తున్నావు?" గద్దించినట్టు అడిగాడు ఆ యువకుడు.
    
    "నన్ను వదులు" సమాధానం చెప్పలేకపోయిందామె.
    
    "నిజం చెప్తే వదిలేస్తాము" అన్నాడు అతడు.
    
    "నన్ను వదులు" మళ్ళీ అదేమాట అంటూ అతడిని విడిపించుకోబోయిందామె.
    
    "కిలాడి" మరో యువకుడు అన్నాడు.
    
    "అవును కేడీరాణిలా వుంది" ఇంకో యువకుడు అన్నాడు.
    
    "నిజం చెప్పకపోతే పోలీస్ స్టేషన్ కి పట్టిద్దాం" ఆమె చేయి పట్టుకున్న యువకుడు అన్నాడు.
    
    పోలీస్ స్టేషన్ అనగానే ఆమెకు ఏడుపు ముంచుకువచ్చింది.
    
    "నేను ఎవ్వర్నీ ఏం చేయలేదు. నన్ను వదిలిపెట్టు" ఏడవసాగింది.
    
    "మోసగాళ్ళ వేషాలు ఇలాగే వుంటాయి పదరా పోలీస్ స్టేషన్ కి" ఇంకో యువకుడు అతడిని ప్రేరేపించాడు.
    
    "వద్దు... వద్దు" ఏడుస్తూనే అంది.
    
    "మరి ఎవ్వర్ని ఏం చేశావో చెప్పు?" ఆమె చేతిని బిగ్గరగా నొక్కాడు అతడు.
    
    ఆమె ఐదారు క్షణాలు మౌనంగా వుండి పోయి ఆ తర్వాత ఏడుస్తూనే నెమ్మదిగా చెప్పుకుపోయింది.
    
    "నన్ను కొనుక్కున్న అరబ్బుషేకును చంపేసి వస్తున్నాను అతడు నన్ను ఏదో చేయబోయాడు. అందుకే చంపేశాను. అదిగో ఆ దూరంగా కనబడుతుందే పెద్దహోటలు అందులోనే చంపేశాను"
    
    యువకులు ఆమెవైపు విస్మయంగానూ అపనమ్మకంగానూ చూస్తుండిపోయారు.
    
    "మాది హైదరాబాదు మేము గరీబువాళ్ళం అందుకే మా అబ్బ నన్ను అరబ్బుషేకుకు అమ్మేశాడు. దయచేసి నన్ను హైదరాబాద్ పంపించండి" అభ్యర్ధనగా అందామె.
    
    "సరే! నిన్ను తప్పకుండా హైదరాబాద్ పంపిస్తాం. మరి మా వెంట వస్తావా?" ఆమె చేయి వదిలేస్తూ అడిగాడు యువకుడు.
    
    "మీ వెంట ఎక్కడికి రావాలి?" అడిగిందామె.
    
    "మేము తీసుకెళ్ళిన చోటికి"
    
    "మీరు నన్నేం చేయరుకదా?"
    
    "నీలాంటి వాళ్ళని ఏదో చేసేంత మూర్ఖులం కాదు. మాకూ మానవత్వం ఉంది"
    
    "సరే" ఒప్పుకుందామె కాని ఆమె లోపల ఏదో అలజడి చెలరేగుతూ వాళ్ళపట్ల అపనమ్మకాన్ని కలిగిస్తోంది.
    
    ఆమె చదువుకోలేదు. పైగా సంఘంలో తిరగలేదు. అందుకే ఆత్మరక్షణ కోసం తను చేసిన హత్యను ఘోరమైన నేరంగా భావించుకుంటూ భయపడుతోంది.
    
    మదమెక్కి... కొవ్వుబలిసి పరాయి దేశానికి చెందిన ఒక పురుషుడు, ఒక భారతీయ స్త్రీని కేవలం తన కోరికల కోసం కొనుగోలు చేయడం అనేది క్షమించరాని నేరమని ఆమెకు తెలీదు ఈ నేపథ్యంలో తను చేసిన హత్యకు శిక్ష వుండదని, సమాజంతో పాటుగా ప్రభుత్వం కూడా తనని హర్షిస్తుందని అంతకన్నా తెలీదు కాబట్టి పోలీసువాళ్ళు అంటేనే భయపడి ఆ యువకుల వెంట వెళ్ళిపోయింది.
    
    వాళ్ళు ఆమెను ఒక మురికివాడలోకి తీసుకువెళ్ళారు. ఆమెకు ఆ ప్రాంతం హైదరాబాదులో తామువుండే మురికివాడకంటే అన్యాయంగా తోచింది. యువకుల్ని చూస్తుంటే బాగా డబ్బుగలవాళ్ళలా వున్నారు అందుకే ఆమె వాళ్ళవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
    
    "మీరు ఈ ప్రాంతంలో వుంటారా?"
    
    "ఏం వుండకూడదా?" నవ్వాడు ఒక యువకుడు. మిగిలిన ఇద్దరు యువకులు శ్రుతికలిపారు.
    
    ఆ నవ్వు ఆమెకు నచ్చలేదు. ఎంతో మృదువుగా నవ్వే తన భవానీశంకర్ నవ్వు ముందు వాళ్ళ నవ్వు ముళ్ళపొద ఒంటికి రాసుకుపోయినట్టుగా తోచింది. అందుకే ఇంకేం మాట్లాడలేదు. వెళ్తున్న ఆటో రిక్షా లోంచి బయటకు చూస్తూ మౌనంగా కూర్చుండిపోయింది.
    
    "నేరుగా వెళ్ళి కనిపించే పెంకుటింటి ముందు ఆపేయ్" ఆటో డ్రైవర్ కి సూచించాడు ఒక యువకుడు.
    
    ఆటోరిక్షా అక్కడికి వెళ్ళి ఆగింది. ముగ్గురూ కలిసి బిల్లు చెల్లించారు ఆటో రిక్షా వెళ్ళిపోయింది.
    
    "వాసనగా వుంది. వెళ్ళి స్నానం చేయి" తన పక్కన కూర్చున్న యువకుడు చెప్పాడు.
    
    "ముందు ఇంట్లోకి వెళ్దాం రండి" అంటూ డ్రైవర్ పక్కగా కూర్చుని వచ్చిన యువకుడు ముందుకు నడిచి తలుపులు తెరుచుకుని నేరుగా లోపలికి వెళ్ళాడు.

...... ఇంకా వుంది .........